Thursday, June 25, 2009

అసాధారణ నటి సావిత్రి



1935లో పుట్టిన సావిత్రి 248 చిత్రాల్లో నటించి, 45 సంవత్సరాలకే అస్తమించిన మహానటి గురించి కూలంకషంగా పరిశోధించి గ్రంథస్తం చేసిన వి. సోమరాజు, వి. ఆర్. మూర్తి అభినందనీయులు. ఇంగ్లీషులో ఇటీవలే వెలువడిన 640 పేజీల రచన అనేక చిత్రాలతో, వివరాలతో, లోగడ తెలియని అనేక అంశాలతో ఉండటం ఒక ప్రత్యేకత. సావిత్రి తెలుగు, తమిళం, మళయాళం, హిందీ చిత్రాల్లో నటించింది. తొలుత స్టేజ్ నటిగా జీవితం ఆరంభించి, మద్రాసులో 1950 నుండి సినిమాల్లో చిన్న పాత్రలతో ప్రారంభించి తిరుగులేని నటిగా తెలుగు సినిమా రంగంలో తన స్థానాన్ని స్థాపించుకుంది. ఈమె 1935 డిసెంబరు 6న తెనాలి తాలూకాలోని చిర్రావూరులో నిశంకరరావు గురవయ్య, సుభద్రమ్మలకు పుట్టింది. ఆమె తొలి చిత్రాలలో తడబడినా పాతాళభైరవిలో చిన్న పాత్రతో సరిపెట్టుకున్నా దేవదాసులో అక్కినేని నాగేశ్వరరావు పక్కన మహానటిగా రంగప్రవేశం చేసింది. 1953 జనవరి 26న దేవదాసు విడుదలైంది. అంతకు ముందు పెళ్ళి చేసి చూడు, సంసారం వంటి సినిమాలు ఉన్నాఆమెకు దశతిరిగింది దేవదాసు అనవచ్చు. ఎన్.టి. రామారావు మొదలు అనేక మంది హీరోలతో నటించిన సావిత్రి తన విశిష్టతను నిలబెట్టుకున్నది.
దాదాపు 50 విధాలైన అభినయాలతో సావిత్రి పతి పాత్రను పోషించగలిగిందంటే ఆమె నటనా నైపుణ్యతను గమనించవచ్చు. సావిత్రి చాలా లావుగా కనిపించినా, కాలేజీ విద్యార్థినిగా పాత్ర ధరించినా ఆమె నటనా నైపుణ్యత వల్లన మిగిలిన వేవీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. అదే బహుశా నేడైతే హీరోయిన్ గా ఆమె నిరాకరించేవారేమో తెలియదు. సావిత్రి తమిళ హీరో జమినీ గణేషన్ ను పెళ్ళి చేసుకున్నది.
1968లో సావిత్రి డైరెక్టర్ గా చిన్నారు పాపలు సినిమా వచ్చింది. దీనికి ఆద్యులు కీ.శే. వీరమాచినేని సరోజని. ఆ సినిమాలో అందరూ స్త్రీలే కావటం మూలానా గిన్నీస్ రికార్డులోకి అది చోటు సంపాదించుకున్నది.
1972 నుంచి సావిత్రి కారణాంతరాలవల్ల విపరీతంగా సారాయి తాగుతూ దానికి అలవాటు పడి మానలేని దశకు పోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నది. హీరోయిన్ స్థాయిని కోల్పోగా చివరిలో కొన్ని సినిమాల్లో స్పల్పమైన పాత్రలను మాత్రమే వేయగలిగింది. 1980 నాటికి కోమాలోకి వెళ్ళిపోయిన సావిత్రి 1981 డిసెంబరు 26న చనిపోయింది.
ఆమె మహోన్నత దశలో వివిధ భంగిమలలో పరిశోధించి గ్రంధస్తం చేసిన రచయితలు చాలా పరిశోదనాత్మకమైన విషయాలను వెల్లడించారు. ఇంగ్లీషులో వెలువడిన ఈ గ్రంథం 500 రూపాయలు. దీనికి వెబ్ సైట్ ఉన్నది. వివరాలకు www.uhpublisher.com చూడవచ్చు.

No comments: