Tuesday, October 23, 2007

గీతా రహశ్యం నార్ల రచన 2 వ భాగం

గీతా రహశ్యం నార్ల రచన 2 వ భాగం



అధ్యాయం నాలుగు
భ్రమల భయం
పురావస్తు శాస్రం మాట్లాడదు. కాని సత్యాన్ని బయట పెడుతుంది. సాహిత్యానికి అలంకరణలు చేసే స్వభావం ఉన్నది. అందులో గాధలూ, ఇతిహాసాలలో ఉపమానాలూ, అలంకారాలూ, గజి బిజిగా అల్లుకొని ఉంటాయి. కనుక ప్రాచీన చరిత్రల గురించి రాసేటప్పుడు సాహిత్యంలో సాక్ష్యాధారాలను అతి జాగ్రత్తగా స్వీకరించాలి. ఇతర ఆధారాలతో ముఖ్యంగా పురావస్తు శాస్రంతో సరితూగుతున్నదో లేదో గమనించి చేపట్టాలి.
సుమేరియా చరిత్రకారులు ఇలాంటి జాగ్రత్త వహించారు. అలాగే ప్రాచీన దేశాలైన బాబిలోనియా, అస్సీరియా, ఈజిప్ట్, ఫినీషియా, క్రీట్, మీడియా, ఫైరియా, లిడియా, కార్తేజ్, గ్రీస్, రోమ్, పర్ష్యా, చైనాకు సంబంధించిన చరిత్రకారులు తగు జాగ్రత్త వహించారు. కాని, ప్రాచీన భారతావనికి సంబంధించిన చరిత్రకారులు తగు జాగ్రత్త తీసుకోలేదు. భ్రమలంటే వారు భయపడ్డారా? రెండువేల సంవత్సరాల పాటు పుక్కిటి పురాణాల మధ్య మనం నివశించాం. అదే మనకు ఔషధంగా మారింది. మోతాదు ఎక్కువై భ్రాంతిలో పడ్డాం. ప్రస్తుతాన్ని పక్కకు నెట్టి, గతాన్ని భజన చేస్తున్నాం. అయోధ్య గొప్పతనాన్నీ హస్తినాపురం వెలుగుల్నీ చెప్పుకొంటున్నాం. ఇంద్రప్రస్తలో, మయసభను గురించి పొగుడుకుంటున్నాం.
గతాన్ని తవ్వితీసి ఆర్యులను గురించి తెలుసుకుంటే, వాస్తవాలెన్నో బయటపడతాయి. రాముడూ, కృష్ణుడూ పాలించిన స్వర్గయుగాల భ్రమలు చెదిరిపోతాయి. రామాయణ మహాభారతాలకు చెందిన స్థలాలను తవ్వినప్పుడు అలాంటి సత్యాలు బయటకొస్తున్నాయి. భారతదేశానికి దండయాత్రీకులుగా వచ్చిన ఆర్యుల నాగరికత గురించి పుక్కిటి గాధలు బట్ట బయలు అవుతున్నాయి. దేశంలో ఉన్న ప్రజలు నాగరికులుగా, దాడి చేసిన వారు ఆటవికులుగా చరిత్ర చూపుతున్నది. హరప్పా ఉన్నత నాగరికతను ఆర్యులు ధ్వంసం చేశారు.
ఆ తరువాత వెయ్యేళ్ళకు గాని మగధ సామ్రాజ్యం తలెత్తలేదు. హరప్పా, మోహంజోదారో వంటి నగరాలు, కాళీబంగాన్, రంగవూరు వంటి పట్టణాలు, లోతల్ వంటి రేవులు మళ్ళీ రాలేదు. ఆర్యులు మట్టి ఇళ్ళలో ఉంటూ, కుండల్లో వండుకుని, తాగటానికీ, తినటానికీ మట్టి పాత్రలు వాడారు. నగర జీవితానికీ, సౌకర్యాలకూ వారుదూరం. వారి సంస్కృతి పేదది. గ్రామాలలో నివశిస్తూ, ఆవుల్ని పెంచుకున్నారు. ఆవులే వారికి సంపద, ప్రతిష్ఠాకరమైన విలువిచ్చాయి. సోమరసం ఆరగించేవారు. ఆర్యుల సంస్కృతి అల్పస్థాయిలోనే వుండేది. మెసపొటోమియాలో అమురుల వలె ఆర్యులకు కూడా నగరం అంటే తెలియదని, స్టూవర్డ్ పిగాట్ రాశాడు. (Pre Historic India, by Piggort Stauart 1962, Page : 265) సర్ మార్టిమర్ వీలర్ గొప్ప పురావస్తు శాస్ర్తజ్ఞుడు. ఆర్య సంస్కృతి గుర్తించదగినంత గొప్ప సంఘటనగా విడదీసి చూపటానికి ఆధారాలేవీ కనిపించటం లేదని రాశాడు. (Mortimer Wheeler : Civilization of the Indus Vallery, London 1966, Page : 97).
రామ, కృష్ణ భక్తులు ఈ విదేశీ శాస్త్రజ్ఞుల రచనలను పరిశీలించి వారు తప్పు అని రుజువు చేయగలిగితే బాగుండును. రామాయణ, మహాభారతాలకు సంబంధించిన స్థలాలను తవ్వి అలా చేస్తే సంతోషించవచ్చు. కాని, చెదురుమదురుగా లభించిన పూసలూ, రంగులు వేసిన కుండలూ, 12 గదులతో కూడిన మట్టియిళ్ళూ చూపి అదే గొప్ప సంస్కృతిగా ఆకాశానికి ఏత్తే ప్రయత్నాలు చేస్తున్నారు. మగధ సామ్రాజ్యం తలెత్తే వరకూ ఆర్యుల సంస్కృతి నిస్సందేహంగా అల్పస్థాయిలో కొనసాగింది.
క్రీ.పూ. 8వ శతాబ్దంలో గంగానది వరదల వలన నాగరికతంతా కొట్టుకుపోయినట్లు పురాణాల్లో రాసిఉందని చెపుతున్నారు. అప్పుడు కౌరవుల రాజధాని కొశాంబీకి మారిందట. హస్తినాపురం వద్ద తవ్వకాలలో యిది బయటపడిందటున్నారు. హస్తినాపురాన్ని పురాణాల ప్రకారం అస్తినుడు స్థాపించాడు. దుష్యంతుడికీ, అతడి కుమారుడు భరతుడికీ హస్తినాపురం రాజధాని అన్నారు. పురాణాల వంశ పారంపర్య జాబితాలో దుష్యంతుడి తరువాత 5వ వారసుడుగా హస్తినుడు వచ్చాడు. అతడు స్థాపించిన రాజధాని ముత్తాతల రాజధాని ఎలా అవుతుంది. పురాణాలన్నీ యిలాంటి అసంగతాలతోనే ఉన్నాయి. (Amar Chand : Hastinapura, 1952, Banares, Page : 7, 8).
భారీ కట్టడాల అవశేషాలు భౌతిక సంస్కృతికి చిహ్నాలు. అలాంటివి హస్తినాపురంలో లేవు. ఎ. ఘోష్ ఇలా హెచ్చరించాడు. మహాభారతగాధల గురించి పురావస్తు శాఖ త్రవ్వకాల ద్వారా సాక్ష్యాధారాలు అందించినట్లు చెపుతారు. అలాంటి నిర్ణయాలకు రావటం తొందరపాటవుతుంది. కౌరవుల రాజధాని హస్తినాపురం భారీ వరదల వలన కొట్టుకుపోయిందని కధలు అల్లారు. ఇతిహాసాల సంప్రదాయాలను సమర్ధించుకోటానికి పురావస్తుశాఖ పరిశోనలను అడ్డంపెట్టుకోవాలి. (A. Ghosh : Ancient India, No.11.12 New Delhi, 1954-55, Page:3).
మన ప్రాచీన గ్రంధాలు ఎంత పెద్దగా ఉంటే వాటి భాష్యాలు, వాటి చరిత్ర కాలక్రమం, భూగోళం అంత చిలవలు పలవలుగా ఉంటుంది. మన సనాతనులు గుడ్డిగా వాటిని అనుసరిస్తారు.
ప్రాచీన భారత చరిత్రలో మహాభారత యుద్ధం ప్రథమ అధికారిక సంఘటనగా సి.వి. వైద్య పేర్కొన్నారు. దీనిని ఎవరూ సందేహించటం లేదన్నారు. (C.V. Vaidya : The Mahabharata War, Bombay, 1929, Page:55). ఆ సంఘటన మాత్రమే కాదు, అది జరిగిన తేదీలు సహితం ప్రశ్నార్ధకంగానే మిగిలాయి. చరిత్రకారుడు విన్ సెంట్ స్మిత్ రాస్తూ మౌర్య సామ్రాజ్యం తలెత్తటంతో చరిత్రకారుడు ఆంధకారంలోంచి వెలుగులోకి వచ్చినట్లయింది. తేదీలు నిర్దుష్టంగా తెలిసాయి. (Vincent Smith : The oxford History of India, 1958, Page:95).
సనాతనులకు అలాంటివి మింగుడు పడవు. సూర్యవంశం నుండి దిగివచ్చిన క్షత్రియులు కేవలం ఆర్యవంశంలో ప్రాచీన భారత దేశంతో పాటు యావత్తు ప్రపంచాన్నీ పరిపాలించారన్న వారే షట్ చక్రవర్తులు. చంద్రగుప్త మౌర్యులతో ప్రారంభించటం విన్ సెంట్ స్మిత్ వంటి యూరోపియన్ల కుట్రమాత్రమే అన్నారు. అలెగ్జాంటర్ తో సమకాలీనులైన చంద్రగుప్తుడు మౌర్యవంశానికి చెందడనీ, అతడు గుప్తవంశంవాడనీ అన్నారు. క్రీ.పూ. 4 వేల సంవత్సరాల క్రితం గుప్త సామ్రాజ్యం ఉన్నదన్నారు. దీనికి పంచాంగాలూ, పురాణాలూ ఆధారాలన్నారు. ద్వాపర, కలియుగాల మధ్య క్రీ.పూ. 3102లో మహాభారత యుద్ధం జరిగిందన్నారు. దీనివలన ఒక వెయ్యి సంవత్సరాలు అశోకుడిని వెనుక్కు నెట్టినట్లయిందని ఎ.ఎ. మెగ్డానెల్ అన్నాడు. (A.A. Macdonell : India’s Part, 1956, Varanasi).
1966లో విలర్డ్ ఎఫ్. లిబి అనే రసాయన శాస్రజ్ఞుడికి కార్బన్-14 డేటింగ్ కనుగొన్నందుకు నోబుల్ బహుమానం వచ్చింది. గతాన్ని తెలుసుకోడానికి ఇతని ప్రక్రియ చాలా వరకు ఉపయోగపడుతున్నది. 40 వేల సం.రాల వరకు కనుగొనే అవకాశం లభించింది. (Libbi Willard F.H. : The Frontiers of Knownedge, Newyork 1975). ఈ విధానంలో దోషాలు కూడా అనల్పంగానే ఉన్నాయి. అది అంగీకరిస్తే ప్రాచీన భారత చరిత్ర తెలుసుకోటానికి పంచాంగాలూ, పురాణాలూ పక్కన పెట్టాల్సిందే. చరిత్ర కారుల ముసుగులో వైద్య వంటి వారెందరో పక్కిటి గాధల్ని చరిత్ర తొడుగుతో చూపారు. అలాంటి వారిని గమనంలోకి తీసుకోరాదు. వారికి ప్రాధాన్యత యిస్తే, చెత్తాచెదారానికి ప్రాముఖ్యత యిచ్చినట్లే.
కార్బన్-14 డేటింగ్ విధానంలో సర్ విలియం జోన్స్ భారత చరిత్ర కాలాన్ని సరిగ్గా చూపాడు. చంద్రగుప్త, అలెగ్జాండర్ సమకాలీనతను నిర్ధారించాడు. అశోకుని శాసనాలు తెలుసుకోటానికి బ్రహ్మీ, ఖరోస్తి లిపి జేమ్స్ ప్రిన్ సెస్ వెలుగులోకి తెచ్చాడు. ప్రాచీన భారత భౌగోళిక విషయాలను ఏర్చికూర్చిన ఖ్యాతి అలెగ్జాండర్ కానింగ్ హాంకు దక్కింది. ప్రిషాల అంటే శూద్ర అనీ, పాపపంకిలుడనీ నిఘంటువులు పేర్కొన్నట్లు ఎందరికి తెలుసు. దేవానాం ప్రియ అనే అశోకుని బిరుదు శాసనాలపై ఉన్నది. దానికి ఉన్మత్తుడు అనే అర్ధాన్ని మన ఇతిహాసాలూ, పురాణాలూ అంటగట్టాయని ఎందరికి తెలుసు.
కురుక్షేత్ర యుద్ధం బహుశ పుక్కిటి పురాణమే కావచ్చు. క్రీ.పూ. వెయ్యి సంవత్సరాలలో ఒకవేళ ఇది జరిగే ఉంటే, కేవలం ఆర్య తెగల మధ్య కలహమే తప్ప యుద్ధం మాత్రం కాదు. వేదసాహిత్యంలో దీని ప్రస్తావన లేదు. ఈ కలహం కూడా కూరు-పాండవుల మధ్య అయి ఉండదు. మహాభారత అధ్యయన పరులు ఇలాంటి భావాలను వెల్లడించారు.
విన్ సెంట్ స్మిత్ మహాభారత యుద్ధాన్ని చారిత్రకేతర కధగా భావించాడు. ఆల్ బ్రెట్ వెబర్ ఆర్య తెగల కలహంగానే భావించాడు. (Albreckt Weber : The History of Indian Literature, London, 1914, Page : 187). రోమిలాధాపర్ దీన్ని కేవలం స్థానిక ముఠాతగాదాకా చెప్పింది. (A History of India, 1968) భాషమ్ దీన్ని యుద్ధంగా పేర్కొన్నప్పటికీ అతిశయోక్తులే చాలా జోడించారు అన్నాడు. కురుక్షేత్ర యుద్ధం కౌరవులకూ, పాంచాలురకూ మధ్య జరిగిందనీ, దీనికి పాండవులను జోడించడంలో బ్రాహ్మణాసక్తి ఉన్నదనీ క్రిస్టియన్ లాసన్ రాశాడు. (Pre Musalman India, Vol.II, Vedic India, Part I, Madras, 1937). మహాభారతాన్ని సొంతంగా పరిశీలించిన పెండ్యాల శాస్త్రి (పిఠాపురం) కూడా అలాంటి అభిప్రాయానికే వచ్చారు.
దీని అంతటినీ బట్టి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన చరిత్ర, తేదీలు, పాల్గోన్నవారూ అన్నీ సందేహాస్పదాలే. అలాగే కృష్ణుడు, గీత కూడా, మన ప్రాచీన భారత చారిత్రక తేదీలను నిర్ధారించే ప్రయత్నం కొందరు సనాతనులు చేస్తూనే అన్నారు. ఎ.డి. పుసల్కర్ పాషండుడూ కాదు. సందేహవాదీ కాదు. అతడు ఇలా అన్నాడు. మహాభారతానికి సంబంధించి గ్రహ నక్షత్రాలను ఆధారంగా తేదీలు నిర్ణయిస్తున్నారు. దీనివలన భిన్న ఫలితాలు వచ్చాయి. పరస్పర విరుద్ధ వాస్తవాలు బయట పడ్డాయి. కనుక అలాంటి వాటిని ఉత్తరోత్తరా ప్రవేశపెట్టినట్లు భావించి నిరాకరించాలి. (A.D Pusalkar : History and Culutre of the Indian People Vol.I. Vedic Age Page : 269).
పుసల్కర్ చేసిన విమర్శల వంటివి భారతదేశానికే పరిమితం కాలేదు. క్రీ.పూ. 4004 మార్చి 23న బైబుల్ ప్రకారం భగవంతుడు ఆడంను సృష్టించినట్లు బిషప్ ఆషర్ ప్రకటించారు. అతని ప్రేరేపణతో గాబోలు, వెలంది గోపాలయ్యర్ కురుక్షేత్ర యుద్ధం క్రీ.పూ. 1194 అక్టోబరు 14న మొదలయిందన్నాడు. కలియుగం క్రీ.పూ. 312 ఫిబ్రవరిలో ఆరంభమయిందనీ, ఆ తరువాత 36 ఏళ్ళకు కురుక్షేత్ర యుద్ధం జరిగిందనీ, మరొక పండితుడు ప్రకటించాడు. (S.B. Roy : Ancient India, 1975). అతడి ప్రకారం క్రీ.పూ. 3227 వరకూ కృష్ణుడు 125 ఏళ్ళు బ్రతికాడన్నాడు. కృష్ణుడు చనిపోయిననాడే కలియుగం మొదలయిందన్నారు. ఆదాయపు పన్ను అధికారిగా రిటైరయి అతడు ఇలాంటి తేదీల నిర్ణయానికి పూనుకున్నారు. ఇండియా అనే భారత దేశం అలాంటివారితో నిండి ఉన్నది. వారికి నమోవాకాలు.
అధ్యాయం ఐదు
పెనుభూతం
కైరోవద్ద పిరమిడ్లను పెనుభూతం వంటిదిగా కిప్లింగ్ అభివర్ణించాడు. మహాభారతానికి అదే వర్తించవచ్చు. పిరమిడ్ ఏడు అద్భుతాలలో ఒకటైతే, మహాభారతం 7 అభూత కల్పనలలో ఒకటిని చెప్పవచ్చు. పిరమిడ్ ఎత్తు 451 అడుగులు. మహాభారతం 18 పర్వాలలో, లక్ష శ్లోకాలలో ఉన్నది. ఒకప్పటి పిరమిడ్ పవిత్రత కోల్పోయి యాత్రికుల ఆకర్షణ స్థలంగా మారింది. మహాభారతానికి ఇంకా కొనసాగుతున్న పవిత్రత భారతదేశానికి పెద్ద ఉపద్రవం వంటింది. భారతీయుల జీవితాన్నీ, ఆలోచననూ అణచివేసే భారంగా అది తయారయింది.
మహాభారతం శతాబ్దాలుగా నేటి పెనుభూతస్థాయికి ఎలా చేరుకున్నదో గమనించాలి. వ్యాసుడు 8800 శ్లోకాలు చెప్పి జయ అని నామకరణం చేశాడు. వైశంపాయనుడు 24 వేల శ్లోకాలకు పెంచి భారతం అని పేరు పెట్టాడు. సౌతుడు లక్ష శ్లోకాలు పూర్తి చేసి మహాభారతంగా రూపొందించాడు. మధ్యలో మరెందరో జ్యోకం చేసుకొని యధాశక్తితో కలిపారు.
ఒక రచయిత కృషిలో జోక్యం చేసుకొని, రూపురేఖలో మార్చేసి, ముఖ్య సందేశాన్ని తారుమారు చేయటం హీనమైన నేరం. ప్రాచీన కాలం నుండి ఈ ఆధ్యాత్మిక దేశంలో అది సాగి పోతూనే వున్నది.
మత గ్రంధాలూ, ధర్మసూత్రాలూ రాజకీయ, ఆర్థిక రచనలూ, ఇతిహాసం, పురాణం అన్నీ యిలా మార్చేసారు. ఆ విధంగా చేయటంలో ప్రజాశక్తిని పెంపొందించినట్టూ, స్వర్గంలో స్థానం ఏర్పరచుకొన్నట్టూ భావించారు. అచ్చుయంత్రాలు వచ్చినా ఈ విధానాం ఆగలేదు.
మహాగ్రంధాలూ, ధర్మసూత్రాలూ రాజకీయ, ఆర్థిక రచనలూ, ఇతిహాసం, పురాణం అన్నీ యిలా మార్చేసారు. ఆ విధంగా చేయటంలో ప్రజాశక్తిని పెంపొందించినట్టూ, స్వర్గంలో స్థానం ఏర్పరచుకొన్నట్టూ భావించారు. అచ్చుయంత్రాలు వచ్చినా ఈ విధానం ఆగలేదు.
మహాభారతం, ఒక పెద్ద గేయం, సినిమా, రేడియో, టెలివిజన్, డ్రామాలు లేని రోజుల్లో గేయాలు పాడుకుంటూ కాలక్షేపం చేసేవారు. నాయకులూ, దేవుళ్ళూ కధా వస్తువులుగా ఉండేవి. రాజుల కొలువుల్లో సూతులు ఈ రచనలు చేస్తూ పోయారు. యజ్ఞయాగాదులలో వీరి అవసరం ఉండేవి. సంవత్సరాల తరబడి యజ్ఞాలు సాగుతుండగా విసుగు పుట్టకుండా గేయాలు పాడేవారు. రాజుల తృప్తి కోసం ఆ గేయాలను మారుస్తుండేవారు. మహాభారతం, రామాయణం పురాణాల కథాకాలక్షేపం అలా సాగేది.
తొలుత ప్రాకృతంలో ఉన్నదంతా తరువాత సంస్కృతంలోకి మార్చారు. సూత్రధారుల స్థానంలో బ్రాహ్మణులు వచ్చారు. స్తోత్రపాఠాలలో అర్థాన్నీ, సందేశాన్నీ మార్చివేశారు. భూసురులుగా తమ స్థానాన్ని భద్రపరచుకున్నారు. దేవుళ్ళకు మించి తమకు ఉన్నత స్థాయి ఉన్నట్టు భృగులు తిరగరాసుకున్నారు. (Irawati Karve : Yuganta, Poona, 1966, Page 5). అందులో ఒకరు విష్టువు వక్షస్థలాన్ని తన్నినట్లు, బ్రహ్మ-శివులను అణచి పెట్టినట్లు పేర్కొన్నారు. (Vemuri Sreenivasa Rao, Purvagathalahari, Madras, 1952, Page. 327-328).
జర్మనీలో హెర్మన్ వోల్డెన్ బర్గ్ బుద్ధునిపై నిశిత పరిశీలనా చరిత్ర ప్రచురించారు. మహాభారతం చిన్న ఇతిహాసంగా ప్రారంభమై, భయానకంగా, గందరగోళంగా మారిందని అన్నాడు. వి.ఎస్. సుక్తాంకర్ ఇతడి ప్రస్తావన చేశాడు.
మహాభారతాన్ని క్రమబద్ధంగా విశ్లేషించిన వాడు హాప్ కిన్స్. ఇతడు ఇలా అన్నాడు. ఈ ఇతిహాసం మనకెలా చేరింది. ప్రతి అధ్యాయమూ మార్పులకు గురై విస్తరించిన ప్రక్షిప్తాలు చోటు చేసుకొని, హద్దూ పద్దూ లేకుండా ప్రతి లేఖ కూడా సొంత రచనలను ప్రవేశపెట్టి కలగా పులగం చేశాడు. (V.W. Hopkins : The Great Epic of India, 1969, Calcutta, Page: 400). విన్ సెంట్ స్మిత్ ప్రకారం నేటి లక్ష శ్లోకాలలో 20 వేలు మాత్రమే కురుపాండుల సంఘర్షణకు సంబంధించినవి. మిగిలినదంతా కలిపారు. (Vincent Smith, Oxford History of India).
మహాభారతంలోని మూల అంశం ఎప్పుడు రచించారు. విస్తరణ ఎప్పుడు, ఎలా జరిగింది. ఎప్పుడు ఆగింది. ఈ మార్పులన్నింటికీ కారణం ఏమిటి.?
భిన్న పండితులు విభిన్న అభిప్రాయాలు వెల్లడించారు. పాణిని కాలంలో మహాభారతం సంస్కృత ఇతిహాసంగా లేదు. మహాభారతం అనే పదాన్ని పాణిని తన వ్యాకరణంలో విశేషంగా వాడాడు. వాసుదేవుడిని, అర్జునుడిని దేవుళ్ళుగా ప్రస్తావించారు. యుధిష్టిరుని మాట గూడా ఉన్నది. (Max muller, A History of Sanskrit Literature) అంటే కృష్ణుడితో పాటు అర్జునుడిని గూడా దేవుడుగా కొలిచారు.
పాణిని వ్యాకరణంలో కుంతి, మాద్రీ ప్రస్తావన పాండురాజు భార్యలుగా కాదు. కుంతుల ప్రాంతం నుండి కుంతి, మద్ర ప్రాంతం నుండి మాద్రి వచ్చినట్లున్నది. (Radhakummud Mukherjee, Hindu Civilization, 1950 Bombay, Page : 141) భారతం మహాభారతం అనే ప్రస్తావన తొలుత అశ్వలాయన గృహ్యసూత్రాలలో ఉన్నది. ఇది కూడా మధ్యలో ప్రవేశపెట్టిందేనని వెబర్ అన్నాడు. (Albrecht Weber : The History of Indian Literature, 1914, Page : 189) ఏమైనా యీ సూత్రం ఎప్పుడు వచ్చిందన్నది కూడా నిర్ధారణ కాలేదు.
పాణినికి ముందు సంస్కృత ఇతిహాసంగా మహాభారతం లేదు. ఈ వ్యాకరణ శాస్ర్తజ్ఞుడు ఎప్పటి వాడో సరైన కాలనిర్ణయం లేదు. (V. Rangacharya, Vedie India 1937, Madras Page : 69, 70) క్రీ.పూ. ఐదవ శతాబ్దంలో ఉండవచ్చునని భావిస్తున్నారు. మహాభారతం పాణిని అనంతరం క్రీ.పూ. 4-3 శతాబ్దాల మధ్య వచ్చి ఉండవచ్చునని రాప్ సన్, బార్నెట్, హాప్ కిన్స్, మెగ్డోనెల్, వింటర్నిజ్డ్ పండితులు భావిస్తున్నారు. వెబర్, వైద్యా అభిప్రాయం ద్వారా చెప్పించారన్నారు. అశ్వమేధపర్వంలో క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందగా, రాధాకుముద్ ముఖర్జీ క్రీ.పూ. 2వ శతాబ్దానికి తెచ్చారు.
మహాభారతం నేటి అవతారం దాల్చింది క్రీ.త. 4,5 శతాబ్దాలలోనే మార్పులూ, చేర్పులూ అన్నీ 4వ శతాబ్దం వరకూ జరుగుతూ వచ్చాయి. కలియుగంలో మనిషి పతనం ఆరంభం అయిందన్నారు. మహాభారతాన్ని అతి గౌరవంగా చూచే వి.యస్. సుక్తాంకర్ క్రీ.త. వెయ్యివరకూ అనేక చేర్పులు చేశారంటూ ఒప్పేసుకున్నారు. బండార్కర్ ప్రాచీన పరిశోధనా సంస్థవారు ప్రచురించిన మహాభారతంలో చాలా చేర్పులు జరిగాయన్నారు. విష్ణు అవతారవర్ణన, భీష్ముడి వైష్ణవ ధర్మాల్ని తెచ్చి పెట్టారన్నారు. ఇవి 2500 శ్లోకాల వరకూ ఉన్నాయి. ఇటీవలే యిలా జరిగినప్పుడు పూర్వకాలం యింకా ఎన్ని జరిగి ఉంటాయో ఊహించాల్సిందే. (V.S. Suktankar : On the Meaning of Mahabharata, Bombay 1957, Page : 22).
అంధ విశ్వాసంతో సనాతనులు ఈ విధంగా యిష్టం వచ్చినట్లు మలుచుకుంటూ పోయారు. వ్యాస మహాభారతంలో లక్ష శ్లోకాలున్నట్లు 5వ శతాబ్దంలో ఒక శాసనం పుట్టించారు.
మార్పులేమీ జరగలేదని వాదించారు. ఈ సంఖ్యను అట్టి పెట్టటానికి పాత వాటిని కొన్నిటిని తొలగించటం, కొత్తవాటిని చేర్చటం సునాయసంగా జరిపారు.
వ్యక్తిగత దేవుడనే భావనను పెంపొందించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. గౌతమబుద్ధుడు దేవుడున్నాడనీ, లేడనీ చెప్పలేదు. అతని శిష్యులు బుద్ధుడు చనిపోగానే అతడిని దేవుణ్ణి చేశారు. అతని జీవితాన్ని గురించి కథలు అల్లారు. వేద, బ్రాహ్మణవాదాన్ని దెబ్బ తీసేటంతగా బౌద్ధం పెరిగిపోయింది. ఇందుకు మారుగా క్రీస్తుపూర్వం 3,4 శతాబ్దాలకు మధుర ప్రాంతంలో గోవుల్ని కాచుకునే తెగల నాయకుడిని అడ్డం పెట్టి దేవుణ్ణి చేశారు. ద్రౌపదీ స్వయం వరంలో హఠాత్తుగా మహాభారత కథలోనికి కృష్ణుడు వచ్చేశాడు. అప్పటి నుండీ కృష్ణుడు పెరిగిపోయి దేవుడయ్యాడు. అంతవరకూ కురురాజులకు అనుకూలంగా ఉన్న కథను పాండురాజుల వైపు తిప్పారు. జనమేజయుడి యజ్ఞంలో ఈ మార్పు జరిగినట్లు పిఠాపురానికి చెందిన పెండ్యాల శాస్ర్తి, ప్రాచీన భారతాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు భావించారు. జనమేజయుడు పాండు సంతతి వారు. ఉదారంగా దానాలు చేశారు. అతడికి తృప్తి నిచ్చేటట్లు కథను మార్చారు. ఐనా దోషాలు కనిపిస్తూనే ఉన్నాయి.
సామాజిక అంతస్తులలో పురోహిత వర్గాన్నీ, ఉన్నత స్థాయిలో పెట్టటానికి ప్రయత్నించారు. మహాభారతం బ్రాహ్మణుల విజ్ఞాన సర్వస్వమని రాప్ సన్ పండితుడు సృష్టీకరించాడు. బౌద్ధ కాలాన్ని గురించి రాసిన రైస్ డేవిస్ మహాభారతం పురోహితుల చేతుల్లో మార్పుచెందిందన్నారు. బౌద్దుల వలన దెబ్బతిన్న ప్రతిష్ఠను పునరుద్ధరించడానికి బ్రాహ్మణులు యిలాంటి పనిచేశారు. ప్రజా బాహుళ్యంలో ఉన్న కధల్ని బ్రాహ్మణులు సానుభూతితో స్వీకరిస్తున్నారని చూపడానికి కూడా యిలా చేశారు. వేదసాహిత్యంలో లేనివన్నీ ఇందులో సజీవంగా ప్రవేశపెట్టారు. ఆర్యులకు సంబంధించిన ఈ అంశాలు మహాభారతంలో చోటు చేసుకున్నాయి. (Rhys Davis : Buddhist India) ఏమైనా అమానుషంగా ప్రక్షిప్తాలు జరిపారు. గుప్తులకు ముందు మాహాభారతాన్ని తిరగరాయటం గమనిస్తే ఆటవిక ఆచారమైన సతీ సహగమనం కూడా తిరగదోడారని కోశాంబి అన్నారు. (An Introduction to the study of Indian History), బ్రిటిష్ వారు శాసన బద్ధంగా నిషేధించిన సతి 150 సం.రాల తరువాత తిరిగి ప్రవేశించింది. అలాగే భారతీయుల జీవితాన్ని ప్రభావితం చేయటంలో మహాభారతం పుస్తకాలను మించిపోయిందని సర్ పెర్సివల్ గ్రీవిత్స్ అన్నారు. పాండురాజు భార్యల మధ్య ఎవరు సతీసహగమనం చేయాలనే అంశంపై వివాదాన్ని మహాభారతంలో ప్రవేశపెట్టారు. దీన్ని తిరగరాసినప్పుడు తిరోగమన ప్రభావం ఘోరంగా పరిణమించింది. కులధర్మంగా చంపేయమని భగవద్గీత బోధించింది కూడా మహాభారతంలో తెచ్చిపెట్టారు.
అధ్యాయం ఆరు
లోగుట్టు
కోటలోకి ప్రవేశించాలంటే ప్రహారీగోడలు పగులగోట్టాలి. మహాభారతంపై దాడి చేసి, అది అబద్దాల పుట్టఅనీ, మోసపూరితమనీ చూపితేగాని గీతను ఎదుర్కోలేము. చుట్టూ అల్లిన నాటకాన్ని పొరలు విప్పుకుంటూ పోతే, గీత బండారం బయట పడుతుంది.
మహాభారతం ఎన్ని వంకలు తిరిగినా చివరకు కురుక్షేత్రాన్ని చేరుకుంటుంది. అది యుద్ధరంగమే గాక, ధర్మక్షేత్రంగా పేర్కొన్నారు. ఉభయ సైన్యాలు ఢీకొన్నాయి. గుర్రాలు కదం తొక్కుతున్నాయి. ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. రధాలపై పతాకాలు రెపరెపలాడుతున్నాయి. కాల్బలం పోరాటానికి సిద్ధంగా ఉన్నది. చెవులు గింగురు మనే ధ్వనులు వినిపిస్తున్నాయి. అలాంటి భూమికలో తాను ఎదుర్కొనవసిన వారిని పరిశీలించటానికి గాను రథాన్ని పక్కకు తిప్పమని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కోరాడు. ఎదుట తండ్రులనూ, తాతలనూ, గురువులనూ, బంధుమిత్రులను తిలకించాడు. అతడికి నోటమాట రాలేదు. నాకు విజయం సాధించాలని లేదు. రధాన్ని వెనక్కుతిప్పమని కోరాడు. కృష్ణుడు నవ్వి గీతాబోధన ప్రారంభించాడు. కురుక్షేత్రం మౌనం దాల్చింది. అందరూ గీతను విన్నారు.
ఈ నాటక రంగాన్ని తొలగిస్తే, గీతలో ఏమి మిగిలింది? నేను దేవుణ్ణి, సత్యాన్నీ, జీవితాన్నీ, మార్గాన్నీ అంటూ కృష్ణుడు చెప్పాడు. మహాభారతంలోకి గీతను ఎవరు తొలుత చొప్పించారో గాని అతడు గొప్ప మానసికవేత్త. పి.డి. మెహతా వ్యాఖ్యానిస్తూ తాత్త్విక గీతాలాపనకు ఎంపిక చేసుకున్న దృశ్యం చాలా ఆకర్షణీయమైందన్నాడు. (P.D. Mehta : Early India Religious Thought, London, 1956, Page : 246).
మహాభారతాన్ని రాజగోపాలాచారి, మున్షీ సుక్తాంకర్ అభినందించినట్లు నేను చేయలేను. గీత వారి దృష్టిలో గొప్పది కాగా, మహాభారతం నీతి కూడలి. కాని, ప్రపంచంలోని ఇతిహాసాలో అంత గందరగోళమయింది మరొకటి లేదు. అది కలగాపులగం అని హాప్ కిన్స్ అన్నాడు. పురోహితులతో సహా ఎందరో జోక్యం చేసుకున్నారు. సూతులు దీని తొలిరచయితలు. వారు కవులు. సామాన్య ప్రజలను ఆకట్టుకున్నారు. వారి దృష్టిలో ఒక యుధిష్టిరుడు, ఒక భీముడూ, ఒక దుర్యోధనుడూ, సంజయుడూ, శకుని ఉన్నారు. వారి సృష్టిలో ద్రౌపది చాలా గొప్పది. మహాభారతానికి తొలి ఆకర్షణ ఆ పాత్రలే.
మహాభారతాన్ని ఉన్నత నీతి గ్రంధంగా పేర్కొనటం ఘోరమైన విషయం. సుక్తాంకర్ వంటి వారు అందులో స్వర్ణ సంపదను చూచారు. బాణుని కాలంలో ఇది విద్యాగంధంగా ఉపకరించిందన్నారు. (V.S. Suktankar : The Meaning of Mahabharata) బాణుడు ఏడవ శతాబ్దంలోనివాడు. రాజరికంలో నివసించాడు. ప్యూడల్ సాంఘిక ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఐనా, మహాభారతాన్ని నేడు మన పాఠ్యగ్రంధంగా ఉంచాలని సుక్తాంకర్ కోరుకుంటున్నారు. బహుళ ప్రచారం నిమిత్తం రాజగోపాలాచారి వీటిని అనువదించాడు. మున్షీ తన చివరి దశలో కృష్ణావతారం పేరట ఏడు సంపుటాలు ప్రచురించాడు. ఇలాంటి వారు మన మధ్య లక్షలాదిగా వున్నారు. వారిది ఫ్యూడల్ మనస్తత్వం. ప్రాచీన సమాజాన్ని అట్టే పెట్టాలన్న స్వార్ధచింతన ఉన్నది. మహాభారతాన్ని పాఠ్యగ్రంధంగా, గీతను పవిత్ర గ్రంథంగా కోరుకుంటున్నారు. ప్రపంచ చరిత్రను చదివి పాఠాలు నేర్వటం వారికిష్టం లేదు. జర్మనీ రసాయనిక శాస్ర్తజ్ఞుడూ, వైద్యుడూ పరసిలస్ 15వ శతాబ్దంలో ప్రాగ్ లో వైద్యం పై తన ఉపన్యాసాలు ప్రారంభించే ముందు హిపోక్రిటస్, గాలెన్ పుస్తకాలను తగ్గుల బెట్టాడు. ఆధునిక వైద్యానికి నాందిపలికిన ధోరణి అది. మృత ప్రాయమైన మన గతాన్ని అలా వదిలేస్తే గాని, ఆధునిక భారతదేశం ఆవిర్భవించదు. మానవ నాగరికతో ప్రాచీన గాధలకు స్థానం ఉన్నదనీ, నమ్మకాలను క్రోడీకరిస్తుందనీ చెప్పాడు. ఆనాటి మానవుడికి మార్గగామి అయినగాధలు చాలా ముఖ్యదశను చూపుతున్నాయి. అతడు ఆదిమ సమాజాన్ని గురించి ఈ మాటలన్నారు. మన సమాజం నేడు ఆదిమస్థితిలో లేదు. అలాంటప్పుడు ప్రాచీన గాధల్ని నేడు యథాతధంగా స్వీకరిస్తే ఎవరో కొందరు ఉన్నతస్థాయిలో కొనసాగటానికి ప్రయత్నించటమే అవుతుంది. (Bronislew Malinowski : Magic, Science and Religion and other Essays, New York, 1954) గాధలు సామాజిక వడిదుడుకులలో, హెచ్చుతగ్గులలో పనిచేస్తాయని కూడా అన్నారు. అలాంటి స్థితి నేడు మన సమాజంలో ఉన్నది. వాటిని తొలగించి సమసమాజాన్ని ఏర్పరచాలంటే పాతవ్యవస్థను పోగొట్టాలి.
అధ్యాయం ఏడు
కృష్ణుడెవరు?
కృష్ణుడెవరు అని ప్రశ్నించటం అసందర్భం కాదు. హిందూ మత కృతుల్లో, కవితలు, పాటలు, నృత్యాలు, నాటకాలు, శిల్పం, చిత్రాలు రూపకంగా హిందూ జీవన రంగంలో కృష్ణుడి ఆధిపత్యం వ్యాపించింది. హెర్మన్ ఓల్డెన్ బర్గ్ కృష్ణుడు ఎవరు అని ప్రశ్న వేశాడు. కృష్ణుడికి పోటీగా రాముడున్నా, హైందవేతరులలో రాముడికి భక్తులు ఆట్టేలేరు. క్రీ.పూ. రెండవ శతాబ్దంలోనే వాసుదేవుని పేరిట గ్రీకులు పూజలు చేశారు. (Cambridge History of India, Vol.I) క్రైస్తవులలో సహితం కృష్ణుడి ప్రభావం ఉన్నది. కమ్యూనిస్టు లోకంలోనూ ఇది వ్యాపించింది. భారతదేశం నుండి ఎగుమతి అవుతున్న వాటిల్లో యిది ముఖ్యమైనది. అమెరికాలో కృష్ణ చైతన్యపేరిట మాదకద్రవ్య సంస్కృతిలోకి ప్రవేశించింది. సర్వరోగ నివారిణిగా ప్రచారంలోకి వచ్చింది. కృష్ణచైతన్యను ప్రచారం చేయటానికి అమెరికాలోని ఫోర్డ్ కుటుంబంవారు కోట్లాది రూపాలిచ్చారు.
కృష్ణుడెవరు అని అడగటం సులభమే గాని, సమాధానం అంత సులువు కాదు. బిపిన్ చంద్రపాల్ ప్రయత్నించి ఇంకా ఉచ్చులో బిగుసుకుపోయాడు. (Vipin Chanra Pal : Sri Krishna, 1963) కృష్ణుడు చాలా మంది ఉన్నారు. సిసలైన వాడెవరో తేల్చటం కష్టం. వేద కాలంలో ఒక కృష్ణుడు ఆర్యరుషికాగా, మరొకరు ఆర్యేతరులు. రుషిగా ఉన్న కృష్ణుడికి విశ్వకుడు అనే కుమారుడు, విష్ణవుడు అనే మనుమడు ఉన్నారు. ఈ మనవడిని అశ్వనీ దేవతలు పునరుద్ధరించారు. (H.H. Wilson, Rigveda, Vol – I 1946, Bangalore, Page : 190) ఇందులో అశ్వనీ దేవతలకు ప్రార్థన చేయటమే కృష్ణుడి పని. పౌరాణిక కృష్ణుడు తన గురువు సందీపుని సంతోషంతో సముద్రం అడుగుకు వెళ్ళి అతడి కుమారుడిని కాపాడతాడు. (Vemuri Sreenivasa Rao, Purvagadhalahari, 1952, Vijayawada, Page 270).
ఆర్యేతర కృష్ణుడిని రుగ్వేదంలో రాక్షసుడిగా చిత్రించాడు. 10 వేల సైన్యం అతనికి ఉండేదట. ఆర్యుల దేవుడు ఇంద్రుడితో అంశుమతి తీరాన పోరాటం జరిపినప్పుడు కృష్ణుడు ఓడిపోయాడు. అది ఆర్యేతర కృష్ణుడికి చాలా అపఖ్యాతి. పురాణాలలో దీన్ని తిరగదోడి విష్ణుపురాణం పేరిట కృష్ణుడు గెలిచినట్లు, ఇంద్రుడు ఓడినట్లు రాశారు. బృందావన గోపికలు ఇంద్రస్తుతి చేయడాన్ని కృష్ణుడు వ్యతిరేకించారు. కుంభవృష్టిని కురిపించిన ఇంద్రుడి దాడినుండి తన వారిని సంరక్షించటానికి కృష్ణుడు గోవర్ధన గిరిని చిటికిన వేలుపై 7 రోజుల పాటు గొడుగుపట్టాడు. ఇంద్రుడు మేఘాలను పంపించి వేశాడు. ఇలాంటి కట్టుకథలకు పురాణాలు పెట్టింది పేరు.
ఉపనిషత్తుల్లో కృష్ణుడు దేవకీపుత్రుడుగా చాందోగ్యోపనిషత్తులో కనిపిస్తారు. అంగీరస శిష్యుడేనా ఈ కృష్ణుడు? అవునని ఆదిశంకరా చార్యుడంటాడు. (B. Majundar : Krishna in History and Legend, 1969, Calcutta Page : 3) సనాతనుల దృష్టిలో శంకరాచార్యుడు చెప్పింది తిరుగులేనిది. అంగీరసుని వద్ద కృష్ణుడు ఉపనిషత్తులు నేర్చాడు. పురాణాలను బట్టి కృష్ణుడి గురువు సందీప్. ఉపనిషత్తులను ఔపోసనం పట్టిన ఖ్యాతి కృష్ణుడికి దక్కితే, అంగీరసుడితో ముడిపెట్టక తప్పదు. శంకరాచార్యుడు మెదలు హేమచంద్రరాయ్ చౌదరివరకూ ఆపనే చేశారు. (Hema Chandra Roy Chaudhury, Materials for the History of the Vaishnava sect, New Delhi, 1975) చాందోగ్యంలో, గీతలో కొన్ని పోలికలు ఉన్నాయి. గనుక రాయ్ చౌదర అలా అభిప్రాయపడ్డాడు. ఆ విధంగా చూస్తే మర కొందరు ఉపనిషత్ రుషులకు కూడా కృష్ణుడు శిష్యుడేనని భావించాలి. ఎ.ఎస్.పి. అయ్యర్ ఇలా అంటాడు. అంగీరసుడికి గుణపాఠం చెప్పాలని భావించిన కృష్ణుడు శిష్యుడిగా వెళ్ళాడు. అతడి గ్రహణ శక్తిని గురించి ఆశ్చర్యపడిన అంగీరసుడు నేను చెప్పదగినదంతా నేర్చుకున్నావు. ఇక వెళ్ళవచ్చును అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు పెద్ద ఉపన్యాసమే యిచ్చాడు. యాజ్ఞవల్క్యులు గారితో చెప్పిన విషయాన్ని ప్రస్తావించాడు. నిగూఢ సత్యాలను అచ్చుతుడు గ్రహించినట్లు అంగీరసుడు స్తుతించాడు. (A.S.P. Ayyar, Srikrishna, The Darling of Humanity, Madras, 1952) చాందోగ్య ఉపనిషత్తులో ఎంత వెదికినా అయ్యర్ అల్లిన కథ కనిపించవచ్చు. బ్రహ్మసమాజం వారిగా ఉన్న విపిన్ చంద్రపాల్ వైష్ణవుడిగా మారి కృష్ణుడిని అంగీరసుడికి శిష్యుడిగా చేశాడు.
మూడవ కృష్ణుడు మహాభారతంలో, హరివంశంలో కనిపిస్తాడు. ద్వంద్వ వ్యక్తిత్వం గల ఈ కృష్ణుడికి, గీతలోని కృష్ణుడికి పోలికలేదు. మహాభారతంలో దివ్యపురుషుడిగా ఒకవైపున, కురుపాండవుల మధ్య ఎత్తుగడలు, కుట్రలుపన్నిన వ్యక్తిగా మరోవైపునా కనిపిస్తాడు. విష్ణు పురాణంలో కృష్ణుడు గోపికలతో సంచరిస్తాడు. ఇది క్రీ.త. 5వ శతాబ్దంలో రాసింది. కృష్ణుడు నర్మదానదీ తీరాన రాక్షసులను బౌద్ధ జైనులుగా మార్చినట్లు చూపారు. మహామోహ వేషంలో ఆ పని చేశారన్నాడు. (The Cultural Heritage of India, 1969, Calcutta) ఇలాంటి చిత్రణలో ఇతిహాసాలూ, పురాణాలలో మసురుకొని ఉన్నాయి. బుద్ధుడికంటె కొన్ని శతాబ్దాలు ముందే రాముడు ఉండగా, రామాయణంలో బుద్ధుణ్ణి చోరుడుగా రాముడు పేర్కొంటాడు (M.N. Dutt : Ramayana).
భాగవత పురాణంలో కృష్ణావతారం కనిపిస్తుంది. విష్ణుపురాణంలో గోపికలలో సరసాలు ఉండగా, భాగవతంలో వాటి రూపం మారింది. రాధ అప్పటికి రాలేదు. క్రీ.త. 9, 10 శతాబ్దులలో భాగవత కృష్ణుడు వచ్చాడు. కొందరు క్రీ.త. 13వ శతాబ్దానికి కూడా ఈ కృష్ణుడిని నెట్టివేశారు. (Maurice Winter nitz. A History of Indian Literature, Vol-I, Part-II).
క్రీ.త. 14, 15 శతాబ్దాలకు చెందిన బ్రహ్మవైదత్త పురాణంలో కృష్ణుడు కనిపిస్తాడు (Seethanath Tatwabhushan : Krishna And Puranas, Calcutta, 1926). రాధ శృంగార నాయకిగా కనిపిస్తుంది. వైష్ణవ వాదంలో కృష్ణుడి తరువాత ఆమెదే పైచేయి. రాధాకృష్ణుల శృంగార లీలను సమర్ధించటానికి దివ్యాత్మలూ, వ్యక్తి పరమాత్మ లోలీనం కావటం అలాంటివన్నీ తెచ్చిపెట్టారు. కాని, అసలు విషయాన్ని దాచలేకపోయారు.
నారాయణ ఉవాచలో ఇలా ఉంది.
కృష్ణుడు రాధను వివస్ర్తను చేసి ఆమె స్తనాలను పట్టుకుంటాడు. నాలుగు రీతులుగా చుంబిస్తాడు. సంభోగంలో రాధ గజ్జలు తెగిపోతాయి. ముద్దులతో ఆవిడ పెదాలు ఎరుపెక్కుతాయి. స్తనాలపై గంధం చెరిగిపోతుంది. కొప్పువూడి పోతుంది. బొట్టు చెరిగిపోతుంది.
నీరద్ సి. చౌదరి బ్రహ్మ వైవర్తంలోని ఈ భాగాన్ని అనువదించాడు. ఇందులో జీవి అనంతంలో కలిసిపోయే దేమిటో పిచ్చివాడికి కనిపించవలసిందే.
తరువాత కృష్ణుడి పైకి వచ్చిన రాధ సంభోగిస్తుండగా ఆవిడ కాళ్ళ పారాణి చెరిగిపోతుంది. ఆ ప్రక్రియలో ఆమెకు పారవశ్యం కలుగగా రాత్రింబగళ్ళకు తేడా లేకుండా పోయింది. నఖక్షతాలు, దంతక్షతాలతో కృష్ణుడు 8 భంగిమలలో ఆమెతో సంభోగిస్తాడు. గాజుల, మట్టెల చప్పుళ్ళ మధ్య రాధ ఇక భరించలేక సంభోగం నుండి వైదొలగుతుంది. (C. Nirad Chawdhary, Hinduism, New Delhi, 1979) నీరద్ చౌదరి పురాణాలలోని ఘోర విషయాలను ప్రస్తావించాడు.
రాధతో నిమగ్నుడైన కృష్ణుడు గోపికలకు అన్యాయం చేస్తున్నట్లు భావించి ఉద్యానవనంలోకి వెళతాడు. 9 లక్షల మంది ఉండగా అంతమంది పురుషులుగానూ కృష్ణుడు మారి సంభోగించగా ఉద్యానవనం ప్రతిధ్వనిస్తుంది. సామూహిక సంభోగ ప్రక్రియ కొనసాగుతుంది.
సంస్కృతం, ఇంగ్లీషు బాగా తెలిసిన నీరద్ చౌదరి ఈ ప్రక్రియను అనువదించి చూపాడు. యోగులందరికీ గురువైన నారాయణుడు అనేక రూపాలు ధరించి సంభోగించాడు. అప్పుడు గాజుల, మెట్టెల, పట్టెల చప్పుడు ఆనందంగా వినిపించింది. వారంతా పారవశ్యంగా స్పృహ తప్పారు. తెలివి వచ్చిన తరువాత గిచ్చుళ్ళతో, కొరుకుళ్ళతో కృష్ణుడు వారి పిరుదలపై ముద్ర వేశాడు. నగ్నంగా వారెంతో సుందర రూపాలతో ఉన్నారు.
అలాంటి కృష్ణుడిని చూచి వల్లభాచార్యుడూ, చైతన్య, ఇతర వైష్ణవ భక్తులు పారవశ్యం చెందారు. ఆ కృష్ణుడిని చూసే అండాళ్ చండీదాస్, జయదేవుడు, మీరాబాబు, సూరదాస్, విద్యావతి, పోతన, నర్సిమెహతా వంటి కవులూ, కవయిత్రులూ ఆలపించారు. ఆ కృష్ణుడిని గురించే మాధవుడూ, దైవం లీనమైనట్లు ఆధునిక జీవిత చరిత్రల్లో రాశారు.
ధీరేంద్రనాధ్పాల్ ఇలా అన్నారు. ప్రేమరాజ్యం హిమాలయాల నుండి దక్షిణాది వరకూ, ద్వారక నుండి తూర్పు తీరాల వరకూ వ్యాపించింది. (Dhirendranath Pal : Sri Krishna, His Life and Teachings, Calcutta 1904).
కృష్ణుడిని ఎవరూ అర్థం చేసుకోలేదనీ, అతని మార్మికవాదం గొప్పదనీ పాల్ పొగిడాడు. ఐనా, అతన్ని గురించి మనకు తెలియజెప్పడానికి పుస్తకం రాశారు. మోహన్ లాల్ సేన్ 3 సంపుటాలలో కృష్ణుడిని గురించి రాస్తూ బృందావన లీల పేరిట మొదటి సంపుటంలో గోపికలతో కృష్ణుడి క్రీడలను రాశాడు. పారవశ్యం చెందినట్లు కృష్ణుని చిత్రించాడు. బృందావన లీల అంతా ప్రేమమయం అన్నాడు. హిందువులకే గాక అందరికీ శ్రీ కృష్ణుడు దేవుడన్నాడు. (Mohanlal Sen : Lord Sri Krishna, His Life and Teaching, Calcutta 1954).
ప్రతాప్ ఆర్. పరేఖ్ కృష్ణుడి జీవితాన్ని రాస్తూ కృష్ణుడు వాస్తవం అన్నాడు. అతని వంశపారం పర్యతనూ, గ్రహరాసి ఫలితాలను గూడా యిచ్చాడు. బృందావనంలో గోపికలతో, రాధలతో శృంగార లీలను వర్ణించాడు. వీటిని విమర్శించే వారిని గర్హించాడు. గొప్ప వారు ధర్మాన్ని మించిపోయి, నియమాలను పాటిస్తారన్నారు. వారికి దోషాలంటవన్నాడు. చట్టాలు బలహీనులకే అన్నారు. (P. Pratap Parekh : Krishna, Myth or Reality).
హనుమాన్ ప్రసాద్ ప్రోద్దార్ కృష్ణుడి గోపికా లీలను 100 పేజీలలో చిత్రించాడు. దివ్యలక్షణాలున్న వారిలో ప్రేమ స్వభావాన్ని బూతుగా చూడరాదన్నాడు. విశ్వాసంలేని భార్యకు 3 కారణాలుగా గౌరవాన్ని ఆపాదించాలన్నాడు. 1. ప్రేమికుడిపై నిరంతర ధ్యాస, 2. ప్రేమికుడిని కలవాలనే తీరని వ్యామోహం, 3. ప్రేమికుడి దోషాలను పూర్తిగా విస్మరించటం. అలాంటివి మామూలుగా పెళ్ళి చేసుకున్న భార్యలో ఉండదన్నారు. గోపికలు కృష్ణుడితో ఎడబాటు క్షణం కూడా సహించలేకపోయారన్న మాట. ఎ.ఎన్.పి. అయ్యర్ మరొక అడుగు ముందుకి వేసి శ్రీకృష్ణుడు పురుషులందరికీ తండ్రి అనీ, స్ర్తీలందరికీ భర్త అనీ రాశాడు.
కృష్ణభక్తులు బలహీనులకు ఒక నియమం, బలవంతులకు మరో నియమం చూపుతున్నారు. రెండు విధాలైన నీతి శాస్ర్తాలు పేర్కొని ఒకటి దేవుళ్ళకూ, మరొకటి మానవులకూ చెందిందంటున్నారు. భారతీయ జీవనంలో యిదే రెండు నాలుకల విధానం. కృష్ణుడికి చెందిన జీవిత గాధలలో ఇది కన్పిస్తుంది. బాబా పరమానంద్ భారతి, మోనికా వర్మ అలానే రాశారు. (Monika Varma : Lord Krishna, Love Incarnate, New Delhi. 1978 : Baba Paramananda Bhrath, Sri Krishna. The Lord of Love, New York 1904).
భారతీయ బాబాలూ, భగవాన్లూ అమెరికా వెళ్ళి డబ్బు గడిస్తున్నారు. కామం ద్వారా ముక్తి సాధించాలనే భగవానుడొకరు అమెరికాలో ప్రచురణలు చేశారు. అతడి పేరు డొనాల్డ్ ఆర్. కిన్ స్లే. కృష్ణుడిని గురించి రాస్తూ రాధాకృష్ణుల ప్రేమ, గోపికలతో కృష్ణుడి శృంగార లీలలు దివ్యానుభూతిని సూచిస్తాయన్నాడు. ఆ దశలో మామూలు బంధాలు తెగిపోతాయన్నాడు. ఆ శృంగారం నీచమయింది కాదనీ, క్షణికమైంది కాదనీ, అరమరికలు లేనిదనీ, ఆనందభరితమనీ చెప్పాడు. గోపికలు మానవ మాత్రులు. వారు సాధారణ విషయాలను విస్మరించిన దైవమత్తులో స్వేచ్ఛగా శృంగార లీల జరుపుతారన్నాడు. (Donald. Kinsley : The Sword And the Flute, Kali and Krishna, New Delhi)
ఇలాంటి మాటలు కృష్ణ భక్తులకు ప్రోత్సాహాన్నిస్తాయి. అమెరికా ఆధ్యాత్మిక వాది పాదాల వద్ద కూర్చొని బృందావన సందేశాన్ని వినమంటారు. అది అలా ఉంచి ఇందరి కృష్ణులలో అసలు వాడెవరు. అంటే, సంప్రదాయ వాదులు మహాభారతంలో, గీతలో కృష్ణుడుని చూపిస్తారు. అదేమిటో చూద్దాం.
అధ్యాయం ఎనిమిది
మానవుడుగా కృష్ణుడు
పురాణాల్లోని కృష్ణుడిని మనం ఇష్టపడవచ్చు, పడకపోవచ్చు. అది మన అభిరుచిని బట్టి ఉంటుంది. మహాభారతలో కృష్ణుడిని గమనిస్తే అయిష్టత యేర్పడుతుంది. కృష్ణ భక్తులవలె గాక, హేతుదృక్పథంతో చూస్తే అలా అనిపిస్తుంది. భక్తులకు వారి దేవుడే సర్వస్వం. భక్తికి అలాంటి ప్రభావం ఉన్నది. రాముడికీ, కృష్ణుడికీ సమానంగా భక్తిని చూపడాన్ని ఏమనుకోవాలి? ఇరువురూ విష్ణువు అవతారాలే అంటారు. ఐనా, ఎంత తేడా ఉన్నది. రాముడు సత్యం వైపుకు మొగ్గుతాడనీ, కృష్ణుడలా కాదనీ అంటారు. రాముడు ఏకప్రత్నీ వ్రతుడు. కృష్ణుడు కాదు. రెండ మూడు సందర్భాలు మినహాయించితే, రాముడు ధర్మయుద్ధం చేశాడు. కృష్ణుడు చేయలేదు. ఐనా, భక్తులకు తేడా కనిపించటం లేదంటే భక్తి ప్రభావమే కారణం.
భక్తుల సంగతి అలా వుంచి, మహాభారతంలో కృష్ణుడిని విదేశీ పండితుల దృష్టిలో చూద్దాం. ఇందులో బ్రిటిషువారిని స్వీకరించటం లేదు. దేశాన్ని పరిపాలించిన సామ్రాజ్యవాదులుగా వారికి భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత ఉండవచ్చు.
ఇ.డబ్ల్యు. హాప్ కిన్స్ భారతీయ శాస్ర్తాలను పరిశీలించిన అమెరికన్ పండితుడు. (1857-1932). అతడు సంస్కృతం, పహ్లవి, గ్రీస్, లాటిన్ భాషలను అధ్యయనం చేశాడు. హిందువుల కులం, నీతిపై రాశాడు. భాష, కవిత, నీతి దృష్ట్యా మహాభారతాన్ని విశ్లేషించారు. ఏల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా చాలా ఖ్యాతి పొందారు. కృష్ణుడు పవిత్రమైన మోసకారి అని స్పష్టంగా రాశాడు. (The Great Epic of India) గీత చివరలో ధృతరాఘ్ర్టనితో సంజయుడు చెప్పిన మాటలను బట్టి, కృష్ణుడి విశ్వరూపాన్ని చూచి ముగ్ధుడైనట్లు పేర్కొన్నారు. కురుక్షేత్ర యుద్ధం చివరిలో ఆ కృష్ణుడు మోసగాడని సంజయుడంటారు. 18 రోజుల్లో సంజయుడి అభిప్రాయం మారటానికి తగిన కారణం ఉండి ఉండాలి. సంజయుడి అభిప్రాయాన్నే హాప్ కిన్స్ గూడా సమర్ధించాడు. అర్జునుడికి రధసారధిగా ఉన్న కృష్ణుడు తాను పోరాటం లోకి దిగనని చెపుతూనే కురుపాండుల మధ్య వైరం పెంచాడు. కుయుక్తులనూ, విచక్షణ లేని ధోరణినీ కృష్ణుడు ప్రదర్శించాడు.
ఆస్ర్టేలియా పండితుడు మోరిస్ వింటర్నిట్ట్ భాష, తత్త్వాలను, భారత శాస్ర్తాలనూ అధ్యయనం చేశారు. ఆక్స్ ఫర్డ్ లోఉన్నప్పుడు రుగ్వేదం ముద్రణకు మాక్స్ ముల్లర్కు సహాయపడ్డాడు. మాక్స్ ముల్ల ర్ తయారు చేసిన 49 ప్రాచ్యపవిత్ర గ్రంధాలకు పద సూచికలో తోడ్పడ్డారు. ప్రాగ్ లో భారతీయ శాస్ర్తాలను బోధించాడు. భారతీయ సాహిత్యం పై 16 వంద పేజీలు రాశాడు. 1937లో అతను చనిపోయినప్పుడు రవీంద్రనాథ్ టాగోర్ అతడి సత్యాన్వేషణకు జోహారులర్పిం చాడు. కృష్ణుడిపై వింటర్నిట్జ్ రాస్తూ కుట్రలన్నీ అతడి నుంచే వచ్చాయనీ, మోసాలకు ప్రోత్సాహకారి అనీ, పాండవుల ప్రవర్తనను సమర్ధిస్తూ పోయాడనీ అన్నారు. పాండవులకు కృష్ణుడు జిత్తులమారి స్నేహితుడుగా రాశాడు. (Mauric Winternitz : A History of Indian Literature, Vol-I, Part-II, Calcutta).
మాక్స్ వెబర్ (1864-1920) జర్మనీ సామాజిక శాస్ర్తజ్ఞుడు. ప్రపంచమతాలను సామాజిక శాస్ర్త దృష్టితో పరిశీలించటం అతని ప్రత్యేకత. భారతదేశంలో శాస్త్రీయ దృక్పధాన్ని సాగనివ్వకుండా మతం అడ్డుపడుతుందని రాశాడు. కృష్ణుడు మహాభారతంలో అతి ఘోరమైన నేరాలను తనవారితో చేయించాడనీ అన్నాడు. (Max Weber : The Religion of India, New York, 1967, Page : 189).
సుక్తాంతర్ కృష్ణుడిని బాగా అధ్యయనం చేసి రాశాడు. విరుద్ధాల పుట్ట. యుద్ధరంగంలో తాత్త్వికుడు. తన సైన్యాన్ని శత్రువులకు అప్పజెప్పాడు. సర్వశక్తివంతుడైన తాను యుద్ధారంభంలో ఆయుధాలు చేబట్టనని ప్రతినపూనాడు. నిష్పక్షపాతంగా ఉండవలసిన ఈ దేవుడు కౌరవ సంహారానికీ, పాండవ విజయానికీ, నీతిరీతి లేని రాజకీయవాదిగా రహస్యకుట్రలు పన్నాడు. యుద్ధరంగంలో నిలబడి ఈ అవతరా పురుషుడు కింది స్థాయి నీతిని భోదించాడు. జిత్తులమారిగా ప్రవర్తించాడు. (V.S. Suktankar : On the Meaning of Mahabharata, 1957, Bombay)
పరస్పరం విరుద్ధాలు అన్నపుడు అందులో వివేచనలూ, వాదనకూ చోటు లేదు. కృష్ణుడు ఈ విరుద్ధాల పుట్ట అనీ, చిక్కు సమస్యవంటి వాడనీ సుక్తాంకర్ అన్నాడు. జీవితం గూడా అలాంటిదేకదా అన్నాడు. మనిషి దేవుడుగానూ, దేవుడు మనిషిగానూ కృష్ణుడిలో చూచిన సుక్తాంకర్ రెండు దృక్పధాలనూ సమర్థించే ప్రయత్నం చేశారు.
కృష్ణుడు చెప్పిందాన్ని బట్టి శత్రుగృహంలోకి తప్పుడు త్రోవలో, స్నేహిడింటిలోనికి సరైన మార్గంలో ప్రవేశించాలన్నాడు. (సభాపర్వం). జరాసంధుడి కోటలోకి అలాగే కృష్ణుడు ప్రవేశించాడు. భీమార్జునులను వెంట బెట్టుకొని బ్రాహ్మణ వేషంలో లోనికి వెళ్ళాడు. బ్రాహ్మణులను సత్కరించటానికి వచ్చిన జరాసంధుడిని భీముడితో చంపించాడు. భీమ-జరాసంధుల 14 రోజుల మల్లయుద్ధం అబద్ధమని పిఠాపురం పెండ్యాల శాస్త్రి రాశాడు. (Mahabharata Charitramu, 1933 Page 166). కంసుని, శిశుపాలుని చంపించటంలో కూడా కృష్ణుడు అలాంటి ఎత్తుగడనే అవలంబించాడు.
భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనులను చంపించటంలో మోసపూరిత ఎత్తుగడలను సుక్తాంకర్ సహితం కాదనలేక పోయాడు. ఐతే, అందుకేవో కుంటిసాకులు చెప్పాడు.
కౌరవులు కూడా అక్రమ మార్గావలంబన చేశారనీ, కాగా వారు తెలివిగా, లోపాయకారీగా చేశారనీ అన్నాడు. పాండవులు కొన్ని దోషాలు చేశారంటూనే సుక్తాంకర్ మాట తప్పించాడు. పాండవులతో పాటు కౌరవులు గూడా తప్పుచేశారని చెప్పిన సుక్తాంకర్ రెండు దోషాల వలన ఒక మంచి జరిగినట్లయింది. ఐతే ఉభయ పక్షాల మీద నెపం వేసిన సుక్తాంకర్ దోషులలో కృష్ణుని చేర్చకపోవటం గమనార్హం.
మనోరమ జవహరి మహాభారతంలో అక్రమ చావుల్ని గురించి రాసింది. కృష్ణుడి సలహాతో పాండవులు పోరాట నియమాలను ఉల్లఘించారన్నారు. కృష్ణుడు తరచూ పరోక్ష సలహాలిస్తుండేవాడు. భీముడితొడలు విరగ్గొట్టమని అర్జునుడి ద్వారా చెప్పించాడు. కృష్ణుడి సోదరుడు బలరాముడు ఈ అక్రమ పోరాటం పట్ల ఆగ్రహించి భీముడిని చంపటానికి ఉద్యమిస్తాడు. బలరాముడు గ్రహించకుండా ఉండేటందుకే అర్జునుడి ద్వారా తన దుస్సలహాలు కృష్ణుడు అందచేస్తాడు. పైగా బలరాముడిని శాంతించమంటాడు. అక్రమ పోరాటాన్ని సమర్ధించి అలా అయితేనే దుర్యోధనుణ్ణి చంపగలుగుతామని యుధిష్టిరునితో చెపుతాడు.
యుధిష్టిరుడు ఈ అక్రమ పోరాటం పట్ల మొసలి కన్నీరు కారుస్తూ భీముడు కింద పడిన దుర్యోధనుడి తల తన్నినందుకు ఆక్షేపిస్తాడు. ఐతే, కృష్ణుడి సలహాను పాటించి భూమిని జయించామంటాడు. ధర్మరాజు తనపట్ల సంతృప్తి వహించినా దేవతలు మాత్రం చనిపోతున్నధుర్యుధనుని పైన పూలవర్షం కురిపిస్తారు. (Salya Parva) మహాభారతాన్ని పరిష్కరించిన సుక్తాంకర్ ఈ సంఘటనలను ఎవరో చేర్చారంటూ వదిలేసాడు.
అధ్యాయం తొమ్మిది
రాజకీయ వేత్త కృష్ణుడు
బంకిమ్ చంద్రచటర్జీ దేశభక్తుడు. బ్రిటిషు వారి హయాంలో ఉద్యోగిగా ఉన్నప్పటికీ జాతీయవాదిగా హిందూ అనుకూల ధోరణులు కనబరచాడు. మానవవాదిగా ప్రారంభించి మతవాదిగా మారాడు. దేశంలో నవలా ప్రక్రియకు ఆద్యుడు. మహాభారతంలో, కృష్ణుడిలో ప్రేరేపణలు అన్వేషించాడు. కృష్ణుడి దైవత్వంలో నమ్మకం చూపాడు. రాజ నీతిజ్ఞుడుగా కృష్ణుడిని గురించి రాశాడు.
ఫ్రెంచి జిజ్ఞాసి కామ్టే ప్రభావంతో బంకించంద్ర కొనసాగాడు. దేశభవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పునరుజ్జీవనం కోసం కృష్ణుడిని ఆదర్శంగా స్వీకరించాడు.
ఆధునిక భారత సాహిత్యాన్నికి ఆధ్యుడైన బంకించంద్ర కృష్ణుడిని స్వీకరించటంలో పొరపాటు పడ్డాడు. పురాణాలూ, గాధల నుండి కృష్ణుడిని వేరు చేసి చూడటం సంభవంకాదు. మహాభారతంలో కృష్ణుడిని కూడా రాజనీతిజ్ఞుడుగా స్వీకరించటంలో చాలా లోపాలున్నాయి. అదీగాక, దేశాన్ని ముందుకు నడపాలంటే గతంలోనే దృష్టి పెడితే చాలు. కృష్ణుడు గతానికి మాత్రమే చిహ్నం. అతడి కాలం, ఆనాటి చారిత్రక శక్తులూ భిన్నమైనవి. రాముడి విషయమూ అంతే. బంకించంద్ర కృష్ణుడిని, గాంధీ రాముడినీ స్వీకరించారు. గాంధీ రామరాజ్యం అంటూ నిత్యం రామధున్ తో ప్రారంభించి ముగించేవాడు. తన రాముడు దశరధుని కుమారుడు కాడనీ, దైవం అనీ అనేవాడు. రామనామం అన్నిరోగాలనూ నయం చేస్తుందనేవాడు. గాంధీ, బంకించంద్ర స్వీకరించిన సంకేతాలు భారతదేశాన్ని బాధిస్తున్నాయి.
బంకించంద్ర తన కృష్ణ చరిత్రలో లోకాతీత విషయాలను పక్కకు బెట్టాడు. పురాణాల్లో కృష్ణుడికి సంబంధించినవన్నీ కొట్టిపారేశాడు. జయదేవుడూ, విద్యాపతి స్వీకరించిన కృష్ణుడిని అతను ఆమోదించలేదు. మహాభారతంలో కృష్ణుడిని సహితం బంకించంద్ర వాస్తవమని అంగీకరించలేదు. నరకుడితో యుద్ధం, తదనంతరం స్వీకరించిన అనేకమంది కన్యల విషయం మిధ్యఅన్నాడు. కృష్ణుడి భార్యలు 22 మంది మాత్రమేనని అన్నాడు. కృష్ణుడి భార్యలు 10 మందినే ప్రస్తావించాడు. సత్యభామను సత్యగానూ, జాంబవతిని రోహిణిగానూ చూపాడు. అష్టమహిషీలలో 5 గురిని గురించి తెలియదు గనుక అవి తొలగించాలన్నారు. ఎలుగుబంటి కుమార్తె జాంబవతిని, కృష్ణుడు పెళ్ళాడాడని అనటం అర్థంలేని దన్నాడు. ఇక మిగిలింది ఇద్దరే భార్యలు. సత్యభామను కాదనలేకపోయినా ఆమెను కూడా విస్మరించి కేవలం రుక్మిణి మాత్రమే అసలు భార్యగా పేర్కొనాలన్నాడు. మొత్తం మీద కృష్ణుడిని ఏకపత్నీ వ్రతునిగా చేశాడు.
బంకించంద్రుడు కృష్ణుడిలో రాజకీయవేత్తను చూచాడు. దేశ ఐక్యత సాధించేవాడిగా పేర్కొన్నాడు. మజుందార్ కృష్ణచరిత్రపై నిశిత పరిశీలన చేశాడు. అందులో కృష్ణుడు నాయకుడు కాదనీ, బంకించంద్ర హేతుపద్దతి మాత్రమే కనిపిస్తుందనీ అన్నాడు (Majundar : Krishna in History and Legend)
బంకించంద్రను మించిపోయి కృష్ణుడిని గొప్పరాజనీతిజ్ఞుడుగా చూపటానికి కె.యం. మున్షీ ప్రయత్నించాడు. దేశాన్ని ఐక్య పరచటానికి యుధిష్టిరుని ఆధిపత్యాన్నీ గొప్పజాతి రూపొందించటానికి కృష్ణుడు ప్రయత్నించాడన్నాడు. ఆనాడు భారతదేశంలో బీహారు ప్రాంతంలో వింధ్యకు దక్షిణాన ఉన్న ప్రాంతం అపవిత్రంగా భావించాడు. అలాంటి దేశాన్ని ఐక్య పరచటానికి కృష్ణుడు ప్రయత్నించాడనటం అర్థం లేదు. బుద్ధుని జీవిత కాలంలో 16 మహాజన పదాలుండేవి. క్రీ.పూ. 320 నాటికి మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. ఆటవిక పాలకుల స్థానే రాజరికం వచ్చింది. (Niharranjan Ray : Mahabharatha, K.M. Munshi, Krishna Vatara, the Magic Flute).
మౌర్య సామ్రాజ్యనికి పూర్వం పురాణాలలో చిత్రించిన దిగ్విజయాలన్నీ చరిత్ర కాదు. అవి గాధలూ, కట్టుకథలు మాత్రమే. (D.C. Sirkar : Mahabharatha, Myth and Reality)
దేశంలో ఐక్యత మాట అలా ఉంచి కృష్ణుడు తన యాదవులనే ఐక్యపరచలేకపోయారు. ద్వారకలో యాదవులెందరు. మజుందార్ రాస్తూ ద్వారకలో యాదవులు 3 కోట్ల నిమత్స్య, అగ్ని పురాణాలు చెప్పాయన్నాడు. స్కంధ పురాణాంలో వీరి సంఖ్య 56 కోట్లుగా ఉన్నది. కృష్ణుడికి 9 లక్షల స్వర్ణ మందిరాలున్నాయి. భాగవతం ప్రకారం యాదవుల సంఖ్య లెక్కింపరానిది. యాదవకుమారులలో ఉపాధ్యాయులే 3 కోట్లపైగా ఉన్నారు. బహుశ స్వర్గం నుండి వీరికి ఆహారం అంది ఉండవచ్చునని మజుందార్ వ్యాఖ్యానించాడు.
యాదవులు మధుర, విదర్భ, అవంతి, మహిష్మతిలలో కూడా ఉన్నారు. కృష్ణుడి నాయకత్వాన్ని వారంగీరించలేదు. కురుక్షేత్ర యుద్ధంలో అత్యధిక యాదవులు కౌరవుల పక్షాన ఉన్నట్లు పుసల్కర్ రాశాడు. (A.D. Pusalkar, The History and Culture of Indian People, London 1957)
భోజులూ, అంధకులూ, వృషిణులు, యాదవులకు భిన్నమైన జాతి, ద్వారకలోని యాదవులలో పాండవులకు సంబంధించింది కృష్ణుడు మాత్రమే. మిగిలిన వారు కౌరవులతో ఉన్నారు. కృష్ణుడి కేంద్రం సంఘముఖ్యం.
శాంతిపర్వంలో ఈ ప్రస్తావన ఉన్నది. తనను అర్థ భోక్తగానూ, కృష్ణుడు చెప్పుకున్నాడు. రెండవ సంఘముఖ్యుడు బలరాముడు కావచ్చు. అతడు తటస్తుడు. కృష్ణుడి కుమారులు ప్రద్యుమ్మ, సాంబు కూడా తటస్తులే. యాదవులను ఐక్యపరచలేని కృష్ణుడు దేశమంతటినీ ఐక్యపరుస్తారనుకోవటం అర్థం లేనిది. కృష్ణుడిని దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడిగా భావించటం ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి చెప్పటమే

No comments: