Tuesday, October 30, 2007

Agehananda Bharati- 4

నేతాజీతో పరిచయం
1942 చివరిలో ఒకరోజు హఠాత్తుగా నాకో టెలిగ్రాం వచ్చింది. వీలు వున్నంత త్వరలో ఓ మోజోటాను (7 సోఫిన్ స్ర్టాప్,. బెర్లిన్) కలుసుకోమని ఉన్నది. నాకు తలా, తోక అర్థం కాలేదు. ఆ పేరు ఎవరిదో నాకు తెలియదు. వియన్నా జనరల్ హాస్పిటల్లో ఇండియన్ డాక్టర్ రఘులాల్ నాకు ఫోన్ చేసి అలాంటి టెలిగ్రామే తనకు వచ్చిందని, వెంటనే వెళ్ళాలని చెప్పాడు. ఇద్దరం కలిసి టెలిగ్రామ్ లోని అడ్రసుకు వెళ్ళాం. అదొక గొప్ప యిల్లు. ఆత్రుతగా ఎదురుచూస్తుండగా చనిపోయాడని భావిస్తున్న సుభాష్ చంద్ర బోస్ తలుపు తీసుకొని వచ్చారు. ఆయన కలకత్తా నుండి ఎలా తప్పించుకు వచ్చారో తుది విజయం తర్వాత చెబుతానని మాతో తరచు అంటూండేవారు. కాని, ఆ క్షణం ఎప్పుడూ రాలేదు. 1943లో బోస్ మళ్లీ జర్మనీ నుండి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన విషయం అక్కడి భారతీయ సైన్యానికి తెలియదు.
నేను బోసుతో నా పరిచయాన్ని ప్రస్తావిస్తూ, భారత సైన్యంలో చేరడానికి దరఖాస్తు పెట్టాను.
1943 ఫిబ్రవరిలో నాకు పిలుపు వచ్చింది. కల్నల్ గా ఒకతను నన్ను చూచి నీవు సైనికుడిగా మారేటంతవరకూ ఉంటావన్నాడు. కాని ఆ ఏడు నవంబరులో భారతీయ సైన్యంలో చేరగలిగాను. అది నాకు గొప్ప అనుభవం నాకు యింకా 20 ఏళ్ళు నిండలేదు. అంతవరకు వియన్నా క్లబ్ లో భారతీయుల ద్వారా, పుస్తకాల ద్వారా మాత్రమే ఇండియా నాకు తెలుసు. కాని, సైన్యంలో భిన్న భాషలు మాట్లాడేవారు వుండటం వలన అనేక విషయాలు తెలుసుకోవడానికి భాషాపరంగా పెంపొందటానికి అవకాశం ఏర్పడింది. భారతీయులు మాట్లాడినట్టే నేను మాట్లాడేవాడిని. తమరిలో ఒకరిగా నన్ను స్వీకరించడానికి ఈ ఉచ్ఛారణ తోడ్పడింది. నన్ను భాయీ సాహెబ్ అని, రామచంద్ర అని పిలిచేవారు. జర్మన్ సైనికులు నాపట్ల విముఖతతో వుండేవారు. జర్మనీలో నన్ను కావాలని ఇండియన్ల మధ్య వుంచినట్లు, రోజూ జరుగుతున్న విషయాలు తెలుసుకోడానికి ఇలా చేసినట్లు కొందరు భావించారు. అయితే, నేను ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కాని, నాకు ఎదురైన చిక్కులన్నీ జర్మన్ సైనికాధికారుల తోనే.
భారతీయ సైన్యంలో చేరిన తరువాత గ్రాండ్ ప్రికే అనే గ్రామం వద్ద 11వ దళంలో నన్ను చేర్చారు. జర్మనులకు ఇండియన్లకు వంటలు కూడా వేరు వేరుగా వుండేవి. మొదట్లో నేను జర్మనుల వంటలనే తినే వాణ్ణి. నా భారతీయ అనుకూలత చూసి, నన్ను ఇండియా మెస్ కి పంపివేశారు. ఇందుకు దారితీసిన ప్రథాన సంఘటన ఒకటి వున్నది. డిసెంబరులో ఒకనాడు నా గదికి వెళ్లి యూనిఫాం తీసివేసి తెల్లని అంగీ వేసుకొని ధ్యానంలో కూర్చున్నాను. హఠాత్తుగా కొంతమంది జర్మన్ సైనికులు అరుస్తూ తలుపుకొట్టారు. తలుపు తీయగానే నా మీద ఐస్ నీళ్ళు చల్లారు. వారంతా బాగా తప్పత్రాగి వున్నారు. నా గదిలో వున్న భగవద్గీత, చిన్న పూజామందిరం, ఒకటి రెండు పవిత్ర గ్రంథాలు చిందర వందరగా పడేసి గదంతా నీళ్లు పోసారు. నాగదిలో వున్న రైఫిల్ ను మా కండర్ తీసుకున్నారు. ఇంతలో ఎవరో ఒకతను యిదంతా ఎగతాళికని చెవిలో వూదాడు. ఆ తరువాత నన్ను ప్రక్కగదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ యిద్దరు అందమైన ఫ్రెంచి అమ్మాయిలు వున్నారు. నన్ను త్రాగమని కమాండర్ అన్నాడు. నేను హిందూ మతం పుచ్చుకొన్నాను. తాగనన్నాను. కోటు తీసి వెయ్యమన్నాడు. తీసేసాను, బట్టలు పట్టుకొని ఆల్మెరా ఎక్కమన్నారు. అది ఇంచుమించు కప్పును తాకుతున్నది. అతి కష్టం మీద ఎక్కి పడుకున్నాను. అంతలో ఫ్రెంచి అమ్మాయి నాపై వెస్ ను విసిరేసింది. నా బట్టలు విప్పతీమని కంపెనీ కమాండర్ అమ్మాయిలతో చెప్పాడు. ఇక నేను సహించలేక పోయాను. క్రిందకు దిగివచ్చి మీ అధికారాలను మితిమీరుతున్నారు. ఏమైనా చేసుకోండి అన్నాను. నన్ను గదిలో పెట్టి బయట తలుపువేసి వెళ్ళిపోయారు. (లియోపాల్డ్ ఫిషర్ అయిన నేను రామచంద్రగా మారి జర్మనుల చేతిలో ఇలాంటి అనుభవాలు పొందాను) ఆ తర్వాత ప్లెటూ కమాండర్ వచ్చి అంతా మర్చిపో, ఏం జరగలేదనుకో అని చెప్పి వెళ్లాడు. ఆ తరువాత నిద్రపోదామంటే నా గదంతా పడకతో సహా తడిసి పోయింది. ఇంతలో కార్పోరల్ రతన్ సింగ్ వచ్చి జరిగినదంతా ఇండియన్లకు తెలుసునని, ఆ రాత్రికి తన పడకను వాడుకోమని చెప్పాడు. ఆ తరువాత నన్ను జర్మన్ మెస్ నుంచి తొలగించారు. హిందువులు, సిక్కులు వున్న దళంలో వేశారు. అక్కడ నుండి కూడా నన్ను మారుస్తారని జర్మన్లు అనుకుంటుండగా విన్న వంటవాడు చెప్పాడు. వెంటనే కల్నల్ క్రాప్ కు జరిగినదంతా తెలియజేసి సహాయపడమన్నాను. నన్ను లకనాప్ అనే చోటికి మార్చారు. జాగ్రత్తగా వుంటే ఏమీ జరుగదు. గొడవ చేస్తే నీ సంగతి చూస్తానని లెఫ్టినెంట్ నన్ను హెచ్చరించారు. నేను టెలిప్రింటర్ సెక్షన్ లో పనిచేశాను. చదువుకోవడానికి చాలా సమయం వుండేది. లకనాప్ లో భారతీయదళం మధ్య ఉంటూ హిందీ, ఉర్దూతో పాటు పంజాబీ, బెంగాలీ కూడా నేర్చుకున్నాను.
ఒకవారం రోజుల పాటు వియన్నాలో గడిపాను. భారతీయ సైనిక దుస్తులతో తిరిగాను. పాత స్నేహితురాళ్ళను కలుసుకున్నాను. తరువాత లకనాప్ డ్యూటీలో చేరాను. భారతీయ సంగీతం కొంత పట్టుబడింది. నాకు తోడుగా లుథియానా నుంచి వచ్చిన కార్పోరల్ ప్రీతమ్ సింగ్ ఫోన్ డ్యూటీలో చేరాడు. ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చి మనదళం కోసం పుల్ వారీ పెడతామన్నాడు. ఎక్కడి నుంచో 8 మంది అమ్మాయిలను తీసుకు వచ్చారు. అందులో ఇద్దరు చాలా అందంగా వున్నారు. ఒకామె ఇటాలియన్, ఇందులో జర్మన్లకు ఇండియన్లకు వేరే వేరు ఏర్పాట్లున్నవి. ఇక్కడ జాతి విద్వేషాన్ని పాటించారు. 14 రోజుల పాటు చాలా సందడిగా హడావిడిగా జరిగిపోయింది. ఇటాలియన్ అమ్మాయి నీనాతో పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు జర్మన్లు, ఇటాలియన్ల కంటే భారతీయ సైనికులు చాలా ఆప్యాయంగా ప్రవర్తించారని చెప్పింది.
ఒకవైపున మిత్రరాజ్య సైన్యాలు వచ్చేస్తుంటే, ఫ్రాన్స్ ద్వారా ప్రయాణం మళ్ళుతున్నవది. అప్పుడు 4 వారాలపాటు మేము ఫ్రాన్ ద్వారా ప్రయాణం చేశాం. కొందరు భారతీయ సైనికులు చేసిన దుర్మార్గాల వల్ల మొత్తం సైన్యానికి చెడ్డపేరు వచ్చింది. ఇండియాపట్ల నా ఉత్సాహానికి తొలిదెబ్బ తగిలింది. వెనక్కు తిరిగి వస్తున్న సైనికులలో కొందరు ఇరవై సంవత్సరాల లోపు యువతులను చెరిచారు.

No comments: