Saturday, October 20, 2007

First four chapters

The Treeth about the Gita
నార్ల వెంటేశ్వరరావు
రచనకు
సంక్షిప్త తెలుగు సేత
ఎన్. ఇన్నయ్య
భారత శాస్త్రీయ పరిశీలనా కేంద్రం
ఇ-బుక్ ప్రచురణ
గీతా రహస్యం
పీఠిక
దేశ విదేశాలలో కొందరు గొప్పవారు భగవద్గీతను గొప్పమత గ్రంథంగానూ, తత్వం నీతి రంగాలలో తిరుగులేని మార్గ దర్శిగానూ, సామాజిక విజ్ఞాన రంగాలకు సైతం ఆదర్శవంతమైనది గానూ భావించారు. వారిపై నేను తీవ్ర విమర్శచేశాను. అందుకు క్షమాపణ కోరడం లేదు. వారెంత గొప్ప వారైనా ఒక్క విషయంలో లోపభూయిష్టులే. వారికి ఆధునిక మనస్తత్వం లేదు.
ఆధునిక మనస్సు అంటే ఏమిటి? అంధ విశ్వాసాన్ని యీసడించడం, మూఢ నమ్మకాన్ని త్రోసిపుచ్చడం, పిడివాదాన్ని గర్హించడం, మాయ మాటల్ని కాదనడమే ఆధునిక మనస్సు. వివేచనాత్మకంగా, విజ్ఞాన పూరితంగా ఆలోచించడమే ఆధునిక మనస్సు పని. హేతుబద్ద కొలతకు నిలవలేని దానిని నిరాకరించడమే ఆధునిక మనస్సు. స్వేచ్ఛగా, సాహసోపేతంగా, కొత్త పరికల్పనలతో, తెలియనిది తెలుసుకుంటూ పోవడమే. భూమి విశ్వంలో ఒక అణువు మాత్రమే. దానిని గురించి, జీవితాన్ని గురించి, విశాల విశ్వం గురించి తెలుసుకుంటూ పోవడమే ఆధునిక మనస్సు.
ఆధునిక మనస్సుకు కేంద్రం దేవుడుకాదు, మానవుడు. ఆ మనస్సుకు జాతి, మతం, దేశం, వర్గం, కులం అడ్డం రావు. సంకుచితం, తలబిరుసుతనం, అల్పత్వం, స్వార్థం ఆధునిక మనస్సుకు దూరం. ఆధునికుడు యీ ప్రపంచాన్ని పట్టించుకుంటాడు, మరో లోకాన్ని కాదు. నేను నీ సృష్టికర్తను అని ఎవరైనా అంటే, పోవోయ్, నాకునేనే సృష్టికర్తను. నేను పరిణితి చెందుతున్నాను. నా బాల్యదశలో భయం, అజ్ఞానం వలన ఎందరో దేవుళ్ళను దేవతలను సృష్టించాను. అలాగే స్వర్గాలను నరకాలను పుట్టించాను. వాటన్నిటినీ కూలగొడుతున్నాను అంటాడు.
అలాంటి ఆధునిక మనిషికి గీత చాలా మొరటుగానూ, ఆదిమదశగానూ, అర్థ సత్యంగానూ, పరస్పర విరుద్ధాలుగానూ, ఆధారాలు లేని మాటలతోనూ, ఘోరమైన విషయాలతోనూ, కనిపించడం సహజం. డి.డి. కోశాంచి దృష్టిలో గీత పరస్పర విరుద్ధాలను సమన్వయించే సంస్కృత రచన మాత్రమే., వ్యతిరేక విరుద్దాలను దిగమింగే ప్రయత్నం జరిగింది.
నా రచనలన్నింటిలో యీ రచన నాకు సంతృప్తినిచ్చింది. స్వాతంత్ర్యం రావడంతో కొత్త జీవితంలోకి ప్రవేశిస్తామని ఒకప్పుడు అనుకునేవాడిని. కాని తిరోగమన వాదం ఉప్పెన వలె వచ్చిపడడం చూస్తుంటే విచారంగా వుంది. 1947కు ముందు కంటె, నేడు మనం మూఢనమ్మకాలతో, ఛాందసంతో, మాయ మాటల గారడీలతో వున్నాం. మన స్వాతంత్ర్యం భ్రమగా తయారైంది. మనస్సుకు బంధాలుంటే, స్వేచ్ఛ ఎలా వస్తుంది? ప్రజాస్వామిక సంస్థలున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛా వ్యవస్తలు కనిపిస్తున్నా, సరైన అర్ధంలో మనకు స్వేచ్ఛ లేదు.
ఈ స్థితిని వివరించడం ఎలా? జాతీయోద్యమం తిరోగమనంలో ప్రారంభించి కొనసాగిందని, వెనక్కు తిరిగి పరిశీలిస్తే అవగాహన అవుతుంది. బంకించంద్ర ఛటర్జీ, వివేకానంద, బిపిన్ చంద్రపాల్, లజపతిరాయ్, అరవింద ఘోష్, బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్, గాంధీ వంటి విభిన్న జాతీయ నాయకులకు ఉత్తేజాన్ని కలిగించింది భగవద్గీత. గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సెకు సైతం అదే పవిత్ర గ్రంథం! మన స్వాతంత్ర్యానంతరం అందకారంలోకి ఎలా ప్రవేశించామో దీన్ని బట్టి ఆశ్చర్య పడనక్కరలేదు. జ్యోతిష్యం ప్రకారం స్వాతంత్ర్య మూహూర్తం నిర్ణయించారు. అదంతా చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఈ తిరోగమన ఉపద్రవాన్ని 76 ఏళ్ళ వయస్సులో తిప్పి గొట్టగలనా? చేయగలననే నా విశ్వాసానికి యీ పుస్తకమే నిదర్శనం. అదే నాకు సంతృప్తినిస్తున్నది.
ఈ పుస్తకరచనకు తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలి. డా. వై. వెంకటేశ్వరరావు, డా. డి. ఆంజనేయులు, డా. పి.ఎస్.ఎన్. మూర్తి యీ రచన చదివి అనేక సూచనలు చేశారు. అయితే యీ రచనలోని అభిప్రాయాలకు వారెవరూ బాధ్యులుకారు. అవి కేవలం నావే.
యువతరానికి ఒక విజ్ఞప్తి. ప్రపంచం అత్యంత వేగంగా మారుతున్నది. ప్రతి పదేళ్ళకు యీ వేగం చాలా ఎక్కువగా వుంటున్నది. గత 80 ఏళ్ళలో చాలా మార్పువచ్చింది. చాలా మంచి జరిగింది. ఇంచుమించు అంతే చెడుకూడా వుంది. ప్రపంచ ప్రళయం జరగకుండా ఆపే ప్రయత్నాలు జరిగాయి. మార్పుకు అనుగుణంగా, ఉపద్రవాలను అడ్డుకొంటూ, మనం సాగిపోవాలి. ఇందులో యువత బాధ్యత చాలా వుంది. గీత తెచ్చిపెట్టిన పాత అలవాట్లనుండి బయటపడాలి. అలాగే ప్రపంచంలో పవిత్రగ్రంథాల పాత బంధాలు కూడా తెంచాలి. కొత్త భావనలు, కొత్త విలువలు రాకుంటే ప్రపంచంలో జీవన రంగం అదృశ్యమౌతుంది. మన ఆశలు, భవిష్యత్తు అన్నీ పోతాయి.
- నార్ల వెంకటేశ్వర రావు
పరిచయం
ఈ పుస్తకాన్ని గీతామిధ్య అంటే సరిగ్గా ఉంటుంది. గీతను గురించి చెప్పేదంతా సందేహాస్పదమే. కురుక్షేత్రంలో నిజంగా పోరాటం సాగిందా. ఒకవేళ అది జరిగి ఉంటే దేశవిదేశాలలోని తెగలన్నీ ఏదొక వైపు కోపు వేసుకున్నాయా? యుద్ధం ఎప్పుడు జరిగింది? అర్జునుడు, రథసారధిగా కృష్ణుడు ఉన్నాడా. అనేక యుద్ధాలు గెలిచిన అర్జునుడు దుర్యోధనుడి అపార బలగాన్ని జూచి కలవరపడ్డాడా? బంధు మిత్రులనందరినీ చంపాలనే ఆలోచనతో చలించి పోయిన అర్జునుడు కృష్ణుడి ప్రోత్సాహం వలన భీభత్సకాండ జరిపాడా? కృష్ణార్జునుల సంవాదం సాగుతుండగా ఇరువైపులా సైన్యాలు చూస్తూ నిలబడి పోయాయా?
కురు క్షేత్రంలో కృష్ణుడు చెప్పిన భగవద్గీత మనకెలా వచ్చింది? మహాభారతం ప్రకారం హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ణుడికి ఏ రోజు కారోజు సంజయుడు నివేదించటంతో గీతకూడా వచ్చింది. కృష్ణుడి నోటి నుండి ఊడిపడిన ప్రతిమాటనూ పొల్లు పోకుండా సంజయుడు వృధ్ధుడైన, గుడ్డి అయిన ధృతరాష్ర్టుడికి అందించాడు. యుద్ధరంగంలో ఎవరికీ కనిపించకుండా, ఆయుధాల తాకిడికి దెబ్బతినకుండా యధేచ్ఛగా సంజయుడు సంచరించాడు. అతనికి పగటికి-రాత్రికి తేడా లేదు. అలసట లేదు. నిర్విరామ కృషి చేశాడు. అందరి మనస్సుల్లోని ఆలోచనలు గూడా చెప్పగలిగేవాడు.
సంజయుడు ఇదంతా ఎలా చేశాడు? నేటి శాస్ర్తీయ సాంకేతిక పరమైన రెడియో, టెలివిజన్, వీడియోలు సహితం తలవంచుకునేటట్లు సంజయుడు ఎలా చేశాడు? అది చొప్పదంటు ప్రశ్న అని సాంప్రదాయ వాదులు అంటారు. పూర్వం రుషులకు దివ్యశక్తులుండేవట. వరాలివ్వటంలో వ్యాసుడు అత్యున్నత స్థాయిలో ఉండేవాడు. కురురాజు ధృతరాష్ర్టుడు యుద్ధ విశేషాలను సంజయుడి ద్వారానే తెలుసుకోటానికి వీలుగా అన్నిటినీ వివరించేవరాన్ని యివ్వమని కోరగా వ్యాసుడు ప్రసాదించాడు. అది కేవలం యుద్ధం చివరి రోజున సంజయుని పట్టుకొని చంపబోతున్న సాత్యకికి వ్యాసుడు అడ్డుపడ్డాడు. (Sorensens : An Index to the names in the Mehabharata, 1963 : Delhi, Page 6-9).
ధృతరాష్ర్టుడు వ్యాసుని ధర్మసంతానంలో ఒకడు, వ్యాసుడు సహితం సత్యవతి-పరాశరులకు పెళ్ళికి ముందే పుట్టినవాడు. వ్యాసుడికి అక్రమ సంతానం నలుగురు పుత్రులున్నారు.
మహాభారత కాలంలో తాగుడు, జూదం, పశువులను అపహరించటం, కన్యలను ఎత్తుకుపోవటం సాధారణంగా ఉండేవి. మూకుమ్మడి హత్యలు సాగేవి. సింహాసనాధి పత్యం కోసం, నరక ప్రాప్తి తప్పించుకోటానికి వేరేవారితో నైనా కొడుకుల్ని కనటం ఆమోదించారు. ఆవిధంగానే తల్లిమాటల్ని పాటించి అంబికా, అంబాలికలను వ్యాసుడు గర్భవతుల్ని చేశాడు. వారి భర్త చనిపోయినందున భరత వంశం కొనసాగే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి విధానాలు ఆనాడు చాలా జరిగాయి.
వ్యాసుడు దైవ సమానుడు. అలా భావించిన సంప్రదాయవాదులు అతన్ని పైకెత్తారు. అంబికకు పుట్టిన ధృతరాష్ర్టుడు వ్యాసుని గుడ్డి సంతానం. అంబాలికకు వ్యాసునిద్వారా పుట్టిన పాండు రాజు రోగిష్ఠి, మరొక కుమారుడు విదురుడు వివేకి, ఆరోగ్య వంతుడు కాని, అతడి తల్లి శూద్ర యువతి కావటం వలన విదురుడికి సింహాసన హక్కు దక్కలేదు. వ్యాసుణ్ణి ఈసడించుకున్న అంబిక తన సేవకురాలిని అతనికి అప్పగించింది. వ్యాసుడి నాల్గవ సంతానం శుకుడు. వ్యాసుడి రేతస్సు నుండి క్షణికంగా శుకుడు పుట్టాడు. ఇంద్రుని కొలువులో ఒక అప్సరను చూచి రేతస్సు చిందించగా శుకుడి జన్మ జరిగింది.
పాండవులందరూ అక్రమ సంతానమే. కుంతికి పుట్టిన ముగ్గురికీ తండ్రులు ముగ్గురు. మాద్రికి పుట్టిన కవలలకూ అంతే. పెళ్ళికాక ముందు కుంతి కర్ణుడిని కన్నది. సత్యవతి వలెకాక, కనగానే కుంతి కర్ణుడిని వదిలేసింది. ఇలాంటి చర్యలన్నింటికీ అతిలోక ముసుగు కప్పి మహాభారతం నింపారు.
భరత వంశానికే కాక ఇతర రాచరికాలలోనూ లైంగిక స్వేచ్ఛ బాగా ఉండేది. కంసుడు మధుర రాజు ఉగ్రసేనుడి కొడుకు, కృష్ణుడి మేనమామ. దానవుడు రాణిని చెరచగా కంసుడు పుట్టాడు. పాంచాల రాజు దృపదుడి పుట్టుక అంతే. అతడి సంతానం ద్రౌపది, దృష్టద్యుమ్నుడు. రాజు యజ్ఞం చేస్తూ రాణిని తనతో సంభోగించమంటాడు. ఆమె రుతువులో ఉన్నందున ఆగమంటుంది. కాని, యజ్ఞ సమయం ఆగకూడదు. గనుక, యజ్ఞ గుండంలో నుంచి ద్రౌపది, దృష్టద్యుమ్నుడు పెద్దవారు గానే పుడతారు. ద్రౌపది కారు నలుపు. అందువలన ఆమెను కృష్ణ అని పిలిచేవారు. కాని, ఆమె అందగత్తె, పాండవులు ఐదుగురికీ భార్య అయింది.
సంప్రదాయవాదుల ప్రకారం ఇదంతా యజ్ఞ ఫలం కావచ్చుగాని, ఆనాడు రుషులు యధేచ్ఛగా సెక్స్ ఆచరించిన ఫలితమని చెప్పవచ్చు. అక్రమ సంతానం నాడు విచ్చలవిడిగా ఉండేదో, అందుకు ద్రోణకృపాచార్యుల ఉదాహరణ చూపవచ్చు. వైదిక కర్మకాండలో అదొక భాగం. (Maxmuller : A History of Ancient Sanskrit Literature 1968, Varanasi, Page : 40).
మహాభారతాన్ని పంచమ వేదంగా సంప్రదాయవాదులు స్తుతిస్తారు. అది విజ్ఞాన సర్వస్వం అంటారు. అందులో లేనిది ఎందులోనూ లేదంటారు. మహాభారతం వ్యాసుడి విషమ పుత్రిక.
కృష్ణుడు గీత పేరిట అర్జునుడికి ఉపదేశించిన దేమిటో చూద్దాం. సంజయుడు యుద్ధ విలేఖరి. ధృతరాష్ర్టుడికి సాయంత్రానికల్లా పూర్తి చిత్రణ యిచ్చేవాడు. వ్యాసుడు అలాంటి అద్భుతాన్ని ప్రసాదించాడు. నాలుగు వేదాలను పరిష్కరించిన వ్యాసుడు మహాభారతాన్నీ, అష్టా దశ పురాణాలను, బ్రహ్మ సూత్రాల్ని, మరెన్నింటినో రాశాడు. ఈ ఉద్ర్గంధాలలో గీత వంటిది అతనికి మంచి నీళ్ల ప్రాయం. కురుక్షేత్రయుద్ధా నంతరం ఎన్నో సంవత్సరాలకు గాని అది రాయలేదు. మహాభారతంతో పాటు గీతను తన కుమారుడికీ, నలుగురు శిష్యులకూ చెప్పాడు. అందులో ఒకరు వైశం పాయనుడు. గురువువలె అతడిదీ బహుముఖ మేధస్సు. అర్జునుడి ముదిమనుమడు జనమేజయుడు నాగవంశాన్ని మట్టుపెట్టడానికి యజ్ఞం తలపెట్టాడు. (ప్రతి యజ్ఞానికీ పురోహితులకు బంగారం, ఆవులూ, ఆడపిల్లలూ దక్కేవారు) యజ్ఞ సమయంలో గీతతో కూడిన మహాభారతాన్ని వైశంపాయనుడు పారాయణం చేశాడు. అది విన్న సౌతి, ఉగ్రశ్రవుడు మహాభారత గీతను శౌనకాదిమునుల నిమిత్తం నైమిశారణ్యంలో పన్నెండు సంవత్సరాల యజ్ఞకాలంలో చెప్పాడు. ఆ తరువాత ఎవరు పారాయణ చేశారో తెలియదు.
గీత చెప్పిన కృష్ణుడికీ, అది పారాయణం చేసిన సౌతుడికీ వందేళ్ళ తేడా ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం యుధిష్టిరుడు 36 ఏళ్ళు పరిపాలించాడు. జనమేజయుడు నాగవంశాన్ని మట్టుపెట్టాలని తలపెట్టటానికి కారణం తన తండ్రి పరీక్షిత్తును వారు చంపటమే. నైమిశారణ్యంలో శౌనకుడు నాగయజ్ఞం ఎప్పుడు తలపెట్టాడో కచ్చితంగా తెలియదు. (Sitanath Pradhan : Chronology of Ancient India, Calcutta, 1972, Page : 71) కృష్ణుడి గీతాబోధనకూ, సౌతుడి పారాయణానికి, ఒక శతాబ్దం తేడా ఉంటే, ఆ తరువాత గీత వ్రాత పూర్వకంగా రావటానికి కొన్ని శతాబ్దాలు గడిచింది. సంప్రదాయవాదుల ప్రకారం అయితే ఇది వేలలో ఉంటుంది. అన్నాళ్ళు కృష్ణుడు చెప్పిన గీత యధాతథంగా ఉందనటానికి వీలులేదు.
గీత కంటె ఇంకా ఎక్కువ కాలానికి గాని వేదాలు రాతకు నోచుకోలేదనీ, అయినా, ఉచ్చారణతో సహా యధాతథంగా దిగుబడి అయ్యాయనీ సంప్రదాయ వాదులంటారు. గీత వేదంకాదు. దీని ప్రమాణాన్ని అందరూ అంగీకరించటం లేదు. 8వ శతాబ్దంలో ఉన్న ఆదిశంకరాచార్యుడు గూడా. గీతను ఎవరూ పట్టించుకోలేదు. బౌద్ధాన్ని ధ్వంసం చేయటానికి సాధనంగా గీతపై శంకరుడు వ్యాఖ్యానం రాశాడు. ఆర్య సమాజవాదులూ, బ్రహ్మ సమాజ వాదులూ, గీతకు అట్టే విలువ యివ్వరు. కనుక వేదాలకూ, గీతకూ సామ్యం చూపటం సబబు కాదు.
గీత రూపొందిన తీరూ, అది అందించిన వక్రమార్గం గమనిస్తే అదొక మిధ్యగా పేర్కొనవచ్చు. అలెగ్జాండర్ పోప్ వదంతులను గురించి చెప్పిన మాటల్ని గీతకు అన్వయించవచ్చు.
నేను కాలేజి రోజుల్లో తొలుత గీతను చదివాను. ఆ తరువాత దానిపై భాష్యాలెన్నో చూచాను. గీతరచనల, కాలం, ప్రదేశం తరతరాలుగా అందించిన తీరు అన్ని కాలాలకు, అందరికీ సరిపడే తత్త్వం అని ప్రచారం చేయటం అంతా బూటకమే. ఆ మాట పుస్తక శీర్షికకు పెట్టవలసింది. గీతభక్తులు చదవకుండానే పుస్తకం మూసివేస్తారని ఆ పని చేయలేదు. వారిని నా వైపు తిప్పుకోవాలనే భ్రమ నాకు లేదు. కొద్ది మందైనా గీత అల్పత్వాన్ని గ్రహిస్తే నా కృషి వృధా కాబోదు.
అధ్యాయం ఒకటి
సందేహాస్పద సమరం
మహాభారతం అనే పదాన్ని పాణిని వాడాడు. ఏదైనా భరతుడికి సంబంధించిన గొప్పతనానికి విశేషంగా ఈ ప్రయోగం జరిగింది అని హాప్ కిన్స్ రాశాడు. (Edward Washburn Hopkins : A Cambridge History of India, Vol. I. Ancient India, ed. by E.J. Rapson, 1935, Page : 252, 253) భరతునికి సంబంధించిన గొప్ప కావ్యంగా మహాభారతాన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇలియడ్, ఒడెస్సెలకు ఎనిమిదిరెట్లు నేడు భారతం ఉన్నది. (V.S. Suktankar, on the Meaning of Mahabharata, Bombay, 1957, Page.8) భరతుల మధ్య, అంటే కౌరవ-పాండవుల మధ్య కురుక్షేత్రంలో జరిపిన గొప్ప యుద్ధం కూడా ఇందులో ఉందా? అలాంటి యుద్ధం జరిగిందనటానికి ఆధారాలు లేవు.
1. వేద సాహిత్యంలో కౌరవుల ప్రస్తావన ఉన్నది. పాండవుల ప్రసక్తి లేదు. మహాభారతాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన హాప్ కిన్స్ ప్రకారం బ్రాహ్మణాలు, సూత్రాలు కూడా పాండవుల ప్రస్తావన తేలేదు. మాక్స్ ముల్లర్ ప్రకారం కౌరవులు, భరతులూ వేద సాహిత్యంలో వున్నారు. పాండవులు లేరు. పాణిని వ్యాకరణంలోనూ, కౌరవ, భరతుల ప్రస్తావన ఉన్నది గాని, పాండవుల పేరు ఎత్తలేదు. (Maxmuller : A History of Ancient Sanskrit Literature, 1968 Varanasi Page 40)
క్రీ.పూ. 5వ శతాబ్దం మధ్యలో పాణిని జీవితకాలంలో పాండవులెవరో తెలియదు. (V.S. Agravala : India As known to Panini, Luknow, 1953, Page : 455-475).
2. రుగ్వేదంలో భరతరాజు సూదుడికీ, ఇతర తెగలకూ జరిగిన పోరాటాన్ని నేటి రావి నదీ తీరాన (నాటి పరుషణి ఒడ్డున) జరిగినట్లు ప్రస్తావన ఉన్నది. మహాభారత యుద్ధం జరిగి ఉంటే వేద సాహిత్యంలో తప్పని సరిగా పేర్కొనే వారే. వేదాలలో కౌరవ పాండవ యుద్ధం లేదని మాక్స్ ముల్లర్ స్పష్టీకరించాడు.
3. వేద సాహిత్యంలో కురుక్షేత్రాన్ని పవిత్రస్థలంగా పేర్కొన్నారే తప్ప యుద్ధభూమిగా కాదు. (D.C. Sirkar : Mahabharata Myth And Reality, ed. by S.P. Gupta and K.G. Rama Chandra, Delhi, Page.5)
4. వ్యాస, వైశంపాయనులు తైత్తీరీయ, ఆరణ్యకాలలో ప్రస్తావించిన మహాభారత కర్తలు మాత్రం కాదు.
5. కధక సంహితలో కురురాజు ధృతరాఘ్ర్టడి ప్రస్తావన ఉన్నది. అతడికీ, పురోహితుడికీ మధ్య ఒక క్రతువుకు సంబంధించిన వివాదానికి సంబంధించిన విషయం గానే వచ్చింది గాని, కురుక్షేత్ర యుద్ధ ప్రస్తావన లేదు. (A.B. Keith : Cambridge History of India, Vol. I. Page. 119).
6. అధర్వణ వేదంలో సంపన్నరాజుగా పరీక్షిత్ పొగడ్త ఉన్నది. శతపధ బ్రాహ్మణాలలో జనమేజయుడు గొప్ప యాగకర్తగానూ, పురోహితులకు దానం చేసిన వాడు గానూ పేర్కొన్నారు. అర్జునుడి వంశంలోని వాడుగా చెప్పలేదు.
7. మహాభారతంలో అర్జునుడు ఇంద్రుని కొడుకు. శతఫత బ్రాహ్మణంలో అర్జునుడే ఇంద్రుడు. (H.C. Ray Chandhury : An Advanced History of India, London, 1953, Page. 94).
8. ఆక్షౌహిణిలో 21, 870 రధాలు, 21870 ఏనుగులూ, 65, 610 గుర్రాలు, 109, 350 కాల్బలం ఉన్నది. (Dikshintar, V.R. Ramachandra : Wat in Ancient India, Madras, 1944, Page. 198). కురుక్షేత్రంలో కౌరవులకు 11, పాండవులకు 7 అక్షౌహిణులు ఉన్నాయన్నారు. నేడు అంతమంది ఒక చోట కూడటం సులభం కాదు. ప్రాచీన కాలంలో అది అసంభవం. యుద్ధ రంగంలో అంతమందిని ఒక చోట చేర్చటం సాధ్యమయ్యే పని కాదు.
9. కురుక్షేత్రంలో 11,80,980 గుర్రాలున్నాయన్నారు. పదాతిదళం 20 లక్షలన్నారు. కాని యుద్ధ ప్రస్తావనలో ముఖాముఖి పోరాటాలే ఆనాటి సంప్రదాయంగా ఉదహరించారు. (H.D. Sankalia : Mahabharata, Myth and Reality, Delhi, 1976, Page. 145).
10. ఎంత ఉదారంగా లెక్క వేసినా 40 లక్షలకు మించి యుద్ధంలో పాల్గొన్నట్లులేదు. కాని మృతుల సంఖ్య 1660 మిలియన్లని చూపారు. అంటే ఒక్కొక్కరూ 4 వందల సార్లు చనిపోయారన్న మాట. (Pratapchandra Roy : The Mahabharatha Calcutta, Vol 7, Streepartha, Page. 42-43).
11. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలు నాటికాలాన్ని బట్టి మోటైనవి. అంతకంటే ఉన్నత నాగరికతలో పెంపొందిన హరప్పా వాసులు రాతి, ఇత్తడి, రాగి పనిముట్లే వాడారు.
12. భారీ యుద్ధానికి కావలసిన ఇనుప ఆయుధాలు కురుక్షేత్ర యుద్ధంలో ప్రధానపాత్ర వహించలేదు. క్రీ.పూ. 6వ శతాబ్దంలో గాని ఇండియాలో ఇనుము వాడకంలోకి రాలేదు.
13. మగధ ఆర్యేతర రాజ్యంగా పేర్కొన్నారు. వింధ్యకు దక్షిణాన ఉన్న ప్రాంతమూ అంతే. కురుక్షేత్రంలో వీరెవరూ పాల్గొనిఉండరు.
14. రవాణా రాకపోకలు ఆదిమ దశలో ఉన్నప్పుడు దూర ప్రాంతాలలో ఉన్న భారీ సైన్యాన్ని రప్పించటం చాలా కష్టంతో కూడిన పని.
15. మహాభారతంలో ప్రాగ్ జ్యోతిష (నేటి అస్సాం) రాజు భగదత్తుడు ప్రధానపాత్ర వహించినట్లున్నది. వేద సాహిత్యంలో ఎక్కడా అతడి పేరు లేదు. పాణినికి కూడా అతడు తెలియదు.
16. యవనులు, శకులు, పల్లవులు యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడారని చెప్పటం అసందర్భం. భారత చరిత్రలో క్రీ.పూ. 5వ శతాబ్దం ముందు వీరి పాత్ర లేదు.
కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్ష్కహిణులున్నాయన్నారు. సమరం 18 రోజులు సాగిందన్నారు. పాండవులలో మిగిలిన వారు ఆరుగురు, కౌరవులలో ముగ్గురు. యుధిష్టిరుడు రెండు 18 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ యుద్ధానంతరం 36 ఏళ్ళకు కృష్ణుడు చనిపోయాడు. 18 పర్వాలలో మహాభారతం చెప్పారు. గీత కూడా 18 అధ్యాయాలలో ఉన్నది. ఇదంతా అనుకోకుండా జరిగింది కాదు. సంఖ్యాశాస్రంలో నమ్మకం ఉన్నవారు అల్లిన పన్నాగ మే ఇది.
ఆధునిక భారత చరిత్ర కారులలో గౌరవించదగిన ఆర్.జి. భండార్కర్ నిస్సందేహంగా భారత, రామాయణ పురాణాలు చారిత్రకాలు కావన్నాడు. (Collected works, Poona, Vol. I, Page : 365) ఆధునిక విద్య వివేచనతో, ప్రశ్నించే తత్త్వంతో మనకు ఎందుకు రావటం లేదని అతను బాధపడ్డాడు.
ఆర్.సి. దత్. మరొక అడుగు ముందుగు వేసి మహాభారత యుద్ధం కట్టుకథ అన్నాడు. పంచ పాండవులు, ద్రౌపది గూడా అల్లినగాధే అన్నాడు. అతడు రుగ్వేదాన్ని బెంగాలీలోకి అనువదించాడు. శూద్రుడు వేదాల జోలికి ఎలా పోతాడని అతడి పట్ల సనాతనులు గొడవ చేశారు. మహాభారతం, రామాయణాన్ని కూడా ఇంగ్లీషులో సంక్లిప్తంగా అనువదించి అందించాడు. (R.C. Dutt : Civilization of Ancient India, Vol. I, London, 1893, Page : 122).
రామ్ మోహన్ రాయ్ మహాభారతంలో వ్యాసుడు ఆగాధంతా ఊహాజనితంగా పేర్కొన్న విషయం చూపారు. ప్రపంచంలోని ప్రధాన మతాల పవిత్ర గ్రంథాలను పరిశీలించిన రామమోహన్ రాయ్ గీతకు విలువ ఇవ్వలేదు. మతాలపై అతని రచనలలో గీతను పట్టించుకోనేలేదు.
గీత తనకు తల్లివంటిదని, 1889లో తొలుత గీతా పరిచయం ఐనప్పటి నుండీ అలాగే భావించానని గాంధీ అన్నాడు. (M.K. Gandhi, Geetha My Mother) ఐనప్పటికీ మహాభారత చారిత్రకత పట్ల అతనికి సందేహాలున్నాయి. గీత ప్రస్తావించిన సంఘర్షణ మంచి చెడుల మధ్య ప్రతి వ్యక్తిలో జరిగే పోరాటంగా పేర్కొన్నాడు.
వివేకానందుడు చారిత్రకత విషయమై అర్జునుడు, తదితరుల సంగతి సందేహాస్పదమే అన్నాడు. శతపధ బ్రాహ్మణంలో అశ్వమేధ యజ్ఞం సందర్భంగా అందరి పేర్లూ ప్రస్తావించినా, అర్జునుడు తదితరుల పేర్లు లేవన్నాడు. ఐనా, మహాభారతంలో యుధిష్టిరుడూ, అర్జునుడూ, ఇతరులూ అశ్వమేధ యజ్జం చేసినట్లున్నది. (Swami Vivekananda : Thoughts on the Geetha) ఐనప్పటికీ మహాభారతం ఇతి హాసంగా విలువను కాపాడుకుంటున్నదనీ, అందులో గీతకు ప్రాధాన్యత ఉన్నదనీ అన్నాడు. అర్జునుడు కల్పితమైతే, కృష్ణుడు చారిత్రక పురుషుడు కావటానికి వీలులేదు. ఇరువురూ కల్పితమైతే పరస్పరం సంభాషించుకున్నారనటంలో అర్ధంలేదు. గీతను ఎవరో అల్లి మహాభారతంలో చొప్పిస్తే, అది దివ్యవాణి ఎలా అవుతుంది?
మన సంప్రదాయవాదులు భండార్కర్ నూ, దత్ నూ పాత కాలపు చరిత్ర కారులుగా తీసి పుచ్చవచ్చు. రామమోహన్ రాయ్, వివేకానంద, గాంధీలను చరిత్ర కారులు కాదనవచ్చు. కాని డి.డి. కోశాంబిని కాదనగలరా? శాస్ర్తీయ పద్ధతిలో భారతీయ నాణాలను అతడు పరిశీలించాడు. భారత చరిత్రకు మార్క్సిస్ట్ దృక్పధాన్ని అన్వయించాడు. అతడిని ఎంత తోసిపుచ్చినా, చివరకు మార్గగామిగా గుర్తించక తప్పలేదు. అతడి చిత్తశుద్ధిని కాదనలేకపోయారు. రామాయణ, భారతాలలో పేర్కొన్న యుద్ధాలు ఎప్పుడు, ఎక్కడ జరిగాయో మనకున్న చారిత్రకాధారాల ప్రకారం చెప్పటం అసంభవం అన్నాడు. (D.D. Kosambi : An Introduction to the Study of Indian History)
కురుక్షేత్ర యుద్ధం గొప్ప కల్పితగాధ అని నిస్సందేహంగా పేర్కొన్నారు.
డి.సి. సర్కార్, హెచ్.డి. సంకాలియా కూడా కురుక్షేత్ర యుద్ధం జరగలేదని, కేవలం కుటుంబాల మధ్య, తెగల మధ్య కలహాలు మాత్రమేనని రాశారు.
ఈ అధ్యయనం వలన నాకు మనస్తాపం కలిగింది. హిందువులపై సంప్రదాయ బరువు ఎంత భారంగా పరిణమించిందో అర్థం అవుతున్నది. 41 మంది అధ్యయనం చేసిన వారిలో కనీసం ధైర్యంగా, వివేచనాత్మకంగా, సొంతంగా ఆలోచించిన వారు 6 గురన్నా లేరు. కోట్లాది ప్రజలు వేలాది సంవత్సరాలుగా నమ్ముతున్నదంతా గాధ ఎలా అవుతుందని భావించారు. ఇదే వాదనతో సూర్యచంద్రులకు, రాహుకేతువుల గ్రహణాలు పడుతున్నాయని వీరు నమ్మారు.
మనజాతీయ మనస్తత్వంలో మౌలికంగా దోషం ఉన్నదా. గ్రహణంలో ఉపవాసం ఉండి, తరువాత స్నానం చేసి, తద్వారా సూర్య చంద్రులను కాపాడా మనేవారే వీరంతా. వారు నమ్మకంలో పుట్టారు, నమ్మకాలతోనే పెరిగారు, అలాగే చనిపోతారు. సందేహించే శక్తి వారికి లేదు. ప్రశ్నించే స్వభావం లేదు. వివేచనా పరిశీలనకు దేనినీ గురి చేయలేదు. పాత నమ్మకాన్ని కాదనటం పాపం. ప్రశ్నిస్తే పాతకం, పరిశీలనకు పెడితే నరక ప్రాప్తే అలాంటి వారే మన విశ్వవిద్యాలయాలలో, జాతీయ పరిశోధనాలయాలలో, సాంకేతిక సంస్థలలో వివిధ ప్రభుత్వస్థాయిలలో ఉన్నారు. మన జాతీయ జీవనంలో కనిపిస్తున్న ఉన్మాద ప్రవృత్తిని బట్టి ఘాటైన విమర్శలు చేయక తప్పటం లేదు.
అధ్యాయం రెండు
తప్పుడు సంకేతాలు
భారతదేశ ప్రాచీన చరిత్రలో ఒకే ఒక తేదీ నిర్దుష్టంగా చెప్పవచ్చు. క్రీ.పూ. 327-326లో అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. మిగిలిన తేదీలు ఖచ్చితంగా చెప్పలేక పోటానికి మనకాలచక్రమే కారణం. ప్రభవ, విభవ అంటూ 60 సంవత్సరాల కొకసారి తిరిగి వచ్చే కాలాన్ని ఏర్పాటు చేసుకోటంలో నిర్దిష్టత పోయింది.
విక్రమయుగం, శాలివాహన లేదా శాకయుగాలు ఉన్నాయి. వాటికి కూడా ప్రారంభం ఎప్పుడో తెలియదు. క్రీ.పూ. 58-58 మధ్య విక్రమ యుగం మొదలయిం దంటారు. ఎవరీ విక్రముడు? ఏ చారిత్రక సంఘటన, గొప్ప చర్య ఆధారంగా ఈ యుగం ఆరంభమయింది, స్పష్టమైన సమాధానం లేదు. క్రీ.త. 5వ శతాబ్దంలో హూణులపై జయం సాధించిన విక్రమాదిత్యుడు కావటానికి వీలు లేదు. అంతకు ముందు 600 ఏళ్ళ క్రితమే ఈ యుగం ఆరంభమయింది. చివరి మౌర్య చక్రవర్తిని చంపి సుంగరాజ్యాన్ని స్థాపించిన పుష్యమిత్రుడూ కాదు. క్రీ.పూ. రెండవ శతాబ్దం అనంతరం గాని కుషాణ సామ్రాజ్యం స్థాపన కాలేదు. శాతవాహన సామ్రాజ్యానికి చెందిన గౌతమీపుత్ర శాతకర్ణి కాదు. క్రీ.త. 124-125 ప్రాంతాలలో అతడు శకులను అణచి వేశాడు. విక్రమాదిత్య అనేది బిరుదుగానూ పేర్కొనడం లేదు. విక్రమయుగం ఎలా ప్రారంభం అయిందీ చరిత్రకారులకే ఏకాభిప్రాయం లేదు. క్రీ.పూ. 60లో పంజాబ్-సింధు సామ్రాజ్యాలను స్థాపించిన అజస్ తన పేరే ఆ యుగానికి పెట్టుకున్నాడు. ప్రాకృతంలో యుగం అంటే ఆయం అనిపిలుస్తున్నారు. విక్రమ యుగం ఎక్కడా ప్రస్తావనలో లేదు.
విక్రమ యుగానికి చెందిన చిక్కును తొలగించటానికి చరిత్రకారులు కొందరు కృతయుగం అనీ, మాళవ యుగమనీ తొలుత ఉండేదంటున్నారు. విక్రమ యుగం పూర్తి అయిన సందర్భంగా ప్రచురించిన సంపుటిలో డి.డి. కోశాంబి యిలా రాశాడు. 1943లో విక్రమయుగం 2 వేల ఏళ్ళు గడిచిన సందర్భంగా, దీనికి సంబంధించిన చిక్కును విడదీయలేకపోయారు. పరస్పర విరుద్ధ వ్యాసాలు కేవలం నమ్మకాన్ని సూచించాయి. (An Introduction to the Study of Indian History, Bombay, 1975, Page : 293)
శాలివాహన లేదా శాకయుగం క్రీ.త. 78లో మొదలయింది. ఇందులోనూ విడదీయరాని చిక్కులున్నాయి. ప్రాచీన భారత తేదీలన్నీ అస్పష్టం అయినప్పుడు రామాయణ, మహాభారతాలలో, పురాణాలలో తేదీలు నిర్ధారించటం వృధా రామాయణ, మహాభారతాలు కూడా ఒక విధంగా పురాణాలే. వాటికి తేదీలు నిర్ణయించటం అవివేకమే.
కలకత్తా హైకోర్టులో జడ్జీగా పనిచేసిన బ్రిటీష్ ఐ.సి.యస్. ఆఫీసర్ ఎఫ్.ఇ. పర్గీటర్ ఈ తేదీల నిర్ధారణలో తిప్పలు పడ్డాడు. సంస్కృతం చదువుకొని మార్కండేయ పురాణాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. పురాణాలలో ప్రస్తావించిన రాజ్యాల జాబితా సేకరించి ఇంగ్లీషులోకి అనువదించి పెద్ద పీఠిక రాశాడు. (F.E. Pargiter : The Purana Text of the Dynasties of the Kaliage : 1962, Varanasi) వీటినే తరువాత మరో పుస్తకంలో పేర్కొన్నారు. (Ancient Indian Historical Tradition) పురాణాల నుండి అతను సేకరించిన చరిత్ర అనేది ఊహ మాత్రమే. చరిత్రకు భిన్నంగా పురాణాలన్నీ గాధలతోనూ, కట్టుకధలతోనూ నిండాయి. విశ్వసృష్టి, ప్రళయం, మళ్ళీ పుట్టటం, మనువు, అతని భార్యలు, సంతతి యిత్యాదుల ప్రస్తావనలున్నాయి. వివిధ రాజుల కాలాలు పేర్కొన్నారు. మధ్యలో మానవుల అసమానతల గొప్పతనాన్నీ, కులాన్నీ సంస్థాగతం చేయడాన్ని యీ గ్రంథాలలో రాశారు. పురోహితులను రాజు కాపాడకపోతే ప్రపంచం నాశనమవుతుందన్నారు. పుట్టుకనుండి చనిపోయే వరకూ, ఆ తరువాత కూడా ఎలా ఉండాలో నియమాలు రాశారు. స్వర్గానికి ఎలా వెళ్ళాలి, అక్కడకు చేరిన తరువాత రంభ, ఊర్వశి, తిలోత్తమ, వరూధినులలో ఎలా అనుభవించాలి అనేవి చిత్రించారు.
అలాంటివాటి నుండి చరిత్రను ఏమేరకు రాబట్టవచ్చు. ఇంచుమించు ఏమీలేదు. పైగా మన నైతిక ప్రవర్తనపై ఆ రచనలు దెబ్బతీశాయి. అదంతా బాధ్యతా రహితమని భావించినా, ఇప్పటికే 2,500 సం.రాలు ఆలశ్యమయింది. మనకు వాల్మీకి, వ్యాసుడు ఎలాగో గ్రీకులకు హూమర్, హీసియాడ్ అలాగ, సోక్రటీస్ నోటితో వారిపై ప్లేటో ధ్వజమెత్తాడు. దేవుళ్ళూ, నాయకులూ తాగుబోతులైతే, జూదరులైతే అబద్ధాలాడితే, భట్రాజులైతే, శృంగారకేళిలో తేలిపోతే, ద్వేషం, అసూయలతో నిండిపోతే, అలాంటి వారిని ఆదర్శంగా చూపి జనం కూడా తమ బలహీనతల్ని కప్పి పుచ్చుకోరా, అని ప్లేటో అడిగాడు. హోమర్, హీసియాడ్లను చదివితే, ప్లేటో ఖండించిందంతా అభినందిస్తాం. ఫ్లేటో రిపబ్లిక్ మూడవ సంపుటిలో యిది చూడవచ్చు. (Translation by Benfaminjo-Wette, 1946) హోమర్, హీసియాడ్ లను ఖండించటంలో ప్లేటో కంటే జెనోఫేన్స్ మరొక అడుగు ముందుకు వేశాడు. నాటక రచయిత యూరిపిడస్ కూడా పుక్కిటి పురాణాలను ఖండించాడు. మన దేశంలో కవులూ, నాటక కర్తలూ, తాత్వికులూ, రామాయణ, మహాభారత పురాణాలపట్ల పరవశం చెందుతున్నారు. వీటి వెనుక ఒక పథకం ఉన్నది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం అనే శక్తులను అడ్డుకోవాలనీ, కులతత్వాన్ని కొనసాగించాలనీ ప్రయత్నిస్తున్నారు. సి. రాజగోపాలచారి, కె. ఎం. మున్షీ మొదలైన రాజకీయ వాదులు స్వతంత్ర భారతదేశంలో హిందూ పురాణాల కోపు వేసుకున్నారు.
నైతిక రంగంలో పురాణాలూ, ఇతిహాసాలు నికృష్టమైనవి. చరిత్రకోసం వాటిపై ఆధారపడకూడదు. ఎ.ఎల్. భాషం యీలా అంటాడు. మహాభారత నాయకులు సమకాలీన ముఠా ప్రభువులు కావచ్చు. కాని చరిత్రకారుడి కవి పనికిరావు. క్రీ.పూ. 10వ శతాబ్దంలో చరిత్రను మహాభారతం ఆధారంగా నిర్మించటానికి పూనుకోవటం వృధా (A.L. Bashgam : The Wonder That was India).
పురాణాలలో చరిత్రకారులకు ఎలాంటి చిక్కులు వస్తాయో శీతానాధ్ ప్రధాన్ గుర్తించాడు. పురాణాలలో ప్రాచీన ఆర్య చరిత్ర లభిస్తుందనుకొంటారు. కాని యిందులో చాలా విరుద్ధ విషయాలున్నాయి. అనేక చోట్ల పురాణాలు భిన్న రీతులుగా చూపుతున్నాయి. విరుద్ధ విషయాలున్నాయి. అనేక చోట్ల పురాణాలు భిన్న రీతులుగా చూపుతున్నాయి. ఒక సామ్రాజ్యాన్ని మరొక దానిలో కలిపేశారు. రాజుల జాబితా పెరిగిపోయింది. రాజ్యాల సంక్రమణ మారిపోయింది. సామ్రాజ్యాలకు కాలం పొడిగించేశారు. ఒకొకసారి ఒకే పేరు వలన అనేక చిక్కులు చోటు చేసుకున్నాయి. (Chronology of Ancient India) అయినప్పటికీ ఈ పురాణాల ఆధారంగానే ప్రాచీన భారత చరిత్ర తేదీలను ప్రధాన్ ప్రస్తావించాడు.
పర్గీటర్ కూడా చరిత్రకారుడుగా పురాణాల్లో అనేక చిక్కులను ఎదుర్కొన్నారు. 80 మంది జనమేజయులూ, 100 మంది నాగులూ, హైహయులూ, ధృతరాష్ర్టులూ, బ్రహ్మదత్తులూ, 200 పైగా భీములూ, భీష్ములూ, 1000కి పైగా శశబిందువులూ అతనికి ఎదురయ్యారు. ఈ జాబితా పూర్తి కాలేదు. వాటితో పర్గీటర్ వంటి వారు విసుగుచెంది పురాణాలు రాసిన బ్రాహ్మణులకు చరిత్రకు, కట్టుకధకు తేడా తెలియాదన్నాడు. చరిత్రకు పురాణాన్నీ, ఇతిహాసాలకు చారిత్రక ముసుగుల్నీ వేశారన్నాడు. బ్రాహ్మణ సాహిత్యంలో చారిత్రక దృక్పధం లేదన్నాడు.
పురాణాలు ప్రాచీన భారత చరిత్రకు తప్పుడు సంకేతాలు. వాటి ఆధారంగా కురుక్షేత్ర యుద్ధ తేదీలను నిర్ణియించ బూనారు.
అధ్యాయం మూడు
తేదీల ఒడిదుడుకులు
కలియుగం అనేది చాలా మోటుభావన. పురావస్తుశాఖ పరిశోధనలకు విరుద్ధమైనది. ఆటవిక, బర్బర, నాగరిక యుగాలు చరిత్రలో సుప్రసిద్ధమైనవి. వీటిలో వివిధ దశలున్నాయి. ఒక దశ కొత్త దశకు స్థానం కల్పిస్తూ మిళితమౌతూ పోతుంది. పక్క పక్కనే వివిధ దశలూ వుండవచ్చు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో క్రమేణ ధర్మం క్షీణిస్తూ, శాంతి సంపదలు కోల్పోతూ ఉంటాయనే భావన ఛాందసమైనది. అయినప్పటికీ కలియుగం ఎప్పుడు ప్రారంభమయిందా అనే చర్చ చేస్తూ ఉంటారు.
కలియుగం నిర్ధారితమైతే కురుక్షేత్ర యుద్ధం తేదీలు చెప్పవచ్చునని సనాతనుల ఉద్దేశం. వీరి అభిప్రాయంలో 3101 క్రీ.పూ. కలియుగం ప్రారంభమైనప్పటి నుండి 5 వేల సం.రాలు గడిచేసరికి క్రీ.త. 1899 వచ్చిందని అన్నారు. దీనితో అంగీకరిస్తున్నట్లు వైద్య చెప్పాడు. (Mahabharatha-A Criticism, 1929 : Page 55, 56) సనాతనులు ఎంత ఎలుగెత్తి చాటితే అంత ఖచ్చితంగా నమ్మినట్లు భావిస్తారు. భారతదేశానికి అదొక విషాద పరిణామం. మూఢ నమ్మకాలకూ, వివేచనా రాహిత్యానికీ భారత దేశం చాలా సారవంతమయింది.
కృత, కలియుగాలనేవి హిందువుల నిమిత్తం ప్రత్యేకంగా రూపొందించిన దైవ నిర్ణయమని నమ్మారు. ఇవి మిగిలిన ప్రపంచానికి చెందవు. ఇతర ప్రజలకూ, లోకానికీ ఎలాంటి పెత్తూలేదు. విదేశాలకు పోకుండా హిందువులను వేలాది సంవత్సరాలు ఆపారు అది నత్త జీవితం వంటిది.
కలియుగారంభంలో ఆర్యులు సంచారజాతులు. 1500 సం.రాలు పాటు తిరిగి సింధులోయకు చేరారు. మరో 500 ఏళ్ళకు గంగా యమున ప్రాంతాలకు చేరారు. అలా స్థిరపడిన ఆర్య తెగల మధ్య నేటి ఢిల్లీగా పేర్కొంటున్న ప్రాంతంలో క్రీస్తు పూర్వం 3102-3101 ప్రాంతాలలో పోరాటాలు జరగటం సంభవమా? సప్త సింధు ప్రాంతం ఆర్యుల అసలు ప్రాంతమని అభినాష్ చంద్రదాస్ పేర్కొన్నాడు. అక్కడి నుండి నలువైపులా వెళ్ళి తమ దివ్య సంస్కృతిని ఆర్యులు వెదజల్లారన్నారు. ఈ సిద్ధాంతాలను వివరించటానికి దాస్ రెండు పెద్ద గ్రంధాలు రాశారు. వీటిని నవ్వులాటకైనా చదవాలనిపించదు. (Rigvedic India, Rigvedic Culture).
కలియుగం క్రీ.పూ. 3102లో ఆరంభమైందనటానికి శాసనాలు ఆధారం ఉండదన్నారు. అయిహోలా శాసనం రెండవ పులకేసికి చెందినది. పశ్చిమ చాళుక్య రాజ్యంలోని ఈ శాసనం చాలా ప్రాచీనమైనది. (A.D. Pusalker, History and Culture of the Indian People Vol. I. The Vedic Age) అయితే యిది క్రీ.త. 634కు చెందినది. అలాంటప్పుడు 3736 సం.రాల తరువాత వచ్చిన శాసనాన్ని కలియుగానికి సాక్ష్యంగా సనాతనులు మాత్రమే స్వీకరించగలరు ఆర్యభట్ట అంచనాల ప్రకారం కలియుగం క్రీ.పూ. 3102లో ప్రారంభమైంది. కాని, ఆర్యభట్ట క్రీస్తు తరువాతవాడు. 3600 సం.రాల తరువాత ఉన్న ఆర్యభట్టు ఖగోళ అంచనాల ఆధారంగా చెపుతున్నాననటం సనాతనులకు నచ్చవచ్చు.
కలియుగారంభాన్ని, రాజరికాల తేదీలను భవిష్యపురాణం అందించగా మత్స్య, వాయు, బ్రహ్మాండ పురాణాలు అనుకరించాయి. ఈ భవిష్య పురాణం నటనకు మారుపేరు. భవిష్యత్తులోకి తొంగిచూచి రాజ్యాలు రావటం, పోవటాన్ని చెప్పగలమన్నారు. వాటి ఆధారంగా కలియుగం ఎప్పుడు మొదలయిందో అంచనాలు వేస్తామన్నారు.
పురాణాలలో రాజ్యాలూ, రాజులు పట్టీల తేడా ఉన్నది. ప్రతి పురాణంలోనూ వివిధ రాజ్యాల కాలాలు అనేక విరుద్ధాలతో కూడి ఉన్నది. 14 నుండి 25 సం.రాల వరకూ ఈ తేడాలు కనిపిస్తున్నవి. పర్గీటర్ అంచనాలలో 18 సం.రాల కాలపరిమితి ఒక్కొక్క రాజ్య పాలనకు ఉన్నది. వైద్య ఈ పరిమితిని 20 సం.రాలన్నారు.
బాషమ్ 19 సం.రాలకు కుదించాడు. టి.టి. శ్రీనివాసయ్యంగార్ 25 సం.రాల వరకూ పెంచాడు. విన్ సెంట్ స్మిత్ 25. 2 సం. రాలన్నారు. ఎ.డి.పుసాల్ కర్ 18 సం.రాలకు తగ్గించాడు. పి.ఎల్. భార్గవ, 20 సం.రాలన్నాడు. పురాణంలోని రాజ్యాల కాలపరిమితిని ఫ్లిట్, హార్నెల్ అనేవారు 15 సం.రాలకు పరిమితం చేశారు. ఎ.ఎస్. ఐటేకర్ 16.5 సం.రాలన్నారు. బి.బి.లాల్ 14.5 సం.రాలన్నాడు. ఎస్.యస్. ప్రధాన్ 14 సం.రాలన్నాడు. విసుగు పుట్టించే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దాం.
ఏ ఇరువురు చరిత్రకారులూ రాజ్యాల పరిమితిని గురించి ఏకాభిప్రాయానికి రాలేక పోయారంటే వారు స్వీకరించిన ఆధారాలు తప్పుడివి కావటమే కారణం. ఈ సామ్రాజ్యాల పట్టిక చాలా పెద్దదయినప్పుడు సగటు సంఖ్య 5కు మించి లెక్కల్లో పెద్ద తేడా వస్తుంది. ఏ రాజు తరువాత ఎవరు వచ్చారనేది తేలకుండా పోతుంది.
చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 332లో తన రాజ్యాన్ని ప్రారంభించాడు. అదే నందులరాజ్యానికి చివరి దశ. అప్పటి నుండి, అంటే మహాపద్మనంద కాలం నుండీ కురుక్షేత్ర యుద్ధం వరకూ వెనక్కు వెళ్ళాలంటే 24 యిక్ష్వాకులూ, 27 పాంచాలులూ, 24 కాశీలూ, 28 హైహయులూ, 32 కళింగులూ, 25 అశ్మకులూ, 26 కురులూ, 28 మైధిలులూ, 23 సూరసేనులూ, 20 వీత హోత్రులూ స్వీకరించాలి.
257 సమకాలీన రాజులను పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కొక్కరికీ సగటున వంశానికి 26 రాజులను చూపవచ్చు. ఒక్కొక్క రాజుపాలన 18 సం.రాలుగా అంచనా వేస్తే 468 సం.రాలవుతుంది. నంద సామ్రాజ్యం క్రీ.పూ. 850 వరకూ వెనక్కు వెళ్ళ వలసి ఉంటుంది. కురుక్షేత్రయుద్ధానికీ, 10 సామ్రాజ్యాలకూ మధ్య మరికొందరు రాజులున్నారు. వారికొక 100 సం.రాలు కలిపితే కలియుగం క్రీ.పూ. 1132లో కలియుగం మొదలైనట్లు చెప్పాలి. ఈ అంచనాలలో విపరీతమైన ఊహలున్నాయి. రాజులపాలన కాలపరిమితికి నిర్ధారణ లేదు. పురాణాల ప్రకారం నందసామ్రాజ్యం 100 ఏళ్ళున్నది. జైన లెక్కల ప్రకారం 150 సం.రాలు. సిలోన్ అంచనాల ప్రకారం ఇది 22 ఏళ్ళు. మహాపద్మ పాలన 88 ఏళ్ళున్నదని కొందరు, 12 సం.రాలు మాత్రమేనని మరి కొందరు అన్నారు.
వృద్ధగార్గ, వరాహమిహిర అనేవారు క్రీ.త. సుప్రసిద్ధ ఖగోళ శాస్ర్తజ్ఞులు. కలియుగ ప్రారంభమైన తరువాత 653 సం.రాలకు కురుక్షేత్ర యుద్ధం జరిగిందని వీరన్నారు. అంటే క్రీ.పూ. 2449-48లో అన్నమాట. దీనికి కాశ్మీరు చరిత్రకారుడు బి.సి. కల్హణ పూర్తి మద్దుత్తునిచ్చారు. కె.పి. జైస్వాల్ అనే చరిత్రకారుడు క్రీ.పూ. 1424లో జరిగిందన్నారు.
ఇలాంటి ఆధారాలను పురస్కరించుకొని కురుక్షేత్ర యుద్ధాన్ని నిర్ణయించటం గీతా పారాణం చేయటం అర్థం లేనిది. అయినా 1500 సం.రాల పాటు యుద్ధ కాల నిర్ణానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో కొన్ని తేదీలు ఉదహరిస్తాను. ఆర్యభట్ట, భాస్కరాచార్య క్రీ.పూ. 3102 అన్నారు. సి.వి. వైద్య క్రీ.పూ. 3101, వృద్ధ గార్గ, వరాహమిహిర, కల్హణ, బి.సి. సేన్ క్రీ.పూ. 2444-48, జె.ఎస్. కరండికర్ క్రీ.పూ. 1922, బంకిమ్ చంద్ర చటర్జీ, ధీరేంద్రనాధ్ పాల్ క్రీ.పూ. 15వ శతాబ్దం, ఎం. రంగారావు క్రీ.పూ. 1468, పి.టి. శ్రీనివాసయ్యంగార్ క్రీ.పూ. 1450, హెచ్.టి. కోల్ బ్రూక్, లార్డ్ ఎల్ఫిన్సన్, హెచ్.హెచ్. విల్సన్, బాలగంగాధరతిలక్, శీతానాధ్ తత్వభూషణ్, ఆర్.సి. మజుందార్, హెచ్.సి. రాయ్ చౌదరి, పాల్ రేణు, ఎ. భాషమ్ క్రీ.పూ. 14వ శతాబ్దం, ఎ. జి. శంకర్ క్రీ.పూ. 1198, విన్ సెంట్ స్మిత్ క్రీ.పూ. 1000.
ఇంకా ఎక్కువ చర్చ సాగిస్తే తేదీలతో పాటు గందరగోళం కూడా పెరుగుతుంది. ఈ చర్చలో పాల్గొన్న వారిలో వివేచనాపరులు కలియుగం కట్టుకథ అన్నారు. జె.ఎఫ్. ప్లీట్ ఈ విషయంలో ఆర్యభట్లపై నెపం వేశారు. క్రీ.త. 498లో ఆంధ్రరాజ్యం అంతమైనప్పుడు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని కె.పి. జైస్వాల్ అన్నాడు. కలియుగ ఆరంభాన్ని గురించిన అంచనాలు భారతీయ ఖగోళ శాస్ర్తజ్ఞుల కృత్రిమ లెక్కలపై ఆధారపడ్డాయన్నారు. దీని కౌరవ, పాండవ సంఘర్షణలు జోడించారు. మొత్తం మీద కలియుగ భావన నమ్మకంతో అల్లిన కథ మాత్రమే.

No comments: