Wednesday, October 24, 2007

Narla Venkateswararao (V R Narla)Gita final part

అధ్యాయం పంధొమ్మిది
కొండ దేవర నుండి జాతీయ దేవుడి వరకు
ఏ దేశమైనా ఆదిమ తెగల స్థాయి నుండి ఎదుగుతూపోతుంది. అలాగే దేవుళ్లు కూడా. కృష్ణుడి విషయంలో అంతే జరిగింది. కృష్ణుడు రాజపూత్ తెగల కులదేవతగా తొలుత ఉండేవాడని భారతీయ శాస్త్రాలను అధ్యయనం చేసిన ఫ్రెంచి పండితుడు బర్త్ భావించాడు. (A Barth : Religions of India, New Delhi, 1969) యాదవులు ఏనాడూ ఏకంగా లేనందునవారు సమైక్య పడలేకపోయారు. యాదవులు రాజపూత్లయితే సంప్రదాయం ప్రకారం క్షత్రియకులంలో కింది స్థాయికి చెందినవారే ఉండాలి. కృష్ణుడి సామాజిక అంతస్తును మహాభారతంలో ప్రశ్నించిక పోలేదు. ద్వారకలో గడిపినపుడు కృష్ణుడికి తన వారి నుండి గౌరవం లభించలేదు. పైగా ఖండన మండలకు గురి అయ్యాడు. మహాభారతంలో కృష్ణుడు ఒకసారి నారదుడితో ఫిర్యాదు చేస్తూ తానెవరికొసం అయితే శ్రమిస్తున్నాడో వారే పరుష వాక్యాలు పలుకుతున్నారని వాపోయాడు. అందువలన అక్కడ కులదేవతగానో, రాజపూత్ ల సమైక్య జాతులకు దేవుడుగానో ఉండే అవకాశం లేదు.
మధుర, బృందావన్ ప్రజలకు, సూరసేనులకూ కులదేవత అయి ఉండవచ్చు. పశ్చిమ తీరాన ఉన్న ద్వారకకు వెళ్ళిన కృష్ణుడి చర్యలు విని వారి నుండి గౌరవం లభించి ఉండవచ్చు. కృష్ణుడి బాల్య చేష్టలూ, యువకుడిగా శృంగార చేష్టలూ, కథలుగా, వ్యాపించటం కూడా యిందుకు తోడ్పడి ఉండవచ్చు. ద్వారకలో యాదవ కులం తాగితందనాలాడుతూ, అగ్ని మంటలకు ఆహుతి కావటంతో వారి పట్ల సానుభూతి వచ్చింది. మధుర, బృందావన్ ప్రాంతంలో కృష్ణుడు కులదేవత కావటానికి యిది తోడ్పడి ఉండవచ్చు.
క్రీ.పూ. 4వ శతాబ్దంలో చంద్రగుప్త కొలువులో సెల్యూకస్ కు రాయబారిగా మెగస్ధనీస్ వచ్చాడు. క్రీ.పూ. 304-299 మధ్య ఇతడు భారతదేశాన్ని గురించి తాను చూసింది రాశాడు. చరిత్ర క్రమపద్ధతిలో లేని మనకు అతడు రాసిందెంతో ఉపయోగంగా ఉన్నది. ఈ దృష్ట్యా మనం చారిత్రక దృష్టినీ, అవగాహనూ పెంపొందించుకోవాలి.
మెగస్ధనీస్ తన రాయబారిగా, నివేదికలో హెరాక్లస్ అనే హిందూ దేవుని గురించి ప్రస్తావించాడు. అతడే కృష్ణుడు, మధురను మెధర్ అన్నాడు. కృష్ణపురాణాన్ని క్లేసొబొరా అన్నాడు. యమునానదిని అయోబారే అన్నాడు. కనుక మెగస్థనీస్ రాసిన దాన్ని బట్టి కృష్ణుడు ఆదిమవాసి దేవుడుగా క్రీ.పూ. భక్తుల్ని ఆకర్షించాడు. దీనిని బట్టి క్రైస్తవ ప్రభావం కృష్ణుడిపై ఉన్నదని వాదించిన వెబరోలాసెన్, లోరిన్ సర్ రాతలకు ఆధారాలు లేవని అర్ధం అవుతున్నది.
కృష్ణుణ్ణి దేవుడుగా ఉన్నత స్థాయికి తీసుకురావటానికి చాలా కాలం పట్టింది. పాణిని కాలంలో అర్జునుడితో పాటే కృష్ణుడు పూజలందుకున్నాడు. తరువాత అర్జునుడిని తొలగించి ఆ స్థానం బలరాముడికి (సంకర్షణకు) యిచ్చారు. హిందువుల దేవుళ్ళలో ప్రతిమ స్వరూపంగల దేవుడు తొలుత బలరాముడే ఆ తరువాత తండ్రి మాయలతో పాటు ప్రద్యుమ్నుడు కూడా చేరాడు. ఉత్తరోత్తరా కృష్ణ - జాంబవతి కుమారుడు సాంబ, ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు దేవుళ్ళ జాబితాలో చేరారు. వీరందరినీ స్థాన భ్రష్టుల్ని చేయటానికి కృష్ణుడికెంత కాలం పట్టిందో తెలియదు.
కుటుంబ సభ్యులను అధికారంలో, కీర్తిలో భాగం పంచుకోకుండా ఆపటం కష్టం అని కృష్ణుడికి బాగా తెలుసు. అందుకే వ్యూహాలలో వారిని చేర్చారు. పురాణాలు దశావతారాలు గురించి అనేక రకాలుగా చెప్పాయి. ఒక జాబితా ప్రకారం 22 అవతారాలున్నాయి. భాగవత పురాణాలను బట్టి ఈ జాబితా అనంతం (T.S. Rukmani : A Critical Study of Bhagavatha Purana, Varanasi 1970)
వేద సాహిత్యంలో అవతారాలు లేవు. ఎ.పి. కర్మార్కర్ దశావతారాలు ఇతిహాసకాలంలో రాలేదని అన్నారు. మహాభారతంలో ఈ అవతారాలను చేర్చారన్నాడు. (A.K. Karmarkar : Religion And Philosophy of Ethics in the Cultural History of India, Vol. II) బ్రహ్మసూత్రాలలో అవతారాల ప్రసక్తి లేదు. సుంగుల కాలంలో అవతారాల గురించి ప్రచారం జరిగినట్లు చెప్పవచ్చు. క్రీ.పూ. 2వ శతాబ్దంలో తిరోగమనవాదం వచ్చింది. చంద్రగుప్తుడి వంశీకులైన బృహద్రధుణ్ణి హత్య చేసిన తరువాత ఈ ధోరణి ప్రబలింది. హిందువులలోనే అవతారాల సిధ్ధాంతాన్ని గురించి చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఉపనిషత్తులలో తొలుత నిర్గుణ బ్రహ్మను ప్రతిపాదించగా, తరువాత సగుణబ్రహ్మ వచ్చింది. ఈ రెండింటికీ రాజీకుదిర్చిన తరువాత అది గీత రూపం దాల్చింది. గీతలో వైవిధ్యాలను ఆవిధంగా అర్థం చేసుకోవచ్చు (J.N. Farquhar : The Crown of Hindusim, New Delhi, 1971).
గీతలో తానే అవతారాన్ననీ, గతంలో భూమిపైకి అనేకమార్లు అవతరించాననీ భవిష్యత్తులో కూడా వస్తాననీ చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపడి ఒక ప్రశ్న వేస్తాడు. వివస్వతుకు (సూర్యుడికి) యోగజ్ఞానాన్ని బోధించానన్నావు. వివస్వతుడు నీకంటే ఎన్నో యుగాల ముందు లేడా. అన్నాడు. (అధ్యాయం 4, శ్లోకం 4).
కృష్ణుడు చిక్కుముడులతో, కథలతో, అర్జునుడిని ఊరుకోబెడతాడు. ఈ పద్ధతిలో దైవాన్ని విడమరచి చెప్పవచ్చునని శంకరాచార్యుడు కూడా అంటాడు. గీతపై భాష్యం రాస్తూ కృష్ణుడు పుట్టాడనీ, పుట్టలేదనీ అంటాడు. ఇదెలా సాధ్యమంటే మాయ ద్వారా అంటాడు. మాయను అడ్డం పెట్టుకుంటే ఇక చర్చ, వివాదం ఉండదు. (Shankarchargya : The Bhagavadgeetha with Commentary) మాయావాదులు తింటారు, తాగుతారు, ప్రేమిస్తారు, పిల్లలను గంటారు. డబ్బు సంపాదిస్తారు. రాజకీయాధికారం స్వీకరిస్తారు. అధికారంలో ఉన్న వారిని గుప్పిట్లో పెట్టుకుంటారు. విలాస జీవితం గడుపుతారు. అదంతా మాయే. కృష్ణుడు గీతాబోధనలో తనను అవతారంగా చెప్పుకున్నప్పుడు అదంతా మాయగా చూడలేక పోతే, అందుకు గత జన్మలోని పాపపుణ్యాలు అడ్డువస్తున్నాయన్నాడు.
కృష్ణుడు కులదేవతనుండి విష్ణు అవతారంగా ఎదగటానికి శతాబ్దాలు పట్టింది. గీతలో విష్ణువు పేరు 3 సార్లూ, హరి పేరు 2 సార్లూ కనిపిస్తుంది. కృష్ణుడు తనను, విష్ణువుగా, ఆదిత్యుడిగా ఒకసారి చెప్పుకుంటాడు. అర్జునుడు రెండుసార్లు కృష్ణుడిని విష్ణువుగా సంబోధిస్తాడు. ఐతే, సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకొని అలా పిలిచాడు. సంజయడు రెండుసార్లు కృష్ణుడిని హరి అంటారు, (W. Hill, P. Douglas : The Bhagavadgeetha, Madras, 1959) కృష్ణుడు విష్ణువుగా, హరిగా రూపొందటం గీత తరువాత ఎంతో కాలానికిగాని జరగలేదు.
గీతలో కృష్ణుడు తాను భూమి మీదికి అవతరించటానికి ధర్మం పోయి, అధర్మం ప్రకోపించినప్పుడు అవతరిస్తాన్నాడు. అదే గనుక కృష్ణుడి (విష్ణువు) ఉద్దేశం అయితే, స్వర్గంలో యోగనిద్రను అనుభవిస్తూనే ఉండవచ్చు గదా అని అరవిందుడన్నాడు. అరవిందుడు తానే అవతారం అన్నట్లు కొన్ని సందర్భాలలో ప్రవర్తించాడు. అతని రచనల్లోని పులుముడు వాదాన్ని ఆయన భక్తులే వివరించాలి. (Sri Aurobindu : Essays on the Geetha, New York, 1950).
గాంధీ ఈ అవతారాలను గురించి పట్టించుకోకపోలేదు. అన్ని మతాలు అవతారాలను సమ్ముతున్నాయన్నాడు. గాంధీ వివరణ ప్రకారం రజనీష్, సాయిబాబాలు తమను అవతారాలుగా చెప్పుకోవచ్చు. కృష్ణుడన్నట్లు అవతారానికి ప్రధాన లక్షణం మాయే. అవతార పురుషులు ఈ మాయనే ప్రదర్శిస్తున్నారు. మానవరూపంలో దేవుళ్ళమనే భ్రమ అమాయక జనాలకు కల్పిస్తున్నారు.
భగవాన్ దాస్ తన సొంత వివరణతో కృష్ణుడి విష్ణు అవతారాన్ని గురించి చెప్పాడు. అతడు అనిబిసెంట్ సహచరుడు. భారతరత్న, మూఢనమ్మకాలకు హేతుబద్ధత కల్పించదలిచాడు. అతని రచనల శీర్షికలు అలాగే ఉంటాయి. విష్ణువు ఎందుకు అవతరించిందీ వివరిస్తూ సుందోపసుందులు నాశనమైనట్లే, కురుపాండవుల తీవ్రవాదాన్ని అణచటానికి అవతరించాడన్నాడు. (Bhagavandas : Krishna, Madras 1959)
ఆర్.కె. పాండె కృష్ణుడి గోపికాలీలల్ని వివరిస్తూ రుషులు కృష్ణుణ్ణి ప్రార్థించారనీ, తమను సన్నిహితంగా ఉండనియ్యమని కోరారనీ కనుక వారందరినీ గోపికలుగా అవతారం ఎత్తమని కృష్ణుడు వారి కోరికను తీర్చాడనీ రాశాడు. గోపికల వస్త్రాలను అపహరించుకుపోవటం పాండె వివరిస్తూ దోషం రూపంలో ఉన్న వివస్త్ర స్నానాన్ని రూపుమాపాలని అలా చేశాడన్నారు. ఈ వివరణ యిచ్చిన పాండె తరువాతి జన్మలో గోపికగా జన్మించి కృష్ణుడికి సన్నిహితంగా ఉండవచ్చు. (R.K. Pandey : The Concept of Awataras).
కృష్ణుడిపై ఎన్నో గ్రంధాలు వెలువడ్డాయి. వాటన్నిటినీ చదవటం సాధ్యపడే విషయం కాదు. భారతీయ విద్యాభవన్ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలను బట్టి భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి అడుగు పెట్టకుండా ఉండే ప్రయత్నం కనిపిస్తున్నది.
డార్విన్ సిద్ధాంతం లోతుపాతులు తెలియకుండానే కొందరు అందులో అవతారాలకు సమర్ధన ఉన్నదంటున్నారు. ఆత్మ, దాని ప్రయాణం అనే భ్రమల్ని డార్విన్ సిద్ధాంతం కొట్టిపారేసింది. సృష్టివాదాన్ని పటాపంచలు చేసింది. దేవుడు దిగివచ్చాడనే నమ్మకాన్ని తృణీకరించింది.
జీవితానికి భౌతిక ఆధారాలు చూపింది. జ్ఞానార్జనకు ఇంద్రియాల ప్రాధాన్యతను పేర్కొంది. అర్హత లేని జీవులు నశించినట్లు చూపింది. మానవుడు దిగజారిన దేవతకాదనీ, పైకి ఎదుగుతున్న జంతువనీ రుజువు పరచింది. క్రైస్తవుల మత సిద్ధాంతాన్ని దెబ్బతీసిన డార్విన్ సిద్ధాంతం హిందూ మతానికి తోడ్పడుతుందను కోటం భ్రమ.
ఇటీవల జీవశాస్త్రాలలో పరిశోధనల వలన డార్విన్ ప్రతిపాదనలు దేవుడికింకా దూరమై మానవుడి కింకా దగ్గరయ్యాయి. జీవరాశులున్ను మేఘాల నుండి మానవుడు ఆవిర్భవించినట్లు ఫ్రెడ్ హోయల్, విక్రమ్ సింఘే సిద్ధాంత ప్రతిపాదన చేశారు. అది మత ప్రాతిపదిక కాదు. మన సంప్రదాయవాదులు పురాణాలలో అది కూడా చెప్పారని చూపగల సమర్ధులే. మన ఉపనిషత్తు దార్శనికులు ఈ విషయాలను ఆనాడే తెలుసుకున్నారని కూడా అనగలరు. బ్రహ్మపదార్థం అంటే హోయల్ చెప్పే జీవకణానికి కూడా చెప్పగలరు. (Holye, Wickramasinghe : Life cloud, the origin of life in the universe, New Year, 1978)
దశావతారాలలో మనవాళ్ళు పదవ అవతారం ఇంకా రావాలంటున్నారు. శూద్రులను శిక్షంచటానికి అది ఉద్దేశించారట. కల్కి అవతారం క్షత్రియుడంటున్నారు. అవసరమైనప్పుడు విష్ణువు పంది అవతారమైనా ఎత్తుతాడుగాని, వైశ్యుడుగానూ, శూద్రుడుగానూ రాడు. వారు పాపయోనికి పుట్టినవారు గదా! (Pandey, Delhi 1979).
20వ అధ్యాయం
ఇద్దరు భగవాన్లు
ఒక ఆటవిక హీరోని జాతీయదేవుడుగా పైకెత్తాలంటే ఒక పవిత్ర గ్రంధాన్ని అతని పేరిట సమకూర్చాలి. కృష్ణుడి విషయంలో వెయ్యేళ్ళు పట్టింది. అయినప్పటికీ ఆ గ్రంధాన్నీ, దాని సందేశాన్ని గురించీ ఏకాభిప్రాయం లేదు. కృష్ణుడి అనంతరం గీత వచ్చిందని నిశిత పరిశీలన చేసే పండితులంతా అంగీకరిస్తున్నారు. అది కూడా దశల వారీగా వచ్చింది. ఆర్.జి. భండార్కర్ యీ విషయమై రాస్తూ భగవద్గీత రచించినప్పుడు వాసుదేవుడు లేడనీ, అలాగే బుద్ధుడి ప్రవచనాలు గ్రంధస్తం చేసేటప్పుడు బుద్ధుడు లేడనీ అన్నాడు. అయినా, ఇరువురినీ భగవంతుడని అన్నారు.
సన్యసత్వం అనేది ఆర్యేతర భావన. భారతదేశంలో ఆ భావనకు ఆర్యులు విముఖులు. జీవితాన్ని అనుభవించాలనే సుఖజీవితం గడిపారు. యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలుండేవారు. క్రమేణ హరప్పా ద్రావిడులనుండి ఆర్యేతర భావంగా సన్యాసాన్ని తెచ్చుకున్నారు. మూడు అగ్ర కులాలు మాత్రేమే సన్యసత్వాన్ని పుచ్చుకోవచ్చన్నారు. జీవితం చివరి దశలో ఇది చేపట్టాలన్నారు. శూద్రులూ, ఛండాలరు కూడా సన్యాసులు కావచ్చని బుద్ధుడన్నాడు. తల్లిదండ్రుల అనుమతితో పిల్లలు కూడా చేరవచ్చునన్నారు. బుద్ధుడు ఇదంతా చాలాల పరిమితంగానే చేశాడు. కుష్టురోగుల్నీ, రుణగ్రస్తుల్నీ, బానిసల్నీ, సన్యాసులు కావటానికి అంగీకరించలేదు. బుద్ధుడు చేసినదంతా వర్ణాశ్రమ ధర్మాలను దెబ్బతీసేదిగా ఉన్నది. కింది కులాలకు చెందిన మంగలి, మత్స్యకారులూ, పాకీవారూ బుద్ధుని శిష్యులలో ఉన్నారు. కొందరు స్ర్తీలను కూడా సన్యాసులు కావటానికి బుద్దుడు అంగీకరించాడు. వైశాలికి చెందిన ఆమ్రపాలిని సంఘంలో చేర్చుకున్నాడు. ప్రసేనజిత్తురాజు అభ్యంతరం పెడుతున్నా ఒక ఛండాల స్త్రీని, శ్రావస్తికి చెందిన బ్రాహ్మణులనూ బుద్ధుడు సంఘంలో చేర్చుకున్నాడు. ఆ విధంగా అరమరికలు లేకుండా చేర్చుకోవటం వలన మితం తప్పింది. లోగడ బానిసగా ఉన్న గోపాలుడు గొప్ప తాత్త్వికుడిగా చెప్పుకున్నాడు.
సన్యాస భావనలు కాదంటే వర్ణాశ్రమ ధర్మాన్ని కాదనడమే అవుతుంది. కనుక రెండవ భగవాన్ గా కృష్ణుడు వచ్చి అర్జునుడికి నిష్కామకర్మ అంటూ బోధచేశాడు. కులధర్మాన్ని పాటించమన్నాడు. అది గీత సారాంశం. రాధాకృష్ణన్ ప్రకారం ఆధునిక మనస్తత్వ శాస్ర్తంలో గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. వాస్తవం ఏమంటే కింది కులాలవారిని వారి వృత్తులలో అట్టి పెట్టి, విద్య, వికాసాలకు దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. చెప్పులు కుట్టేవారు జన్మాంతర విషయాలను దృష్టిలో పెట్టుకొని తన వృత్తిని మార్చకుండా కొనసాగించాలన్నాడు. శంబుకుడు ధైర్యంగా తపసు చేసినందుకు రాముడు అతడిని తలసరికేసాడు. ఈ చర్యను కాళిదాసు అభినందించాడు.
మొదటి భగవానుడు సంఘం వెలుపల కులపద్ధతిని ఆమోదించాడు. ఐతే పుట్టకను బట్టిగాక, అభిరుచి, గుణగణాలను బట్టి కులం ఉంటుందన్నాడు. మానవుడి వృత్తిని అతడి కులం నిర్ణయిస్తుందనీ, తల్లిదండ్రులను బట్టి కాదనీ అన్నాడు. (Lord Chalmers ; Twither Dialogue of the Buddha, London 1926 : c. Kunhan Raja : Dhamrapada, Madras, 1956)
రెండవ భగవానుడు కులాన్ని ఆవిధంగా చూస్తే ప్రమాదమని, తానే సృష్టించినట్లు చెప్పుకున్నాడు. లోగడ జన్మలను బట్టి ఈ కులనిర్ధారణ జరుగుతుందన్నారు. ఇది మొండివాదన గనుక ఒప్పుకోవాలి, లేక నిరాకరించాలే తప్ప, వాదించేదేమీ లేదు.
మొదటి భగవంతుడు నీతిని అనుసరించమన్నాడు. క్రూరత్వాన్ని ద్వేషించమన్నాడు. జనన, మరణాల బంధనుండి తప్పించుకోవచ్చున్నాడు. రెండవ భగవంతుడు కులధర్మం ప్రధానం అన్నాడు. ఎటువంటిదైనా సరే కులవృత్తిని పాటిస్తే వచ్చే జన్మలో సుఖం ఉంటుందన్నారు. కల్పిత బ్యాంక్ పేరిట పోస్టు డేటు వేసిన చెక్కులాంటిదే కృష్ణుడి హామీ. వీటిని అనుసరించటం కష్టమని కృష్టుడికి తెలుసు. అందుకనే సహృదయంతో, భక్తితో తనకేది సమర్పించినా అంగీకరిస్తానన్నాడు. మరణించేముందు తనను తల్పుకుంటే తన వద్దకు చేరుకుంటారన్నాడు. ఎంత అవినీతి పరులైనా కృష్ణుడి నామం జపిస్తే మోక్షం పొందుతారు. అమరత్వానికి అది హామీ పత్రం వంటిది.
బుద్ధుడు నిర్మాణం ఉత్తమ మార్గమన్నాడు. అందుకు అష్టాంగ మార్గాలూ సూచించాడు. సారనాధ్ లో తొలిబోధనగా ఈ విషయాలు చెప్పారు. రెండవ భగవానుడు ఇంకా ఉదారంగా భక్తులు ఏమార్గాన్ని అనుసరించినా తనవద్దకే చేరుకుంటారన్నారు. ఐతే తనను కొలిచే వారికి స్వర్గంలో ఉత్తమ స్థానం లభిస్తుందన్నాడు.
ఇరువురు భగవాన్లూ శాఖాహారులు కాదు. ఆహారం కోసం జంతుబలిని బుద్ధుడు ప్రోత్సహించకపోయినా, భక్తులు మంసాహారాన్నిచ్చిపన్పుడు నిరాకరించ లేదు. అడుక్కునే వారికి ఎంపిక చేసే హక్కులేదన్నాడు. చుండ అనే భక్తుడు ఇచ్చిన పంది మాంసం తిన్న తరువాతనే బుద్ధుడు చనిపోయాడు. ఎవరూ మద్యపానం చేయకూడదన్నాడు.
కృష్ణుడు మాంసాహారి, మద్యం సేవించడు. మత్తుపానీయాలకు అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు గీత వెల్లడించలేదు. క్షత్రియులకు చంపడం కులధర్మం అన్నారు. యుద్ధరంగంలో బంధుప్రీతి లేకుండా క్షత్రియుడు హతమార్చాలి. అతనికి అప్పుడే ఇహపరలోకముక్తి లభిస్తుంది.
బుద్ధుడు చేపలు తప్ప మరే జీవులకూ హాని చేయరాదన్నాడు. (E.H. Brewster : The Life of the Gothama, The Budha) రాజ్యాల మధ్య యుద్ధాన్ని బుద్ధుడు ఖండించలేదు. వ్యక్తులపై హింసను మాత్రమే బుద్ధుడు ఖండించాడు. రాజ్యాల మధ్యపోరాటాలు తప్పవేమొ అన్నాడు. వినయ పిటక జాతక కధలలో యుద్ధాలకూ, వ్యూహాలకూ ఆయుధాలకూ సంబంధించిన ప్రస్తావన ఉన్నది. వాటిని ఖండించలేదు కూడా. (G.S.P. Mishra : The Age of Vinaya, 1972, New Delhi)
గీత అహింసను చెప్పలేదు. ఒక చోట మాత్రం యీ ప్రస్తావన ఉన్నది. (5వ అధ్యాం, 5వ శ్లోకం) అహింస, సమానత్వం గీత ప్రయోజనానికే విరుద్ధం. అంచలవారీ అసమానత్వాలకు దారి తీసిన కులవిధానంలో సమానత్వం కుదరదు. ఎవరో కావాలని అహింస, సమానత్వపదాలను ఒక చోట గీతలో చేర్చారు. బుద్ధిజం వ్యాప్తిని అరికట్టడానికి గీతను అల్లారు. మహాభారతం యావత్తునూ బ్రాహ్మణ విజ్ఞాన సర్వస్వం అనవచ్చునని ఎన్.జె. షిండే అన్నాడు. అంగీరసుడు, భృగుడు మహాభారతానికి ప్రస్తుత రూపాన్నిచ్చారన్నాడు. దాన్ని ధర్మశాస్త్రంగా, నీతి శాస్త్రంగా చూపారన్నాడు. (N.J. Shende, The Authorship of Mahabharatha, Vol. 24, Annals of the Bhandarkar Rosearch Institute, Poona, 1943). నా దృష్టిలో గీత-బంధాల బైబిల్ మాత్రమే.
అధ్యాయం యిరువైఒకటి
ఎవరికి కావలసింది వారికి!
రోమన్ దేవుడు జేనస్ కు రొండు ముఖాలుంటే, హిందువుల దేవుడు హరికి వెయ్యి ముఖాలున్నాయి. కృష్ణావతారంలో హరి వెయ్యినాల్కలతో మాట్లాడతాడు. గీత యిచ్చే వెయ్యి సందేశాలలో ఏది స్వీకరించాలో అది నీ యిష్టం. నీకు నచ్చే సందేశాలను కలిపి చూచుకోవచ్చు. అలా కలిపినప్పుడు ఎన్నో తత్వ్తాల గురించి ఎప్పటి కప్పుడు పుష్కలంగా పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. ఇక అనువాదాలూ, భాష్యాలూ లెక్కకు మించాయి. క్రీ.త. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు దీనికి శ్రీకారం చుట్టాడు. అది నిర్విఘ్నంగా సాగిపోతూ యజ్ఞాలూ, ప్రసంగాలూ, ప్రవచనాలరూపం దాల్చాయి.
గీత ఆకర్షించటానికి అందులోని గందరగోళమే కారణం. భిన్నత్వం, మరొక అంశంగా చెప్పవచ్చు. ఎవరికేది కావాలో అది గీతలో ఉన్నది. కేవల అద్వైతం నుండి ద్వైతం వరకు శంకరుడూ, రామానుజుడూ, మధ్వుడూ, వల్లభుడూ గీతనుండి స్వీకరించారు. ముక్తికి భిన్న మార్గాలున్నాయన్నారు. అన్ని మార్గాలూ తన వద్దకే చేరుస్తాయని కృష్ణుడన్నాడు. శంకరుడు జ్ఞానయోగాన్ని కోరాడు. సన్యాసం కావాలన్నాడు. మిగిలిన ముగ్గురాచార్యులూ భక్తియోగం ఎంపిక చేసుకున్నారు. శంకరుణ్ణి వ్యతిరేకించిన ఈ ముగ్గురూ వారిలో వారు విభేదించారు.
ఈ ఆచార్యుల చుట్టూ అనేక భాష్యకారులు బయలుదేరారు. ఇందులో శంకరుడిది చాలా విస్తారమైనది. ధనపతి, హనుమత్, మధుసూధన, శ్రీధర, నీలకంఠ, వెంకటనాధ, శంకరానంద, భాష్యకారులుగా పేర్కొనదగినవారు. శంకరుడిని అనుసరించిన వీరు మధ్యలో సొంతదారులు నిర్మించారు. ఎదుటి పక్షం వారితో చేరిన సందర్భాలూ లేకపోలేదు. రామానుజుడూ, మధ్వుడూ, వల్లభుడూ తమ అనుచరులతో వేర్వేరుగా కొనసాగారు. యమునాచార్యుడూ, వెంకటనాధ చాలా సమర్ధులైన రామానుజాచార్యుల ముఠాకు చెందినవారు. పురుషోత్తం వంటి వారు వల్లభుడిని సమర్ధించారు. జయతీర్ధ, రాఘవేంద్ర వంటివారు మధ్వుడి కోపు వేసుకొన్నారు. వీరందరిలో వ్యక్తిగత తేడాలున్నాయి.
కేసవ, నింబార్కుడు ఏ ముఠాలకూ చెందకుండా గీతకు సొంత వ్యాఖ్యానాలు చేశారు. భాస్కర, అభినవగుప్త, ఆనందవర్ధన, రమాకాంతులు కాష్మీరు పండితులుగా గీతకు భాష్యం చెప్పారు. బొంగాలలో చైతన్య, మహారాష్ర్టలో రామ్ దాస్, ఏకనాధ్, ఇంకా తుకారాం వారి భాష్యాలు వెల్లడించారు.
మహారాష్ర్టలో గీతపై చెప్పే వ్యాఖ్యానానికి బ్రాహ్మణులు జ్ఞానదేవుడిని 13వ శతాబ్దంలో హింసించారు. అతనిని కాపాడిన కొందరు బ్రాహ్మణులు గీతపై వేరే అనువాదం, భాష్యం వెల్లడింపచేశారు. మహారాష్ర్టలో అన్ని కులాల వారికీ అది ప్రేరణ కల్పించింది. (D.D. Kosambi : The Culutre And Civilization of Ancient India) అతడి భాష్యంలో మానవవాదం ఉన్నది. జ్ఞానదేవుని ఆదర్శపురుషుడు ప్రపంచంలోని ఏ వస్తువును చూచినా దివ్యమైన ప్రేమతో పొందిపోతారు. జీవితాదర్శం మోక్షం కాదు. భక్తి మాత్రమే. కర్మకాండలూ, యోగాభ్యాసాలూ నిరుపయోగం. జీవితం పాపపంకిలం కాదు. దైవ ప్రేమానుభూతిని చూపేదే జీవితం. అది గ్రహించటమే జీవిత లక్ష్యం. ఇందుకు కులాలూ, కాల, ప్రదేశాలు అడ్డురాకూడదు. ఇది జ్ఞాన దేవుడి సందేశం. (B.P. Birat : A Philosophy of Gnanadeva Pandharipur, 1956). 13వ శతాబ్దంలో మోక్షం ఆదర్శం కాదని, కులాలను ఖండించటం అసాధారణం. 22వ ఏట చనిపోయిన జ్ఞానదేవుడు మురాఠీ భాషపై, ఆలోచన పై తన ప్రభావాన్ని చూపెట్టాడు.
శంకరుని చాలా మంది ప్రమాణంగా స్వీకరించినా మైంకర్కు అతని పట్ల చాలా స్వల్పమైన అభిప్రాయం ఉన్నది. గీతకు భక్తియోగం కేంద్రమనీ, శంకరుడు వక్రభాష్యం చేసి తన జ్ఞానయోగాన్ని సమర్ధించుకున్నాడనీ అన్నాడు. భగవద్గీత భాష్య కారుడుగా శంకరుడిపై ఆధారపడటానికి వీలులేదన్నాడు. (T.G. Mainkar : A Comparative Study on the commentary of Bhagavadgeetha, Delhi 1969). గీతపై సంప్రదాయ భాష్యకారులందరికీ ఈ మాటలు వర్తించవచ్చు.
ఆర్.డి. రణడే పండితుడుగా గీతపై భాష్యం చెప్పాడు. ఎస్.హెచ్. జాబ్వాలా హీనమైన భాష్యం చెప్పాడు. ఐతే, వారు ఆధునిక కాలాన్ని కూడా తమ భాష్యంలో చెప్పారు.
గీతను ఎలా చదివాల్సిందీ వివరిస్తూ త్రిదండి స్వామి బి.హెచ్. బాన్ రాయగా, పేరు లేకుండా మరొకరు గైడు రాశారు. చైతన్య ధోరణిలో గీతను త్రిదండిస్వామి అనువదించాడు. పేరు లేని వ్యక్తి రాధాకృష్ణను ఉదహరిస్తూ కాలాతీతంగా, విశ్వవ్యాప్తంగా గీత పనికి వస్తుందని బోధించాడు.
ఢిల్లీలోని సుందర్ లాల్ అనే హిందువు గీతను ముస్లింలు ఎలా చదవాల్సిందీ రాయగా హైదరాబాద్ లోని సయ్యద్ అసదుల్లా దానిని అనుసరించాడు. గీతను క్రైస్తవులు చదవ వలసిన తీరుపై కొన్ని పుస్తకాలున్నాయి. బౌద్ధ, జైన, యూదు, జోరాస్ట్రియన్, షింటొ, కన్ఫ్యూసియన్ గైడ్లు కూడా వస్తుండవచ్చు. (Anon : Githadarshan as Bhaktiyoga, Madras 1968 : Tridandaswamy, B.H. Bon : The Gita as a Chaitanyait Reads it, Bombay 1938).
బాల్ గంగాధర్ తిలక్ గీతను ఆచరణకు పురికొల్పుతున్నట్లు, నిష్కామకర్మగా, ప్రపంచం కోసం ఈ ఆచరణ జరపాల్సినట్లు అభిప్రాయపడ్డాడు. మరాఠీలో రాసిన ఈ పుస్తకాన్ని బర్మాలోని మాండలే జైలులో ఉండగా తిలక్ ఉద్ర్గంధంగా రూపొందించాడు. దీనిని బాలచంద్ర శీతారాం సుక్తాంకర్ ఇంగ్లీషులోకి అనువదించాడు. గీత భాష్యాన్ని అరవిందుడు కొట్టిపారేశాడు. గాంధీ కూడా విభేదించాడు.
అరవిందుడు చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటూ, హఠాత్తుగా పాండిచేరి పారిపోయి అది భయపడి తీసుకున్న చర్య కాదనీ, దైవపిలుపును బట్టి తీసుకున్న నిర్ణయం అనీ మనల్ని నమ్మమంటున్నాడు. సంపన్న శిష్యులతో, వారి ఆదరణతో సొంద జీవితాన్ని గడిపాడు.
తిలక్, గాంధీల మధ్య గీతాభాష్యంపై వచ్చిన అభిప్రాయభేదాలను డి.కె. గోసావీ విడమర్చి చెప్పాడు. (Tilak,Gandhi and Geetha, Bombay, 1983)
గాంధీ కేవలం సత్యం, సంపూర్ణ బ్రహ్మచర్యం, పూర్తి ఆహింస, తిరుగులేని త్యాగం, కేవల నైతిక విలువలూ కావాలన్నాడు. అలా అంటే చివరకు వ్యక్తిలో కపట ప్రవర్తనకు దారితీసే లక్షణాలు వస్తాయి. నైతికవాది మానవస్వభావాన్ని విస్మరించే అవకాశం వున్నది. అలాంటప్పుడు నైతికవాదిని మానవస్వభావం కూడా పక్కనబెడు తుంది. బెట్రాండ్ రసెల్ ఇలాంటి హెచ్చరికచేశాడు. ఐనా గాంధీ పట్టించుకో లేదు. దాని ఫలితం అనుభవిస్తున్నాం. ప్రజా జీవితం, వ్యక్తిగత జీవితంలో కూడా నైతిక విలువల్ని పాటించకుండా నటనతో కప్పిపుచ్చుతున్నాం. దీనంతటికీ గీతా ప్రభావం చూపవచ్చు. అన్ని అభిప్రాయాలకూ నమ్మకాలకూ అసమానతలకూ ఆర్థిక పరమైన అన్యాయాలకూ గీతను అడ్డం పెట్టుకోవచ్చు చంపేవాడూ, చంపబడేదీ అనేది లేదని గీత చెపుతుండగా ఇక హత్యలకూ, మూకుమ్మడి హింసలకూ, వ్యతిరేకత ఎలా వస్తుంది. చంపుతున్నారనుకోటం అజ్ఞానం. దేవుడు వారిని ముందే చంపేశాడు అంటుంది గీత. గీతాకారులకు ఆచరణలో స్వేచ్ఛ లేదు. అతడు దేవుని చేతిలో కీలుబొమ్మ. వేదాంతులు దీనివే ఈశ్వరలీల అంటున్నారు.
ఆల్బర్ట్ షూజర్ భగవద్గీతకు స్పింన్క్స్ వంటి స్వభావం ఉన్నదన్నాడు. అది కేవలం గూఢార్ధంతో నవ్వుతుంది. కాని, గీత గూఢార్ధంలో మాట్లాడుతుంది, వాదిస్తుంది, బెదిరిస్తుంది, ప్రేరేపిస్తుంది, ఇంకెన్నో చేస్తుంది. నైతిక విలువల్ని పాటించదు. గీత నీతికి దూరమైనది. మనం దానిని చదివి గౌరవిస్తున్నాం. గీతను రాసిన అనామకులకు అది గొప్ప విజయం. భారతదేశానికీ, ప్రపంచానికీ అదొక విషాదం.
22వ అధ్యాయం
తుదిమాట
1200 సం.రాల క్రితం శంకరాచార్యుడు దుమ్ముదులిపి గీతను పైకి తీసి తన మేధస్సుతో భాష్యంగా రాసి విమోచన గ్రంధంగా ప్రజలు ముందుంచాడు. అప్పటి నుండీ దీని ప్రభావం సర్వత్ర దారుణంగా పరిణమించింది. మానవ అసమానతలకు, బాధలకూ బాధపడకుండా, ఉదాసీనత చూపటానికి గీతే కారణం. మనల్ని కపటవర్తనలోకి గీత నెట్టేవేసింది. ఆ విషయాన్ని ప్రేమనాధ్ బజాజ్ రాశాడు.
గీత జాతీయ పవిత్రగ్రంధంగా ఆవిర్భవించటం, మన మనస్తత్వాన్ని ఆవరించటం పరస్పర సంబంధం గలవి. ఆ మాట అంటే గీతాభిమానులు దూషిస్తారు. ఈ విషయంలో చర్చ జరగాలి. ఆలోచనల సంఘర్షణ సాగాలి. అప్పుడు కొత్త జీవితానికి నాంది పలుకుతుంది.
గీత పేర్కొన్నట్లు కృష్ణుడు మళ్ళీ ఈ భూమి మీదికి ధర్మస్థాపన నిమిత్తం రాకూడదు. లోగడ వచ్చినందుకే తీరని నష్టం జరిగింది. ధర్మం పేరిట మారణకాండ జరిగింది. మహాభారతం ప్రకారం అప్పుడు మిగిలిన వారు 9 మందే. ద్వాపరయుగం అంతమై కలియుగ మారంభమైందన్నారు. కృష్ణుడు తనను వజ్రాయుధంగా వర్ణించుకున్నారు. అలాంటి కృష్ణుడు ఇప్పుడు వస్తే అణ్వాయుధాల కృష్ణుడవుతాడు. భూమిపై మనుషులుండరు.
అర్జునుడు విస్మరించినట్లే మనం గీతను విస్మరించాలి. కృష్ణుడు బోధించిన ఒక ఏడాది లోనే గీత తన మనసు నుండి తొలిగిపోయిందని అర్జునుడన్నాడు. మనజాతి మనసునుండి కూడా అలాగే తొలిగిపోవాలి. అంతటితో మన నిద్రావస్తపోయి, భ్రమలు తొలగి సొంత ఆలోచన పెరుగుతుంది. అప్పుడే స్వార్ధాన్ని పక్కన బెట్టి మానవజాతి భవిష్యత్తుకు బాటలు వేయగలం. కార్ల్ సేగన్ ఊహించినట్లు మనభూమి వంటివి ఈ విశ్వంలో యింకెన్నో ఉండి ఉండవచ్చు. అవి వివిధ సంస్కృతులలో మనల్ని మించిపోయి ఉండవచ్చు. అర్జునుడు గీతను మరచిపోయినట్లే మనం గీత వైరుధ్యాలనూ, గందరగోళాలనూ ఎత్తుగడలనూ మరచిపోయే రోజు వస్తుందని ఆశిస్తున్నాను. భారతీయులు ఆనందంగా అర్థవంతంగా మనుగడ సాగిస్తారని కోరుకుంటున్నాను. ఆలోచన స్థభింపజేసే ధోరణి మార్చుకోవాలి. అనంతాకాశంలోకి చూస్తూ, ఆత్మ పరమాత్మతో లీనమయ్యే ఎండమావుల కోసం వెతక్కుండా ఉండాలి. విశ్వంలోని మర్మాల పొరలను విప్పుకుంటూ మానవుడు పురోగమించాలి. అందుకు తొలిమెట్టుగా కృష్ణుడిని, గీతనూ విసర్జించాలి.
96

2 comments:

Anonymous said...

ఇన్నయ్య గారూ,

మీరు కొంత కాలం చెత్త పుస్తకాలను చదవడం ఆపగలరు. హైదారబాదుకు వచ్చేది మీకు తెలియబరుస్తాను. నన్ను కలవండి.

- నాగరాజా.
http://ten.nagaraja.info

innaiah said...

నార్ల గీత పారాయణం చే సే వారికి కాదు.ఆధ్యయనం చెసే ఆలోచనాపరులకు.