Wednesday, October 24, 2007

The Truth about the Gita 3 rd part

అధ్యాయం పది
దేవుడుగా కృష్ణుడు
మానవుడుగా కృష్ణుడికంటె, రాజనీతిజ్ఞుడుగా కృష్ణుడికంటె, దేవుడుగా కృష్ణుడికి అంత ఖ్యాతి లేదు. మహాభారతంలో మనిషిగా ప్రవేశించి దేవుడుగా నిష్ర్కమిస్తాడు. పురాణాలలో అద్యంతాలూ దేవుడుగానే ఉంటాడు. కనుక ఇతిహాసాలూ, పురాణాలు కలిపి చూస్తే కాని, దేవుడి విషయం బయటపడదు.
కృష్ణుడి బాల్యదశలో చేష్టలూ, అద్భుతాలూ అంతగా బంకించంద్ర చటర్జీ పట్టించుకోలేదు. కృష్ణుడి దైవత్వంలో మాత్రం నమ్మకం ఉంచాడు. బాల్యదశలో చెప్పినవన్నీ అలంకార ప్రాయాలన్నాడు. పిఠాపురం పెండ్యాల శాస్ర్తి ఈ అద్భుతాల గురించి నిర్మొహమాటంగా చెప్పారు. పూతన చిన్న పిల్లలరోగమనీ, రాక్షసి కాదనీ అన్నాడు. భారతీయ వైద్య గ్రంధాలలో ఆ రోగ ప్రస్తావన ఉన్నది. ఇప్పటికీ గ్రామాలలో పిల్లల జబ్బుల్ని పోగొట్టటానికి కొన్ని క్రతువులు చేస్తుంటారు. కేసి, సాదేరధ, ఉల్లూక అనే దయ్యాలను కంసుడు కృష్ణుడిపైకి పంపిస్తాడు. రెండు చెట్లమధ్య కృష్ణుడిని కట్టేసినట్లు చెప్పిన కథలో ఉల్లూక అనేది దోషపూరిత దయ్యం పేరే. మిగిలిన కృష్ణలీలలు కూడా ఊహించిన మూఢనమ్మకాలే అని పెండ్యాల శాస్ర్తి పేర్కొన్నాడు.
కౌరవసభలో ద్రౌపది వస్ర్తాపహరణం జరుగుతుండగా ఆమె కృష్ణుడిని ప్రార్థించటం, అతడు దివ్యశక్తులలో ఆమెను కాపాడటం కథగా చెపుతారు. శాస్త్రి ఈ విషయమై రాస్తూ మహాభారతంలో 13 సందర్భాలలో ఈ అవమాన ప్రస్తావన ఉన్నదనీ, 3 సార్లు వివస్ర్తను చేయటనికి ప్రయత్నించారనీ, మిగిలినప్పుడు కథలో ఆమెను జుట్టుపట్టుకొని ఈడ్చారనీ ఉన్నది. రెండు సందర్భాలలో మాత్రం తన అవమానాన్ని గురించి కృష్ణుడికి నివేదించుకున్నది. అందులో తనను వివస్త్ర గావించటానికి చేసిన ప్రయత్నం గురించి గానీ, తనను కాపాడినందున కృతజ్ఞతగానీ తెలిపినట్టు లేదు. ఈ ఉదంతం జరిగినప్పుడు కృష్ణుడు ద్వారకలో లేడు. సాళ్వుడితో పోరాటం అంటూ ఏమీ లేదు. తిరిగివచ్చిన తరువాత యుధిష్టిరుడి జూదం, దాని తీవ్ర పరిణామాలూ విన్నాడు. కనుక ద్రౌపది మొరబెట్టుకోటం, కృష్ణుడు కాపాడటం ఆధారాలు లేవు. భాసుడూ, భారవీ, క్షేమేంద్రుడూ మహాభారతాన్ని గురించి రాసినప్పుడు ద్రౌపదీ వస్త్రాపహరణం ప్రస్తావన లేదు.
రాజసూయ యాగంలో ముందుగా ఎవరిని గౌరవించాలనే విషయమై పేచీరాగా కృష్ణుడికి వ్యతిరేకంగా ఉన్న శిశుపాలుడు పోరాటానికి సన్నద్ధుడై వెళ్ళిపోతాడు. యుధిష్టిరుడతణ్ణి శాంతింపజేసి తీసుకువస్తాడు. అయినప్పటికీ శిశుపాలుడు తన అభ్యంతరాన్ని కొనసాగిస్తుండగా కృష్ణుడు చక్రంతో అతణ్ణి హతమారుస్తాడు. కృష్ణుని ప్రేరేపణతో భీముడు జరాసంధుడిని చంపుతాడు. జరాసంధుడు అప్రమత్తుడుగా లేనప్పుడు అది జరిగిందని శాస్త్రి రాశాడు.
శీతానాధ్ తత్వభూషణ్ కృష్ణుడి దైవలీలను గురించి తీవ్ర ఆరోపణలు చేశాడు. కంసుణ్ణి చంపిన తీరు ప్రస్తావిస్తూ కంసుడు పురికొల్పినప్పుడు పోరాటంతో కృష్ణుడతణ్ణి చంపలేదనీ, మల్లయుద్ధం పోటీలు తిలకిస్తున్న కంసుణ్ణి హఠాత్తుగా జుట్టుపట్టుకొని వేదిక నుండి కిందికి విసిరేసి చంపాడని అంటాడు. శిశుపాలుడూ, సాల్యుడు, శతధన్వుడు కృష్ణుడి చేతిలో చనిపోయిన తీరుగూడా అతడు ప్రస్తావించాడు. పురాణాల రచయితలకు చంపడం దివ్యచర్యగా ఉన్నది. కృష్ణుడు తన దివ్యత్వాన్ని ప్రశ్నించిన పౌండ్రుని చంపాడు. పౌంద్రుడు ద్వారకపై దండెత్తినట్లు కూడా రాశాడు. కృష్ణుడు ధరించిన విష్ణు చిహ్నాలను, శంకుచక్రాలను, పద్మం, పౌండ్రుడు ప్రశ్నించాడు. అందుకే కృష్ణునికి ఆగ్రహం వచ్చింది. (Seetanath Tatwabhushan : Krishna And the Geetha, Calcutta).
కృష్ణుడు అపహరణల్లోనూ ప్రసిద్ధి చెందాడు. శిశుపాలుడితో పెళ్ళాడాల్సిన రుక్మిణిని ఒకరోజు ముందు అపహరించాడు. మిత్రవిందను స్వయంవర సభ నుండి అపహరించాడు. మద్రరాజు కుమార్తె లక్షణాలను బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకున్నాడు. నరకుడి కొలువులోని 16 వేల మంది స్ర్తీలను భార్యలుగా స్వీకరించాడు. భార్యల సంఖ్య 16,008 కాగా, పురాణాల ప్రకారం 16,022 అని బంకించంద్ర చూపాడు. హరివంశం ప్రకారం కృష్ణుడికి ఆడపిల్లలు లేరు. మగ సంతానం లక్ష 80 వేలు మాత్రమే. భాగవతాన్ని బట్టి కృష్ణుడు 125 ఏళ్ళు బతికాడు. దీని ఆధారంగా బంకించంద్ర లెక్కలు వేసి రోజుకు 4 గురు చెప్పున కృష్ణుడు పిల్లలను కన్నాడని చెప్పాడు. కృష్ణుడు 14 ఏళ్ళ వరకూ పిల్లలను కనజాలడనీ, 80వ ఏడు తరువాత పిల్లల లేరనీ మజుందార్ చూపాడు. మిగిలిన 66 ఏళ్ళలో రోజుకు 7.5 కుమారులు చొప్పున పుట్టారన్న మాట.
కృష్ణుడు ఒక పథకం ప్రకారం ద్వారకా నగరాన్ని రూపొందించాడని పురాణాలు చెపుతున్నాయి. హరివంశం ప్రకారం ద్వారకలో వేలాది మంది స్త్రీలను వ్యభిచారంలో ఉన్నవారిని స్థిరపరిచారు. హరివంశం ప్రకారం ఆ స్త్రీలకు తగ్గట్లే పురుషుల్నీ, వసతి గృహాల్నీ తెరిపించాడు. ఆనాడు కృష్ణుడి సోదరుడు బలరాముడే పెద్ద తాగుబోతు. కల్లుముంత లేకుండా అతడు కనిపించేవాడు కాదు. అందుకే హరిప్రియ అని కల్లుకు మారుపేరు వచ్చింది. అక్కడ అన్ని రకాలైన మాంసభక్ష్యాలూ లభించేవి. కృష్ణుడు కూడా వాటిననుభవించే వాడు. మజుందార్ ద్వారకను గురించి రాస్తూ హరివంశం ప్రకారం యాదవులు ఈ స్త్రీలను తమ కుటుంబాలతో పాటు సముద్ర తీరాలకు తీసుకువెళ్ళి జలకాలాడుతూ, తాగుతూ తింటూ అనుభవించేరన్నాడు. కృష్ణుడి సంతానం, ఇతర కుటుంబీకులూ, బట్టలూ, నగలూ ఒడ్డున పెట్టి జలక్రీడలలో నిమగ్నులయ్యేవారు. యాదవ స్ర్తీ పురుషులంతా తాగుడుకు అలవాటు పడ్డవారే.
ద్వారకానగరం పవిత్రమో కాదో గాని, కృష్ణుడి ఆధ్వర్యంలో విలాసవంతంగా మాత్రం ఉన్నది. హరివంశం ప్రకారం అలా ఉన్నదన్నా సనాతనులకాగ్రహం వస్తుంది. సుక్తాంకర్ అదంతా మూర్ఖత్వంగా కొట్టిపారవేయదలిచాడు. కృష్ణుడు తన దైవలీలల్ని అనేక సందర్భాలలో చూపినా, చదువుకున్నవారు సహితం వాటి లోతుపాతుల్ని చూడలేక పోతున్నారన్నాడు.
కృష్ణుడి విషయంలో ఉత్తమ నిర్ణేతలు యాదవులే. వారి దృష్టిలో అతడు దేవుడు కాదు. వారెప్పుడూ అతణ్ణి పూజించలేదు. మజుందార్ ఈ విషయాలను స్పష్టంగా రాశాడు. అక్రూరుడూ, కృతవర్మ కృష్ణుడి పట్ల శమంతకమణి విషయంలో చూపిన ధోరణి, శిశుపాలుడూ, దంతవక్ర్తుడు, దైవాతకుడూ, ప్రభాసుడూ కృష్ణుడిపట్ల గౌరవం చూపలేదు. అతడిని దేవుడుగా చూడకపోవటం యాదవుల దురదృష్టమని భాగవతంలో అన్నారు.
కృష్ణుడి కొడుకులు ప్రద్యుమ్నుడూ, సాంబుడు సహితం తండ్రిని గౌరవించలేదు. పెంపుడు తల్లి మాయాదేవిని ప్రద్యుమ్ముడు పెళ్ళాడాడు. హరివంశం వజ్రనాభుడి కుమార్తె ప్రభావతిని ప్రద్నుమ్నుడు ఆకట్టుకుంటాడు. కృష్ణుడి 16 వేల మంది భార్యల్నీ అతని కుమారుడు సాంబువాడుకున్నట్లు, వరాహపురాణం చెపుతున్నది. అందుకు సాంబుడిని కుష్టురోగిగా సాంబువాడుకున్నట్లు శపిస్తాడు. ద్వారకా నగరంలో పురుష జనాభా హరించి పోతుండగా వారిని కాపాడాలని అర్జునుడు ప్రయత్నించి కూడా విఫలుడౌతాడు. హస్తినా పురానికి తీసుకువెళుతున్న ద్వారక జనాన్ని అర్జునుడు కాపాడలేక పోయాడు. ఆఖరులో వారిపై దండెత్తి చాలామంది స్త్రీలనెత్తుకపోయారు. అందులో ముగ్గురు తప్ప, కృష్ణుడి భార్యలు కూడా ఉన్నారు.
కృష్ణుడి దివ్యత్వాన్ని చాలామంది నమ్మలేదు. హాప్ కిప్స్ ఈ విషయం రాస్తూ గీత ప్రకారం కృష్ణుడిని దేవుడుగా గుర్తించి పూజించిన వారు కొద్దిమందే అన్నాడు. (గీత 9వ అధ్యాం, 11వ శ్లోకం) పతంజలి మహాభాష్యం కూడా కృష్ణుడిని నాయకుడిగా తప్ప దేవుడుగా గుర్తించలేదు. (E.W. Hopkins : The Great Epic of indian Literature)
శీతానాధ్ తత్వభూషణుడి ప్రకారం కృష్ణుడి కథ అంతా అద్భుత కల్పనలే. మహాభారతం, పురాణాలూ ప్రస్తావించినదాన్ని బట్టి చూస్తే కృష్ణుడు దైవావతారం కానేరదు.
డి.డి. కోశాంబి ధైర్యంగా, నిర్మొహమాటంగా కృష్ణుడు గురించి రాశాడు. అవకాశవాదానికి ఆయువు పట్టుగా ఉన్న గీతావాదనలు నాటి సమాజంలోని ఆదిమ ఉత్పత్తి దశకూ, మతానికీ ప్రతిబింబంగా ఉన్నవన్నారు. (D.D. Kosambi) కోశాంబి లాంటివారే అలా మాడుపగుల కొట్టగలిగేట్లు చెప్పగలరు.
అధ్యాయం పదకొండు
గీత ఎవరు రాశారు?
మనకు తేదీలు లేని చరిత్ర ఉన్నట్లే, పేరు లేని రచయితలున్నారు. అలాంటి వారే గీతను రచించారు. గీత మాట్లాడిందీ కాదు, ఆలాపించిందీ కాదు. కేవలం రాశిందే. అందుకు గీతలోనే ఆధారాలున్నాయి. ఈ పవిత్ర సంబాషణను ఎవరు చదివినా-అంటూ కృష్ణుడు చెప్పటమే అందుకు ఆధారం. (18వ అధ్యాయం, 70వ శ్లోకం) తాము చెపుతున్న తాత్త్వికవచనాల్ని సంజయుడు వింటున్నాడని కృష్ణుడికి తెలియదు. వ్యాసుడు తన ఇంద్రియాతీత శక్తులతో సంభాషణంతా పొందుపరుస్తూన్నాడని తెలుసా. దేవుడు గనుక వాటన్నిటినీ గ్రహించాడా. కురుక్షేత్రంలో అర్జునుడు కుప్పగూలిపోతాడనీ, అతన్ని ప్రోత్సహించి పోరాడమని చెప్పవలసి వస్తుందనీ కృష్ణుడికి ముందే తెలుసా. ఇది కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకటం వంటిది కాదు. రాసిన దాన్నే చదవగలరు. అనూహ్యపరిణామంపై అప్పటికప్పుడు మాట్లాడిన దానిని చదవలేదు. అర్జునుడితో తన సంభాషణను పవిత్రం అనటం సరైనాదేనా. సుక్తాంకర్ దృష్టిలో మన ప్రమాణాలను దేవుళ్ళకు అంటగట్టకూడదు. గీతను భిన్న సమయాలలో విభిన్న వ్యక్తులు రాశారు. కృష్ణుడి జీవితాన్నీ, కాలాన్నీ మహాభారతం, పురాణాల దృష్య్టా చూచినప్పుడు అతడు గీతా రచయితకాదని తేలిపోతుంది. భాగవతంలో బాల్యచేష్టల పిల్లవాడు తాత్త్వికుడు కాలేడు. మహాభారతంలోని జిత్తులమారి తాత్త్వికుడు కాలేడు. నేను కృష్ణభక్తుడిగా కాక ఆలోచనా జీవిగా చూస్తున్నాను. భక్తుడైతే పారవశ్యంతో మనసు కుంచింప చేసుకుంటాడు. పూనకం ఎక్కువైన కొలదీ దేవుడికి సన్నిహితుడుగా భావిస్తాడు. కృష్ణుడు మెకవెల్లి అవుతాడేమొగాని సోక్రటీస్ కాలేదు. తాత్వికుడి స్వభావం అతడికి లేదు.
కృష్ణుడు గీత రచయిత కాదనడానికి కొన్ని కారణాలున్నాయి. అంగీరసుడు శిష్యుడని ఆదిశంకరాచార్యుడు చేసిన ప్రచారం కృష్ణుణ్ణి గురించి కేవలం కల్పితగాధే. పురాణాలను బట్టి వారణాసి వద్ద అవంతిపూర్లో సందీపుని వద్ద కొద్దికాలం కృష్ణుడు ఉన్నాడు. ఉత్తరోత్తరా అతడికి చదివే అవకాశమే లేదు. అమ్మాయిల మీదున్న ఆసక్తి అధ్యయనంపై లేదు. వేదవేదాంగాల జిజ్ఞాసి అని భీష్ముడు చెప్పిన మాటలను అంతగా పట్టించుకోనక్కరలేదు. యుధిష్టిరుడు రాజసూయ యాగంలో ప్రథమ తాంబూలం భీష్ముడికి యివ్వవలసింది. అందుకు మారుగా ఆ గౌరవం ఎవరికి దక్కాలో చెప్పమని భీష్ముడినే అడిగాడు. రాజుపేరు చెపితే చిక్కువస్తుందని అతడు కృష్ణుడి పేరు చెప్పాడు. భీష్ముడి అనౌచిత్యాన్ని శిశుపాలుడు ప్రశ్నించాడు. కృష్ణుడిని అజ్ఞాని అన్నాడు. కృష్ణుణ్ణి సమర్ధించటం విజ్ఞాననిధిగా, భీష్ముణ్ణి పొగిడాడు. అంతమాత్రన అతడే గీతా కారుడంటానికి వీలులేదు. కృష్ణుడు మిధ్యకాదనీ, కురుక్షేత్ర యుద్ధం జరిగిందనీ అనుకొందాం.
యుద్ధ సమయంలో కృష్ణుడి వయసెంత? ద్రౌపదీ స్వయంవరంలో అతడి వయసు 64. అర్జునుడు సుభద్రను పెళ్ళాడినప్పుడు కృష్ణుని వయసు 80. కురుక్షేత్ర యుద్ధం నాటికి 94 ఏళ్ళు అన్నారు. కురుక్షేత్ర యుద్ధానంతరం 36 ఏళ్ళకు కృష్ణుడు చనిపోయాడు. సి.వి. వైద్య అంచనా ప్రకారం క్రీ.పూ. 3185లో కృష్ణుడు పుడితే మహాభారత యుద్ధం నాటికి 84 ఏళ్ళుండాలన్నాడు. యుద్ధంలో పాల్గొనటానికి అది సరైన వయసు కాదు. ఐతే దక్షిణాఫ్రికాలో బ్రిటిషు సైన్యాల అధిపతిగా లార్డ్ రాబర్ట్స్ ఉన్నట్లు ఫీల్డ్ మార్షల్ చెప్పారు. కనుక 84 ఏళ్ళపుడు కృష్ణుడు రథసారధి కావటంలో తప్పులేదన్నాడు. ఆధునిక యుద్ధాలకూ, ప్రాచీన యుద్ధాలకూ తేడా అతను గమనించినట్లు లేదు. మహాభారత యుద్ధంలో కృష్ణుడు తప్ప రథసారధులందరూ చనిపోయారు. కాని కృష్ణుడికి యుద్ధ నియమాలేవీ సోకినట్టు లేదు అని హాప్ కిన్స్ రాశాడు. (E.W. Hopkins, The Social And Military Position of the Ruling Caste in Ancient India, 1972, Varanasi)
కృష్ణుడు రథసారధిగా వృధ్యాప్యంలో పనిచేయటం, అప్పుడే గీతాలాపన చేయటం అసంబద్ధమైన విషయాలు. శీతానాధ్ తత్త్వభూషణ్ అదే విషయాన్ని చెపుతూ క్రీ.పూ. 12వ శతాబ్దంలో ఉన్న వ్యక్తి గీతను చెప్పి ఉండడని అభిప్రాయ పడ్డాడు. (Krishna Ad the Geetha) గీతను బయట నుంచి ప్రవేశ పెట్టినట్లు 1863లో వెబర్ అభిప్రాయపడ్డాడు. అంతేగాక అది కలగా పులగమైన రచన అన్నాడు. (Quest for the Original Geetha, Quoted by G.S. Khair, 1969 Bombay) 1877లో మోనియర్ విలియమ్స్ రాస్తూ గీత ఒక ఆణిముత్యమనీ, ఐతే అది మహాభారతంలో చొప్పించారనీ అన్నాడు. బహుశ బ్రాహ్మణుడో, వైష్ణవుడో, తాత్త్వికుడో ఈ పని చేసి ఉండవచ్చునని అన్నాడు. ఆ తాత్త్వికుడు కృష్ణుడు మాత్రం కాదు. గీతను ఒకవైపున పొగుడుతూనే అందులో అసంబద్ధాలున్నా యన్నాడు. (E.W. Hopkins, Religions of India)
రిచర్డ్ గార్బ్ జర్మనీలో గీతను గురించి రాశాడు. దీనిని కె.ఎస్. ఉపాధ్యాయ ఉదహరించాడు. తొలుత గీత సాంఖ్య సారాంశమనీ, ఉత్తరోత్తరా ఓ వేదాంతి దీనిని విస్తరించి ఉండవచ్చుననీ అన్నాడు. గార్బ్ ఉద్దేశంలో తొలిగీతలో 528 శ్లోకాలున్నాయి. (K.N. Upadhaya : Early Buddhisnm And Bhagavat Geetha)
రుడాల్ఫ్ ఓటో గీతపై తన సిద్ధాంతాలను ప్రకటించాడు. తొలిగీతలో 28 శ్లోకాలే ఉన్నాయంటాడు. తరువాత నెమ్మదిగా చేర్చుకుంటూ వచ్చారంటాడు. (Rudolf Otto : The Original Geetha, London 1936)
గీతాకారుడెవరో మనకెంత తెలుసో ఓటోకి అంతే తెలుసు. అది రాసింది మతకర్త కాదనీ, గొప్ప కవిమాత్రమే అలా సృష్టించగలడనీ అన్నారు.
మహాభారతం కంటే గీత ముందు రాశారనీ, తరువాత 80 శ్లోకాలలో మహాభారతం ప్రస్తావన తెచ్చారనీ ఎస్.సి. రాయ్ అన్నారు. బౌద్ధం కంటె ముందే గీత ఉన్నదని అన్నారు. (The Bhagavat Geetha And Modern Scholarship, Quoted by B. Majundar Krishna in History)
సురేంద్రనాథ్ దాస్ గుప్త బౌద్ధానికి ముందే స్వతంత్ర గ్రంథంగా గీత ఉన్నదనీ, దాన్ని మహాభారతంలోకి తెచ్చారనీ, గీతకున్న పవిత్రత దృష్ట్యా అలా చేశారన్నాడు.
గీతపై పరిశోధించిన ఫ్రాంక్లిన్ ఎడ్గర్ టన్ గీతను సమైక్య రచనగా పేర్కొన్నాడు. భారతంలో ఇది భాగం కాదనీ, తరువాతనే దీన్ని ప్రవేశపెట్టారన్నాడు. గీతను ప్రార్థనా గ్రంథంగా వాడిన గజానన్ శ్రీపతిఖేర్ 26 శతాబ్దాల క్రితం జరిగిన గీతారచన ఇంకా భారతీయుల్లో ప్రతిధ్వనిస్తుందన్నారు. భౌతికవాదానికి దూరంగా, ఆధ్యాత్మిక వాదానికి చేరువగా ఉంచుతుందన్నారు. భగవాన్ కృష్ణుడు గీతను రాయలేదనీ, యుద్ధరంగంలో గద్యంలో జరిగిన సంభాషణంతా తరువాత గీతగా శ్లోకాలలో మలచి జొప్పించారనీ అన్నాడు. మొత్తం ముగ్గురు రచయితలు గీతను పూర్తి చేశారన్నాడు. (G.S. Krishna : Quest for the Original Geetha, Bombay 1969)
ఈ విధంగా చూస్తే గీత రచనల గురించి అనంతంగా చర్చ సాగుతుంది. అందులో ఆలోచనా సమైక్యతే ఉంటే, క్రమబద్ధమైన తత్త్వమే ఉంటే, ఇంత గందరగోళం వచ్చేది కాదు. మహాభారతం ఎంతకలగా పులగమే, గీత కూడా అంతే అని వింటర్ నిజ అన్నాడు.
అధ్యాయం పన్నెండు
ఎప్పుడు రాశారు?
గీత ఎప్పుడు రాసిందీ సరిగా తెలియకపోవటంలో ఆశ్చర్యంలేదు. మనవారికి చారిత్రక జ్ఞానం లేదు. కాలజ్ఞానం లేకపోవటమే అందుకు కారణం. సంవత్సరం అంటే మన వారికి బొత్తిగా అర్థం లేని విషయమే. దేవుళ్ళ దృష్టిలో అది ఒక రోజు మాత్రమే. ఒక జీవిత కాలానికీ మనవారు ప్రాధాన్యత యివ్వలేదు. అనంత గతజన్మలలో, భవిష్యత్తు జన్మలలో యిది ఒక బిందువు మాత్రమే. ఆత్మ, పరమాత్మలో లీనం కావటం అసలు లక్ష్యం. అది జరిగినప్పుడు కాలం ఆగిపోతుంది. కనుక కపిలుడు ఎప్పుడు అన్నాడు. కణాదుడు ఎప్పుడు బోధించాడు, కనిష్కుడు ఎప్పుడు పాలించాడు. కాళిదాసు ఎప్పుడు రచించాడు. అనేవి పట్టించుకోగూడదు. వారంతా క్షణకాలం వెలిగి కాలగర్భంలో కలిసిపోతారు. మనం కాలాతీతంగా సమయానికి మించిపోయి వాస్తవాన్ని చూడాలి. బ్రహ్మ, విష్ణు, శివుడు, రాముడు, కృష్ణుడు, మత్స్య, కూర్మావతారాలు మొదలగు వాటి నుండి బయటపడటం ఎలా? కాలాన్నీ, చరిత్రనూ పట్టించుకునేదెప్పుడు? ప్రాచీన భారత చరిత్రను నిర్దుష్టంగా రాసేదెలా? గీతను ఎవరు, ఎప్పుడు రాశారో నిర్ణయించేదెవరు?
మత గ్రంధాలూ, ఇతిహాసాలూ, ఆధారం లేని చరిత్రలూ నమ్ముకోవలసి వస్తున్నది. బుద్ధుడికి ముందే గీత ఉన్నదని ఊహిస్తున్నారు.
అలా చెప్పే ఎస్.బి.రాయ్, సురేంద్రనాధ్ దాస్ గుప్తాకు ఆధారాలేమిటి? గీతలో బౌద్ధ ప్రస్తావనలేదు. రామాయణం కర్తలకంటే మహాభారతంలో ప్రవేశపెట్టిన వారు తెలివైన వారు. బుద్ధుడు చోరుడని రాముడి నోట పలికించారు. బుద్ధుడికి ముందే రాముడున్న విషయం వారు విస్మరించారు. గీతలో బౌద్ధం ప్రస్తావన లేనప్పటికీ, గీతాశ్లోకాలపై బౌద్ధ ప్రభావం కనిపిస్తున్నది. ఆనాడున్న బ్రాహ్మణ వాదాన్ని దెబ్బకొడుతున్నా, బౌద్ధాన్ని తిప్పి కొట్టాలనే ప్రయత్నంతో గీతారచన సాగింది.
బుద్ధ, ప్రతిబుద్ధ అనే మాటలు ఇతిహాసంలో తరచుదొర్లాయి. సంస్కృతంలో స్ధూప అనే అర్థం గల పదం ఎక్కువసార్లు కనిపించింది. దేశమంతా స్థూపాలతో నిండినట్లు గమనిస్తే బౌద్ధం తరువాతనే మహాభారత రచన సాగినట్లు తెలుస్తుంది.
గీతను ప్రాచీనతకు నెట్టి వేయాలని చూచేవారు గీతలో బ్రహ్మసూత్ర ప్రస్తావనను తెస్తారు. బాదరాయణుడి బ్రహ్మ సూత్రమే గీతలో ఉంటే, బౌద్ధం అనంతరమే భగవద్గీత వచ్చి ఉండాలి. బౌద్ధంలోని క్షణిక వాదాన్నీ, శూన్యవాదాన్నీ బ్రహ్మసూత్రం కాదంటుంది. (సూత్రాలు 18-32 Majundar : Krishna in History and Legend)
బ్రహ్మ సూత్ర ప్రస్తావన అలా ఉంచి గీతలో వేదాంత ప్రస్తావన కూడా ఉన్నది. బౌద్ధం అనంతరం, బ్రహ్మసూత్రం అనంతరం గీత వచ్చిందనటానికి యిదొక ఆధారం.
కె.యల్. ఉపాధ్యాయ గీతకు సంబంధించిన తేదీలూ, వివిధ పండితుల పరస్పర విరుద్ధ అభిప్రాయాలూ ప్రస్తావించి, అవన్నీ సమస్యా పరిష్కారానికి అవరోధాలే తప్ప సహాయకారి కాదన్నాడు. రాధాకృష్ణన్, బాలగంగాధర తిలక్, ఆర్.జి. భండార్కర్ ప్రభృతుల భిన్నాభిప్రాయాలు చూపాడు. (K.L. Upadhya : Early Buddhism and the Bhagavadgeetha, Delhi, 1971)
డి.డి. కోశాంబి రాస్తూ గీతలోని సంస్కృతం క్రీ.త 3వ శతాబ్దానికి చెందినదనీ, కనుక అంతకుముందు ఉన్నదనటానికి వీలులేదన్నాడు. ఇదంతా పరిశీలిస్తే పతంజలి అనంతరం అనేక మంది రచనగా గీత ఆవిర్భవించి ఉంటుంది.
ఈ అభిప్రాయాలను చూచి వైద్య వంటి వారు మండిపడటం సహజం. 84వ ఏట కృష్ణుడు సుదీర్ఘ తాత్విక విషయాన్ని కురుక్షేత్రంలో చెప్పటంలో ఆశ్చర్యం లేదన్నాడు. మొదటి ప్రపంచయుద్ధంలో హైండ్ బర్గ్ 70వ ఏట యుద్ధరంగం నుండి చాలా పెద్ద సమాచారాన్ని పంపించలేదా అన్నాడు.
ఎస్.కె. బెల్వాల్కర్ మహాభారతాన్ని ఆధారంగా చర్చిస్తూ, గీత అందులో భాగం కాదని నిదర్శనాలున్నాయన్నాడు. చాలా తెలివిగల వారెవరో గీతను భారతంలో చేర్చి ఉండాలి. (S.K. Belwalkar : The Cultural Heritage of India Vol. II. Calcutta 1961 Page 136, 137).
అధ్యాయం పదమూడు
పవిత్ర గ్రంధంగా గీత
గీత వేదమూకాదు, వేదాంగమూ కాదు. దీనికి పవిత్రత తరువాత ఎప్పుడో గాని రాలేదు. ఆది శంకరాచార్యుడికి ముందు గీతను ఎవరూ తీవ్రంగా పట్టించుకోలేదు. గ్రంధంలో అంతర్గత ప్రతిభను బట్టిగాక శంకరాచార్యుడు తన కుల, శాఖ ఆసక్తుల దృష్ట్యా శ్రద్ధ వహించారు. వాదంలో అతడు దిట్ట. ఇబ్బందికరమైన మాటలను తనకనుకూలంగా మార్చేశాడు. ఎదుటివారి వాదనలను వారికిబ్బందికరంగా పరిణమించేటట్లు చేసేవాడు. జుగుప్సాకరమైన స్థితిని సానుకూలం చేసుకునేవాడు. నిస్సందేహంగా అతడు ప్రతిభావంతుడు. పాతేయటానికి వీలుగా సమాజాన్ని నిర్మించటంలో అందె వేసినచేయి. శంకరుడు ఆలోచనారంగంలో నాయకత్వం చేపట్టిన తరువాత భారతదేశం వాడిపోయింది. క్రీస్తు తరువాత ఎనిమిదివ శతాబ్దం నుండి శంకరుడి అనంతరం జాతిపతనమయింది. అతడి తరువాత సాహిత్య సృష్టి, విజ్ఞానం వట్టిబోయాయి. శంకరాచార్యుడు గీతను తవ్వితీశాడు. మెరుగుపెట్టాడు. శంకరాచార్యుడి అనంతరం గీతకు అధిపత్యం లభించిందని ఎస్.కె. బెల్వాల్కర్ అన్నాడు. (The Cultural Heritage of India, 1969).
కాలాది ఆచార్యుడు మార్గం చూపిన తరువాత రామానుజుడు, మధ్వుడు, వల్లభుడు గీతను తమ ప్రయోగాలకు వాడుకున్నారు. పతంజలి కాలంలో హిందూమతాన్ని మొదటిసారి తిరగదోడగా దక్షిణాది నుండి వచ్చిన 4 గురు ఆచార్యులూ రెండవసారి తిరగదోడారు. శంకరుడు కేరళనుండీ, రామానుజుడు తమిళనాడు నుండీ, మధ్వుడు కర్నాటక నుండి వల్లభుడు ఆంధ్రనుండి వచ్చారు. ఈ నలుగురూ దేశంలో అంధకారయుగానికి నిర్మాతలయ్యారు. 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకూ ఆదశ కొనసాగింది. స్వాతంత్ర్యానంతరం వారి ప్రభావం పూర్తిగా పోలేదు.
ఆచార్యులు 4గురూ గీతను తమకనుకూలంగా వాడుకున్నారు. అద్వైత గ్రంథంగా శంకరుడూ, విశిష్టాద్వైత రచనగా రామానుజుడూ, ద్వైతంగా మాధ్వుడు, శుద్ధ అద్వైతంగా వల్లభుడూ వాడుకున్నారు. ఈ ఆచార్యుల బాణీలో గీతకు భాష్యాలొచ్చాయి. భాష్యాలపై భాష్యాలొచ్చాయి. చెప్పిందే చెప్పటం హిందూ మతరచనల్లో అనుచానంగా వస్తున్నది. ఆలోచనారాహిత్యానికి అది నిదర్శనం. ఈ భాష్యాలను గురించి తెలుసుకోవాలంటే సురేంద్రనాధ్ దాస్ గుప్త రాసిన భారత తత్త్వ చరిత్ర చూడవచ్చు. అతడి జాబితాలో కూడా ప్రాంతీయ భాషలలో వచ్చిన పుస్తకాలు లేవు. మరాఠీలో జ్ఞానేశ్వరి ప్రస్తావన లేదు. తెలుగులో తిక్కన గీతపై ఉన్నతాభిప్రాయాన్ని వెల్లడించలేదు. భీష్మపర్వంలో కేవలం 35 పద్యాలతో సరిపెట్టి, 700 గీతాశ్లోకాలను కుదించివేశాడు.
అందరూ తిక్కనలు కారు. గీతానువాదాలు నిరంతరంగా వెలువడ్డాయి. వివిధ భాషలలో వచ్చాయి. 1785లో గీత ఇంగ్లీషు అనువాదం వెలువడింది. ఛార్లెస్ విల్ కిన్స్ ఇంగ్లీషు అనువాదాన్ని బాగా ప్రచారంలో పెట్టాడు. కంపెనీ పాలకులు దీనికి రాజపోషణ చేశారు.
గీత ఫ్రెంచి అనువాదం 1787లో వెలువడింది. ఎం.పరాద్ అనువదించాడు. ఐనా, జనంలో గీతాప్రభావం కనిపించలేదు. ఎడ్విన్ ఆర్నాల్డ్ చేసిన స్వేచ్ఛానువాదం గీతకు చాలా ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. దీనికి (The Song Celestial) పేరు పెట్టాడు.
హెన్రీ డేవిడ్ ధోరో గీత అనువాదాలలో ఏది చదివాడో తెలియదుగాని, గీతాస్నానం రోజూ చేస్తానని అన్నాడు. దాని ముందు ప్రపంచ సాహిత్యం అంతా మరుగుజ్జు వంటిదన్నాడు. రాల్ఫ్ వాల్డ్ ఎమర్సన్ గూడా భగవద్గీతను ఆకాశానికెత్తాడు. ఆవిధంగా గీత విదేశాల్లో కూడా ప్రభావాన్ని కనబరిచింది. అనువాదాలూ, భాష్యాలూ, సిద్ధాంతాలూ, స్తుతి పాఠాలూ వస్తూనే వున్నాయి.
గీతను రబ్బరువలె సాగదీసి చెప్పటానికి వీలుగా సంస్కృత భాషవాడారు. గాంధీకి, గాడ్సేకి గూడా గీత పవిత్రగ్రంధమే. ఎటుబడితే అటు వ్యాఖ్యానించటానికి వీలుగా గీత ఉన్నది. సంస్కృతంలో పదాలకు నానా ఆర్ధాలూ, భిన్న అర్ధాలూ ఉండటమే అందుకు కారణం. శ్రీ అనే పదానికి సంపద మొదలు విషం వరకు 20 అర్థాలున్నవి. అలాగే ధర్మం అనే పదానికి మతం మొదలు విల్లంబువరకు 23 అర్థాలున్నాయి. దీని సంయుక్త పదాలు 150 వరకూ ఉన్నవి. వాటిలో మళ్ళీ అనేక ఛాయాబేధాలున్నాయి. గీతలో వచ్చే ధర్మం, ఖర్మం, యోగం ఎన్నో విధాల చిత్రించే అవకాశం ఉన్నది. పురోహిత భాషలన్నింటికీ యీ లక్షణాలున్నాయి. అందులో సంస్కృతానికి ఇంకా ఆధిక్యాలున్నవి. ఈ విషయాన్ని డి.డి. కోశాంబి బాగా వివరించాడు.
గీత ఇంగ్లీషు తెలుగు అనువాదాలు, భాష్యాలతో నాకలాంటి అనుభవం ఉన్నది. దాదాపు 40 ఇంగ్లీషు అనువాదాలూ, 6 తెలుగు అనువాదాలూ నా సేకరణలో ఉన్నాయి. వీటిలో శంకరుడూ, రామానుజుడూ, మధ్వుడు, శ్రీధరుడూ, విల్ కిన్స్, డేవిస్, ఆర్నాల్డ్, తెలాంగ్, బిసెంట్, రాధాకృష్ణన్, ప్రభుపాద, మహేష్ యోగి, చిన్మయానంద, అరవిందో జహనీర్ వంటి వారున్నారు. చదువుతూ పోతే గందరగోళం కూడా పెరుగుతూ పోతుంది.
గీత పేరిట జరిగిన గ్రంధచౌర్యాలను ఉపాధ్యాయ వివరించాడు. ప్రధాన భావాలనేగాక, అనేక భాగాలను ఉపనిషత్తులనుండి గీత స్వీకరించింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయ చాలా మర్యాదగా పేర్కొన్నాడు. (Early Buddhism and the Bhagavad Geetha) ఉపనిషత్తులనుండి యథాతధంగా స్వీకరించినవి 22 చూపారు. ఇతర చోట్ల నుండి అరువు తెచ్చుకున్న భావాలు 13 వరకు చూపాడు. గీతభక్తులు శ్లాఘించే విషయాలలో ఉపనిషత్తుల నుండి కాపీ కొట్టేసినవి 7 చూపాడు. అందుకే కాబోలు గీతను ఉపనిషత్తుల సారాంశం అంటారు. అన్ని మతగ్రంధాలూ, యిలాంటి పనులు చేశాయి. గ్రంధ చౌర్యంలో గీతకు ప్రధమ బహుమతి లభించాలి.
అధ్యాయం పధ్నాలుగు
గీతకు తత్త్వం ఉందా?
పైథాగరస్ మొట్టమొదట తత్త్వం పద ప్రయోగం చేశాడు. ప్లేటో దీనికొక ప్రత్యేక శాఖగా పెంపొందించాడు. వారికి ముందు తత్త్వం లేదని అర్థం కాదు. అప్పుడూ ఉండేది. మానవుడు ఆశ్చర్యంతో, భయంతో, జిజ్ఞాసతో సూర్యోదయం, అస్తమయం ఎందుకు జరుగుతాయనీ, మేఘాలెలా ఏర్పడతాయనీ, వర్షాలెలా కురుస్తాయనీ, వరదలూ, తుపానులు, పిడుగులూ, మెరుపులూ దైవాగ్రహానికి సూచనలూ అనీ, చావుబ్రతుకులు అన్వేషణ, ప్రశ్నించటం మొదలు పెట్టినప్పటి నుండీ తత్వం పుట్టింది.
తొలుత తత్త్వంలో అన్ని శాఖలూ ఉండేవి. 18వ శతాబ్దం వరకూ ఈ ధోరణి అమలులో ఉన్నది. ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వంలో అందరినీ తాత్వ్తికులని పిలిచారు. తత్త్వంగా ఒక ప్రత్యేక క్రమశిక్షణను తరువాత రూపొందించారు. జ్ఞానం అంతటినీ స్వీకరించి, అర్థాన్ని సమకూర్చి జీవితానికొక గమ్యం, ప్రయోజనం చేకూర్చడాన్ని తత్త్వం ఉద్దేశించింది. జ్ఞానంగాని, అనుభవంగానీ జడప్రాయంకాదు. అవి పెరుగుతూ విస్తరిస్తూ ఉంటాయి. తత్త్వం కూడా అలాగే పెంపొందుతుంది. కాలక్రమేణా మార్పుల కనుగుణంగా తత్త్వం సాగిపోతుంది. తత్త్వం కేవలం ప్రపంచాన్ని విడమరచి చెప్పటమేగాక, మార్చుకుంటూ పోవాలని మార్క్స్ అన్నాడు.
భారతదేశంలో తత్త్వాన్ని దర్శనం అంటున్నారు. ప్రత్యక్షంగా చూడటమని దీని అర్థం. దేనిని చూడటం అంటే, ఆత్మ రూపాన్ని వ్యక్తిగా, పరమాత్మగా చూడటమన్నారు. ఆవిధంగా తత్త్వం దేశంలో గాడి తప్పింది. బాహ్యప్రపంచాన్ని పరిశీలించకుండా, హేతు బద్ధంగా ఆలోచించకుండా, శాస్ర్తీయ పరిశోధనలను గమనించకుండా, మానవుడికీ మానవుడికీ సంబంధాలు చెప్పటం కష్టం. ప్రపంచమంతా తత్త్వానికి చెందినదని విల్ డ్యూ రాంట్ అన్నాడు. (Willdurant : The Pleasures of Philosophy, Page 11). విశ్వమంతా భ్రాంతి అనుకుంటే తత్త్వం విజ్ఞానం లేని తత్త్వం శక్తిహీనమైనదని విల్ డ్యూ రాంట్ అన్నాడు. భారతీయ త్తత్వం విజ్ఞానాన్ని దూరంగా పెడుతుంది. ఆత్మ ఒకటే, ప్రపంచం అంతా మాయ అంటుంది. కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, ఊపిరి బిగబట్టి ఇంద్రియాలను పనిచేయనివ్వకుండా, మనసును స్థంభింపచేస్తే, ఆత్మ పరమాత్మలను ప్రత్యక్షంగా చూడవచ్చునంటుంది. వివిధ వేదాంత దర్శనాలు చెప్పేది ఇదే. ఇది నైతిక పతనానికీ, మానసిక రుగ్మతలకూ దారితీస్తుంది.
భగవద్గీతను తత్త్వం అనే కంటే మత ప్రమాణంగా భావించాలని రాధాకృష్ణన్ రాశాడు. (The Bhagavadgeetha, London 1956) గీతలో ఉన్నతత్త్వం ద్వితీయ స్థానానికి చెందినట్లు అతడు సూచించాడు. వాస్తవానికి అలాంటిదేమీ లేదు.
సందేహించడం తత్త్వం కావచ్చు కాని, పిడివాదం కాదు. గీత ఏవిధంగా చూచినా తాత్త్వికం కాదు. అందులో పిడివాదాలూ నిండిపోయి ఉన్నాయి. అది మొండివాదాల నిఘంటువు, ఆధ్యాత్మిక విద్య, మాయ, మంత్రం, యుగధర్మం వంటి పిడివాదనలు అందులో కనిపిస్తాయి. గీత నమ్మకాల పుట్ట అని హాప్ కిన్స్ అన్నాడు. నిర్ధారణ లేని ధోరణి, దాటవేసే పద్ధతి గీతలో హాప్ కిన్స్ చూసాడు. (E.W. Hopkins, Madras, 1953).
అరుణ్ శౌరి ఈ విషయంలో హాప్ కిన్స్ అభిప్రాయాలతో ఏకీభవించాడు. (Arun Showrie : Hinduism, Essence and Consequence : 1979).
గీతా సంప్రదాయంలో మునిగితేలిన రాధాకృష్ణన్ అయోమయం మధ్య అర్ధాన్నీ క్రమత్వాన్నీ చూచాడు. మానవ స్వభావం అంతా సమన్వయీకరణగా గీతలో కనిపిస్తుందన్నారు. రుషికీ, ఆటవికుడికీ మధ్య తాత్త్వికుడు ఎక్కడ యి ముడుతాడో ఇంకా రాధాకృష్ణ చెప్పాలి. గీతలో భిన్న రీతుల్ని సమన్వయించిన తీరు మనకు చూపటానికి రాధాకృష్ణ ప్రయత్నించాడు.
డి.ఎస్.శర్మ గీతలో ఎలాంటి సమైక్యతా లేదన్నాడు. క్రమత్వం చూడలేమన్నాడు. కాని, గీతను దివ్య కవిత్వమయంగా చూచాడు. పర్వతాలూ, సముద్రాలూ, అడవులూ ఎలా క్రమం లేనివో, గీత కూడా అంతే అన్నాడు. అది మతం, తత్త్వం కాదనీ, కవితా గానం అనీ పేర్కొన్నాడు. వీరిరువురిలో మనం ఎవరిని స్వీకరించాలి.
గీత అనంత ప్రశ్నలకూ దారి తీస్తుంది. అందులో పిడివాదం అలాంటిది. ఈ విషయాలనే అరవిందశర్మ అనేక ప్రశ్నల రూపంగా చూపాడు. నిజమైన గీత ఏదో చూపగలరా. లేదు. ప్రధాన ప్రశ్నలను దాటవేసే తీరులో గీత పయనిస్తుంది. దేవుడు ఒకప్పుడు వ్యక్తిగతమనీ, మరొకప్పుడు కాదనీ అంటుంది. (అధ్యాయం 9-17, 18) దేవుడు బ్రహ్మపదార్థం అంటుంది. (14వ అధ్యాయం, 27) మానవుడిలో దేవుడికి ఆసక్తి ఉందా. లేక పట్టించుకోడా. అవును, కాదు అంటుంది. (అధ్యాయం 9-22, అధ్యాయం 11-32,33,34) ఒక క్షణంలో ప్రేమ, దయ, క్షమాభిక్ష చూపిన దేవుడు, మరుక్షణంలో పగసాధిస్తాడు. ప్రపంచం వాస్తవమా. అవును. (అధ్యాయం 7-4) కాదు. అదంతా భ్రమ. (అధ్యాయం 7-14) నీవేమి చేయాలో, చేయగూడదో వేదాలు నిర్ణయిస్తాయి. (అధ్యాయం 16-24) కాదు. నీవు వేదాధికారం నుండి స్వేచ్ఛగా పయనించాలి. (అధ్యాయం 2-45, 46) యజ్ఞాలు కావాలి. అవును. మరోచోట అవసరం లేదు. పూజలు చాలు అంటుంది. ఇలా అనంతంగా పరస్పర వైరుధ్యాలు సాగుతాయి.
గీతాభిమానులు ఈ వైరుధ్యాలను కేవలం పైకి కనిపించేవిగా భావించి వాస్తవం కాదని కొట్టిపారేస్తారు. వారంతా కావాలని కళ్ళు మూసుకుంటున్నారు. ఒకవైపు అహింసను పేర్కొంటూ మరొకవైపు యుద్ధాన్ని పురికొల్పారని డి.డి. కొశాంబి రాశాడు. (Myth and Reality, Bombay, 1962). ఇది కూడా పైకి కన్పించే విరుద్ధత్వమైనా. కె.టి. తెలాంగ్ గీతక్రమం లేని రచన అనీ, ఈ విషయంలో ఇది ప్రాచీన ఉపనిషత్తులకు పోలిందనీ అన్నారు. (K.T. Telang, The Bhagavad Geetha with the Sanastugatiya and Anugita Oxford, 1908).
అప్పుడప్పుడూ వేదాలూ, వేదక్రతువులపై గీతలో అన్న విసురులు చూపి మతంపై తిరుగుబాటుగా కొందరు చూపుతున్నారు. అసలు విషయమేమంటే ఎవరికేది కావాలో అది చెప్పి అందరినీ వలలో వేసుకోటమే గీత చేసిన పని. ఫ్రాంక్లిన్ ఎడ్గర్టన్ అదే రాశాడు.
కలగా పులగం అనేది గీతకు ప్రత్యేక లక్షణం. భిన్న ఆలోచనా స్రవంతులను సరిదిద్ది సమన్వయ పరుస్తున్నదని రాధాకృష్ణ అన్నాడు. అది అడ్డగోలుగా పయనించటమే. గతంలోనూ, నేడూ దేశంలో ఇదే జరుగుతున్నది. కలగా పులగంలో సమన్వయం లేదు. భిన్న ఆధారాలనుండి విభిన్న భావాలు స్వీకరించి ఒకే తీరులో సమన్వయీకరంచాలనటం కుదిరే పని కాదు. అది ద్వంద్వ మనస్తత్వానికీ, దోషపూరిత జీవితానికీ దారితీస్తుంది. భారతీయ చింతనాపరులు అలాంటి ఊబిలోనే పడ్డారు. గీతలోనూ ఆలక్షణాలున్నాయి. గీతకు నిర్దష్టత లేదు. తత్త్వం, మతం, నీతి సమాజశాస్త్రాలలో గీతస్థానం ఎక్కడా కచ్చితంగా నిలబడదు.
ఒక్క విషయం మాత్రం గీతలో నిర్ధిష్టంగా చెప్పవచ్చు. అదే లొంగుబాటు. మనసునూ, ఇచ్ఛనూ, స్వేచ్ఛనూ, అన్నిటినీ పూర్తిగా తనకు లొంగుబాటు చేయమని చెప్పటమే గీత సారాంశం. నేను పోరాడను అని చెప్పిన అర్జునుడు నీవు చెప్పినట్లే చేస్తానని ముగిస్తాడు. అందులోనే గీత సారాంశమున్నది. తిరుగుబాటు నుండి లొంగుబాటుకూ, స్వేచ్ఛ నుండి బానిసత్వానికి గీత దారిచూపింది.
మనిషి ఎందుకు లొంగుతాడు, లొంగకుండా ఉండటం ఎంత కష్టం అనే విషయాన్ని ఎరిక్ ఫ్రాం చక్కగా వివరించాడు. రాజ్యానికీ, మతానికీ, ప్రజాభిప్రా యానికీ లొంగి ఉంటే క్షేమం. ఎవరికి లొంగి ఉన్నామనేది ప్రధానం కాదు. ఒత్తిడిని ప్రయోగించే సంస్థ ఏదైనా సర్వశక్తి వంతంగా రూపొందుతుంది. అందులో భాగంగా లొంగిపోయిన వ్యక్తి తానూ శక్తివంతుడినే అనుకుంటాడు. తన కోసం నిర్ణయాలు చేసే సంస్థ బలీయమైనది. కనుక తానేమీ దోషం చేయలేదనుకొంటాడు. (Eric Fromm : See A Matter of Life, ed. By Clara Urquhart, Boston, 1963).
కృష్ణుడు తనను సర్వాంతర్యామిగా, సర్వశక్తివంతుడుగా చెప్పుకొని అర్జునుడితో పాటు అందరినీ తనకు లొంగిపొమ్మన్నాడు. ప్రపంచ మత సాహిత్యంలో అంత ఆడంబరంగా గొప్పలు చెప్పుకున్న ధోరణి మరి ఎక్కడా కనిపించదు. తన శక్తిని శంకించిన వారినందరినీ ఖండించాడు. అలాంటి తత్త్వం అత్యున్నతమైందని మన నాయకులు పొగిడారు. మనదేశం శతాబ్దాలుగా లొంగిపోయిందంటే ఆశ్చర్యమేమున్నది. ఇరానియాన్లూ, గ్రీకులూ, బాక్టీరియన్లూ, కుషాణులూ, హుణులూ, శాక్యులూ, అరబ్బులూ, తురుష్కులూ, మొగలులూ, ఆఫ్ఘన్లూ, పోర్చుగీస్, ఫ్రెంచి, బ్రిటిషువారికి భారత జాతి లొంగిపోయింది. 1962లో చైనావారి తన్నులకు గురయింది. ఇదంతా లొంగుబాటు తత్త్వ సారాంశమే.
భారతదేశం ఏనాడైనా నిశిత పరిశీలనకు పూనుకుంటుందా. వివేచనతో ఆలోచిస్తుందా. మూఢనమ్మకాలూ, సంప్రదాయాలూ, పెత్తందారీ తనాన్ని ప్రశ్నిస్తుందా. గీతభజన చేస్తూ కృష్ణుడిని స్తుతించినంత కాలం ఇది జరగదు.
అధ్యాయం పదిహేను
గీత నీతి
నీతి శాస్ర్తం విశాలమైనది. లోతుపాతులతో కూడినది. విశ్వవ్యాప్తమైనది. ప్రవర్తన నియామావళి కంటె నీతి శాస్త్ర పరిధి పెద్దది గ్రీస్ లో పెంపొందినట్లుగా భారతదేశంలో నీతిశాస్ర్తం పెంపొందలేదు. గౌతమ బుద్ధుడు మతానికి నీతిప్రాతిపదిక అందించాడు. కాని, మహాయాన, తదితర శాఖలు నీతి ప్రాతిపదికను తగ్గించివేశాయి. నీతి శాస్ర్తం ప్రధానంగా సమాజపరమైనదని బెర్ర్డాండ్ రసెల్ అన్నారు. (Bertrand Russell : An Outline of Philosophy, London, 1948). సామాజికంగా పొందిన ఉన్నచోట నీతి విధానం పెంపొందుతుంది. కులాలూ, ఉపకులాల వలన మనకది లేకుండా పోయింది. సామాజిక ప్రవృత్తి కూడా మనకు లోపించింది. ఎప్పుడైనా ఉంటే అది కాస్త కర్మ, పునర్జన్మ వలన బలహీన పడింది. వేదాంతం యింకా కుంటుపరచింది. ముక్తి, మోక్షం, నిర్వాణం అంతిమ లక్ష్యాలుగా నీతిని చంపేశాయి. జన్మల బంధం నుండి విముక్తి చెందాలంటే కుమారుడూ, భార్య, కుటుంబం బంధాలు వదలుకోవాలని కృష్ణుడు బోధించాడు. (Sankaracharya, Bhagavadgeetha with commentary, transleted by Alladi Mahadevasastry, Madras, 1979). ఈ విషయంలో ఎలాంటి సందేహం మిగల్చకుండా శంకరాచార్య భాష్యం చెప్పాడు. భగవంతుని పట్ల లీనం కావలసిన దశ పొందాలంటే సమాజంలో మనుషులకు దూరంగా ఉండాలన్నాడు. ఈ దారుణ పంథాను గురించి రంగనాధనంద యిలా చెప్పాడు. రెండు వేల సంవత్సరాలనుండీ గీతలో కృష్ణుడు బోధించినట్లు హేతుబద్ధమైన విశ్వజనీన ఆధ్యాత్మిక పంథాను అనుసరిస్తే నేటి గందరగోళ పరిస్థితులకు మార్గాంతరంగా ఉంటుంది. గీతాబోధన ప్రపంచమానవాళికి చిరకాల ప్రయోజనాన్ని అందించాలని కోరుకుందాం. (Swami Ranganadhananada : Studies in the Geetaed M.D. Paradkar Bombay, 1970).
అయిష్టంగా ఉన్న అర్జునుడిని ఆయుధాలు చేపట్టి చంపమని పురికొల్పిన గీత ప్రపంచశాంతికేమి దోహదం చేస్తుంది? అర్జునుడికి స్వేచ్ఛ లేదనీ, అతడు గురువుతో సహా అందరినీ చంపివేయాలనీ, కృష్ణుడు వారినిముందే చంపేశాడని బోధించిన గీత స్వేచ్ఛను ఎలా పెంపొందజేస్తుంది? అందులోని సత్యాన్ని రంగనాధానంద మాత్రమే గ్రహించగలడు. శుశ్రువ రాసిన గీతావ్యాఖ్యానం నాకు బొత్తిగా అర్ధం కాలేదు. (Susruva : The Esoteric Gospel of Geetha, Madras, 1978).
గీతలోని నీతిని గురించి జి. డబ్ల్యు కావీశ్వర్ రాశాడు. మానవాళి ముందు ఆచరణకు వుపక్రమించివలసిన లక్ష్యాన్ని గీత చూపినట్లు పేర్కొన్నారు. బహుశ కర్మ యోగాన్నిదృష్టిలో పెట్టుకొని ఆయన ఈమాటలని ఉంటాడు. భాషకూ, మనసుకూ అందని విషయాలను రాయటం మూర్ఖత్వమని కావీశ్వర్ గ్రహించి ఉండవలసింది. శంకరుడు, రామానుజుడు, మధ్వుడు, ఇతర వేదాంతులను పాశ్చాత్య తాత్విక ఆచార్యులతో పోలుస్తుంటారు. ఎ.ఎస్. శర్మ బట్లర్ నీతిశాస్త్రం భగవద్గీతలో కార్యాచరణతో పోల్చిరాశాడు. మరొక ఆచార్యుడు బి.యస్.గస్ఖ్ వాల్ కాంట్ నూ, గీతనూ పోల్చిరాశాడు. బహుళ గీతను చూచి జర్మనీ తత్త్వ వేత్త తమ ఆలోచనను రూపొందించుకొని ఉంటాడన్నాడు. (B.S. Ganchkwal : The concept of Perfection in the Teachings of Kant and Geetha, Delhi 1967) కాంట్ 1804లో చనిపోయాడు. జర్మనీలో 1908లో ఫ్రెడరిక్ ష్రీగల్ గీతలోని కొన్ని భాగాలను అనువదించి ప్రస్తావించాడు. అలాంటి గీతాప్రభావం కాంట్ పై ఉన్నదనటం అర్థం లేనిది. అలాగే ఎస్.ఎస్. రాఘవాచార్య గీతను విశిష్ఠాద్వైత గ్రంధంగా పేర్కొన్నాడు. ప్రతి మానవుడినీ లక్ష్యంగా పరిగణించాలని కాంట్ చెప్పిన తత్త్వం గీతకే మాత్రం పొసగడు. గీతపై ఇలా వివిధ రచనలు వెలువడుతూనే వచ్చాయి. పి.ఎన్. శ్రీనివాసాచారి, హెచ్.వి. దివాతియా గ్రంధాలు రాశారు. బ్రిటిష్ కాలంలోనూ, స్వతంత్ర భారతంలోనూ అనుభవం గల దివాతియా గీతలోని నీతి అవగాహన చేసుకోటానికి వీలులేనిదని రాశాడు. గీతపై ఎవరు ఎలా వ్యాఖ్యానం చేసినా నీతికి సంబంధించిన గీత చాలా దూరమనేది స్పష్టం.
అశోకుడి నుండి మార్క్స్, ఏంగెల్స్ వరకూ అనేక నీతివిధానాలు వచ్చాయి. విల్డ్యురాంట్ వీటన్నిటినీ మూడు రీతులుగా వర్గీకరించాడు. 1. బుద్దుడూ, జోస్ ఫ్ చెప్పినది, 2. మెకవల్లీ, నీషే ప్రవచించినది,. 3. సోక్రటీస్, ప్లేటో, ఆరిస్టోటిల్ చెప్పిన తీరు ఇందులో గీతాకారుడు అనుకొంటున్న కృష్ణుడు నీతిలో మెకవిల్లీ, నీషేలను పుణికిపుచ్చుకొన్నాడు. మెకవెల్లీ నిరంకుశ పాలనను కోరాడు. గట్టి రాజ్యపాలన అభిలషించాడు. నీషే సూపర్ మాన్ కావాలన్నాడు. లక్ష్యాన్ని సాధించటానికి మార్గం ఎలాంటిదైనా వారు పట్టించుకోలేదు. బలం గల వారిదే రాజ్యం అనే ధోరణిలో చెప్పారు. కృష్ణుడి ధోరణికూడా అదే, మహాభారతం, పురాణాలూ చూపుతున్న కృష్ణుడిలో ఆధోరణి ఉండవచ్చుకాని, గీతలోని కృష్ణుడిలో అలాంటి లక్షణాలు లేవని కొందరంటారు. నా దృష్టిలో ఆలక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. యదుకుల నాయకుడైన కృష్ణుడు నిరంకుశపాలనలోనే ఉన్నాడు. ప్రజాస్వామ్య శక్తులకు అతడు మద్దత్తు ఎందుకు యివ్వలేకపోయాడు? సామ్రాజ్యవాదానికి తొలిమెట్టుగా రాజరికాన్నే పురికొల్పాడు. నేనేరాజునని ప్రకటించుకున్నాడు. అతడికున్న పలుకుబడితో పాండవ కౌరవుల మధ్య సామరస్యం సాధించవచ్చు. హస్తినా పురానికి సంధి రాయబారిగా వెళ్ళి అనంగీకార కోర్కెలను ముందుపెట్టాడు. ఐదు ఊళ్ళిస్తే పాండవులు సంధికి ఒప్పుకుంటారని చాలా మంది భావించారు. కౌరవులు పరువు గలవారిగా పాండవులతో సంధి నిమిత్తం తన పాలును వదులుకోమని ద్రోణుణ్ణి అడగలేకపోయారు. కృష్ణుడికా విషయం తెలుసు. ఐనా కౌరవులు గర్విష్టులని చిత్రించారు.
కృష్ణుడు యుద్ధంలో తటస్థవైఖరి నటించాడు. వాస్తవానికి పోరాటానికి మించిన పాత్ర వహించాడు. అర్జునుడు ఉపసంహరించుకోటానికి అంగీకరిస్తే, యుద్ధం సాగేదికాదు. అర్జునుడి పై అన్ని విధాలైన ఎత్తుగడలూ ప్రయోగించాడు. గెలిస్తే రాజ్యం వస్తుందనీ, విఫలమైతే స్వర్గం లభిస్తుందనీ చెప్పాడు. అర్జునుడిని అతడి మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించమనటం నీతివంతుడి లక్షణం కాదు. పైగా అందరినీ తాను ముందే చంపేసాననీ, నీవు చంపబోతున్నానుకోటం అజ్ఞానం అనీ చెప్పి విశ్వరూపం చూపాడు. అర్జునుడిని మోహనిద్రలో పడవేశాడు. అందుకే ప్రేమనాధ్ బజాజ్ గీతను గురించి అదొక హత్యాకాండగా పేర్కొన్నాడు. (Premnath Bajaj : the Role of the Bhagavadgeetha in Indian History, Delhi 1975).
డి.డి. కొశాంబి గీతలోని నీతిని గురించి రాస్తూ, నాలో విశ్వసం ఉంటే పాపాలన్నీ క్షమించబడతాయనీ, నీ విధి ప్రకారం సోదరులనైనా చంపేయాలని గీత బోధించిందన్నాడు.
గీతాభిమానులకు యివ న్నీ పట్టవు. ఉపనిషత్తుల సారాంశమేగాక వాటిని ప్రపంచంలోకి తెచ్చింది గీతమాత్రమే నంటారు. పోరాడమని గీత భోదించటంలోనూ అందిక పొందక లేదని అరుణ్ శౌరి రాశాడు. ఈ పోరాటాలు ప్రపంచాన్ని మెరుగు పరచటానికి కాదు. ఆత్మను పరమాత్మలో లీనం చేయటానికి మాత్రమే.
నా దృష్టిలో ఆత్మ పరమాత్మలో లీనం అనేది సంకుచితం, స్వార్ధపూరితం, నీచం, లీనం కావల్సింది బ్రతుకుతోనూ, మానవాళితోనూ మాత్రమే. నేడు మనమున్న స్థితికి రావటానికి ఎన్నో తరాలవారు పుట్టిగిట్టారు. గతతరాలకు మనం రుణపడిఉన్నాం. ఈ గత తరాల సంపదను భావి తరాలకు అందించటం మన కర్తవ్యం. ఇందులో చేతనైనంత కృషి చేయాలి.
గీతను గమనిస్తే స్వార్ధం లేకుండా చర్యకుపూనుకోవాలనటం ఔన్నత్యమే కావచ్చు కాని, ఫలితాలు ఎలా ఉంటాయో పట్టించుకోకుండా పనులు చేయటం చాలా తప్పు. చేసిన పని ఫలితంగా దోషాలు రాబోతున్నాయని తెలిస్తే ఆ పని చేపట్టకూడదు. కులవృత్తిగా, ప్రవృత్తిగా పనిచేయటం మందలో ఆలోచనా రహితుడి ధోరణి మాత్రమే. అరమరికలు లేకుండా చంపేయమనీ, అది కుల వృత్తి ధర్మమనీ చెప్పటం కంటే ఘోరం మరొకటి లేదు.
గీత నీతి మెకవెల్లీ, నీషేలను పోలినది. మెకవెల్లీ చివరిదశలో పదవికి దూరంగా కారాగారంలో బతికాడు. నీషే పిచ్చాసుపత్రిలో మరణించాడు. కృష్ణుడు ఒక ఆదివాసి విలుగాని చేతిలో హతమాయ్యాడు. వీటికి ప్రాధాన్యత లేకపోలేదు.
16వ అధ్యాయం
గీతలో సామాజిక రీతి
సామాజిక శాస్ర్తం సమాజాన్ని అధ్యయనం చేసే విధానం. అది ఆత్మజ్ఞానం కాదు. భగవద్గీత-హిందూ సమాజ శాస్త్రం అనే పుస్తకాన్ని ఎమ్.కె. శ్రావణ్ రాశాడు. అందులో అట్టమీద తప్ప సమాజ విజ్ఞాన ప్రస్తావన లోపల ఎక్కడా లేదు. సుప్రసిద్ధ సమాజశాస్త్రజ్ఞుల పేర్లు తెలిసినట్లే లేవు. డర్క్ హైమ్, లాల్, బెంధామ్, కామ్టే, మిల్, స్పెన్స్ ర్, మార్క్స్, ఏంగెల్స్ గురించి విన్నట్లే లేదు. సమాజం, సమాజశాస్త్రం అతని పరిధిలోనే లేవు. కుల ప్రస్తావన మినహాయిస్తే, సమాజ విజ్ఞానాన్ని పట్టించుకున్నట్లే లేదు. ఆత్మ, బ్రహ్మ, ధర్మ, కుర్మ, మాయ, యోగ, వేదాంత-ఎంతసేపూ, అదే గొడవ. గీత భక్తి సారాంశమని రాశాడు. (M.K. Sravan : Bhagavadgeetha And The Hindu Sociology, Delhi, 1977) అలాంటప్పుడు గీతలో సమాజశాస్ర్తం వుంది అని ఎందుకు పేర్కొన్నట్లు?
ఒక పేజిలో చెప్పింది పక్క పేజీలో శ్రావణ్ మర్చిపోతున్నాడు. బీష్ముడూ, కృష్ణుడూ క్షత్రియులైనప్పటికి, బ్రాహణులు వారిని తమవర్గంగా, ఉపాధ్యాయలుగా భావించారు. మరోచోట యుధిష్టిరుడు బ్రాహ్మణుల పాదాలు కడిగినట్లు చెప్పాడు. కృష్ణుడు శాంతి సమయంలో వలె యుద్ధంలో కూడా నెమ్మదిగానే ఉండేవాడన్నాడు. రెండు పర్యాయాలు కురుక్షేత్రయుద్ధంలో కృష్ణుడు రధం దిగి భీష్ముణ్ణి ఎదుర్కోబోగా అర్జునుడు వారించిన విషయం మరిచిపోయినట్లున్నాడు. శ్రావణ్కు తెలియకపోయినా గీతకు సొంత సమాజశాస్త్రం ఉన్నది. గుణాన్నీ, పనిని బట్టి నాలుగు వర్ణాలూ నేనే సృష్టించానని చెప్పటంలోనే సారాంశం ఉన్నది. నాలుగు వర్ణాల బదులు నాలుగు కులాలని అల్లాడి మహాదేవశాస్త్రి తన అనువాద గ్రంధంలో రాశాడు. (Shankaracharya, The Bhagavadgeetha with the commentary, tr. by Alladi Mahadeva Sastry, 1979) జాన్ డేవిడ్ అనువాదం కూడా నాలుగు కులాల్నే సూచిస్తున్నది. కృష్ణుడు పేర్కొన్న నాల్గు విధాలైన సృష్టి నాలుగు కులాలకు చెందినది. హిందువు కులంలో పుడతాడు, అందులో నివశిస్తాడు, గతిస్తాడు. బ్రతికుండగా పాటించిన కులధర్మాన్ని బట్టే జన్మాంతరం కూడా ఆధారపడి ఉంటుంది. కులవిధానంలో పైకి పోయే అవకాశం లేదు. అదే, వర్గ సమాజంలో కూలివాడి కుమారుడు ఎంత పెద్ద స్థానానికైనా ఎదగవచ్చు.
కృష్ణుడు కులసమాజసృష్టికి తానే బాధ్యుడనని ఒప్పుకున్నాడు. గతజన్మల పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో కులనిర్ధారణ అవుతుంది. ఇలా చెప్పటంలో కృష్ణుడు మాటల గారడీ చూపాడు.
గీతా భాష్యకారులు కులం దైవసృష్టి, కనుక పవిత్రమయింది అంటున్నారు. దేవుడు స్థాపించిన సాంఘిక వ్యవస్థను కూలద్రోయటమే కులవిమర్శకుల పని అంటున్నారు. ఈ వ్యవస్థ హెచ్చుతగ్గులతో కూడినది. దేవుడు నామమాత్రంగానే ఈ విధానాన్ని సృష్టించినా, పూర్వజన్మల కర్మ ఫలితమే యిందుకు కారణం, మనిషి స్వాభావిక అభిరుచుల్నీ బట్టి కులాన్ని నిర్ధారించటం దేవుడి పని. పుట్టకముందే ఈ స్వభావం ఎలా తెలుస్తున్నదీ అంటే దేవుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి గనుక, తల్లి గర్భంలోకి రాకముందే మానవుడి స్వభావాన్ని నిర్ణయిస్తాడు. కృష్ణుడు అర్జునుడిలో నీ గత జన్మలన్నీ నీకు తెలియవు గాని, నాకు తెలుసు అంటాడు.
కులవిధానంలో ఎలాంటి దోషాలున్నా క్షమించే గుణం, ప్రేమ, దయ భగవంతునికున్నాయి. ఈ విషయం శంకరాచార్యుడు చాలా తెలివిగా చెప్పాడు.
నాలో శరణుపొందే వారందరూ ఉన్నత లక్ష్యాన్ని చేరుకుంటారు. స్త్రీలూ, వైశ్యూలూ, శూద్రులూ పాపయోనికి పుట్టినప్పటికీ, నావలన విముక్తులవుతారు. భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని ఒకపట్టాన విస్మరించటానికి వీలులేదు. శంకరా చార్యుడు అతి తెలివిగా దీనిని దాటవేశాడు. హిందూసమాజంలో 90 శాతానికి వర్తించే శ్లోకమిది. అందులో 50శాతం స్త్రీలకు చెందినది. వైశ్రులూ, శూద్రులూ కలిపి 40 శాతం ఉన్నారు. అంటరానివారి ప్రస్తావన గీతలో లేదు. వీరంతా పాపజన్ములేనా. పాపయోనికి పుట్టారనేమాటను శంకరాచార్యుడు కావాలని దాటేశాడు. పవిత్రబ్రాహ్మణులంతా, రాజర్షులంతా తనను ఆరాధిస్తారని కృష్ణుడు అన్నాడు. ఆయన దృష్టిలో ఆ కొద్దిమందే పవిత్రులు. తెల్లవారు కానివారంతా తక్కువవారని కిప్లింగ్ అన్నట్లే గీతకూడా చులకన భావం చూపిస్తున్నది.
జీవనరంగంలో ఉన్నతస్థాయికి చేరుకున్న రాజులూ, పురోహితులూ సంపదను అదుపులో పెడుతూ సుఖాలనుభవిస్తున్నారు. ఆత్మ, పరమాత్మల సమ్మేళనానికి ప్రయత్నిస్తూ లోకంలో గడుపుతున్నారు. అణగారిపోయిన ప్రజల ఆగ్రహానికి రాజులూ, బ్రాహ్మణులూ గురికాకుండా ఉండాలని యిలాంటి మాటలు చెప్పారు.
పాపయోని నుండి పుట్టినవారిలో స్త్రీలూ, వర్తకులూ, శ్రామికులూ ఉండటం, వీరు అత్యధిక సంఖ్యాకులు కావటం గమనిస్తే, గీతాప్రవచనం క్షమించరానిది అని చిన్మయానంద అన్నారు. దేవుడు చెప్పినా సరే అంగీకరించరాదన్నాడు. (Swami Chinmayananda Bhagavadgeetha, 1979, Madras Chapters : 7, 8, 9, Page : 158) ఐనా ఏమో కుంటిసాకులతో చిన్మయానంద తప్పుకుపోయాడు. రాధాకృష్ణ కూడా ఈ మాటలపై వ్యాఖ్యానిస్తూ నాటి కాల పరిస్థితులను బట్టి చూడాలేగాని, స్త్రీలనూ శూద్రులనూ వేదాలకు దూరం చేయాలనే ఉద్దేశ్యం లేదన్నాడు. గీత ప్రేమ సందేశం అందరికీ వర్తిస్తుందన్నారు. జాన్ డేవిడ్ కూడా ఇలాగే వ్యాఖ్యానించటం చూస్తే ఆశ్చర్యం వేసింది. జవహార్ లాల్ నెహ్రూకు చిన్నతనంలో ఉపాధ్యాయుడుగా ఉన్న ఎఫ్.టి. బ్రూక్స్ కూడా గీతను ఈ విషయంలో ఏదో విధంగా సమర్ధించాడు. కీన్ బోల్, ఎ,జె,బాన్, శకుంతలారావు, శాస్త్రి, అనిబిసెంట్, భగవాన్ దాస్, పరమానంద, వీరేశ్వరానంద, శివానంద, ఆర్ధర్ ఆస్ బోర్నో, జి.వి. కులకర్ణి, నిహాల్ చంద్ వైశ్, పి.లాల్ తమ గీతాభాష్యాలలో ఇంచుమించు శంకరాచార్యుని అనువాదాన్నే పాటించారు. మిగిలిన వారు చాలామంది పాపయోనికి పుట్టినవారిని గురించి అనువాదాన్ని తప్పించటమో, ఏదో ఒక విధంగా పక్కదారులలో పోవటమో చేశారు. శీతానాధ్ తత్త్వ భూషణ్ గూడా అలా చేయటం ఆశ్చర్యకరం. ఈ శ్లోకాన్ని చూచి కలవరపడిన దిలీప్ కుమార్ రాయ్ అసలే వదిలేసాడు. ఎడ్విన్ ఆర్నాల్డ్ సూక్ష్మంగా ఏదో చెప్పబోయాడు. ఎ.ఎస్.పి. అయ్యర్ బాధ్యతా రహితంగా ఈ శ్లోకాన్ని అనువదించి భాష్యం చెప్పాడు. పాపయోని అనటానికి బదులు పాపాత్ములైన స్త్రీలకు పుట్టినవారు అన్నాడు.
నీ కులధర్మం నుండి ఎన్నడూ తప్పుకోరాదని గీత బోధిస్తున్నది. కులవృత్తిలో అభిరుచి లేకపోయినా అంటిపెట్టుకోవాలంటున్నది. నీస్వభావాన్ని నిర్ణయించటంలో కృష్ణుడి కంటే నీకు ఎక్కువ తెలుసా అంటున్నది. స్వభావాన్ని బట్టి కులం వస్తున్నది గనుక, గత జన్మల చర్యలను బట్టి కులనిర్ధారణ జరుగుతున్నట్లు తెలుసుకోమంటున్నది. ఆకలితో అలమటిస్తుంటే అదీ గత జన్మల పాపఫలితమే అంటున్నది. కులవృత్తిని వదిలేసి సమాజానికి బాగా సేవ చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది ఉపద్రవానికే దారితీస్తుందంటున్నారు. ఎలాంటి ఉపద్రవం రానున్నదో తెలుసుకునే శక్తి నీకులేదంటున్నది. కనుక మూర్ఖమార్గాలను అవలంబించవద్దంటున్నది. శంకరాచార్యుడు చిన్నరకం భగవంతుడు గనుక, ఈ ఉపద్రవం నరకానికి పోవటమేనని చెప్పాడు.
పాండిచేరీ ఆశ్రమంలో సంపన్నుల ఆదరణ పొందిన అరవిందుడు గీతపై మరొక విధంగా వ్యాఖ్యానం చేశాడు. గీత ప్రకారం ఎత్తులు, తమశక్తియుక్తులు గమనించకుండా వృత్తిని పాటించాలని అనటం లేదన్నాడు. (Sri Aurobindo : Essays on the Geetha) భారతదేశ స్వేచ్ఛా పురోగతిని అడ్డుకున్న వాళ్ళలో ఈ పాండిచేరి ఆశ్రమవాసి కూడా ఒకడు.
గీత కులాన్ని ఎలుగెత్తి చాటుతున్నది. అర్జునుడు వాపోవటంలో కుల కారణాలున్నాయి. యుద్ధ విపత్తు వలన అక్రమం పెరిగి, స్త్రీలు అవినీతిపరులై, కుల విధానంలో గందరగోళం వస్తుందన్నాడు. కులనియమాలు, కుటుంబం నాశనమవు తుందన్నాడు. తమవారిని చంపటం కంటే కులం ధ్వంసం కావటం విచారకరంగా అర్జునుడు భావించాడు. గీత బోధించే సమాజశాస్త్రమంతా కులపరమైనదే.
అధ్యాయం పదిహేడు
గీత-విజ్ఞానం
అనేక శాస్త్రాలతో పాటు గీత ఆధునిక విజ్ఞానాన్ని కూడా బోధించింది. అణుభౌతిక శాస్త్రంలోని పరిశోధనలు సహితం ఊహించింది.
అలాంటి మాటలు వింటే ఆశ్చర్యం వేస్తున్నదా? ఇంకేమైనా అంటే హరీష్ దబాయి విజూభాయి దివాతియా మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తాడు జాగ్రత్త. గీత-ఆధునిక విజ్ఞానం అంటూ ఒక అధ్యాయం కూడా తన గ్రంధంలో చేర్చాడు. అన్ని పరిశోధనలూ గీతలో చూడాలనుకోవటం విపరీతమే అవుతుందని కూడా అనుకున్నాడు. (H.V. Divatia : The Art of life in Bhagavatgeeta 1970, Bombay) డార్విన్, హక్సలే, స్పేన్సర్ మొదలైన శాస్త్రజ్ఞులు చూపిన వాదనలను తప్పనిచూపే ప్రయత్నం చేశాడు.
కిందిస్థాయి నుండి ఉన్నదశకు జీవితం పరిణమిస్తుందని డార్విన్, హక్సలే చెప్పారు. జీవితం కోసం పోరాటం, అర్హులైనవాడు మనుగడ సాగించటం అనే రెండు భావాలూ వెల్లడించారు. కోతుల నుండి క్రమేణా మానవులుగా పరిణమించారు.
ఈ వాదనలన్నీ తప్పని దివాతియా చూపటానికి ప్రయత్నించారు. అందుకు గాను సర్ ఆలివర్ లాడ్జీ, సర్ రిచర్డ్ గ్రిగరీ, సర్.జె. ఎ.వి. బట్లర్ను సాక్ష్యంగా చూపాడు. ఆధునిక విజ్ఞానంలో వారిదే చివరిమాటగా స్వీకరించ మంటాడు. విశ్వమంతా విశాల జీవరాసి అనీ, ప్రతి జీవి అందులో ఒక భాగమనీ అంటాడు. శక్తి, లేదా ఆత్మ అనే సూత్రం ఈ విశ్వంలో వ్యాపించి ప్రకంపన చెందుతుంటుంది. ఈ భావాలు వేదాంతంలోని మాయనూ, విశ్వంలోని ఒకే భావం, లేదా శక్తి ఉన్నదనే విషయాన్ని సమర్ధిస్తున్నది. విశ్వమంతా బ్రహ్మస్వరూపం. మన ఇంద్రియ పరిమితి వలన భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది దివాతియా చెప్పిన విషయం.
ఆధునిక విజ్ఞానం మనలను మాయ, బ్రహ్మల దగ్గరకు తీసుకెళుతుందన్న మాట భారతీయ రుషులు ఆధునిక శాస్త్రీయ పదజాలాన్ని వాడకుండా కవితలో, అలంకారాలలో శాశ్వత సత్యాలు చెప్పారని దివాతియా రాశాడు. గీతను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆధునిక విజ్ఞానం అందులో ఉన్నట్లు కనుగొనవచ్చునన్నాడు. హెగెల్ వంటి వారు గీత చదివి ఉంటే ఇంకా గొప్ప తాత్వికులయ్యేవారని అన్నాడు.
సి. రాజగోపాలాచారి గీతను ప్రచారంలో పెట్టటమే గాక, తన అధికారంలో అందలి సూత్రాలను అమరపరచటానికి కూడా ప్రయత్నించారు. మద్రాసు ముఖ్యమంత్రిగా గీతలోని స్వధర్మ సూత్రాన్ని ప్రతి విద్యార్థి పాటించాలన్నారు. తండ్రుల వృత్తిని అనుసరించి రోజులో సగభాగం వినియోగిస్తే, నిరుద్యోగ సమస్యకు పరిష్కారమన్నాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని దొడ్డిదారిన తెచ్చే ఈ ప్రయత్నాన్ని తమిళనాడు ప్రజలు ప్రతిఘటించటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఎస్.జి. సర్దేశాయి. వెల్లడించిన ప్రకారం శంకరాచార్యులలో ఒకరు పూనాలో ప్రకటిస్తూ పాపయోని నుండి పుట్టిన శూద్రులూ, స్త్రీలూ ఈసడించబడాలి. ఇందులో వైశ్యులనొదిలి వేయటానికి కారణం మఠాలకు దానాలివ్వటమే కావచ్చు.
రాజగోపాలాచారి శాస్త్రజ్ఞుడి పాత్ర వహించి ఇలా అన్నాడు. తండ్రుల భౌతిక లక్షణాలు, మానసిక ధోరణులూ పిల్లలకు సంక్రమిస్తున్నాయి. ఈ వంశ పార్యం పర్యత కర్మ సూత్రాన్ని వివరించరు. వంశపారంపర్యంలో దేహాలే గాని ఆత్మలు లేవు. ఆత్మకు తల్లిదండ్రులు లేరు. అది స్వయంభువు. ఏ ఆత్మ అయినా తనకు అర్హమైన శరీరంలోకి ప్రవేశిస్తుంది. పౌరుల అవసరాలను బట్టి ఇంజనీర్లు వివిధ భవనాలు నిర్మించినట్లే యిది కూడా. కాని, అతడెప్పుడైనా డి.ఎస్.ఎ., ఆర్.ఎన్.ఎ., అనే మాటలు విన్నాడా. వంశపారం పర్యలక్షణాలు నిర్ణయించేది అవే, అనీ, కర్మకాదనీ ఎవరూ చెప్పలేదా. అవి కనుగొన్న తరువాత జన్యు శాస్త్రం విప్లవాత్మకంగా మారిందని తెలియదా.
గీతలో విజ్ఞానాన్ని గురించి మాట్లేడే గీతా ప్రచారకులు విజ్ఞానశాస్త్రజ్ఞులలోనూ లోపాలుంటాయని విస్మరిస్తున్నారు. న్యూటన్ లో చాలా మూఢనమ్మకాలున్నాయి. సర్. ఆలివర్ లాడ్జ్, సర్ విలయిం క్రూక్స్, ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ శాస్ర్తజ్ఞులైనా-మరొకవైపున చనిపోయిన అలెగ్జాండర్, షేక్స్ పియర్, నెపోలియన్లతో మాట్లాడుతున్నామంటూ, దయ్యాలశాస్త్రాన్ని ప్రచారంలో పెట్టారు. (F.E. Planer : Superstition, London 1980) చాలా మంది శాస్త్రజ్డులు తమ పరిధి దాటిన తరువాత సంకుచిత మనస్తత్వంతో మూర్ఖంగా ఉన్నారని వాట్ సన్ శాస్త్రజ్ఞుడు రాశాడు. (James D Watson : The Double Helek, London, 1969) మన వద్ధ భగవంతం, స్వామి నాధన్ ఇలాంటి వారే. గీతాకారులు తమ ఆత్మ, పరమాత్మ, కర్మ, పునర్జన్మ వంటి వేదాంతమాటలను సమర్ధించుకునే ముందు, ఐన్ స్టీన్, ఫ్రాన్సిస్ క్రిక్, కార్ సేగన్ వంటి వారి వాదనలు ఎందుకు వినలేదు అనిపిస్తుంది. ఆధునిక విజ్ఞానంలో వేదాంతంలో లేనిదేమీ లేదని అనేవారున్నారు. అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండబోదు. డార్విన్, హక్సలే, ఏమి చెప్పినా, యజ్ఞాల ద్వారానే బ్రహ్మసృష్టి జరిపాడనీ, ఆ తరువాత యజ్ఞాలద్వారానే పెంపొందుతారనీ, సకాలంలో వర్షాలొస్తాయనీ నమ్మారు. దేవుళ్ళకు సంతర్పణలర్పిస్తుంటే వారు బదులందిస్తుంటారు. చంద్రుడిని గొప్ప నక్షత్రంగా భావించారు. మొసలిని మత్స్యంగా స్వీకరించారు. అత్యంత వేగం గలదిగా వాయువును సమ్మారు. హిమాలయాలు అచలాలు అంటే కదలనివి అన్నారు. కొలనులను సముద్రాలుగా భావించారు. మనసును జ్ఞానేంద్రియం అన్నారు. గీత చెప్పిన గొప్ప శాస్త్రీయ సత్యాలు యివే. కృష్ణుడి కాలంలో విద్యుత్ ఉన్నదని కూడా చెప్పారు. కృష్ణుడికి విద్యుత్తు, సూర్య-చంద్రుల అవసరం లేదనీ, కావాలనుకుంటే తన మందిరాన్ని విద్యుత్ తో వెలిగించేవాడనీ ప్రభుపాదరాశాడు. (Sw. Prabhupada, Bhagavadgeetha, Los Angeles, 1972)
గీతలో సైన్స్ అలాంటిది. వేద ఉపనిషత్తుల సారాంశమది. విజ్ఞాన సర్వస్వమది. అలా భావించినంత కాలం భారతదేశంలో సైన్స్ కుంటుతూనే ఉంటుంది.
భారతదేశంలో నోబెల్ ప్రైజు వచ్చిన ముగ్గురిలో ఇరువురు అమెరికాలో కృషి చేసి కనుగొన్నారు. పైగా భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. వేదభూమికి తిరిగి రాలేదు. వేదాంత భూమికలో సరైన శాస్త్రజ్ఞుడు ఆలోచించి పనిచేయటం కష్టం.
18వ అధ్యాయం
గీత ఎందుకు రాశారు?
గౌతమ బుద్ధుడు విప్లవవాది కాడు. బౌద్ధవాదం విప్లవమూ కాదు. ఆక్స్ ఫర్డ్ నిఘంటువు నిర్వచించినదానికి దరిదాపుల్లోకి బౌద్ధం రాదు. బౌద్ధం తలపెట్టిన మార్పులు సంపూర్ణం కాదు, మౌలికమూ కాదు. ఉన్నతవ్యవస్థను తిరగవేసి పూర్తి మార్పునూ తేలేదు. బలవంతంగా ఏ రాజునూ, ప్రభుత్వాన్ని తొలగించలేదు. బౌద్ధం సమూల సంస్కరణవాదం. అది ఎంత సమూలమైనా, విప్లవం కాజాలడు. పాతనంతా పడద్రోసి మళ్ళీ నిర్మిస్తే విప్లవం అవుతుంది. సంస్కరణ కేవలం మార్పులతో సరిపెట్టుకుంటుంది.
బుద్ధుడికి పూర్వమే వైదిక యజ్ఞయాగాదుల పట్ల, పశువుల్ని భారీ ఎత్తున చంపటం పట్ల నిరసన ఉన్నది. బుద్ధుడూ, మహావీరుడూ, గోశాల, అజిత మొదలైనవారు వేదాల దైవాధికారాన్ని ప్రశ్నించారు. భూ దేవుల పేరిట నటిస్తున్న పురోహితులపట్ల నిరసన వ్యక్తం అయింది.
బుద్ధుడూ, తదితరులూ ఈ సాంఘిక మత ధోరణులను బలపరిచారు. బిందుసారుడూ, మరి ఇతరుల మద్ధతు లభించినందున సాఫల్యత పొందాడు. ఆ తరువాత అశోకుడూ, అతడి వారసులు కూడా బౌద్ధాన్ని సమర్ధించారు. వేదాల అధికారాన్ని, ప్రశ్నించటం వలన పురోహిత వర్గం బాధపడలేదు. బుద్ధుడికి ముందే ఉపనిషత్తులాపని చేశాయి. బుద్ధుడు కులవ్యవస్థను వ్యతిరేకించినందు వలన కూడా అంతగా నొచ్చుకోలేదు. బౌద్ధ సంఘంలో కులానికి గుర్తింపులేదు. బయట కులాన్ని అతడు పట్టించుకోలేదు. పుట్టుక వలన బ్రాహ్మణుడు కాడనీ, క్షత్రియుడు బ్రాహ్మణుని కంటె అధిక్యతలో ఉన్నాడని బుద్ధుడు చూపాడు. బౌద్ధాన్ని బాగా అధ్యయనం చేసిన హెర్మన్ ఓల్డెన్ బర్గ్ సాంఘిక సంస్కర్త గానూ బుద్ధుడిని ఒప్పుకోలేదు. బుద్ధుడు కులబంధాలు ఛేదించాడని గాని, పేదవారికి బౌద్ధంలో ఆధ్యాత్మిక స్థానాన్ని సంపాదించి పెట్టాడని గానీ అంటే అది చారిత్రకం కాబోదని కూడా అన్నాడు. (Herman Oldenburg : Buddha, His Life, His Doctreni, His order, Calcutta 1927).
తమ ఆర్థిక స్థితి గతులు క్షీణించటంతో పురోహితవర్గం బాధపడింది. వేదయజ్ఞాలు ఆగిపోవటంతో పురోహితులకు బత్వాలు లేకుండా పోయాయి. రాజులు అనుగ్రహం అంతా బౌద్ధ ఆరామాలకు దక్కటంతో పురోహితులకు ఆదాయం పోయింది. నగరీకరణం వలన బాగా సంపాదించిన వైశ్యులు బౌద్ధం వైపుకు మొగ్గారు. పురోహిత వర్గం తమ సామాజిక పునాదులు కదలిపోవటం గ్రహించారు. వర్ణాశ్రమ ధర్మం కూలిపోవటం చూచారు. మనిషి కులంలో పుట్టటం, కులవృత్తిలో మార్పులేకుండా కొనసాగటం వర్ణాశ్రమ ధర్మ లక్షణం.
అత్యధిక సంఖ్యాక ప్రజానీకం బానిసలుగా బ్రతకటం, వారిపట్ల బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలు ఏమాత్రం బాధ్యత వహించక పోవటం ఆనాటి పరిస్థితి. కుల బానిసత్వం అమానుషం, బాధ్యతా రహితం. పుట్టిన కులంలోనే అట్టి పెట్టటం, అదే వృత్తిలో చేరేటట్లు చూడటం ఆచారమైపోయింది. బుద్ధుడు కులంపైనా, కులవృత్తిపైనా తీవ్రంగా దాడి చేయలేదు గాని, ఏ కులంలోని వారైనా సంఘంలో సభ్యుడైతే మిగిలిన వారితో సమానుడౌతాడని చూపాడు. కింది కులాల నుండి బౌద్ధ భిక్కువులుగా వచ్చారనేది వేరే అంశం. వారు చాలా కొద్ది మందేనని ఓల్డెన్ బర్గ్ రాశాడు.
ఈ విధానం తమ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లు పురోహిత వర్గం పసికట్టింది. శూద్రుడు యజమాని కాబోతున్నాడని వారు భయపడినట్లే జరిగింది. శూద్రవంశం నుండి ప్రప్రధమంగా నందులు అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత మౌర్యులు శూద్రులుగా రాజ్యపాలన చేశారు. (Bhupedndranath Dutt ; Studies inIndian Social Polity, Calcutta, Page 189 స్వామి వివేకానంద సోదరుడే ఈ రచయిత) విస్తారమైన మౌర్య సామ్రాజ్యం దేశమంతా పాలించింది. బౌద్ధాన్ని స్వీకరించిన అశోకుడు దండ సమత ప్రవేశ పెట్టాడు. (Romila Thopar : Ashoka and the Decline of Mauryas, Oxford, 163) అంటే శిక్షలో అందరికీ సమానత్వం, వ్యవహార సమత కూడా అశోకుడు ప్రవేశపెట్టాడు. భూసురులనూ, శూద్రులనూ ఒకేస్థాయిలోకి తెచ్చాడు. ఛండాలురను కూడా వారి స్థాయిలోనే అట్టి పెట్టాడు. భూసురులు తప్పుడు దేవుళ్లని శాసనంపై చెక్కించాడు. (భూపేంద్రనాధ్ దత్తా పేజి 189).
వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడటానికి శూద్రపాలన అంతం చేయాలి. దీనికి గాను చంద్రగుప్తుడు అశోకుడికి వారసుడైన బృహద్రధులని చంపించారు. అతని వద్ద పుష్యమిత్తుడు అనే బ్రాహ్మణ సైన్యాధిపతి ఉండేవాడు. రాజు సైన్యాలను పరీక్షిస్తూ ఉండగా ఈ హత్య జరిగింది. పుష్యమిత్రుణ్ణి ద్రోహిగా బాణకవి పేర్కొన్నాడు. (Jagannadham : A comprehensive History India, Bombay 1957, Vol. II. Page-94) నిహరంజన్ రే మరొక విధంగా భావించాడు. ఇతిహాసాలూ, పురాణాలూ మౌర్యులను అసురులుగా భావించడాన్ని తేలికగా కొట్టి పారవేయరాదన్నాడు. రచయితలు బ్రాహ్మలుగానటం, మౌర్యులు బౌద్ధులుగావటం ఇందుకు కారణం కాదన్నాడు. (Niharanjan Ray : Maurya and the Post Maurya Art, New Delhi, 1975) నిహరంజన్ రే భారతదేశంలో అత్మవసర పరిస్థితిని సమర్ధించాడు. అలాంటివాడు పుష్యమిత్రుడిని గొప్ప విమోచనకారుడిగా, మౌర్యులు పాలించినప్పుడు సామాన్యులు బాధలకు గురైనట్లుగా చిత్రించాడు.
పుష్యమిత్రుడు, తొలి బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బౌద్ధాన్ని విధ్వంసం చేయాలనీ, బ్రాహ్మణీకాన్ని తిరగదోయటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. బౌద్ధ భిక్కులను చంపేసి, బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేయతలపెట్టాడు. (K.P. Jayaswal : In Imperial History of India) బౌధ్ధ భిక్కువులను చంపి, వారి తలలను తనకు బహూకరిస్తే నూరు దీనార్లు చొప్పున ప్రతి తలకూ ఇస్తానని ప్రకటించినట్లు దివ్యవదనుడు తెలిపాడు. (B.C. Sinha : History of Sranga Dynasty, Delhi : 1977) ఐతే, అప్పటికే కాలం మారింది. పాతమూసలో బ్రాహ్మణ విధానాన్ని పోయటానికి వీలులేదు. కొత్త తొడుగులు అవసరమయ్యాయి. కనుక రెండు అశ్వమేధ యాగాలు చేశాడు. పతంజలి రాజపురోహితుడుగా ఉన్నాడు. (P Banerjee : Early Indian Religions New Delhi, 1973) అగ్నిస్తోమ, రాజసూయ, వాజ్ పేయ యజ్ఞాలను తిరగదోడారు. పుష్యమిత్ర, పతంజలి అంచలువారిగా సనాతన ప్రతి విప్లవాన్ని తీసుకురావటానికి ప్రయత్నించారు. దీనినే కొత్త బ్రాహ్మణ వాదంగా పి. బెనర్జీ పేర్కొన్నాడు. మౌర్యుల అనంతరం అది కొనసాగింది. విశ్వామిత్రుడు కత్తి పట్టగా, పతంజలి తన తెలివితేటలను వినియోగించాడు. తీరిక ఉన్నప్పుడు వ్యాకరణం రాసినా, పురోహిత వర్గాలను అట్టిపెట్టటమే అతని ప్రధాన లక్ష్యం. 2 వేల సం.రాల క్రితం పతంజలి ఈ విషయంలో ఘన విజయం సాధించాడు.
పాణిని వ్యాకరణంపై భాష్యం రాసిన పతంజలి కృష్ణుడు కంసుని సంహరించటం ప్రస్తావించాడు. వాసుదేవుని పూజించే వాసుదేవకులను కూడా ప్రస్తావించాడు. అంతకుముందు పాణిని వాసుదేవ-అర్జునులు పూజలందుకున్న తీరు చెప్పారు. పతంజలి కాలం నాటికి కృష్ణుణ్ణి దేవుడుగా కొన్ని చోట్ల కొందరు పూజించారు. ఆ విషయాన్ని పతంజలి చాకచక్యంతో వాడుకున్నాడు. బుద్ధుడిని అతని అనుచరులు తదనంతరం దేవుణ్ణిగా చేసి కొలిచారు. (Folyd H. Ross : Meening of Life inHinduism and Buddhism, London 1952) అలా దేవుళ్ళను సృష్టించటం ఆనాటి ధోరణిగా ఉనఅనది. వేదాలలో వ్యక్తిపరమైన దేవుళ్ళు లేరు. ఉపనిషత్తులలోనూ లేరు. వేదాల దేవుళ్ళను సంతృప్తిపరచాలంటే అతి వ్యయంతో కూడిన యజ్ఞాలు చేయాలి. ఉపనిషత్తుల దేవుడు తటస్థ బ్రహ్మం కనుక, సంతృప్తిపరిచే ప్రశ్నలేదు. అలాంటప్పుడు బుద్ధుని దేవుడిగా చేసేటప్పటికి జనం బౌద్ధానికి ఎగబడ్డారు. పతంజలి ఇందుకు బదులుగా, వాసుదేవ, కృష్ణదేవుళ్ళను ఎరగా చూపాడు. విష్ణువు-వాసుదేవ దేవుళ్ళ పరిణామం అట్లా జరిగింది. కృష్ణదేవుళ్ళను ఎరగా చూపాడు. విష్ణువు-వాసుదేవ దేవుళ్ళ పరిణామం అట్లా జరిగింది. కృష్ణుడిని దేవుడుగా చేసి కొత్త బ్రాహ్మణ వాదాన్ని స్థాపించటంలో పతంజలి తన శిష్యుడు పుష్యమిత్రుడి సహకారంతో దండసమత, వ్యవహార సమతను రద్ధు చేశాడు. శిక్షలలో హెచ్చుతగ్గులూ, తరతమ భేధాలు ప్రవేశపెట్టాడు. ఉన్నత కులాలకు స్వల్ప శిక్షలూ, తక్కువ కులాలకు కఠిన శిక్షలూ తిరగదోడాడు. శూద్రులు తలెత్తకుండా కొన్ని పాత సూత్రాలూ, మరి కొన్ని కొత్త సూత్రాలూ కలిపి స్మృతులుగా రూపొందించారు. బెనర్జీ ఈ విషయాలు వివరించారు.
ఏ దేవుణ్ణి కొలిచినా, ఏ యోగాన్ని పాటించినా, ఒక విషయం మాత్రం విస్మరించరాదు. అదే కులంధర్మం, కులవృత్తిని వీడకుండా ఉండాలి. నీవెంత అసమర్ధుడివైనా ఎంత నీచవృత్తిని అనుసరించవలసి వచ్చినా, కులధర్మాన్ని పాటించాల్సిందే. లేకుంటే నరక ప్రాప్తి తప్పదు. ఆ హెచ్చరిక చేయటానికే గీతారచన సాగింది.

No comments: