Thursday, May 1, 2008

సాహితి పరులతొ సరసాలు 20 Gora Sastri





1969 లొ కర్నూలులొ సన్మానం పి వి నరసిమ్హారావు ,మధ్యలొ గోరాశాస్త్రి సన్మానపత్రం చదువుతున్న సి.ధర్మారావు

జీరాలో ఓ కోబ్రా- గోరాశాస్త్రి
(1919-1982)
విప్లవ కవుల దిగంబర ఉద్యమాన్ని గోరాశాస్త్రి వెక్కిరించేవారు. వారి తొలి పుస్తకం హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద అర్ధరాత్రి ఒక రిక్షా కార్మికుడితో ప్రారంభించామన్నారు (1968). కాలిముద్ర ముఖచిత్రంగా వేశారు. అందరివలె ప్రారంభోత్సవం చేయరుగదా, మరి ఎలా విడుదల చేశారు. కార్మికుడి చేత పుస్తకంపై మూత్రం పోయించారా అని గోరా శాస్త్రి హేళన చేశారు. అది తట్టుకోలేని విప్లవ కవులు ఆయన్ను జీరాలో ఒక కోబ్రా వుందంటూ కవితలల్లారు. (సికింద్రాబాద్ లో జీరా ప్రాంతంలో ఆయన అద్దెకుండేవారు).

విజయవాడలో నాస్తిక నాయకుడు గోరా (గోపరాజు రామచంద్రరావు) ఆంధ్రభూమి సంపాదకుడు గోరాశాస్త్రి (గోవిందు రామశాస్త్రి) మధ్య గందరగోళ పడిన వారు లేకపోలేదు. గోరాశాస్త్రి సంపాదకీయాలు చదివి గోరాకు ఉత్తరాలు రాసిన వారు, గోరాశాస్త్రి నాస్తికుడను కొని తిడుతూ రాసిన లేఖలు లేకపోలేదు.
గోరాశాస్త్రి శ్రీకాకుళం జిల్లాలో పుట్టి, భద్రాచలం ప్రాంతంలో పెరిగి, అనేక చిల్లర మల్లర ఉద్యోగాలు చేసిన గ్రాడ్యుయేట్. చివరకు మద్రాసులో ఖాసా సుబ్బారావు అనుచరుడుగా తెలుగు స్వతంత్ర సంపాదకుడుగా కుదురుకున్నాడు. ఇంగ్లీషు స్వతంత్ర ఎడిటర్ ఖాసా. మద్రాసు మెయిల్ మాకు ప్రయబాంధవి అనే వాడు గోరా శాస్త్రి. ఆ రోజుల్లో మెయిల్ ద్వారా వ్యాసాలు, ఉత్తరాలు వచ్చేవి.
మద్రాసులో వున్నందున 1950 ప్రాంతాల్లో తెలుగు రచయితలు, కవులు, కళాకారులతో గోరాశాస్త్రికి సన్నిహిత సంబంధాలుండేవి. ఆలిండియా రేడియోలో ఆయన నాటికలు ప్రసారమయ్యాయి. ఆశఖరీదు అణా అనేది బాగా ప్రచారంలోకి వచ్చిన నాటిక. తెలుగు స్వతంత్ర పత్రిక మంచి పేరు పొందింది. ఎందరో కవుల్ని రచయితల్ని గోరాశాస్త్రి ప్రోత్సహించారు. అందులో పి. శ్రీదేవి రాసిన కాలాతీత వ్యక్తులు బహుళ ప్రచారంలోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత గోరాశాస్త్రి సికింద్రాబాద్ వచ్చారు. అక్కడే చివరిదాకా వున్నారు. తెలుగు స్వతంత్ర ఆగిపోయిన తరువాత, ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడయ్యారు. డక్కన్ క్రానికల్ అనుబంధంగా ఆ దిన పత్రిక వుండేది. గోరాశాస్త్రి చేబట్టిన తరువాత పత్రిక పుంజుకున్నది. డక్కన్ క్రానికల్ సంపాదకీయాలు కొంత కాలం గోరాశాస్త్రి రాశారు.
గోరా శాస్త్రి వద్ద పొత్తూరి వెంకటేశ్వరరావు, జి. వరదాచారి అసిస్టెంట్స్ గా పనిచేశారు.
నేను ఎన్.శూలపాణి పేరుతో ఆంధ్రభూమిలో అనేక వ్యాసాలు(1962-65) రాశాను. అప్పట్లో నేనెవరో గోరా శాస్త్రికి తెలియదు. 1966లో పరిచయం అయిన తరువాత, ఆంధ్రభూమిలో రాయడం మానేశాను. ఇరువురం కుటుంబ మిత్రులమయ్యాం. తన పాత స్మృతులు, అనుభవాలు నాతో చెప్పేవారు.
గోరాశాస్త్రి ద్వారా నాకు పరిచయమైన వారిలో ఇచ్చాపురపు జగన్నాధరావు, డా. పి. తిరుమల రావు, శశాంక, గోపాల చక్రవర్తి, రావి శాస్త్రి, వి. రమాదేవి, భాట్టం శ్రీరామమూర్తి పేర్కొన్న దగినవారు.
గోరా శాస్త్రి కమ్యూనిస్టు వ్యతిరేకి. కాని అనేక మంది కమ్యూనిస్టులు ఆయనకు సన్నిహితులు. సెట్టి ఈశ్వరరావు, శ్రీశ్రీ అందులో వున్నారు.
గోరా శాస్త్రి నేనూ చాలా తరచుగా కలుసుకుని, సాహిత్యం, రాజకీయాలు చర్చించేవారం. సి. ధర్మారావు వచ్చి చేరేవారు. గోరాశాస్త్రి నిత్య దరిద్రుడు. ఎప్పుడూ డబ్బు కరువే. పైగా జబ్బు మనిషి. విపరీతంగా టాబ్లెట్స్ మింగేవాడు. ఉపద్రష్ట కృష్ణమూర్తి అనే బిజినెస్ మిత్రుడు ఆయనకు ఆర్థిక సహాయం చేస్తుండేవాడు. మధ్యలో పి.వి. నరసింహారావు దగ్గరకు వెళ్ళేవాళ్ళం. ఆయన కొంత సహాయపడుతుండేవాడు.
డా. పి. తిరుమలరావు తన స్వీయ చరిత్ర రాసి గోరా శాస్త్రి చే దిద్దించుకున్నారు. జర్నలిస్ట్ సీతారాం, జి. కృష్ణ వంటి వారిని తరచుగా సంపాదకీయ రచనల నిమిత్తం చర్చించేవారు.
రామోజీరావు ఈనాడు పత్రిక పెట్టదలచి, అనేక మందిని సంప్రదించారు. గోరా శాస్త్రి, నేను కొన్ని సార్లు అబిడ్స్ లోని మార్గదర్శి ఆఫీసులో సాయంకాలాలు కూర్చొని చర్చించేవాళ్ళం. రామోజీరావు శ్రద్ధగా ఆలకించి, నోట్స్ కూడా రాసుకునేవారు. 1970 ప్రాంతాల మాట అది.
గోరా శాస్త్రి శాకాహారి. బాగా డ్రింక్స్ పుచ్చుకునేవారు. అందులో నేనూ భాగం పంచుకునేవాడిని. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. సంసారం యీదడం కష్టంగానే వుండేది. ఆయనకు ఆర్థిక సహాయం చేసే నిమిత్తం షష్ఠి పూర్తి సంచిక వేసి, కర్నూలులో సన్మానం చేయించాం. కోట్ల విజయభాస్కర రెడ్డి నాడు జిల్లా పరిషత్ చైర్మన్. పి.వి. నరసింహారావు విద్యామంత్రిగా వచ్చారు. మండవ శ్రీరామమూర్తి పూనుకోగా గోరాశాస్త్రికి ఆర్థిక సహాయం కొంత చేయగలిగాం. సంచికలో కొందరు వ్యాసాలు వేశాం. నేను వివరంగా సంపాదకీయం రాశాను.
మద్రాసులో వుండగా గోరా శాస్త్రి అనేక మంది సాహితీ పరుల్ని కలిశారు. అందులో ఎన్ కౌంటర్ ఎడిటర్ స్టీ ఫెన్ స్పెండర్ ముఖ్యులు. గోరాశాస్త్రికి అతి సన్నిహిత మిత్రులు. కె. రామలక్ష్మి, ఆరుద్ర, హైదరాబాద్ లో వుంటున్న దేవులపల్లి కృష్ణశాస్త్రికి నన్ను పరిచయం చేశారు. కృష్ణశాస్త్రి పరిణామం, ఆయన అబద్ధాలలో బ్రతికిన తీరు ఆసక్తి కరంగా చెప్పేవారు. మద్రాసు నుండి వచ్చిన సాహితీ మిత్రులు గోరాశాస్త్రితో కాలక్షేపం చేసేవారు.
గోరా శాస్త్రితో సన్నిహితత్వం వలన అనేక విషయాలు తెలిశాయి.
రచనలు : ఆశ ఖరీదు అణా (నాటిక), ఆనంద నిలయం (నాటిక), దూరతీరాలు (నాటిక), సెలవుల్లో (నాటిక).