ఈ వ్యాసావళి ఎందుకు వ్రాయవలసి వచ్చింది
మనకు కారల్ మార్క్సు మూడు విధాలుగా తెలుసు. కమ్యూనిస్టులు ప్రచారం చేయగా అందరి నోళ్ళలో పడిన మార్క్సు. కమ్యూనిస్టు వ్యతిరేకులు దూషించగా లోకానికి తెలిసిన మార్క్సు. అసలు అతని రచనలు చదవగా తెలిసిన మార్క్సు. కానీ, ఈ మూడవ పద్ధతిలో మార్క్సు బహు కొద్దిమందికే తెలుసు.
కమ్యూనిస్టు వ్యతిరేకులు యథాశక్తి మార్క్సును వక్రీకరించారు, దూషించారు. చిలవలు పలవలు చేసి చూపెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఇందులో ఆశ్చర్యం లేదు. వారు కమ్యూనిస్టు వ్యతిరేకులు గనుక.
కాని, మార్క్సుకు, మార్క్సిజానికి వారసులు కావలసిన -- అయినామని చెప్పుకుంటున్న - కమ్యూనిస్టులు మార్క్సిజాన్ని ఎందుకు పెడదారిన పట్టించారు. ఇది ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. కమ్యూనిస్టులలో ఒకసారి ఆకాశానికెత్తడం, మరొకసారి దేశద్రోహి అనడం, ఇలా మాటి మాటీకీ మాట మార్చడం తరచుగా చూస్తున్న సంగతే.
కాని కనీసం వారి మూలవిరాట్టు మార్క్సుకైనా ఈ పద్ధతిని అన్వయించ రనుకున్నాను. చివరకు మార్క్సు కూడా కమ్యూనిస్టుల చేతిలో నలిగి పెడమార్గాన పడక తప్పలేదు.
మరి, మూడవ వర్గం ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్న రావచ్చు. మార్క్సు రచనలు చదివి అవగాహన చేసుకుని సరిగా లోకానికి చెప్పవచ్చు కదా. మార్క్సు రచనలన్నీ చాలాకాలం లోకానికి వెల్లడి కాలేదు. ఈనాటీకీ బయటకు రావలసిన ఉన్నాయంటే ఆశ్చర్యమే కలుగుతుంది.
వెలుగు చూడని రచనలు
లెనిన్ బ్రతికుండగా కొన్ని అతి ముఖ్యమైన సిద్ధాంత గ్రంథాలు వెలుగు చూడలేదు. ఆ తరవాత ప్రచురించిన వెంటనే ఉపసంహరించినవి ఉన్నాయి. ప్రచురించినా రష్యా పొలిమేరలు దాటనివి ఉన్నాయి. స్టాలిన్ అనంతరం బయటపడినవి ఉన్నాయి. అవి ఒక్కటొక్కటే మాస్కో నుంచి తొంగిచూస్తున్నాయి.
ఈలోగా మార్క్సును గురించి తుది వాక్యాలు లెనిన్ పలికాడు. కమ్యూనిస్టులు విన్నారు. ఆ తరువాత వచ్చిన మార్క్సు రచనలు అంతకు ముందు కమ్యూనిస్టుల భాష్యానికి భిన్నంగా ఉన్నవి. నాలుక కొరుక్కున్నా మాటమీద నిలబడక తప్పలేదు. లెనిన్ ను కాదనే సాహసం లేకపోయింది. లెనిన్ చెప్పిందే మార్క్సిజం, కమ్యూనిజం అన్నారు. అక్కడే ఉంది అశాస్త్రీయ ధోరణి.
ఆంధ్రప్రదేశ్ ను కానీ, ఆ మాటకొస్తే ఇండియాను కానీ చూడండి. మనకు కమ్యూనిస్టుల ద్వారానే మార్క్సు పరిచితుడు. సోవియట్ యూనియన్ చౌకగా సాహిత్యం అందించడం వల్ల మార్క్సురచనలు బహుళ ప్రచారం పొందడానికి వీలు కలిగింది.
కానీ, ఇవన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి. మార్క్సు రచనలలో ముఖ్యమైనవి చాలా భాగం దేశీయ భాషలలోకి రాలేదు. రష్యాలో సైతం మార్క్సు సమగ్ర జీవితాన్ని 1973 లోనే ఆంగ్లంలో ప్రచురించారు. అది కూడా ముందు ఐరోపాలో వేరే వారు రాయడం వలన, రష్యాకు గత్యంతరం లేక ప్రచురించవలసి వచ్చింది. అలాగే మిగిలిన కొన్ని మార్క్సు రచనలు కూడా.
మార్క్సు రచనలు చదివి పచ్చి మార్క్సిస్టులైతే ఫర్వాలేదు. అందులో అర్ధం ఉంది. సబబుగా ఉంది. చాలామంది ఆ మార్గాన మార్క్సిస్టులు కాలేదు. నాయకులు చెప్పగా విని ఉద్రేకంతో మారారు. మార్క్సును కమ్యూనిస్టులు చెప్పిన భాష్యంలో చదివారు. ఒక్కక్క దేశం కమ్యూనిస్టులు మార్క్సును ఒక్కక్క విధంగా చిత్రించారు. కనుక సోవియట్ మార్క్సిజం, చైనా మార్క్సిజం, నేడు ఇటలీ మార్క్సిజం, ఫ్రెంచి మార్క్సిజం ఆని శాఖోపశాఖలై పాయలుగా చీలి ప్రవహిస్తున్నది. వారి వారి అవసరాలు అభిరుచులనుబట్టి ఆయా దేశాలను అనుసరిస్తూ, కమ్యూనిస్టులు మార్క్సిస్టులమంటున్నారు.
తెలుగులోనికి రాని రచనలు
మార్క్సు రచనలతో ఒక్క కమ్యూనిస్టు ప్రణాళిక మినహా ముఖ్యమైన గ్రంథం ఒక్కటీ తెలుగులో లేదు. ఇన్నాళ్ళు కమ్యూనిస్టులు దాచి, ఇప్పుడు తప్పనిసరై ప్రచురించిన గ్రంధాలు ఇప్పటిలో తెలుగులోకి వస్తాయని ఆశించలేము.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాసపరంపర రాయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఆంగ్లంలో మార్క్సును చదవడానికి వీలు లేనివారికి ఇవి మార్గగాములుగా, కనువిప్పుగా ఉండగలవని ఆశ. వైజ్ఞానిక దృక్పథం కలవారెవరైనా మార్క్సును అర్ధం చేసుకోవడానికి అతని మూలరచనలు చదవాలని అంగీకరిస్తారు. కమ్యూనిస్టులు సైతం లెనిన్ టీకా టిప్పణంపై ఆధారవడినా మూలాన్ని కాదనే సాహసం చేయరనుకుంటాను.
మార్క్సు రచనలన్నీ నేడు 100 సంపుటాలుగా ఐరోపాలోనూ, 50 సంపుటాలుగా రష్యాలోనూ ప్ర.చురిస్తున్నారు. ఎంగెల్సు రచనలు కూడా ఇందులో ఉన్నవి. మార్క్సు జీవితంపై కూడా సమగ్రపరిశోధన జరిగింది. దీనిని బట్టి ఇన్నాళ్ళు కమ్యూనిస్టులు మార్క్సుకు గ్రహణం పట్టించారని స్పష్టపడుతున్నది.
దాచేస్తే దాగిన సత్యాలు
ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆధునిక పరిశోధన ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నది మార్క్సు జీవితం. రచనలు ఈ పరిశీలనకు నిలబడడమో, లేదో అన్నది చరిత్రకు సంబంధించిన అంశం. కాని ఒక సిద్ధాంతకర్తను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి మాత్రం అతని పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ దృష్టితో చూస్తే మార్క్సు జీవితంలో అనేక ఘట్టాలను కమ్యూనిస్టులు నేటికీ దాస్తున్నారు. ఇది మరీ ఘోరం.
ఈ వ్యాసాలకు మార్క్సు రచనలను, మార్క్సును నిష్పాక్షికంగా పరిశీలించిన వారి రచనలే ఆధారం. మార్క్సును గానీ, మార్క్సిజాన్ని గానీ విలువ గట్టడం, తెగడడం, పొగడడం ఇక్కడ తలపెట్టలేదు. వాస్తవాలను చెప్పడమే వీటి ప్రధానోద్దేశం.
మార్క్సు రచనలు - 1837 మొదలు 1882 వరకు చేసిన వాటిలో అత్యంత ప్రధానమైనవి. కమ్యూనిస్టులు బయట పెట్టలేదంటున్నాము కదా. వాటిలో మొదటిది, 1844లో పారిస్ లో ఉండగా రాసినది. తొలుత పేర్కొనదగినది. దీనిని ప్యారిస్ ప్రతులని పాశ్చాత్యులు, ఆర్ధిక తాత్విక ప్రతులు 1844 అని రష్యావారు పిలుస్తున్నారు.
రెండవది -- 1846 లో వ్రాసిన జర్మన్ ఐడియాలజీ. మూడవది -- అత్యంత ప్రాముఖ్యంగలది -- 1857లో వ్రాసిన రాజకీయ ఆర్ధిక శాస్త్ర నిశిత పరిశీలన - ప్రాతిపదికలు. నాలుగవది -- మార్క్సు తన క్యాపిటల్ ప్రథమ భాగం చివర చేర్చుదామని అనుకుని మానేసిన అధ్యాయం - 200 పుటలుగల ఉత్పత్తి విధానాల తక్షణ ఫలితాలు.
దాగుడు మూతలు
మొదటి మూడు నేటికీ ఆంగ్లంలో లభిస్తున్నాయి. నాలుగవది జర్మన్ ఫ్రెంచిభాషలలో తప్ప ఆంగ్లంలో ఇంకా రాలేదు. ఇలా రచనలు దాచి పెట్టడం ఒక భాగమైతే, మార్క్సు జీవిత విశేషాలను కప్పి పుచ్చడం మరొక భాగం. ఈ దాగుడు మూతల ఫలితం చాలా ఉంది. కనుకనే ఇది వ్రాయవలసి వచ్చింది.
మూల పురుషుడైన మార్క్సునే ఇలా చేయగల కమ్యూనిస్టుల రాజ్య విధానం విచిత్రమైనది. మార్క్సుకే ఇలా జరిగినప్పుడు మిగిలినవారి గతి ఇక చెప్పనక్కరలేదు. ఆ కమ్యూనిస్టులు తమకు నచ్చిన, తాము మెచ్చిన మార్క్సునే బయట పెట్టగా, అర్ధం అయీ కాక వారిని అనుసరించిన వారిని చూస్తే జాలేస్తుంది.
మన విశ్వవిద్యాలయాలలో, పాఠ్య ప్రణాళికలలో ఇది వరకు మార్క్సు జోలికి ఎవరూ పోయేవారు కాదు. ఇప్పుడిప్పుడే కొద్ది మోతాదులలో మార్క్సును ప్రవేశపెడుతున్నారు. అయినా, వక్రీకరించడం విపరీతంగా జరుగుతున్నది.
వీటన్నిటి దృష్ట్యా కూడా మార్క్సు విషయమై సమగ్ర పరిశీలన అవసరం.
చాలా కాలం వరకు వెలుగు చూడని మార్క్స్ రచన పారిస్ ప్రతులు
1844 ఏప్రిల్ - ఆగస్టు మధ్య పారిస్ లో ప్రవాస జీవితం గడుపు తుండగా మార్క్సు ఆర్ధిక శాస్త్రాలను అవపోశనం పట్టాడు. భార్య జెన్ని పిల్లలతో పుట్టింటికి వెళ్ళగా, బాదరబందీ లేని మార్క్సు రచనకు ఉపక్రమించాడు. అవే నేడు ఆర్ధిక, తాత్విక ప్రతులుగా చలామణి అవుతున్నాయి. అప్పుడే మార్క్సు కొత్తగా కమ్యూనిస్టు అయ్యాడు. 26 ఏళ్ళ మార్క్సు తాను సంతరించిన భావాలకు ఒక రూవం ఇవ్వ సంకల్పించి చేసిన రచనలే ఇవి. పోయినవి పోగా, మిగిలినవి మాత్రం లోకాన్ని చూడక, అంధకారంలో మ్రగ్గుతూ, లెనిన్ చనిపోయిన ఎనిమిదేళ్ళకు మాస్కోలో తొలిసారి తొంగి చూశాయి.
1932లో మొదటి ప్రచురణకు నోచుకున్న మార్క్సు పారిస్ ప్రతులు కారణాంతాలచే రష్యా బయటకు రాలేదు. నాడు రష్యాకు, బయటి ప్రపంచానికీ సన్నిహితత్వం అంతగా లేనందున, మాస్కోలో ప్రచురణ ఎవరి దృష్టికి రాలేదు. ఇక తొలి ఆంగ్లానువాద ముద్రణ 1959లో గాని జరగలేదు. (MARX – Economic and Philosophic Manuscripts of 1844 – Progress Publishers, Moscow 1974లో పుట 184 చూడండి. మొత్తం మీద మార్క్సు వ్రాసిన అనంతరం 88 ఏళ్ళకు మాస్కోలో ప్రజల మధ్య పడిన ఈ అసంపూర్తి రచనలకు చాలా ప్రాధాన్యత లభించింది. అందుకు కారణం అందులోని విషయమే.
రాజకీయ, ఆర్ధిక పరిశీలన నిశితంగా చేయదలచి రచనకు ఉపక్రమించిన మార్క్సు చిన్న కరపత్రాలుగా న్యాయశాస్త్రం నీతి, రాజకీయాల గురించి వ్రాద్దామనుకున్నాడు. ఈ తలంపుతో లెస్కీ అనే ప్రచురణకర్తతో ఒడంబడిక చేసుకున్నాడు. కాని, అనుకున్నట్టు వ్రాయలేకపోగా, మిగిలినవే ఈ పారిస్ ప్రతులు.
మార్క్సు అంతకు ముందు ప్రధానంగా తీవ్రభావాలుగల నాస్తికుడు, తాత్త్వికుడు, మార్క్సును ఆర్ధిక విషయాలపై దృష్టి మళ్ళించిన వాడు ఎంగెల్సు. అతడు రాసిన రాజకీయ, ఆర్ధిక విషయాల నిశిత పరిశీలన మార్క్సును ప్రభావితం చేసింది. అప్పుడు ఆడం స్మిత్, రికార్డో, సే, వైట్లింగ్ ఓవెన్, మిల్ మాల్తన్, ప్రౌధాన్ లను ఇతర ఫ్రెంచి, ఆంగ్ల సోషలిస్టులను మార్క్సు పట్టి చూచి, తరువాత, రచనకు ఉపక్రమించాడు.
ఈ రచన ప్రాధాన్యత యేమిటి ? అని పరిశీలిస్తే కమ్యూనిస్టులు ఇన్నాళ్ళూ ఎందుకు తొక్కిపట్టారో ఊహించుకోవచ్చు.
పారిస్ ప్రతుల పేరిట మార్క్సు చేసిన రచనలు నాలుగు భాగాలుగా ఉన్నవి. మొత్తం 146 పుటలు (ప్రోగ్రస్ పబ్లిషర్స్, మాస్కో 1974) మొదటి భాగంలో వేతనాలు పెట్టుబడి, లాభం, భూమిపై అద్దె అనే అంశాల చర్చ ఉన్నది. రెండవ భాగం సగం నుంచి ప్రారంభమౌతున్నది. అంటే కొంత రచన అసలు కనపడకుండా పోయింది. మూడవ భాగంలో ప్రైవేటు ఆస్తి శ్రమ, ప్రైవేటు ఆస్తి - కమ్యూనిజంపై చర్చ ఉన్నది. నాల్గవ భాగంలో హెగెల్ తత్వ విమర్శ కనబడుతుంది. ఈ నాలుగు భాగాలలో మకుటాయమానమయిన విషయాలు వైమనస్యత, మానవుని విమోచనలనేవి. (More...)
Monday, July 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment