Sunday, July 8, 2007

నర హంతకులు -8




ఇటలీలో అందమైన నియంత ముసోలినీ

ఇటలీలోని చిన్న పట్టణం మిలన్ కు చెందిన ముసోలినీ అందమైన నియంత. అతడికి 169 మంది భార్యలవంటి ఉంపుడుగత్తెలు వుండేవారు. అధికార దాహం ముసోలినీలో కొట్టొచ్చినట్లుండేది.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1919 మార్చి 23న ముసోలినీ తన మిత్రులతో కలసి పార్టీని పెట్టారు. ఫ్యాక్టరీలు స్వాధీనం చేసుకోవాలని, దేవాలయ భూముల్ని ఆక్రమించాలని, రాజరికం రద్దు చేయాలని నినదిస్తూ ముసోలినీ బయలుదేరాడు. చరిత్ర సృష్టిస్తానన్నాడు. తన ఫాసిజాన్ని వ్యాపింపచేయడానికి కవితను, డ్రామాను, మార్మిక భావాలను బాగా వాడుకున్నాడు. ఈ విషయంలో కమ్యూనిస్టులకు ముసోలినీకి తేడా లేదు. సోషలిస్టు మందలో ఫాసిస్టు పులి పడినట్లయింది, ఇటలీ పరిస్థితి. మాజీ సైనికులను చేరదీసి ఫాసిస్టు దళాల్ని ఏర్పరచిన ముసోలినీ, తరువాత బడి వదలి తిరిగే వారిని చేరవేశాడు. ఆర్.ఎస్.ఎస్. వలె వీరు కూడా కట్టుదిట్టంగా, క్రమశిక్షణతో వుండేవారు. స్థానిక సంస్థల మద్ధత్తు లభించింది. నక్సలిజం యువకులను, అందునా సంపన్న యువతను ఆకర్షించినట్టు, ఫాసిజం ఇటలీలో సంపన్న యువతను పట్టేసింది. ముసోలినీకి అండగా, అనుచరుడుగా ఇటలీలో బాల్బో వుంటూ, కిరాతకచర్యలు చేశాడు. తొలుత హింసపట్ల ఏమంత ఆసక్తి కనపరచని ముసోలినీ క్రమంగా హింసాయుత చర్యలకు ఆమోదముద్ర వేశాడు. 1921లో కొద్ది మోతాదులో ఆరంభమైన ఫాసిస్టు హింసాకాండ 1922లో విజృంభించింది. ఒక్కొక్క నగరాన్ని ఆక్రమించుకుంటూ దౌర్జన్యం చేసుకుంటూ ఫాసిస్టు దళాలు కదిలాయి.
ముసోలినీ వాగ్దాటి ఉపన్యాసాలతో ప్రజల్ని ఉర్రూతలూగించేశాడు. పోప్ తో రహస్య సంబంధాలు ఏర్పరచుకున్నాడు.
1922 అక్టోబరు 28న ముసోలినీ ఫాసిస్టు దళాలు 40 వేలమంది రోమ్ ను ఆక్రమించడానికి ఉపక్రమించారు. జోరున వర్షం కురుస్తుండగా వీరంతా రోం వెలుపల నల్ల చొక్కాలతో (ఫాసిస్టు డ్రెస్) అలా సిద్దమయ్యేసరికి మిలన్ లో వున్న ముసోలినీకి ఫోను మ్రోగింది. మంత్రి మండలిలో ఆయనకు స్థానం కల్పిస్తామని ఆహ్వానం వచ్చింది. అక్టోబరు 29న ముసోలినీ బయలుదేరి అధికారాన్ని చేబట్టాడు. పాసిస్టు నల్ల డ్రెస్ కు గుర్తింపు లభించింది. 1924 ఏప్రియట్లో ఎన్నికలు జరిపితే, ఫాసిస్టులకు బాగా బలం లభించింది.
1924లో ప్రతిపక్షం నాయకుడు గియాకోమో మాటియెట్టిని ముసోలినీ చంపించాడు.
ఫాసిస్టు కోరలు పనిచేయనారంభించాయి. ప్రతిపక్షాల పత్రికల్ని నిషేధించాడు. ప్రతిపక్షనాయకులను నిర్భంధించాడు. ఫాసిస్టు నియమాలను ప్రకటిస్తూ 1925 జనవరి 3న ముసోలినీ ఉపన్యసించాడు. రాజ్యానికిమించి ఏదీ వుండరాదన్నాడు. ప్రతిపక్షాలు అనవసరమన్నాడు.
మొదట్లో లెనిన్ను ఆదర్శంగా స్వీకరించిన ముసోలినీ. జర్మనీలో హిట్లర్ వాదనల్ని నిరసించారు. యూదు వ్యతిరేకతను పాటించలేదు. ఏంజలికా బాలబనోఫ్, ఎన్రికోరోక్కాగినో ఆరియాస్ మొదలైన యూదు ప్రముఖులు ముసోలినీకి తోడ్పడ్డారు. నాజీలకు వ్యతిరేకంగా బ్రిటన్, ఫ్రాన్స్ తో కలసి ఒక ఫ్రంటు ఏర్పరచడానికి సైతం ముసోలినీ సిద్ధమయ్యాడు.
కాని, రానురాను ముసోలినీ మరీ అవినీతికి దిగజారాడు. తన చదువు, సంస్కారం ప్రక్కకునెట్టి టెర్రరిజాన్ని ఆచరించాడు. అబిసీనియాపై దాడిచేసి 1935 మేలో ఆదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఇటలీని దురాక్రమణదారుగా చిత్రించి నానాజాతి సమితి 1935 అక్టోబరులో ప్రకటించింది. అంతటితో ప్రజాస్వామ్య దేశాలకు ముసోలినీ దూరం కాగా, హిట్లర్ పొగడ్తలకు పొంగిపొయిన ముసోలినీ అతడి అడుగుజాడల్లో ఆక్రమణలు ప్రారంభించాడు. ట్యునీషియా, అల్భేనియా, కోర్సికా, నైస్ లపై ముసోలినీ కన్నువేశాడు. అంతవరకూ యూదులజోలికి పోనివాడు, హఠాత్తుగా యూదు వ్యతిరేక ప్రకటనలు చేశాడు. రష్యాకు వ్యతిరేకంగా ఒడంబడికలో చేరాడు. నానాజాతి సమితినుండి ముసొలినీ వైదొలగి ఇటలీని దురాక్రమణ దారుగా మార్చేశాడు. 1939 ఏప్రిల్లో అల్బేనియాపై దురాక్రమణచేశాడు.
ముసోలినీ చేసిన ఒకేఒక మంచిపని సిగ్మండ్ ఫ్రాయిడ్ విషయమై జోక్యం చేసుకొని, ఆయన్ను జర్మనీ నుండి బయటకు పంపమని సిఫారసు చేయడమే. 250000 ఆస్ర్టియన్ షిల్లింగులు తీసుకొని, ఇంట్లో ప్రవేశించిన నాజీలు ప్రాయిడ్ ను వదలేశారు ముసోలినీ నాలుగు ఐరోపా భాషలు ధారాళంగా మాట్లాటేవాడు. చర్చలలో ఆయనదే పైచేయిగా వుండేది. 1909లోనే ముసొలినీ హింస ఆవశ్యకతపై చర్చ చేశాడు.
ముసోలినీ బద్ధశత్రువు సుప్రసిద్ధ కేథలిక్ డిగాస్పెరి. అతడిని 1927లో ముసోలినీ జైల్లో పెట్టించగా పోప్ విడిపించి, 14 ఏళ్ళు వాటికన్లో రక్షణ కల్పించాడు.
రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ తో చేరిన ముసొలినీ ఇటలీని సర్వనాశనం చేశాడు. అయితే తన శక్తి హీనతను అతడు 1940 నాటికే గ్రహించాడు. 1943 జులై 10న సిసిలీని మిత్ర రాజ్యాలు ఆక్రమించిన తరువాత, పాసిస్టు కౌన్సిల్ సమావేశం ఏర్పరచి వారి విమర్శలన్నీ ముసొలినీ విన్నాడు. మిత్ర రాజ్యాలకు లొంగిపోయిన ముసొలినీని, జర్మనీ నియంత హిట్లర్ తప్పించి, మళ్ళీ రాజ్యాధిపతిని చేశాడు. 1945 మార్చిలో సోషలిస్టు విప్లవం తెస్తానంటూ ముసోలినీ కాగితపు పులివలె ప్రకటించాడు. చివరకు అతడు ఉరికంబానికి ఎక్కకతప్పలేదు. రక్తం చిందించ కుండా జీవిత ప్రయోజనం లేదని ముసొలినీ మూలసిద్ధాంతం.

No comments: