Sunday, July 15, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం




ఈ వారంలో ఇన్నయ్య గారి సీరియల్ 'వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు': అయిపోయింది. గత నెలలో చెప్పినట్లుగా, కొత్త సీరియల్ కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం ఈ రోజు ప్రారంభిస్తున్నాము. దీని పూర్వాపరాలు June 11, 2007 నాటి టపా లో మీకు తెలియపరిచాము.ఎప్పటివలే చదివి, మీ అభిప్రాయాలు తెలియచేయగలరు.

-cbrao

కారల్ మార్క్సుకు
కమ్యూనిస్టులు
పట్టించిన గ్రహణం




ఎన్. ఇన్నయ్య






భాను ప్రచురణలు
ఆకునూరు


పరిచయం


మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా ఈ గ్రంథపు మొదటి భాగం వ్యాసరూపంగా అచ్చయింది. సహజంగా, మేథావి వర్గంలో కొంత ఆసక్తిని, సంచలనాన్ని కలిగించాయి ఈ వ్యాసాలు. తర్జనభర్జనలు సాగాయి. ఎవరీ గ్రంథకర్త? ఇంతకూ అతను ఏం చెప్పదలిచాడు? ఈ గ్రంథ అంతరార్ధ మేమిటి? ఇవీ ప్రశ్నలు.
ఏ సిద్ధాంతాన్ని అయినా మూడు విధాలుగా పరిశీలించ వచ్చును. 1. వ్యతిరేక దృష్టి, 2. అంధ విశ్వాస వైఖరి, 3. విశ్లేషణాయుతమైన విమర్శనా పద్ధతి. ఇందులో మూడవ విధానాన్ని అవలంబించాడు శ్రీ ఇన్నయ్య. కావలసిన కారం, మందు గుండు సామగ్రి అందించలేదని రచయిత పై మార్క్సిజం పట్ల వ్యతిరేకులకు కోపం వచ్చింది. తమ ఆరాధ్య దైవాన్ని, తమ జీవితంలో భాగమైన తమ అభిమాన సిద్ధాంతాన్ని కొంతగా కొంతైనా విమర్శకు గురిచేసి దెబ్బతీశాడనే భావంతో మార్క్సిజాన్ని పిడివాదంగా స్వీకరించిన వారికి గ్రంథకర్తపై ద్వేషం కలిగింది. సహృదయులు మాత్రం ఓపికగా పరిశీలనకు పూను కున్నారు.
ఈ గ్రంథ లక్ష్యం చాలా పరిమితంగా కనపడుతుంది. మార్క్సిజంను గురించి సాకల్యంగా, కూలంకషంగా వివరించడం ఈ రచన ఉద్దేశం కాదు. మార్క్సు రచనలను కొన్నింటిని, జీవిత విశేషాలు కొన్నింటిని సోవియటు కమ్యూనిస్టు పార్టీ వారు బుద్ధి పూర్వకంగా ఆలస్యంగా ప్రచురించారనేదే విమర్శ. ఈ నేరారోపణ చేయటానికి సమాచారమూ, ధైర్యమూ కావాలి. ఈ రెండూ శ్రీ ఇన్నయ్యకు ఉన్నాయి. అధ్యాపకుడుగా నిజమైన విద్యార్ధిగా విషయ సేకరణలో శ్రీ ఇన్నయ్య సిద్ధ హస్తుడు. ఎమ్. ఎన్. రాయ్ భావ ప్రభావితుడై, అతని ఆలోచనా రీతిని ఆకళింపు చేసుకున్నవాడై, విశ్లేషణా పద్ధతిని సంతరించుకున్నాడు రచయిత. విమర్శకుడుగా ధైర్యం కావలసినంత ఉన్నది. ఇంకేం ప్రేల్చాడు ఫిరంగిని.
సోవియటు కమ్యూనిస్టులను దోషులుగా చిత్రిస్తూ వారు త్రొక్కి పెట్టారన్న రచనలను పేర్కొన్నాడు శ్రీ ఇన్నయ్య. 1. ప్యారిన్ ప్రతులు లేక 1844 ఆర్ధిక తాత్విక ప్రతులుగా పేరు పొందినది. 2. జర్మన్ ఐడియాలజీ (1846) 3. రాజకీయ ఆర్ధిక శాస్త్ర ప్రాతిపదికలు (1857) 4. కాపిటల్ ప్రథమ భాగం చివర చేర్చుటకు ఉద్దేశింపబడిన అధ్యాయం ఉత్పత్తి విధానాల తక్షణ ఫలితాలు.
1844 ప్రతుల తొలి ముద్రణ 1932లో, బహుళ ప్రచారం పొందిన ముద్రణ 1959లో, జర్మన్ ఐడియాలజీ తొలి ముద్రణ 1927లో, ప్రాతిపదికలు 1939లో అచ్చు అయింది మొదటిసారి. ఉత్పత్తి విధానాల తక్షణ ఫలితాలు 1933లో రష్యను భాషలో వెలుగు చూచింది. ఆంగ్లాను వాదం కాలేదు. ఈ ఆలస్యానికి కారణాలు బలీయమనీ శ్రీ ఇన్నయ్య అంటుంటే సోవియటు కమ్యూనిస్టు పార్టీ అభిమానులు ఆలస్యానికి విశేషార్ధం లేదంటున్నారు. గ్రంథం పూర్తిగా చదివితే ఇన్నయ్యగారి ఆరోపణలలో సత్యం లేకపోలేదని తేటతెల్లమవుతుంది.

కాగా రచయిత స్వరూపమేమిటి ? అనే ప్రశ్న పాఠకుడికి తరచు తగులు తుంది. రచయితను స్ధూలంగా మార్క్సిస్టు హ్యూమనిస్టు అని అభివర్ణించవచ్చు. మార్క్సు వై మనస్యతకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని, అదే మార్క్సు మూల సిద్ధాంతమనీ, తతిమ్మావన్నీ దానికనుగుణమని ఈ కోవకు చెందిన వారు వాదిస్తారు. వై మనస్యతకు మార్క్సు మొదట్లో ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవమేనని అందువల్ల మార్క్సు మానవ వాదియని కమ్యూనిస్టులూ, ఎమ్.ఎన్.రాయ్ అనుచరులైన భారత దేశపు రాడికల్ హ్యూమనిస్టులు అంగీకరిస్తారు. సమాజ సమస్యా విశ్లేషణానికి ఆర్ధిక నియతి వాదాన్ని వినియోగించటంలోనూ, సమాజాన్ని మార్చటానికి పేర్కొన్న రీతులు విధానాల సందర్భంగానూ మార్క్సు మానవవాద వ్యతిరేక ధోరణులను అవలంబించాడనీ హ్యూమనిస్టుల భావన. అలా కాక మానవ వాదానికి సంపూర్ణతను ప్రసాదించాడనీ సంప్రదాయ కమ్యూనిస్టుల వాదన. ఇలా మూడు వాదనలు ప్రబలంగా ఉన్నాయి.

మనిషి స్వభావానికి అనుగుణంగా ఉత్పత్తి జరగనప్పుడు, శ్రమ చేసిన వ్యక్తికి విముఖత కలుగుతుంది. తాను చేసే పని బలవంతపు పరిస్థితులలో చేస్తాడు. దీనినే వై మనస్యత అంటున్నారు. ఈ భావానికి లోనైన వ్యక్తికి తాను చేస్తున్న పని యొక్క సమగ్ర స్వరూపం అర్ధం కాదు. తాను తయారు చేసే వస్తువు, అలాగే ఇతరులు తయారు చేసే వస్తువుతో కలిసి ఎలా మరో పెద్ద వస్తువుగా ఎలా తయారవుతుందో తెలియదు. ఉదాహరణకు ఒక మోటారు కారు ఫ్యాక్టరీ తీసుకుంటే మోటారు కారులో ఒక భాగమైన ఒక రేకుకు చిల్లులు వేసే యంత్రాన్ని నడిపే కార్మికుడికి ఉత్పత్తి విధానం స్థూలంగా కూడా అర్ధం కాదు. తన పని తీరును నిర్ణయించేది తను కాదు. తన పని పరిస్థితులు నిర్ధారణ చేసేది తను కాదు. గతి లేక శ్రమ చేస్తుంటాడు. సహజంగా, తను చేసే పని మీద శ్రద్ధాసక్తులు ప్రదర్శించలేడు. తమ శ్రమ ఫలితంపై తనకు అధికారం లేదు. దాని వినియోగాన్ని శాసించేది ఇతరులు. ఇలాంటి పరిస్ధితులలో అతని వ్యక్తిత్వం నశిస్తుంది. ఈ వై మనస్యతకు పారిశ్రామిక కార్మికులు ఎక్కువ లోనవుతున్నారని మార్క్సు గ్రహించాడు. తమ జీవనోపాధికి అవసరమైన దానికన్నా ఎక్కువగా శ్రమిస్తే తప్ప కార్మికునికి భుక్తి దొరకడం లేదు. ఈ దయనీయ స్థితి చూసి మార్క్సు తల్లడిల్లి పోయాడు. మార్గాలు అన్వేషించాడు. వర్గ పోరాట చరిత్రే మానవ చరిత్ర అన్నాడు. సమాజంలో ఉండే ప్రధానమైన రెండు వర్గాలలో ఒకవర్గం రెండో వర్గాన్ని, దాని రాజకీయాధికారాన్ని నిర్మూలిస్తే తప్ప సమాజానికి విముక్తి లేదన్నాడు. వై మనస్యత పోదన్నాడు. అందుకై సమాజంలోని సంవదను సామాజికీకరణ చేయాలన్నాడు. సాయుధ విప్లవము శరణ్యమన్నాడు. సంధి కాలంలో శ్రామిక నియంతృత్వం వస్తుంది. చిట్టచివరి దశగా జర్మన్ ఐడియాలజీలో చిత్రించిన నాగరికత అవతరిస్తుంది. ఇలాంటి కమ్యూనిజంలో ఎవరికీ ఇతమిత్థమైన కార్యకలాపం అంటూ ఉండదు. తనకిష్టమైన చర్యలో వ్యక్తి పాల్గొంటాడు. ఉత్పత్తిని సమాజం క్రమబద్ధం చేస్తుంది. ఇవాళ ఒక పని చేస్తే రేపు ఇంకో పని చేస్తాడు. ఉదయం వేటాడితే, మధ్యాహ్నం చేపలు పడితే, సాయంత్రం పశువుల కావలా కాస్తే రాత్రి భోజనం వద్ద విమర్శ చేస్తాడు. కాని అంతమాత్రాన ఎవరికీ వేటకాడని, పశువుల కాపరియని, చేపలవాడని, విమర్శకుడని ముద్రలు వేయరు. అర్ధరహితమైన పని బలవంతంగా చేయవలసిన పని ఉండదు. ఇదీ మార్క్సు సిద్ధాంత సారం.
మార్క్సు సిద్ధాంతంలో భాగాలు మూడు. 1. మానవుని వైమనస్యత, 2. వైమనస్యత పోగొట్టడానికి మార్గాలు, 3. వైమనస్యత లేని సమాజ స్వరూపం. ఇలాంటి సమాజ స్థాపన మార్క్సు ఆదర్శం, లక్ష్యం. ఆ సమాజం అతని కలగా ఎంచవచ్చు. ఊహాలోకంలో విహరించే సోషలిస్టులని కమ్యూనిస్టులచే నిందింపబడేవారి కల లాంటిదే మార్క్సు ఊహా చిత్రణ. ఏదైనా ఊహలు లేకుండా అభ్యున్నతి కోసం ప్రయత్నం సాగదు. వచ్చిన చిక్కల్లా మార్గాల విధానాల నిర్ణయంలోనే ఉంటుంది.
సంప్రదాయ మార్కిస్టులు మార్క్సు విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ విధానం వల్ల ఏర్పడే కమ్యూనిస్టు సమాజంలో సంపద జాతీయీకరణ జరుగుచున్నది. ప్రభుత్వం జాతీయ సంపదకు యజమాని, పెత్తందారు. కనుక శాసన కర్త. వ్యక్తి పనిచేసే తీరు, పని విధానము పని పరిస్థితులు అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కనుక ఈ సమాజంలో కూడా వైమనన్యత పోదు. అయినా ఇలాంటి సమాజాన్నే సంప్రదాయ కమ్యూనిస్టులు కావాలంటున్నారు. దానికోసమే కృషి చేస్తున్నారు. కాబట్టి వైమనస్యతపై నొక్కు పెట్టే శ్రీ ఇన్నయ్య భావ స్రవంతి సంప్రదాయ కమ్యూనిస్టులకు నచ్చదు.
ఆదర్శ సమాజాన్ని సాధించడానికి మార్క్సు చెప్పిన విధానాలు లక్ష్యాన్ని సాధించలేవని ఎం.ఎన్.రాయ్ అభిప్రాయం. అదే నవ్య మానవ వాదుల ఆలోచనగా రూపొందింది. వ్యక్తిని నామమాత్రుని చేయటం, సమష్టియైన వర్గాన్ని ఉన్నతోన్నత స్థానంలో ఉంచటం జరుగుతున్నది. కమ్యూనిస్టు విప్లవ సాధన విధాన ఫలితంగా ఆర్ధర్ కోయిజ్లరు అన్నట్లు నేను అన్నది వ్యాకరణ శాస్త్రంలో భావన మాత్రమే. అంటే వ్యక్తికి స్థానం పోయింది. వ్యక్తి వైమనస్యతను పోగొట్టాలని తాపత్రయపడిన మార్క్సు చివరకు వ్యక్తినే నశింపు చేసే సమాజ నిర్మాణ విధానాన్నిసూచించాడు. ఇది మార్క్సిజం యొక్క ప్రత్యేకతయని హ్యూమనిస్టుల అభిప్రాయం. అందువల్లనే మానవ వాదిగా తాత్త్విక చింతన ప్రారంభించిన మార్క్సు సిద్ధాంతకారుడిగా మానవ వ్యతిరేకి అయినాడు. కనుక శ్రీ ఇన్నయ్య వైమనస్యత మాత్రమే నొక్కి చెప్తే, మార్క్సు తరువాత రచనలను, ఆలోచనా స్రవంతిని నిర్లక్ష్యం చేసినట్లు సంప్రదాయ రాడికల్ హ్యూమనిస్టులు అతనిని విమర్శిస్తున్నారు.
ఇలా రెండు రకాల విమర్శలను సంప్రదాయ కమ్యూనిస్టుల విమర్శలను, సంప్రదాయ రాడికల్ హ్యూమనిస్టుల విమర్శలను శ్రీ ఇన్నయ్య ఎదుర్కోవలసి వస్తున్నది. అతడు ఈ విషయమై మరో గ్రంథం రాస్తాడని ఆశించడంలో తప్పు లేదు.
గ్రంథం రెండవ భాగం మార్క్సుపై ఏంగిల్సు ప్రభావానికి సంబంధించినది. ఏంగిల్సు వల్ల మార్క్సు ఆర్ధిక శాస్త్రాధ్యయనంపై దృష్టి సారించాడనీ, ఏంగిల్సు గతి తార్కిక భౌతిక వాదాన్ని మార్క్సు యథాతథంగా ఆమోదించి సమాజానికి అన్వయించడం వల్ల చారిత్రక భౌతిక వాదం మార్క్సు ప్రవచించాడనేది ఒక ధోరణి. అలాకాక, మార్క్సు గతించినతరువాత మార్క్సు గ్రంథాల పరిష్కర్తగా, మార్క్సు ముఖ్య స్నేహితుడుగా ఏంగిల్సు మార్క్పిజానికి భాష్యకారుడు అయినాడు. అందులోనే ప్రమాదం ఉన్నది. వైమనస్యతకు
మానవుణ్ణి సముద్ధరించాలనే మార్క్సును ఏంగిల్సు కనుమరుగు చేశాడనేది మరో ధోరణి. ఈ రెండు ధోరణులను, భావాలను శ్రీ ఇన్నయ్య కొంతగా కొంత ప్రస్తావించాడు. ఈ రెండు విషయాలూ చాలా వివాదాస్పదాలు. ఐతే వివాదంలోనే శ్రీ ఇన్నయ్య రాణిస్తాడు నీళ్ళలో చేపలాగ.
విషయాలు ఇంకా వివరంగా రాస్తే బాగుండేదంటారు చదువరులు. నిజమే, దినపత్రిక చదువరికి మార్క్సిజాన్ని గురించి సమగ్రజ్ఞానం ఉంటుందనుకొని రాసినట్లుగా ఉన్నాయి వ్యాసాలు. శిసలైన రచయిత పత్రికా రచయితగా మారితే ఇదే ఇబ్బంది తటస్థిస్తుంది. రచనలో భావగాఢత, స్పష్టత, విశదీకరణ, శాశ్వతత్వము ఉంటాయి. రెంటినీ పోలిస్తే పత్రికా రచన తాత్కాలికం. గ్రంథ విస్తరణత్వానికి అవకాశం లేనిది. పైగా తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించేది. అందువల్ల కొన్ని విషయాలు చదువరులకు సుపరిచితమే అన్నట్లు నడుస్తుంది పత్రికా రచన. దాని స్వభావమే అది. శ్రీ ఇన్నయ్య తొలి దశలో పత్రికా రచయిత. తరువాత అధ్యాపకుడు అయి గ్రంథకర్తగా రూపొందాడు. ఇపుడు మరల పత్రికా రచయితగా మారాడు. కనుక శ్రీ ఇన్నయ్య వ్యాసాలలో రచనలో ఉండే భావగాఢత, సునిశితత్వము ఉన్నాయి. పత్రికా రచనలో ఉండే ఆసక్తిని రేకెత్తించడం, వివాదాన్ని ప్రోత్సహించడం, తీవ్రపదజాలం వాడడం ఇవన్నీ ఉన్నాయి. అతనిలో ఏ మోతాదు ఎక్కువ అనేది తాపీగా తేల్చవలసిన విషయం.
ఈ గ్రంథకర్త అధ్యయనవరుడు. ఎక్కువగా చదువుతాడు. బాగా ఆలోచిస్తాడు. భావప్రకటనకు వెనుదీయడు. నిర్భీతి అతని సొమ్ము. సమాజంలో ఇలాంటి వారిసంఖ్య బహుకొద్ది. వారి సంఖ్య పెరిగేకొలదీ సమాజాభివృద్ధికి అవకాశాలు పెచ్చు అవుతవి.
తను ఇంతవరకు సంపాదించిన జ్ఞానాన్ని, సంతరించిన పాండిత్యాన్ని వినియోగించి ఒక సమగ్ర తాత్విక రీతిని రూపొందిస్తూ శ్రీ ఇన్నయ్య రచన సాగిస్తాడని ఆశిద్దాం.

ఎం.వి. రామమూర్తి*.


*కీ.శే.మల్లాది రామమూర్తి,రాడికల్ హూమనిస్ట్ అసియేషన్ అధ్యక్షులుగా,Civil Liberties సంఘ నాయకులుగా,వికాసం మాస పత్రిక సంపాదకులుగా,ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సారధిగా పని చేసారు. తన భార్య మల్లాది సుబ్బమ్మను,మహిళా నాయకురాలిగా తీర్చి దిద్దారు. వీరు M.N.Roy అనుచరులు,లాయర్.

-cbrao

No comments: