Tuesday, July 31, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం -3

వైమనస్యతమనిషి ప్రకృతికి సన్నిహితంగా ఉంటూ ఉత్సాహంగా పాల్గొంటేనే మనిషికి అర్ధం ఉంటుంది. వ్యక్తిపరమయిన ఆస్తిగల సమాజంలో ఇది జరగడంలేదు. శ్రమ ఉత్పత్తి చేసే వస్తువు ఉత్పత్తి చేసిన వారికి ఎదురు తిరిగి అతనికి దూరంగా నిలబడుతోంది.
మనిషి స్వభావానికి అనుగుణంగా ఉత్పత్తి జరగనప్పుడు శ్రమ చేసిన వ్యక్తికి విముఖత కలుగుతుంది. (ఆర్ధిక తాత్త్విక ప్రతులు 1844 పుట 63 ప్రోగ్రస్ పబ్లిషర్స్, మాస్కో) తాను చేసే పని బలవంతపు పరిస్ధితులలో చేస్తాడు. పని చేయనప్పుడే తాను తానుగా ఉంటాడు. పనిచేస్తున్నంతసేపూ మనసెక్కడో పెడతాడు. (పైన ఉదహరించినదే - పుట 66) ఇలా వైమనస్యంతో ఉత్పత్తి జరుగుతుంటే ఆ ఉత్పత్తే నెత్తినెక్కి స్వారీ చేస్తుంది. ఉత్పత్తి కోసమే శ్రామికుడు ఉన్నాడా అన్నట్టు తయారవుతుంది రంగమంతా. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యవహారం.
వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ఉత్పత్తి విధానాల నుంచి మానవుని విమోచనాన్ని కోరాడు మార్క్సు. వైమనస్యం లేని ఉత్పత్తి విధానంలో మానవుడు విశ్వజనీనంగా తనను తాను గుర్తిస్తాడు. చైతన్యంగల వ్యక్తిత్వంగల మనిషిగా రూపొందుతాడు. సమాజంలో అన్ని కాలాలలో అన్ని రకాల మనుషులు కూడా ఈ వైమనస్యం పొందుతున్నారు. కాని చారిత్రక గమనంలో కార్మికులు మిగిలిన వారికంటే ఎక్కువ వైమనస్యం చెందుతున్నారు. వారి విమోచన జరిగితే మానవాళికి విమోచన జరిగినట్టే. మనిషికి దేనికీ సాధనంగా, కొరముట్టుగా, యజ్ఞపశువుగా మారరాదు. మార్క్సు దృష్టిలో మనిషి అన్నిటికంటే ముఖ్యం. సోషలిస్టు విధానంలో ఉత్పత్తి అంతా మానవ ప్రతిభావ్యుత్పన్నతలననుసరించి ఉంటుంది. పెట్టుబడిదారీ విధానంలో కృత్రిమ అవసరాల పేరిట ఉత్పత్తికి లొంగి పోతాడు.
కొంతకాలం క్రిందట సోవియట్ కమ్యూనిస్టులు కొత్తవాదన లేవదీశారు. యౌవనదశలో మార్క్సు చేసిన వాదనకు ఉత్తరోత్తరా మార్క్సు పరిణతికి చాలా తేడా ఉందని, తొలిదశలో వ్యక్తపరచిన భావాలకు తరువాత తిలోదకాలిచ్చాడని చెబుతూ వచ్చారు.
1844 పారిస్ ప్రతులలో మార్క్సు వెల్లడించిన భావాలే తరవాత గ్రంథాలలో వెల్లడయినాయి. ముఖ్యంగా క్యాపిటల్ లో వైమనస్యం గురించి మానవుని విమోచన గురించి చర్చ ఉన్నది. కనుక సోవియట్ వారి వాదన నిలబడదు. ఇంత సాధారణ విషయం వారికి తెలియక కాదు. అయితే ఒక చిక్కు వచ్చింది. మార్క్సు చెప్పిన భావాలకు సోవియట్ యూనియన్ లో ఆచరణ చాలా దూరంగా జరిగింది. సోవియట్ యూనియన్ చేసినదంతా మార్క్సిజమేనని వారు ముద్ర వేయదలచారు. ఆ వైవిధ్యమే ఈ రచనను దాచిపెట్టేటట్లు చేసింది.
నేడు మాత్రం కమ్యూనిస్టులు పారిస్ ప్రతుల పట్ల తమ పాత ధోరణి అంతా మార్చుకున్నారు. పరిణతితో మార్క్సు చేసిన రచనగా, గతి తార్కిక భౌతిక వాదిగా (?) కమ్యూనిస్టు భావాలు వ్యక్తం చేసినట్లు శ్లాఘిస్తున్నారు. (పై గ్రంథం 183 పుటలో).
మార్క్సు తరువాత గ్రంథాలలో వైమనస్యం, మానవ విమోచనల గురించి ప్రస్తావన ఉంటేను ఇప్పుడు 1844 పారిస్ ప్రతులను పొగుడుతుంటేను ఇక పేచీ ఏమున్నదని ప్రశ్న రావచ్చు.

మార్క్సు రచనలలో క్యాపిటల్ ముఖ్యమైనదిగా చిత్రించినా అందులో నొక్కు అంతా ఆర్ధిక విషయాలపైనే కనిపిస్తుంది. అక్కడక్కడ ప్రస్తావన ఉన్నా అది సీరియస్ గా పట్టించుకోవడం కష్టం.
ఇప్పుడు ఐరోపాలో కమ్యూనిస్టులు వారి సానుభూతి పరులు, మానవతావాదులు చాలా నిశితంగా మార్క్సు రచనలు పరిశీలిస్తున్నారు. ఆందులోను 1844 పారిస్ ప్రతులు యువతరాన్ని ఎంతో ఆకర్షించడం విశేషం.
మొరటు కమ్యూనిజం

ఈ గ్రంథాన్ని సోవియట్ యూనియన్ దాచిపెట్టడానికి మరొక ప్రధాన కారణం కనబడుతున్నది. కమ్యూనిజం (సోషలిజంగాని) మానవత ప్రధానంగా ఉండాలని మార్క్సు ఉద్దేశ్యం. సమకాలీన కమ్యూనిస్టు భావాలను, కమ్యూనిజం చరిత్రను పరిశీలించిన మార్క్సు, తన కమ్యూనిజం ఎలా ఉండాలో చెప్పాడు. మానవుడిని వైమనస్యంతో దూరం చేసే వ్యక్తిగత ఆస్తిని కమ్యూనిజం దాటిపోతుంది. మనిషి స్వభావానికి దాపులో కమ్యూనిజం ఉంటుంది. మనిషి మళ్ళీ తానుగా ఉంటాడు. ఈ కమ్యూనిజం పూర్తిగా అభివృద్ధి చెందిన సహజవాదం. అంటే మానవవాదంతో సమానంగా ఉంటుంది. చరిత్ర చిక్కుల్ని కమ్యూనిజం విడదీసి మనిషికీ మనిషికీ మధ్య వైరాన్ని తొలగిస్తుంది. (ఈ పుస్తకంలో 9వ పుట చూడండి.)
ఇందుకు భిన్నంగా ఉన్న మొరటు కమ్యూనిజాన్ని మార్క్సు ఖండించాడు. వ్యక్తిపరమైన ఆస్తిగా అందరికీ లేనిదాన్ని ఈ కమ్యూనిజం నాశనం చేస్తుంది. ప్రతిభను బలవంతంగా రాబట్టడానికి కృషి చేస్తుంది. భౌతికంగా యాజమాన్యం కలిగి ఉండడమే జీవిత ధ్యేయం అనుకుంటుంది.
ఈ మొరటు కమ్యూనిజంలో స్త్రీపట్ల దృక్పథం కూడా మొరటుగానే ఉన్నది. వివాహాన్ని వ్యతిరేకించి స్త్రీ సమాజపరం కావాలంటుంది. ఇది ఆలోచనా రాహిత్యానికి పరాకాష్ఠ. వ్యక్తిత్వాన్ని వ్యతిరేకించే ఈ కమ్యూనిజం తగదు. (ఈ గ్రంథంలో పుట 88 చూడండి.)
మనిషి మళ్ళీ మనిషి కావాలని కమ్యూనిజం అంటుంది కదా. అది అవగాహన చేసుకోకుండా రాజకీయ స్వభావంతోనే ప్రజాస్వామిక లేక నిరంకుశ విధానాలు అనుసరిస్తున్న కమ్యూనిజం ఒకటున్నది. రెండవది రాజ్యం హరించిపోవడం. వైమనస్యతకు గురై, ఇంకా వ్యక్తి పరమైన ఆస్తి ప్రభావం నుండి బయటపడలేక, ఈ స్థితి వరకు కమ్యూనిజం బయటపడలేకపోతున్నది. వ్యక్తిగత ఆస్తిసారం ఏమిటో మానవ స్వభావపు అవసరాలేమిటో గ్రహించలేని ఈ కమ్యూనిజం అసలు మూలసారాన్ని అవగాహన చేసుకోలేకపోయింది. (పుట 90లో).
కమ్యూనిజం మానవ ధ్యేయం కాదు. మానవాభివృద్ధిలో అది ఒక దశ మాత్రమే. మానవాభివృద్ధిని వ్యతిరేకించే విధానాన్ని కమ్యూనిజం వ్యతిరేకిస్తుంది. (పుట. 100-101) సంపూర్ణ మానవాభివృద్ధే ప్రధానం. కమ్యూనిజాన్ని గురించిన ఈ చర్చ సోవియట్ యూనియన్ కూ అన్వయిస్తుంది. అందునా తొలిదశలో బాగా వర్తిస్తుంది. బహుశ అది తగిలి ఆ గ్రంథాన్ని ఆపారనిపిస్తుంది. అంతకు మించిన సరైన కారణం మార్క్సు ఎంగిల్సు సంస్థ ఇస్తే తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.

లెనిన్ చదవని మార్క్సు గ్రంథం

జర్మన్ ఐడియాలజీ

మార్క్సు బ్రస్సెల్స్ లో ప్రవాస జీవితం గడుపుతూ తన భావాల స్పష్టతకై జర్మన్ ఐడియాలజీ వ్రాశాడు ఎంగెల్స్ చేయి కూడా ఇందులో ఉంది.
1932 జర్మన్ లో వెలువడిన తరువాత 1933లో మార్క్సు లెనినిస్టు సంస్థ మాస్కోలో రష్యన్ భాషలోనూ ఈ గ్రంథాన్ని ప్రచురించింది. అంటే మార్క్సు - వ్రాసిన 85 సంవత్సరాలకు తొలి ప్రచురణ జరిగిందన్నమాట. ఎంగెల్స్ అనంతరం జర్మన్ సోషల్ డెమొక్రాటిక్ పార్టీ చేతిలో ఈ గ్రంథం పడినందున వారికేమీ తొందర లేనందున ఇది ఆలస్యమైనందని సంజాయిషీ చెబుతున్నారు. (ది జర్మన్ ఐడియాలజీ - మార్క్సు - ఎంగెల్స్ - ప్రోగ్రస్ పబ్లిషర్స్ మాస్కో 1964 పుట 18).
కాని 1927లోనే మార్క్సుతొలి రచనలన్నిటితో కూడిన సంపుటిని మార్క్సు, ఎంగెల్స్ సంస్థ డి రసోజన్ (D. Rja zanov) సంపాదకత్వాన వెలువరించింది. 1932లో రాజకీయ కారణాలచే ఈ గ్రంథాన్ని ఉపసంహరించారు. (David Melellan Marx Before Marxism 1972 Penguin పుట. 269)
1846లో జర్మన్ ఐడియాలజీ ప్రచురించడానికి మార్క్సు, ఎంగెల్స్ చాలా ప్రయత్నించారు. ప్రచురణకర్తలతో సంప్రదింపులు సాగించారు. మార్క్సు తరఫున వేడిమేయర్ హెన్ లు కూడా ఈ ప్రయత్నాలు చేశారు. మొత్తం ఒక్కసారి ప్రచురించడానికి వీలు కాదనుకుంటే చిన్న చిన్న కరపత్రాలుగానైనా ప్రచురించడానికి మార్క్సు సుముఖత చూపాడు. 1847 చివరకు మార్క్సు ప్రయత్నించి ఏ ప్రచురణకర్త కూడా పూనుకోనందుకు విసిగి వేసారి ఆ ప్రతులను అవతల పారేశాడు. మొత్తం జర్మన్ ఐడియాలజీలో కార్ల్ గ్రూన్ పై వ్రాసిన విమర్శ మాత్రమే ప్రచురితమైంది. తన భావాలు నచ్చక ప్రచురించలేదని మార్క్సు అభిప్రాయపడ్డాడు. ఆ వ్రాత ప్రతులను ఎలుకలు కొరికే దుస్థితి పట్టింది.
జర్మన్ ఐడియాలజీ అనే గ్రంథానికి ఎందుకింత ప్రాధాన్యత అంటే అందులో సారాంశాన్ని సంక్షిప్తంగా చూద్దాం. మార్క్సు సమకాలీన యువ హెగెలియన్లతో తేల్చుకోదలచి వ్రాసిన గ్రంథమిది. ఫాయిర్ బాహ్, బాయిర్, స్టర్నర్, మాక్స్ గ్రూన్ ఇత్యాదుల సిద్ధాంతాలను కూలంకషంగా మార్క్సు విమర్శించాడు. అదికాక కమ్యూనిజాన్ని తాననుకునే తాత్త్విక విషయాల గురించి ప్రస్తావన చేశాడు. వాటిలో అతి ముఖ్యమైనవి చూద్దాం. అప్పుడు ఈ గ్రంథాన్ని కూడా కొన్నాళ్ళయినా ఎందుకు తొక్కిపట్టారో అర్ధమవుతుంది.
కమ్యూనిజం అంటే ఏమిటి మార్క్సు దృష్టిలో ? అదేదో స్థాపించవలసిన వ్యవస్థకాదు. ప్రస్తుతం వ్యవస్థను రద్దు చేయడం, శ్రమ విభజన అంతా తొలగి పోవడమే కమ్యూనిజం. (జర్మన్ ఐడియాలజీ పుటలు 44, 47 ప్రోగ్రస్ పబ్లిషర్స్, మాస్కో 1964) ఇలాంటి కమ్యూనిజంలో ఎవరికి ఇతమిత్థమైన కార్యకలాపం అంటూ ఉండదు. తనకిష్టమైన చర్యలో వ్యక్తి పాల్గొంటాడు. ఉత్పత్తిని సమాజం క్రమబద్ధం చేస్తుంది. ఇవ్వాళ ఒక పని చేస్తే రేపు ఇంకోపని చేస్తాడు. ఉదయం వేటాడితే, మధ్యాహ్నం చేపలు పడితే, సాయంత్రం పశువుల కాపలా కాస్తే, రాత్రి భోజనం వద్ద విమర్శ చేస్తాడు. కాని అంత మాత్రాన ఎవరికి వేటగాడని, చేపల వాడని, పశువుల కాపరని, విమర్శకుడని ముద్ర వేయరు. (పుట 44-45) అంటే మార్క్సు చెప్పే కమ్యూనిజంలో కూడిన, అర్ధరహితమైన, బలవంతంగా చేయవలసిన శ్రమ అంటూ ఉండదు. వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని విప్పార చేసుకోవడానికి వీలైన శ్రమ మాత్రమే ఉంటుంది. జీవితాంతం ఒకే వృత్తిలో కుమిలిపోవడం కాక, వ్యక్తి సంపూర్ణంగా తన వివిధ ప్రతిభా వ్యుత్పన్నతల్ని వెల్లడించు కోవడానికి వీలుంటుంది కమ్యూనిస్టు సమాజంలో. అనేక కార్యకలాపాల్లో ఒకటిగానే చిత్రాలు వేయవలసి ఉంటుంది. చిత్రకారుడంటూ ఒకరు ఉండరు. ఇదే మిగిలిన వాటికి కూడా అన్వయిస్తుంది.
నేటి సమాజంలో వ్యక్తులను ముఖ్యంగా శ్రామికులను బలవంతంగా శ్రమించేటట్టు రాజ్యవ్యవస్థ చట్టం వత్తిడి చేస్తున్నది. కనుక వ్యక్తులు వ్యక్తులుగా ఉండాలంటే రాజ్యం హరించాలి.
మార్క్సు కమ్యూనిస్టు వ్యవస్థను ఆచరణలో కమ్యూనిజాన్ని చూపుతున్నామనేవారిని పోల్చి చూచినప్పుడు జర్మన్ ఐడియాలజీని అణచి పెట్టడంలో ఆశ్చర్యం లేదు.
వై మనస్యత
పారిస్ ప్రతులలో మార్క్సు వైమనస్యత పై చేసిన చర్చ జర్మన్ ఐడియాలజీలో కొనసాగడం స్పష్టంగా చూడవచ్చు. వైమనస్యత కేవలం వస్తువుల ఉత్పత్తి వల్లనే కలుగదు. సామాజిక రాజకీయ పరిస్థితులు కూడా మనిషికి యజమానులై స్వారీ చేయడంవల్ల వైమనస్యత దాపురిస్తుంది. చరిత్ర అంతటా ఈ పరిణామం చూడవచ్చు. వైమనస్యత చెందిన వ్యక్తి పరిస్థితులకు బానిస అవుతాడు. వస్తువులకు దాసోహం అంటాడు. తన శక్తులన్నీ ఉడిగి పోతుంటే నిస్సహాయుడవుతాడు.
చైతన్యం
చైతన్యం మనిషి ఉనికిని నిర్ణయించదు. సామాజికంగా మనిషి ఉనికే అతని చైతన్యాన్ని నిర్ధారణ చేస్తుంది. తాత్వికంగా చాలా ముఖ్యమైన ఈ విషయాన్ని మార్క్సు జర్మన్ ఐడియాలజీలో చర్చించాడు. జర్మనీలో తత్వం దివి నుంచి భువికి దిగగా, తన తత్త్వం భూమిపై గట్టిగా కాళ్ళూని పైకి పోతుందన్నాడు. (పుట.37)
మార్క్సుపై మరొక విమర్శ చాలా కాలంగా వినవస్తున్నది. భావాలకు మార్క్సు ప్రాధాన్యత ఇవ్వలేదనేది ఇందలి ప్రధానాంశం. సామాజిక వాస్తవిక పరిస్థితులకు చెందని భావాలంటే మార్క్సు శీతకన్ను వేసిన మాట నిజమే. కాని పరిస్థితులను మానవుడు మలచగలడని మార్క్సు చెప్పాడు. చారిత్రక విధానం దానంతట అది సాగిపోతుంటే మానవుడు నిస్సహాయుడుగా చూస్తూ ఊరుకోడు. విప్లవం ద్వారా పరిస్థతులను మార్చేస్తాడు కనుక పరిస్థితులకు, చరిత్ర గమనానికి మానవుడు కీలుబొమ్మ కాదు.
సంపూర్ణ మానవుడుగా వికసించడానికి, వైమనస్యతతో ఏకపక్షంగా మనిషి - అభివృద్ధి చెందడానికి స్పష్టమైన గిరిగీసి చూపాడు మార్క్సు (ఎరిక్ ఫ్రామ్ వ్యాసం Marx’s Contribution to the knowledge of man - see page 68, The crisis of ?? Fawcett Premier Book 1970)
జర్మన్ ఐడియాలజీ వ్రాసే నాటికి మార్క్సుచాలా మారాడని పారిస్ ప్రతులలోని పదజాలం విడనాడాడనిచెప్పడం కద్దు. మానవ జీవుల వంటి పదాలు పారిస్ ప్రతులలో ప్రయోగించిన మార్క్సుజర్మన్ ఐడియాలజీలో వాటిని వదిలేశాడు. కానీ, ఇంతవరకు జరిగిన స్థాలీ పులాకన్యాయ, చర్చ ప్రకారం మార్క్సు ఆలోచనా విధానంలో మౌలికంగా మార్పు రాలేదు. పారిస్ ప్రతులనాటి ఆలోచనా విధానంలో మౌలికంగా మార్పు రాలేదు. పారిస్ ప్రతులనాటి ఆలోచన ఇంకా విస్తృతంగాను స్పష్టంగాను కొనసాగించాడు. ఆ మాటకు వస్తే పారిస్ ప్రతులు, జర్మన్ ఐడియాలజీ లలో వెల్లడించిన భావాలు కేపిటల్ లో కూడా వ్యక్త పరిచాడు. అందువల్ల యౌవనంలో మార్క్సుకంటే పరిణతి చెందిన మార్క్సు వేరు అనే వాదనలో పసలేదు.
మార్క్సు భావాలు తమకు సూటిగా వచ్చి కొట్టుకున్నందునే జర్మన్ ఐడియాలజీని ప్రచురించి కూడా నాలుక కొరుక్కొని వెంటనే ఉపసంహరించారు. తరువాత ఫాసిజంతో పోరాటం, రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో ఈ గొడవ ఎవరూ పట్టించుకోలేదు. స్టాలిన్ అనంతరంగాని జర్మన్ ఐడియాలజీకి వన్నె రాలేదు. (More…)

1 comment:

raju said...

మీ బ్లాగ్ చాలా బావుంది. నాకు తెలుగు లో బ్లోగ్ మొదలు పెడదామని ఉంది. తెలుగు లో వ్రాయడానికి www.quillpad.in/telugu కన్నా మంచి సాఫ్ట్‌వేర్ ఉంటే చెప్ప్పండి. అంటే ఇది చాలా బావుంది కానీ మీరు చాలా రోజుల నుంచి వాడుతున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా.