Sunday, July 8, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -11

బహుజన
గౌతులచ్చన్న బహుజన పత్రిక స్థాపించి, కొన్నేళ్ళు నడిపించారు. దీనికి పోలవరపు శ్రీహరి రావు మొదలు ఎందరో ఎడిటర్లుగా పనిచేశారు. నేను హైదరాబాద్ నుండి బహుజనలో లచ్చన్న జీవిత చరిత్ర 1970 వరుకూ ధారావాహికంగా రాశాను. అందుకుగాను లచ్చన్న డైరీలన్నీ పరిశీలించాను. లచ్చన్నను ఇంటర్వ్యూ చేశారు. అయితే కొన్ని సందర్భాలలో వ్యాఖ్యానాలు లచ్చన్నకు నచ్చలేదు. ఆ విషయంపైకి నాతో అనలేదు. బహుజనలో కొన్ని యితర వ్యాసాలు కూడా రాశాను. పత్రిక ఒక ప్రమాణం, స్థాయి లేకుండా, కేవలం లచ్చన్న ప్రీతిపాత్రంగా నడిచింది. విశాఖ నుండి కూడా కొన్నాళ్ళు నడచి ఆగిపోయింది.

వివిధ పత్రికలు

అనేక తెలుగు పత్రికలో ఆయా వ్యక్తుల కోరికపై నేను రాశాను. మండవ శ్రీరామమూర్తి స్వప్న సందేశం అనే పత్రిక విజయవాడ నుండి నడిపారు. గుంటూరు నుండి స్వతంత్రవాణి కొన్నాళ్ళు కొల్లా కృష్ణారావు నడిపారు. మన మార్పు కోసం అనే పత్రికను హైదరాబాద్ నుండి లిల్లీ, థామస్ నడిపారు. వీటిలో కొన్ని రచనలు చేశారు. తెలుగు అకాడమీ పత్రిక తెలుగులో వ్యాసాలు రాశారు. బండారు రత్న సభాపతి, గోరాశాస్ర్తి, గౌతులచ్చన్నపై ప్రత్యేక సంచికలు వెలువరించాను.
అమెరికాలో వుండగా 1992-2006 మధ్య తానా పత్రిక, ఆటా పత్రికలోనూ ప్రత్యేక మహా సభల సంచికలలోనూ వ్యాసాలు రాశాను. 1992లో ఆటా ఏర్పడి తొలి సభలు జరిపినప్పుడు, న్యూయార్క్ సమావేశాల సంచికలో సుదీర్ఘ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రాశాను. ఆటా తొలి సభలలో న్యూయార్క్ లో నన్ను సన్మానించి, బిరుదు ప్రదానం చేశారు. నండూరి రామమోహనరావుకు అదే సభలో సన్మానం చేశారు. బాల సుబ్రహ్మణ్యం మమ్మల్ని పరిచయం చేశారు. జంపాల చౌదరి ఎడిటర్ గా వున్న తానా పత్రికలో కొన్ని రచనలు చేశాను.
అమెరికా నుండి వెలువడే అమెరికన్ రేషనలిస్ట్, అమెరికన్ ఎథియిస్ట్, వాష్ లైన్, ఫ్రీ ఇంక్వైరీ మాగజైన్లలో వ్యాసాలు 1992-2007 మధ్య రాశాను.
వారెన్ ఎలెన్ స్మిత్ సంకలనం చేసిన పెద్ద గ్రంధం (who is who is in hell)కు ఇండియా గురించి సహాయపడ్డాను. గార్డన్ స్టైన్ (కీ.శే) సంకలనం ఎన్ సైక్లో పీడియా అన్ బిలీఫ్ కు భారత మానవవాద హేతువాద ఉద్యమాల గురించి రాశాను.
సంస్థల పక్షాన పత్రికలు నడపాలంటే నిధులు సమకూర్చి ఒక బోర్డును ఏర్పరచడం అవసరం.
భారత సెక్యులర్ సొసైటీ స్థాపించిన ప్రొఫెసర్ ఎ.బి.షా (అమృత్ లాల్ బికుషా) ఒక పౌండేషన్ నిధి సమకూర్చారు. సెక్యూలరిస్టు పత్రిక పెట్టి ద్యై మాస పత్రికగా నడిపారు. ఆయన 1981లో చనిపోయినా ఆ సంస్థ పక్షాన వి.కొ. సిన్హ సంపాదకత్వాన పత్రిక నడుస్తున్నది.
ది సెక్యులరిస్టు ద్వైమాస ఆంగ్లపత్రిక వి.కె.సిన్హ సంపాదకత్వాన బొంబాయి నుండి వస్తున్నది. అందులో అప్పుడప్పుడు నేను వ్యాసాలు రాశాను. ది ఛైల్డ్ ఎబ్యూజ్ పై 2005లో రాశాను.
ఇండియన్ స్కెప్టిన్ పేరిట బసవ ప్రేమానంద్, పోడనూర్ (కోయంబత్తూరు) నుండి మాస పత్రిక నిర్వహిస్తున్నారు. పట్టుదలగా ఒంటరిగా లాక్కొస్తున్నారు. (పూఫ్ రీడింగ్ సరిగా లేకున్నా, గెటప్ అసలు పట్టించుకోకున్నా పత్రిక నిర్విఘ్నంగా నడుపుతున్నారు. సత్యసాయి బాబా మొదలు అనేక మాతలు, స్వాములు, వారి గుట్టు బట్టబయలు చేశారు. ఫెడరేషన్ ద్వారా భిన్న సంస్థల సమాచారం అందిస్తున్నారు. ప్రపంచ పర్యాటన చేశారు. మాజిక్ ప్రదర్శనలిచ్చారు. అదంతా పత్రికా ముఖంగా వెల్లడించారు. అందులో నేను అనేక విషయాలు రాశాను 1995-2007 మధ్య.
హైదరాబాద్ నుండి ఎం. సుబ్బారావు రేషనలిస్టు వాయిస్ పత్రిక ఒంటరిగా నడిపారు. అందులో చాలా వ్యాసాలు రాశాను. ఫ్రూప్ రీడింగ్ లోపం బాగా వున్నది. కాని సమాచారం ఎంతో వ్యాసాల ద్వారా అందిస్తున్నారు. ఎడిటింగ్ లేకున్నా విషయ సేకరణ ముఖ్యంగా వుంది. హేతువాద ప్రచారం ముఖ్యాంశంగా పెట్టుకున్నారు.
నాస్తిక, హేతువాద పత్రికలు
వివిధ హేతువాద సంస్థలు నాస్తిక సంఘాలు తమ పత్రికల్ని నడిపిస్తున్నాయి. ఏవీ క్రమపద్ధతిలో వుండవు. పట్టుదల, ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. భారతనాస్తిక సమాజం ఆంధ్ర ప్రదేశ్ హేతువాద సంఘం మానవ వికాస వేదిక వంటివి పత్రికలు చేబట్టాయి. వాటిలో నేను అప్పుడప్పుడూ వారి కోరికపై వ్యాసాలు అందించాను. ఈ దర గోపీచంద్ అశ్లీలంపై తన పత్రిక ద్వారా నరసరావు పేట నుండి ధ్వజమెత్తారు. నేను ఆయన కోరికపై పరిమితంగా చర్చలో పాల్గొన్నాను.
వ్యాసాలు రాసినందుకు డబ్బిచ్చిన పత్రికలు బహుకొద్ది. అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, కే. రామచంద్రమూర్తి గారున్నప్పుడు వార్త, ఉదయం పత్రికలు, జమీన్ రైతు, విజయభేరి వున్నాయి. మిగిలిన పత్రికలలో రచనలకు నేను డబ్బు ఆశించలేదు కూడా. చిన్న పత్రికల వారెవరడిగినా వ్యాసాలు రాసేవాడిని. హేతువాది పత్రికకు సహాయంగా, నా పుస్తకాలిచ్చి, అమ్ముకున్న డబ్బు విరాళంగా స్వేకరించమన్నాను. అలానే తీసుకున్నారు. అచ్చువేసిన వ్యాసాల ప్రతిని పంపే సంప్రదాయం కుడా కొందరికే వుంది.
ఇన్ని పత్రికలు, చిన్నవి పెద్దవి, ఇంగ్లీషు తెలుగు భాషలలో అర్ధశతాబ్ధి రచనలు సంకలనం సాధ్యమా? రచయితలు తమ వ్యాసాలను అన్నీ దాచరు. కొందరు, కొన్ని అట్టి పెడతారు. పాత పత్రికలు అట్టి పెట్టే లైబ్రరీలు అరుదు. సంస్థలూ ఆట్టే లేవు.
ఇప్పుడిప్పుడే మైక్రో ఫిలిం, సి.డి.లు వస్తున్నా, చాలా మందికి అవి పరిచితం కాదు. పత్రికలు అట్టి పెట్టాలంటే సంస్థలకే కుదురుతుంది. అది ఖర్చుతో కూడిన పని. కాగితం నల్లబడి, ముక్కలై పోతుంది. పత్రికలు ఇండెక్సు తయారు చేయవు. విదేశాలలో న్యూయార్క్ టైమ్స్ వంటివి ఆ పని చేస్తున్నవి. ఈనాడు ఆ పని మొదలెట్టింది. ప్రతి చిన్న, పెద్ద పత్రికలు ఇండెక్స్ చేయాలి. అది రచయితలకు, రీసెర్చికి ఉపయోగపడతాయి.
పురావస్తు శాఖ సైతం యీ పని చేయడం లేదు. కంఫ్యూటర్లో లభించే సంస్థలు పనిచేయగలవు.
1982 తరువాత కొన్నాళ్ళు కందనాతి చెన్నారెడ్డి సంపాదకత్వాన నడచిన ఈ తరంలోనూ, దేవీ ప్రియ సంపాదకత్వాన సాగిన ప్రజాతంత్రలోనూ, సతీష్ నడిపిన నేటి రాజకీయంలోనూ వివిధ రాజకీయ వ్యాఖ్యానాలు, వ్యాసాలు రాశాను. దేవీ ప్రియ పత్రికలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర సేరియల్ కొంత కాలం వేశారు. ఈ పత్రికలు అంతగా సర్కులేషన్ వున్నవి కావు. వాటి ప్రభావం అంతంత మాత్రమే. ఆ పత్రికలన్నీ కొద్దికాలం నడచి ఆగిపోయినవే. వి. హనుమంత రావు గారు డేటా న్యూస్ ఫీచర్స్ పక్షాన కొన్నాళ్ళు బులిటేన్ నడిపితే, అందులోనూ రాశాను.
సి. నరసింహారావు జయప్రదంగా విజయవాడ నుండి రేపు మాసపత్రిక నడిపారు. ఆయన మరో పత్రిక నూతన ప్రపంచం పెట్టారు. రెండే సంచికలు వచ్చి, ఆగింది. రెండింటిల్లోనూ నేను రాశాను.

No comments: