Sunday, July 15, 2007

నర హంతకులు -9


స్పెయిన్ లో ఫ్రాంకో దహనకాండ

రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం 3 ఏళ్ళపాటు స్పెయిన్ లో దారుణమైన అంతర్యుద్ధం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మేధావులను, రచయితలను, జర్నలిస్టులను మభ్యపెట్టి, కమ్యూనిస్టులు తమ ప్రచార సాధనాలతో తమ కిరాతక చర్యలను కప్పిపుచ్చగలిగారు. అవి తరువాత గాని వెలుగులోకి రాలేదు.
సోషలిస్టు పార్టిలో వచ్చిన అంతఃకలహాలు స్పెయిన్ లో దేశ అంతర్యుద్ధానికి దారితీసింది. ప్రైమోడి రివేరా నియంతృత్వంతో చేతులు గలిపి సోషలిస్టు నాయకుడు ఫాన్స్ సినోలార్గో కాబెల్లెరో 1923 నుండి 30 వరకు పనిచేసాడు. కమ్యూనిస్టులు, అరాచక వాదులు కలిగిస్తున్న అలజడులను అణచివేస్తూ వచ్చారు. 1932 ఆగష్టులో జరిగిన సైనిక కుట్రను భగ్నం చేయగలిగారు. సోపలిస్టు పార్టి అధికారాన్ని చేపట్టాలని కాబెల్లెరో లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాని ఆయన పార్టిలో అతివాదులు చేరగా, ఆయనకు అదుపుతప్పింది. స్పెయిన్ లెనిన్ గా కాబెల్లెరోను చిత్రించి, అతి వాదనినాదాలిప్పించారు.
1933 నవంబరులో జరిగిన ఎన్నికలలో సోషలిస్టులు ఓడిపోగా యిక లాభం లేదని ప్రత్యక్ష చర్యలకు దిగారు. అరాచకవాదులు రైతుల్ని రెచ్చగొట్టగా సివిల్ గార్డులు నిర్ధాక్షిణ్యంగా అణచివేశారు.
సోషలిస్టు నాయకుడు హింసను రెచ్చగొట్టి, సమ్మెల్ని ప్రోత్సహించాడు. కాబెరెల్లో తలపెట్టిన సమ్మె విఫలంకాగా, రైతుల్ని బలవంతంగా లారీలలో ఎక్కించి వందలాది మైళ్ళ దూరాన వదిలేసింది సైన్యం. ఫ్రాన్సిస్కో ఫ్రాంకో సైన్యాధిపతిగా ఈ సోషలిస్టు తిరుగుబాట్లను అణచివేశాడు. స్పెయిన్ లో సైన్యంలో వామపక్షం వారు దూరారు. కమ్యూనిస్టులు తరచు వారికి కరపత్రాలద్వారా, తదితరంగానూ ప్రచారంచేసి చర్యకు పురికొల్పుతుండేవారు.
1936 ఫిబ్రవరిలో పాపులర్ ఫ్రంట్ స్పెయిన్ లో ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికలలో ఫ్రంట్ కు 50 శాతం ఓట్ల కంటే కొంచెం తక్కువ వచ్చాయి. వామపక్షాలతోపాటు, మితవాదులకు సైతం ఓట్లు పెరిగాయి. స్పెయిన్లో రెండోవిడత ఎన్నికలు జరిగితే గాని ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి బలం ఎవరికున్నదో తేలదు. కాని వామపక్షాలు ఆగకుండా తొలిఎన్నిక కాగానే ప్రభుత్వాన్ని ఏర్పరచారు. ఫ్రంట్లో మితవాద ప్రజాస్వామ్యపక్షం రోబ్లెస్నా నాయకత్వాన పోరాడి ఓట్లు పెంచుకున్నా సీట్లు తగ్గాయి.
1936 ఫిబ్రవరిలో అధికారాన్ని చేపట్టిన వామపక్ష ఫ్రంటు తక్షణమే చర్చీలను, కాన్వెంటులను తగులబెట్టే విధ్వంస కార్యక్రమం చేపట్టింది. పార్లమెంటులో ఏదో ఒక వంకతో మితవాదులను కూర్చోనివ్వకుండా ఆపారు. కమ్యూనిస్టుల ప్రభావం ఫ్రంటులో పెరిగింది. తెలివిగా, తక్కువ సీట్లు తెచ్చుకున్న కమ్యూనిస్టులు సోషలిస్టు యూత్ ఉద్యమంతో కలిశారు. విట్టోరియా కోడ్ విల్డా, శాంటి యాగోకారిల్టో అనే యిరువురూ ప్రముఖ కమ్యూనిస్టులుగా, రష్యా ఏజంట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫ్రంటువారు తక్షణ కార్యక్రమాన్ని ప్రకటించారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఫ్రంటు యివ్వలేక, వీధులలో యువకులను రెచ్చగొడుతూ, హింసను పురికొల్పారు.
1936 మేలో కమ్యూనిస్టుల చర్యలు ప్రారంభమైనాయి. సైన్యంలో తమకు అనుకూలురు కానివారిని సెలవుపై ఇళ్ళకు పంపారు. తరువాత పంటలు తగులబెట్టారు. ఫ్యాక్టరీలలో సమ్మెలు చేయించారు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. 160 చర్చీలు ద్వంసం చేశారు. 10 వార్తాపత్రికల్ని ఆపేశారు. 340 సమ్మెలు చేయించారు. రాజకీయ ప్రత్యర్దులను 269 మందిని చంపి మరో 1287 మందిని హింసించారు. మితవాదపార్లమెంటు నాయకుడు కాల్వోసోటెలోను 1936 జులై 11న చంపడంతో దేశంలో అంతర్యుద్ధానికి గంటకొట్టినట్టయింది.
1936 జులై 17న స్పెయిన్ లో అంతర్యుద్దం ప్రారంభమైంది. చర్చినుండి కాల్పులు సాగిస్తున్నారనే నెపంతో చర్చీలపై వామపక్షాలు దాడిచేశాయి. దేశంలో అంతర్యుద్ధ కారణంగా 11 మంది బిషప్పులను, పురోహితులను, మతగురువులను చంపేశారు. 283 నన్స్ ను హతమార్చారు. కొందరిని చెరచి, తరువాత చంపారు. కొందరు మతగురువులను సజీవ దహనం చేశారు. కొందరిని నిలువునా పాతేశారు. సోవియట్ రష్యా మద్దత్తుతో రహస్య పోలీస్ దళాలు బార్శిలోనాలో వామపక్షాలకు శిక్షణ ఇచ్చారు. కమ్యూనిస్టు యువ నాయకుడు గార్సియా అట్టూడెవ్ ఆధ్వర్యాన హత్యాకాండ విచ్చలవిడిగా సాగింది. దోచిన ఆస్తులతో, సంపదతో యితడు దక్షిణ అమెరికా పారిపోవడానికి ప్రయత్నిస్తే పట్టుబడ్డాడు. మొత్తం మీద కమ్యూనిస్టుల ఆధ్వర్యాన వామపక్షాల పేరిట 4 వేల మంది స్ర్తీలు, పిల్లలతో సహా మొత్తం 55 వేల మందిని చంపారు. ఇదంతా కప్పిపుచ్చడానికి ఆటోకాట్ధ్ పారిస్ లో ఒక కార్యాలయం పెట్టి ఫాసిస్టులు, జాతీయవాదులు హత్యాకాండ చేస్తున్నట్లు పుంఖాను పుంఖంగా అబద్ధాలు సృష్టించి, ప్రపంచాన్ని చాలా కాలం నమ్మించారు. ఇది కమ్యూనిస్టు కొమింటర్న్ విశ్వప్రయత్నాలలో ఒక భాగంగా సాగింది.
జాతీయ వాదులు చేసిన దారుణ హత్యాకాండ కమ్యూనిస్టులకు తీసిపోలేదు. మొత్తం 50 వేల మందిని చంపేసిన జాతీయవాదులు, పట్టుబడిన జనరల్స్ అడ్మిరల్స్ డిప్యూటీలను హతమార్చారు.
గవర్నరు, డాక్టర్లు, టీచర్లు కూడా జాతీయవాదుల బారిపడ్డారు. గ్రనాడాలో 8 వేలు, నవారేలో 8 వేలు, సెవిల్లిలో 9 వేలు, వల్గోడోలిత్లో 9 వేలు, సారగోసాలో 2 వేలు, బాలేరిక్ లో 3 వేల మందిని జాతీయవాదులు చంపేశారు.
ఫ్రాంకో 1936 జులై 16న టెట్యూషన్ కు వచ్చి ఇటలీ, జర్మనీ సహాయాన్ని అర్థించాడు. వెంటనే సహాయంరాగా, ఆగస్టు, సెప్టెంబరులో అంతర్యుద్ధం భవిష్యత్తు మారింది. కమ్యూనిస్టు ఫ్రంటుకు రష్యా ఫ్రాన్స్ సహాయం అందింది. ఆ విధంగా అంతర్యుద్ధం మరో రెండేళ్ళు సాగింది. జర్మనీవారు ఆయుధాలేగాక, సైనిక శిక్షణదారులను, సైన్యాన్ని కూడా ఫ్రాంకోకు అందించారు. అలాగే ముసోలినీ ఇటలీ కూడా సైన్యాన్ని, టాంకులను, ఆయుధాలను అందించింది. పోర్చుగీసు సహాయం కూడా ఫ్రాంకోకు వచ్చింది. ఇంకా మొరాకో సైన్యాలు వచ్చి అండగా నిలిచారు.
కమ్యూనిస్టులకు రష్యానుండి 900 టాంకులు, వెయ్యి విమానాలు, 900 సాయుధ శకటాలు, సైనిక సామాగ్రి వచ్చింది. ఫ్రెంచి సహయంలో 300 విమానాలున్నవి. కాని రష్యా అందించిన సహాయాన్ని స్పెయిన్ కమ్యూనిస్టులు సక్రమంగా వినియోగించుకోలేక పోయారు. జాతీయవాదుల దాడులతో వెనక్కు తగ్గిన కమ్యూనిస్టులు విదేశీ ఆయుదాలను శకటాలను ఎక్కడికక్కడే వదలేసి పారిపోగా, జాతీయవాదులు వాటిని స్వాధీనపరచుకొని వాడుకున్నారు.
రష్యా వెయ్యిమంది పైలట్లను, 2 వేల నిపుణులను పంపించింది. అటు కమ్యూనిస్టులకు యిటు జాతీయవాదులకు వచ్చిన విదేశీ సహాయం చూస్తే మొత్తం 40 వేల మంది విదేశీయులు అంతర్యుద్ధంలో పాల్గొన్నట్లు తేలింది. ఇందులో 30 వేల వరకూ సైన్యం కాగా, 10 వేల డాక్టర్లు, నర్సులు వున్నారు. ఫ్రాన్సు నుండి 10 వేలు, జర్మనీనుండి 5 వేలు, పోలండు నుండి 5 వేలు, ఇటలీ నుండి 3350, ఇంగ్లండు, అమెరికా నుండి 2500 చెప్పున వచ్చారు. అయితే ఏ సమయంలో చూచినా స్పెయిన్లో విదేశీ సైన్యాలు 18 వేలకు మించి లేరు. స్టాలిన్ ఎప్పటికప్పుడు స్పెయిన్ ఫ్రంటు ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటుంటే సోషలిస్టు ప్రధాని కేబల్లెరో సాధ్యమయినంత వరకూ నిరోధించాడు. కమ్యూనిస్టులు సోషలిస్టులు కలసిపోవడానికి నిరాకరించాడు. సోవియట్ రాయబారి మార్సెల్ రోజన్ బర్గ్ ను వెళ్ళగొట్టాడు. అతన్ని తక్షణం రష్యా పిలిపించి స్టాలిన్ చంపేశాడు. కమ్యూనిస్టులు రష్యా ప్రోత్సాహంతో ప్రధాని కాబల్లెరో సాధ్యమయినంత వరకూ నిరోధించాడు. కమ్యూనిస్టులు సోషలిస్టులు కలసిపోవడానికి నిరాకరించాడు. సోవియట్ రాయబారి మార్సెల్ రోజన్ బర్గ్ ను వెళ్ళగొట్టాడు. అతన్ని తక్షణం రష్యా పిలిపించి స్టాలిన్ చంపేశాడు. కమ్యూనిస్టులు రష్యా ప్రోత్సాహంతో ప్రధాని కాబల్లెరోను కూలదోయాలని విఫల ప్రయత్నం చేశారు. ఆ తరువాత కమ్యూనిస్టుల, స్టాలిన్ ప్రోత్సాహంతో జాన్ నెగ్రిన్ నాయకత్వాన్ని బలపరచారు. ప్రముఖ కమ్యూనిస్టు రోడిన్ కోర్టాడాను అరాచకవాదులు చంపడంతో అంతర్యుద్దం విజృంభించింది. కాబల్లెరో తన ప్రజా సైన్యాన్ని తీసెయ్యలేదనే నెపంతో ఆయన్ను తొలగించి, కమ్యూనిస్టు కీలుబొమ్మ నెగ్రిన్ ను అందలం ఎక్కించారు. అంతరంగిక శాఖను కమ్యూనిస్టులు స్వీకరించారు. పోలీసు కీలక ఉద్యోగాలు సైనిక స్థావర ఉద్యోగాలు కమ్యూనిస్టులు తీసుకున్నారు.
కమ్యూనిస్టుల ఆధీనంలో వున్న మాడ్రిడ్ పోలీస్ ద్వారా ఫ్రాంకో పేరిట దొంగ పత్రాలను సృష్టించి మాడ్రిడ్ ను పట్టుకొనే పధకాలు చూపారు. మంత్రి మండలిలో కమ్యూనిస్టులకు, ప్రధాని నెగ్రిన్ కు సైతం తెలియకుండా, స్పెయిన్ కమ్యూనిస్టు రహస్య పోలీస్ దళాధిపతి ఆర్గోప్ జూన్ 14న నాయకులందరినీ నిర్భంధించమన్నాడు. వామపక్ష నాయకులను, సభ్యులను 1937, 38లో నిర్భంధించి చిత్రహింసలకు గురిచేసి, చంపేశారు. బార్సిలో నాలో జరిగిన హత్యలు కమ్యూనిస్టుల ప్రత్యేక కృషే. విదేశీయులను కూడా వదలకుండా చంపేశారు. సుప్రసిద్ధ రాజకీయవాది విలీబ్రాంట్ (తరువాత జర్మనీ ఛాన్సలర్) సుప్రసిద్ధ రచయిత ఆర్వెల్ తప్పించుకోగా, అర్ధర్ కోసర్ జైలు పాలయ్యారు. స్పెయిన్ లో వామపక్షం అధికారంలోకి రావడానికి తోడ్పడిన వారందరినీ స్టాలిన్ చంపించాడు. ఫ్రాన్స్ లోని విదేశీ కమ్యూనిస్టు రహస్య దళాధిపతికి 1938 ఫిబ్రవరిలో సైనైడ్ యిచ్చి ఆయనను ఆఫీసులోనే చంపారు. స్పెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసిన రష్యన్ ఎహెన్ నో వాలెక్ ను 1938 మేలో రోటర్ డాంలో చంపేశారు. అలాగే రుడోల్ఫో క్లెమెంట్, వాల్టగ్ క్రివిట్ స్కీ (పశ్చిమ ఐరోపాలో రష్యా సైనిక గూఢచారి సలహా) దారులను 1941 ఫిబ్రవరి 10న వాషింగ్టన్ లో స్టాలిన్ గూడచారులు వెంటాడి చంపారు. ప్రావ్డాస్పెయిన్ విలేఖరి మై ఖేల్ కోల్ట్ జల్ను చంపారు. స్పెయిన్ లో ఆర్ధిక సలహాదారు ఆర్ధర్ స్టాస్కోవిస్కీని చంపారు. బార్సిలో నాలో కౌన్సిల్ జనరల్ అంటోనోప్ అసింకోను హతమార్చారు. స్టాలిన్ బంటుగా ప్రవర్తించిన అర్లొప్ మాత్రం యీ హత్యకాండ నుండి తప్పించుకుని, స్టాలిన్ అనంతరం కథ అంతా బయటపెట్టాడు.
కమ్యూనిస్టులు స్పెయిన్ లో ముఖ్యంగా ఇర్పెలోని చేసిన యీ దారుణ కిరాతక కృత్యాలు ప్రపంచం ఎందుకు చూడలేక పోయింది? కమ్యూనిస్టులు చేసిన ప్రచారం వలన స్పెయిన్ లో వారి హత్యా కాండ తాత్కాలికంగా మరుగుపడింది. విల్డిమూ జెన్ బర్గ్, ఆటోకాట్జ్ లు యిరువురూ స్టాలిన్ ఏజంట్లుగా గొప్ప కొమింటర్న్ ప్రచారానికి వన్నెచిన్నెలుదిద్ది. మేధావులను, రచయితలను మభ్యపెట్టగలిగారు. న్యూస్టేట్స్ మన్ సుప్రసిద్ద ఎడిటర్ కింగ్ స్లే మార్టిన్, సుప్రసిద్ద కవి డబ్ల్యు.హెచ్. ఆడెన్, ఎర్నెస్ట్ హెమింగ్ వే, యీ కమ్యూనిస్టు భ్రమలో కొన్నాళ్లు వున్నారు. ఫ్రెంచి కమ్యూనిస్టులు బ్రస్సెల్స్ లో అంతర్జాతీయ శాంతి సభలు జరుపుతూ మేధావులను పిలిపించి ఖర్చులు గురించి కొన్నాళ్లు సత్యాన్ని దాచగలిగారు. స్టీఫెన్ స్పెండర్ అగ్రకవులను రాచ మర్యాదలతో చూచాడు.
1937-38లో స్టాలిన్ రష్యాలోనూ, బయటి ప్రపంచంలోనూ హత్యాకాండ ముగించి, హిట్లర్ తో ఒడంబడికలకై సంసిద్దమయ్యాడు. దీని ప్రభావం స్పెయిన్ పై కూడా పడింది. ప్రాంకో యిదే అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని కమ్యూనిస్టులపై దాడిచేశాడు. 1937-38లో ఫ్రాంకో విజృంభించాడు. 1939 జనవరి 29లో బార్సిలోనాను, మార్చి 29న మాడ్రిడ్ ను పట్టుకున్న ఫ్రాంకో, రాజ్యాధిపతిగా స్థిరపడి 38 సంవత్సరాలు నిర్విఘ్నంగా పరిపాలించాడు.
అందర్యుద్ద ఫలితంగా జాతీయవాదులు 90 వేల హత్యకాగా, లక్ష, 10 వేల రిపబ్లికన్ సైన్యం చనిపోయింది. విమాన దాడులవలన 10 వేలు చనిపోగా లక్ష, 30 వేల మంది హత్యలకు గురైనారు. 5 లక్షల మంది ప్రవాసులై పారిపోయారు. ఆస్తినష్టం అంచనా వేయలేనంత జరిగింది.
1939 ఫిబ్రవరి 9న ఫ్రాంకో ఒక చట్టం చేసి నేరస్తులను ఒక్కొక్కరిగా విచారణ జరిపి శిక్షించాలన్నాడు. ప్రతిరోజూ విచారణను జరిపి, కాల్చి చంపేశారు. మాడ్రిడ్లో రోజూ సగటున 250 మందిని కాల్చారు. బార్సిలోనాలో రోజుకు 150 మందిని సెవిలీలో 80 మందిని రోజూ కాల్చి చంపారు. మొత్తం మీద ఫ్రాంకో ఆధ్వర్యాన కాల్పులకు గురై చనిపోయినవారి సంఖ్య వేలల్లో వున్నది. కాని చాలా మందికి 15 ఏళ్ల జైలుశిక్ష వేశారు. 1941లో 2, 33, 375 మంది స్పెయిన్ జైళ్లలో మగ్గారు. కొందరు జైళ్లలోనూ మరికొందరు ప్రవాసాలలోనూ చనిపోయారు. ఫ్రాంకో ఫాసిస్టు, నాజీలతో చేతులు కలిపినందున 1955 వరకు ఐక్యరాజ్య సమితితో స్పెయిన్ కు సభ్యత్వం ఇవ్వలేదు. 1974లో ఫ్రాంకో తన అధికారాలను జాన్ కార్లోకు దత్తం చేశాడు. 1975లో ఫ్రాంకో చనిపోయాడు. ఆ తరువాత స్పెయిన్ ప్రజాస్వామికం అయింది.

1 comment:

Nagaraja said...

గొప్ప మానవ సేవ చేస్తున్నారు మాస్టారూ. వందనాలు.