Thursday, November 1, 2007

Agehananda Bharati- 5


సైన్యంలో పూజలు, పరాభవాలు
యుద్ధంలో జర్మనులు ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది. తిరిగి వస్తున్న భారతసైన్యంతో పాటు నేను ఫ్రాన్సులో చాలా అందమైన ప్రదేశాలు చూశాను. మాలో నూరు మంది మళ్ళీ బ్రిటిష్ సైన్యంలోకి వెళ్ళిపోయారు. మాలో ఉన్న సిక్కులు ఎక్కడికక్కడ గురుద్వారా స్థాపించి గురు గ్రంథ సాహెబ్ను పెట్టుకొని రోజూ ప్రార్థనలు చేసేవారు. నేనూ అందులో పాల్గొనేవాడిని. వారి ఆచార వ్యవహారాలు నాకు బాగా తెలిశాయి.
మళ్ళీ జర్మనీ గ్రామాలలో, లోయలలో పయనించాం. అప్పటి వరకు భారతీయ సైన్యంలో సిక్కులు మాత్రమే నిత్యం ప్రార్థనలు చేస్తుండేవారు. జర్మనీలో అతి శీతల ప్రదేశమైన స్వాబియన్ జ్యూరాలో మమ్మల్ని ఉంచారు. అక్కడ నేను హిందూ దేవాలయాన్ని స్థాపించాను. ప్రతి శనివారం పూజలు చేసి ప్రసాదం పంచిపెట్టేవాణ్ణి. పురాణాల నుండి, భగవద్గీత నుండి కొన్ని భాగాలు చదివి వినిపించేవాడిని. కార్పోరల్ హర్ దయాళ్ సింగ్ తులసీదాస్ రామాయణం చదివి వినిపించేవాడు. నేను అనుకోకుండా ఒక పూజారిగా మారాను. భారతీయ సైన్యంలో సంస్కృతం వచ్చినవారు ఎవరూ లేకపోవడమే అందుకు కారణం. ఇదంతా 1944 క్రిస్మస్ సందర్భంగా జరిగింది. తరువాత మా సైన్యం ఆఖరు ప్రమాణం సాగించింది. రణధీర్ సింగ్ సార్జెంటు మేయరుగా మాకు నాయకత్వం వహించాడు. 15 మైళ్లు నడచి డాన్యూబ్ బ్రిడ్జి దాటి రైలులో ప్రయాణం చేశాం. స్టేయిస్ లింజన్ అనే చోట దిగి మళ్ళీ రాత్రింబవళ్లు మార్చ్ చేశాం. అంతలో ఫ్రెంచివారి టాంకులు ఎదురుకాగా రణధీర్ సింగ్ ఒక తెల్లబట్టను చెట్టుకు కట్టి లొంగిపోయినట్లు ప్రకటించారు. మళ్ళీ మమ్మల్ని జర్మన్ గ్రామాలగుండా నడిపించి యుద్ద ఖైదీల శిబిరాలలో పెట్టారు. మూడు రోజులకొక పర్యాయం చిన్న రొట్టె ముక్కను, చిన్న చేపముక్కను ఇచ్చేవాడు. ఒకరోజు సాయంత్రం బ్రిటీష్ ఆఫీసరు వచ్చి మమ్మల్ని ఉద్దేశించి ఇలా అన్నారు. మీరు మీ దేశానికి ద్రోహం చేశారు. నాజీలతో కలసి నవ్వుతూ ఆడుతూ, పాడుతూ మాతృదేశ పతాకాన్ని వదిలేశారు. ఇప్పుడేడవండి అన్నారు.
బ్రిటీష్ అధికారి అందరినీ ప్రశ్నిస్తూ నా దగ్గరికి వచ్చాడు. అంతకు ముందే నేను భారతీయుడిని కాదని చెప్పవద్దని నాతోటి సైనికులకు చెప్పి ఉంచాను. నావంతు రాగానే హిందూస్థానీలో మాట్లాడాడు. ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు నేను కాశ్మీర్ బ్రాహ్మణుడిని. నా పేరు రామచంద్రశర్మ అని, జర్మనీలో చదివానని చెప్పాను. తెల్లగా కాశ్మీర్ బ్రాహ్మణుడివలె వుండటం వలన అనుమానానికి తావులేదు. తల్లిదంద్రుల పేర్లు కూడా అప్పటికప్పుడు కల్పించి భారతీయ పేర్లు చెప్పాను. ఇదంతా అబద్ధమో నిజమో తెలుసుకునే అవకాశం వారికి లేదు. ఒకవారం తరువాత మమ్మల్ని లారీలోకి యెక్కించి స్ర్టాస్ బరీ వద్ద రైలు ట్రక్కులలో టులాన్కు పంపారు. అయిదు రోజుల ప్రయాణానంతరం ఆకలిదప్పులతో అక్కడకు చేరుకున్నాం. త్రోవలో ఒకచోట రైలాగినప్పుడు వాగన్ ప్రక్కనే నీళ్ళు త్రాగటానికి దూకబోయి పడిపోయాను. నాతోపాటు చాలమంది అలానే స్పృహతప్పి పడిపోయారు. నేను తరువాత జాక్ బూటు విప్పి నీటితో నింపుకున్నాను. తరువాత టూలాన్ లో జనం మమ్మల్ని ఉద్దేశించి ఇక నుండి వీళ్ళంతా బ్రిటిష్ ఆర్డరులో ఉంటారు. క్రమశిక్షణతో మెలగండని హెచ్చరించాడు. మమ్మల్ని మార్ సెల్స్ కు తీసుకెళ్ళి జర్మను యూనిఫారాలు తీయించారు. అక్కడ క్యాంప్ మాస్టరుగా వుండవలసిందిగా నన్ను కోరారు. వంటగదికి తీసుకు వెళ్ళి చూపెట్టి నన్ను ప్రత్యేకంగా తినమన్నారు. ఇంకెవరినీ పిలవవద్దన్నారు. వెన్న, పాలు, అన్నం, పప్పు, మసాలాలు, మాంసం, కూరగాయలు ఉన్నాయి. తెగ తిని నిద్రపోయాను. ఒక గంట తరువాత మెలకువ వచ్చింది. చాలా కాలం తరువాత మళ్ళీ వేడి వేడి భోజనం పెట్టారు.
హఠాత్తుగా నన్ను, మరొకరిని జీపు ఎక్కించి తీసుకెళ్ళారు. ఇండియాకు విమానంలో తీసుకెళుతున్నామని చెప్పారు. శార్దూల్ సింగ్ జిల్ ను, నన్ను ఒక అమెరికా విమానంలో ఓర్గీ అనే పట్టణానికి తీసుకెళ్ళారు. ఇద్దరు గూఢాచార అధికారులు మమ్మల్ని అనుసరించారు. ఇక్కడ మమ్మల్ని ఒకచిన్న గదిలో పెట్టి ఆరువారాల పాటు రాచమర్యాదలు చేసి అనేకసార్లు ప్రశ్నించారు. ఇందులో ఒక ఇండియన్ కెప్టెన్ ఉన్నారు. వారెవరూ నన్ను అనుమానించలేదు. బోసును గురించి, భారతసైన్యం గురించి, జర్మనులు, ఫ్రెంచివారు ఎలా చూచేవారు అనే విషయాలను అడిగేవారు. తరువాత మమ్మల్ని మళ్ళీ జర్మన్ సరిహద్దుకు తీసుకొచ్చారు. కలోన్ లో మధ్యాహ్నం భోం చేసి బయలుదేరాం. మాతో పాటు ఒకసార్జెంటు, ఇరువురు సైనికులు వున్నారు. త్రోవలో ఒక చోట ఇద్దరమ్మాయిలు కారును ఆపారు. సిగిరెట్లు అడిగారు. లిఫ్ట్ అడిగారు. మాతో వున్న సైనికులు మెషిన్ ఫిస్టల్ను, రైఫిల్ను మాకిచ్చేయగా మూడో వ్యక్తి తన పిస్టల్ ను డ్రైవర్ సీట్లో పెట్టాడు. అమ్మాయిలకు ప్రకృతి దృశ్యాలను చూపిస్తామని వారు ముగ్గురు ఆ అమ్మాయిలతో వెళ్ళిపోయారు. ఈ లోగా ఎవరైనా వస్తే పిస్టల్ తో కాల్చమని చెప్పారు. మధ్యలో ఒకటి, రెండు కార్లు అటు వెళ్ళినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కాసేపటికి వెళ్ళిన వారందరూ తిరిగి రాగా అమ్మాయిలు మా వెనుక సీట్లో కూర్చున్నారు.
కొన్ని మాసాలపాటు జైలుశిక్షను అనుభవించిన తరువాత నన్ను హెర్ ఫోర్డ్ బాల్యనేరస్తుల జైలులో పెట్టారు. మూడుమాసాల పాటు నన్ను ఏకాకిగా ఉంచారు. నేను బరువు తగ్గి సన్నబడ్డాను. ఆహారం బాగుండేది కాదు. డాక్టరు నన్ను పరీక్షించి ప్రతీరోజు రొట్టె, వెన్న యివ్వమన్నారు. నన్ను ప్రత్యేక ఖైదీగా చూశారు. గోడమీద పడే నీడను బట్టి నాకు టైమ్ తెలిసేది. గదిలోనే రోజూ గంటన్నర సేపు పడుకోబోయే ముందు ధ్యానం చేసేవాడిని. జైలులో ఒక చిన్న లైబ్రరీ వుంది. ఇంతకాలం ఆ పాటి చదువుకునే అవకాశం లేదు. ఒకరోజు హఠాత్తుగా ఒక సైనిక వాహనంలో నన్ను చాలా దూరం తీసుకెళ్ళారు. సార్ లాండ్ అనే అందమైన ప్రదేశంలో నన్ను ఒక భవనంలోకి తీసుకెళ్ళి సోదా చేసి ప్రక్క గదిలోకి ప్రవేశపెట్టారు. ముగ్గురు అధికారులు కూర్చుని పెన్సిళ్ళతో ఏదో బొమ్మలు గీస్తూ నన్ను ప్రశ్నించారు. జర్మన్ లో నీ పేరేమిటని అడిగారు. రామచంద్రశర్మ అని చెప్పాను. నటించవద్దు. నీ పేరు ఫిషర్ అన్నారు. గత మూడు నెలలుగా నన్ను ఏకాంత వాసంలో ఉంచి ఇవన్నీ కనుక్కున్నారన్నమాట. వియన్నాలో నన్ను గురించి విచారించి, విషయాలన్నీ కనుగొన్నారు. నా సహచరుడెవరో అనుకోకుండా విషయం చెప్పివుంటాడు. గూఢచారులు తమ అసమర్థతను తిట్టుకొని, ఆరా తీశారు.
ఒకరోజు నన్ను, శార్దూలసింగ్ ను లండన్ తీసుకు వెళ్ళి రెండు రోజుల తర్వాత పంపించారు. అనుకోకుండా మాకు లండన్ సందర్శనం జరిగింది.
ఆ తరువాత నన్ను హెమర్ కేంప్లో నెలరోజుల పాటు నిర్భంధిం చారు. ఒకరోజు హఠాత్తుగా వదిలేశారు. ఆర్స్ బర్గ్ వరకూ వచ్చేసిన తరువాత మళ్ళీ నన్ను అరెస్టు చేశారు. రెండు వారాలు రాజకీయ ఖైదీగా అట్టిపెట్టి మూన్ స్టర్ కు పంపించారు. నేనేమంత ప్రమాదకారిని కాదని గ్రహించారు.
చివరకు నన్ను వదిలేయగా 1947 జనవరి 27న వియన్నా చేరుకున్నాను. కుటుంబమంతా ఒకచోట సమావేశమైంది. ఇంట్లో చలి కాచుకోవడానికి తగినన్ని కటైలు కూడా లేవు. ఇంటిల్లి పాదీ ఎవరి బాధలు వారు ఏకరవు పెట్టారు.
యూనివర్శిటీకి వెళ్ళి తత్వశాస్త్రం, ఇండాలజీ అభ్యసించడానికి పేరు నమోదు చేసుకున్నాను. ఇండియన్ క్లబ్బులో పరిచితులైన వారిలో ఐదుగురికి ఉత్తరాలు రాశాను. ఇండియాలో మూడు మఠాలకు నన్ను పరిచయం చేసుకుంటూ ఉత్తరాలు రాశాను.
నేను మొదట్లో 1939లో మా మామవద్ద సంగీతం నేర్చుకున్నాను. తరువాత కుటుంబ కలహాల వలన వదిలేశాను. మళ్ళీ సంగీతంపై అభిలాష కలిగి మొదలు పెట్టాను. తాత్కాలికంగా ఇండియాపై ఆసక్తి సన్నగిల్లింది. ఆ తరువాత నేను ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డాను. మళ్ళీ హిందూతత్వంపై ఆసక్తి కలిగి వారిని వదిలేశాను.
1948 క్రిస్మస్కు ముందు నా వీసా దరఖాస్తును ఆమోదించినట్లు బెర్నీలోని భారతరాయబార కార్యాలయం తెలియజేసింది. క్రిస్మస్ నాడు బయలుదేరాను. ఒకటైప్ రైటర్, ఒక చిన్న కెమెరా, రెండు పుస్తకాలు, ఒక సూట్ కేసుతో ప్రయాణం కట్టాను. రైలులో వెనిస్ కు వచ్చి జెనివాలో ఓడ ఎక్కాను. నేను యూర్ నుండి బయలుదేరేటప్పుడు దృఢ విశ్వాసంతో వున్నాను. ఒక వియన్నా వ్యక్తి సన్యాసిగా మారడం విశేషం.

No comments: