Tuesday, June 3, 2008

సాహితి పరులతో సరసాలు 27
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి

(1901-1977)

చదివింది ఫిజిక్స్. నమ్మింది జిల్లెళ్ళమూడి అమ్మమహిమను. అన్నిటా ప్రవేశం. లండన్ లో పి.హెచ్.డి. చేసిన శ్రీపాద గోపాలకృష్ణ మూర్తితో, ఆయన చివరి దశాబ్దంలో పరిచయమైంది. చాలా సన్నిహితంగా కలసి పోయాం. అప్పట్లో నేను పి.హెచ్.డి. చేస్తూ, గోపాల కృష్ణమూర్తిని సంప్రదించేవాడిని. ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ నా టాపిక్ గావడం వలన, ఆయన కూడా ఆసక్తిగా చర్చించేవారు. విభేదించినా, స్నేహం పెరిగింది.
హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో సైన్స్ ప్రాజెక్టులో గోపాలకృష్ణమూర్తి పని చేస్తుండేవారు. 1968 నాటి మాట. ఇద్దరం మధ్నాహ్నాలు లంచ్ తింటూ అనేక చర్చలు చేసేవాళ్ళం.
నేను ఏర్పాటు చేసిన చర్చా గోష్టులలో గోపాలకృష్ణమూర్తి పాల్గొనేవారు. బర్కత్ పురాలో ఆసియన్ స్టడీస్ కేంద్రంలో ఆధునిక కవితా పోకడలపై చర్చ జరిపాం. అందులో అప్పుడే ప్రారంభమైన దిగంబర కవులంతా పాల్గొన్నారు. గోపాలకృష్ణ మూర్తి గారి ప్రసంగంతో చర్చ ఘాటుగా సాగింది. నగ్నముని (కేశవరావు, అసెంబ్లీలో రిపోర్ట్ ర్) జ్వాలాముఖి (బి.ఎ.లో ఫెలాసఫీ తరగతులలో నా స్టూడెంట్), చరబండరాజు, భైరవయ్య, అంతా వచ్చారు.
గోపాలకృష్ణమూర్తి అప్పటికే కవితా ధోరణులపై పత్రికలో రాశారు. భారతిలో ఎప్పటి నుండో రాస్తున్నారు. ఆయన ప్రవేశించని రంగం అంటూ లేదు. కళలు, శిల్పం, దేవాలయాలు, కవిత్వం, సైన్స్ వుండేవి. వినువీధుల శీర్షికన సైన్స్ ఎంతో చక్కగా అందరికీ అర్థం అయ్యే శైలిలో వివరించారు.
నేను తరచు గోపాలకృష్ణ మూర్తి యింట్లో కలసి, భోం చేస్తూ చర్చలు చేశాం. ఆయన ద్వారకా పురి కాలనీలో అల్లుడి యింట్లో వుండేవారు. (అల్లుడు రామారావు ఐ.ఎ.ఎస్. ఆఫీసర్). ఎటోచ్చీ జిల్లెళ్ళమూడి అమ్మ విషయమై తీవ్ర స్థాయిలో విభేదించాం. తన సైన్స్ జ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని జిల్లెళ్ళ మూడి అమ్మ మాటలకు భాష్యం చెప్పేవాడు. అది కేవలం సైన్స్ ను దుర్వినియోగం చేయడమని నేను విమర్శించే వాడిని. అయినా మా స్నేహానికి యీ విభేదాలు అడ్డు రాలేదు. జిల్లెళ్ళ మూడి అమ్మ గుట్టు బయట పెడుతూ మల్లాది రామమూర్తిచే పుస్తకం రాయించి, స్టేట్ బుక్ క్లబ్ పక్షాన ప్రచురించాను. అందరూ అవాక్కయ్యారు.
గోపాలకృష్ణ మూర్తి గారు నా సిద్ధాంత వ్యాసంలో భాగాలు విని, నియతి వాదంపై ఎం.ఎన్. రాయ్ వాదనలు బాగున్నాయన్నారు. సూరి భగవంతం అప్పటికే సత్యసాయి బాబా శిష్యుడుగా వున్నారు. ఆయన్ను దుయ్యబట్టేవారు శ్రీపాద. సాయిబాబాను ఖండించేవారు. గోపాలకృష్ణమూర్తి గారు టీచర్ గా, ప్రిన్స్ పాల్ గా చేశారు. బాగా పాఠాలు చేప్పేవారు.
పరిశోధనా తత్వంగల శ్రీపాద, వరంగల్లు ప్రాంతంలో దేవాలయాలు పరిశీలించారు. బౌద్ధ ఆరామాలను హిందూ దేవాలయాలుగా మారిన తీరుపై రాశారు. తిరుపతిలో వెంకటేశ్వర విగ్రహం స్త్రీ రూపంలో వుంటుందన్నారు. ఆయన రచనలు రాష్ట్ర ఆర్కియిలాజికల్ శాఖ ప్రచురించింది.
సాహిత్యంలో ఎన్నో వాదోపవాదాలలో పత్రికా ముఖంగా చర్చించారు. నండూరి రామమోహన రావు తెలుగులో సైన్స్ రచనలు చేయగా అందులో విపరీత దోషాలను, రచయిత అర్థం చేసుకోకుండా రాసిన అంశాలను శ్రీపాద ఎత్తి చూపి, ఘాటుగా విమర్శించారు. నండూరికి దిమ్మ తిరిగింది.
రచనలు : లేపాక్షి కళామండపం, స్వర కల్పన, కవితా పరిశీలనం, దేశి సారస్వతం, ఏకాంకికా పరిచయం, దాక్షిణాత్య శిల్పం, విజ్ఞాన వీధులు (సైన్స్), స్త్రీ ల పాటలు (సేకరణ), విజ్ఞాన సర్వస్వంలో భౌతిక శాస్త్రం పై రచన.

No comments: