Tuesday, June 24, 2008
ఫ్రాయిడ్ - 2వ భాగం
ఒడిపస్ కథ ఏమిటి?
మనో విశ్లేషణలో మూలసూత్రంగా స్వీకరించిన ఒడిపస్ సూత్ర కథ ఏమిటి? ఇది గ్రీకు గాథ. థీబ్స్ అనే ప్రాంతానికి రాజు లూయిస్. అతనికి పిల్లలు లేరు. ఆరకిల్ కొండ దేవతను అడిగితే, పిల్లవాడు పుడతాడు కాని వాడే నిన్ను చంపుతాడని చెబుతుంది. ఆ మాటలు నమ్మిన రాజు లూయిస్ తన భార్య జొకాస్తకు దూరంగా వుంటాడు. దీనికి ఆమె ఆగ్రహిస్తుంది. అతన్ని బాగా తాగించి, అతనితో జతకడుతుంది. ఆ తర్వాత పిల్లవాడిని కంటుంది. రాజు ఆ పసివాడిని లాక్కొని రెండు కాళ్ళు కలిపి మేకులు కొట్టి సిథారస్ పర్వతంపై పడేస్తాడు. లాయిస్ అనుకున్నట్లు ఆ పిల్లవాడు కొండపై చనిపోలేదు. ఒక పశువుల కాపరి చూసి కొరింత్ ప్రాంతానికి తీసుకువచ్చి, ఒడిపస్ అని పేరు పెడతాడు. ఆ ప్రాంతానికి రాజు అయిన పోలిబన్, రాణి పెరిబోయాకు పిల్లలు లేకుంటే, వారికి ఒడిపస్ ను ఇచ్చేస్తాడు. పిల్లవాడు పెరిగి, యవ్వనదశకు వస్తాడు. అతణ్ణి చూసిన స్నేహితులు తల్లిదండ్రులు పోలికలు అతనిలో లేవని నెపం వేస్తారు. సంప్రదాయానుసారం ఆరికల్ కొండ దేవత దగ్గరకు వెళ్ళి తనను గురించి అడుగుతాడు. నువ్వు నీ తండ్రిని చంపి, నీ తల్లిని పెళ్ళాడతావు ఫో అంటుంది. తల్లిదండ్రులను విపరీతంగా ప్రేమించిన ఒడిపస్ ఈ జోస్యం విని, తిరిగి కొరింత్ ప్రాంతానికి కాకుండా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. డాలిస్ ప్రాంతంవైపు వెడుతుంటే ఒకచోట ఇరుకుదారిలో రథంపై వస్తున్న లాయిస్ ఎదురౌతాడు. ఇద్దరూ ఎదురెదురుగా తప్పుకొని వెళ్ళేటంత వెడల్పు లేదు. ఒడిపస్ ను తప్పుకోమని లూయిస్ హుకుం చేస్తాడు. ఒడిపస్ నిరాకరిస్తాడు. రథం ముందుకు సాగగా, లూయిస్ రథ చక్రాలు ఒడిపస్ కాలును నలిపేస్తాయి. ఆగ్రహంతో లూయిస్ ను, రథసారధిని ఒడిపస్ చంపేస్తాడు. తాను చంపుతున్నది తన నిజ తండ్రినే అని ఒడిపస్ కు తెలియదు. థీబ్స్ వెళ్ళగా అక్కడ చిక్కు ప్రశ్నలు వేసే స్ఫినిక్స్ ఎదురౌతుంది. చిక్కుముడి విప్పినవారే బతికి ముందుకు సాగిపోగలరు. ఒడిపస్ ఆ చిక్కు ప్రశ్నల్ని విప్పి, నగరాన్ని పీడిస్తున్న స్ఫినిక్స్ ను వదిలిస్తాడు. నగరవాసులు ఆనందంతో అప్పుడే విధవగా మారిన జొకాస్తా రాణిని ఇచ్చి ఒడిపస్ కు పెళ్ళి చేస్తారు. ఆమె తన నిజమైన తల్లి అని ఒడిపస్కు తెలియదు. థీబ్స్ ప్రాంతానికి ప్లేగువ్యాధి వ్యాపిస్తుంది. డెల్విక్ దేవతను అడిగితే, లూయిస్ రాజును చంపినవాడిని వెళ్ళగొట్టమంటుంది. తానే చంపినట్లు ఒడిపస్ కు తెలియక, హంతకుడిని తరిమేస్తానంటాడు.
గ్రీసులో గౌరవపాత్రుడైన టైరిసియన్ అనే అంధుడు. ఒడిపస్ ను కలిసి, నగరం కోసం ఒక వ్యక్తి ఆహుతి కావాలంటాడు. తాను త్యాగం చేయటానికి సిద్ధమని జొకాస్తా రాణి తండ్రి ప్రకటిస్తాడు. కాని అసలు రహస్యం మరొకటి వున్నదనీ, దేవతలు బలికోరే వ్యక్తి వేరే వున్నాడనీ చెబుతాడు. తన కుమార్తె జొకాస్తాను పెళ్ళాడిన ఒడిపస్ ఆమె కుమారుడనీ, అతను చంపింది అతని తండ్రి లూయిస్ నేనని బయటపెడతాడు. ఒడిపస్ పొరుగురాజుకు ఎలా దత్తపుత్రుడో వెల్లడౌతుంది. జొకాస్తా ఆ కథోర సత్యం విని ఉరి వేసుకుంటుంది. ఆమె దగ్గరే ఒక పిన్ను లాక్కొని, కంట్లో పొడుచుకొని, ఒడిపస్ అంధుడౌతాడు.
ఇదీ ఒడిపస్ గాథ. ఫ్రాయిడ్ ఉదహరించే ఒడిపస్ కాంప్లెక్స్ ఈ గాథ నుండే స్వీకరించాడు. అదెలాగో పరిశీలిద్దాం. అసలు గ్రీక్ కథను ఫ్రాయిడ్ యథాతథంగా స్వీకరించలేదు. తన సెక్స్ సిద్ధాంతానికి అనుగుణంగా కథను మలచుకొని, భాష్యం చెప్పాడు. ప్రచారం చేశాడు. అది ఫ్రాయిడ్ సిద్ధాంత ప్రచారబలం.
ఒడిపస్ తన తండ్రిని చంపదలచుకోక వెళ్ళిపోయాడు. అసలు తండ్రి ఎవరో అతనికి తెలియదు. అడ్డొచ్చిన వ్యక్తిని చంపుతున్నప్పుడు తాను హతమారుస్తున్నది తన తండ్రినే అని ఒడిపస్ కు తెలియదు. తల్లిని పెళ్ళి చేసుకుంటున్నప్పుడు ఆమే తన తల్లి అనేది కూడా ఒడిపస్ కు తెలియదు. తల్లితో చిన్నతనం నుండే లైంగిక సంబంధం పెట్టుకోవాలని అతను కోరుకోలేదు. కనుక ఫ్రాయిడ్ సిద్ధాంతానికి ఒడిపస్ కథ యిమడదు. అయినా అదే కథను తీసుకొని, ఒడిపస్ చేసిందంతా అవ్యక్త అచేతన మనస్తత్వం బలం వల్ల అని చెప్పి లోకాన్ని నమ్మించడం ఫ్రాయిడ్ ప్రచార బలానికి నిదర్శనం.
ఒడిపస్ కాంప్లెక్స్ ప్రకారం తండ్రి పట్ల ద్వేషం, తల్లీ పట్ల కామం వుండాలి. అవి ఒడిపస్ కథలో లేవు. అయినా ఫ్రాయిడ్ ఒడిపస్ కాంప్లెక్స్ సృష్టించాడు. ఒక ప్రాచీన గాథను తన సిద్ధాంతానికి అనుగుణంగా మార్చుకోవడమే గాక, అది శాస్త్రీయమని చెప్పడం ఫ్రాయిడ్ బుకాయింపుతనం. ఇది సైకో ఎనాలసిస్ మూలాధారం. అది ఎవరూ పరీక్షకు పెట్టకుండా చాలాకాలం అంగీకరించడం విశేషం. ఫ్రాయిడ్ వాడి, ప్రచారంలో పెట్టిన సూపర్ ఈగో, ఇద్, ఈగో వంటి పదాలను ఆకర్షణ వున్నదేగాని శాస్త్రీయ పరిశోధనగాని, ఆధారాలతో కూడిన రుజువుగాని లేదు. అయినా కథకుడివలె ఫ్రాయిడ్ తరచు యీ పదజాలాన్ని వాడుతూ పోయాడు. అలా వాడగా, అదే నానుడిగా మారి, మూలాధారణ ఏమిటి అని అడగడం మరచిపోయారు జనం.
స్త్రీలు-ఫ్రాయిడ్
స్త్రీల పట్ల ఫ్రాయిడ్ ధోరణి, అవగాహన అశాస్త్రీయతకు పరాకాష్ట. ఆడపిల్ల పెరగడంలో ఆమె లైంగికంగా చిదికిపోవడం పెద్దమలుపు అంటాడు. పిల్లలు పుట్టించకుండా ఎద్దుకు వట్ట చితకకొడతారు. అలాగే పురుషాంగం స్త్రీలలో చితికిపోవడమే స్త్రీ లైంగిక లోపంగా ఫ్రాయిడ్ చిత్రించాడు. లైంగిక లోపాన్ని కప్పిపుచ్చుకోవడం స్త్రీ జీవిత పర్యంతం అవస్థగా మారిందంటాడు. మిగిలిన విషయాలలో మాత్రం స్త్రీకి వ్యక్తిగా గౌరవం వుంటుందన్నాడు. సెక్స్ సిద్ధాంతాలకు ఆద్యుడు, మూలపురుషుడు అని భ్రమపడేవారు తెలుసుకోవాల్సిన సత్యమిది. స్త్రీ పురుషుల మధ్య సెక్స్ సంబంధంలో ఆప్యాయతలు, ప్రేమ, వ్యక్తిత్వం వెల్లడి వంటివేమీ ఫ్రాయిడ్ దృష్టిలో లేవు.
ఆద్యంతాలూ యూదు జాతీయత
తన స్వీయగాథలలో ఫ్రాయిడ్ రాస్తూ తాను యూదుగానే వున్నానన్నాడు. అబ్రహాం, ఫెరెంకిలకు రాసిన ఉత్తరాలలో కూడా తన జాతీయతత్వం గట్టిగా చెప్పాడు. మనోవిశ్లేషణ ఉద్యమాన్ని, చికిత్సను, సిద్ధాంతాన్ని వ్యతిరేకించడాన్ని, విమర్శించడాన్ని యూదు వ్యతిరేకతగా ఫ్రాయిడ్ చూపిన సందర్భాలు లేకపోలేదు. యూదులలో మార్మిక దృష్టి లేదనీ, కనుక వైజ్ఞానిక దృష్టికి వారు బాగా పనికొస్తారని ఫ్రాయిడ్ ఉద్దేశం.
ఫ్రాయిడ్ పలుకుబడి, బహుళ ప్రచారం వల్ల అతడి సిద్ధాంతాన్ని ఆనాడు ఎవరూ టెస్ట్ కు పెట్టలేదు. సైంటిఫిక్ కాదని ఎవరైనా అంటే, విరుచుకుపడడం తప్ప, శాస్త్రీయ సమాధానం ఎన్నడూ రాలేదు. మతాలలో ఆత్మను అడ్డం పెట్టుకున్నట్లే, మానసిక రంగంలో సైకో ఎనాలసిస్ కారుడు అవ్యక్తం, ఉపవ్యక్తం వంటి పదాలను కవచాలుగా వాడారు. అది ఫ్రాయిడ్ ప్రచార సాధనం. అదే ప్రచార గొప్పతనం. ఫ్రాయిడ్ సైకో ఎనాలసిస్ చికిత్సా విధానాన్ని అక్షరాలా పాటించడం మానేశారు. చాలా మార్పులు వచ్చాయి. వాషింగ్టన్ సెయింట్ ఎలిజబెత్ సైకియాట్రి ఆస్పత్రిలో యీ విషయాలు గమనించాను. థామస్ సాజ్ ను సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో (న్యూయార్క్ రాష్ట్రం, అమెరికా) కలిశాను. ఆయన పుస్తకాలు, వ్యాసాలు గమనించాను. ఫ్రాయిడ్ శిష్యులు కూడా అనేక మార్పులు చేశారు. ఎరిక్ ఫ్రాం కూడా ఫ్రాయిడ్ గొప్పతనాన్ని గుర్తిస్తూనే, ఆయన లోపాల్ని చూపారు.
ఫ్రాయిడ్ స్వదస్తూరి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment