Monday, June 2, 2008
సాహితీ పరులతో సరసాలు 26
బెజవాడ గోపాల్ రెడ్డి
(1907-1997)
మిసిమి ఎడిటర్, మిత్రులు ఆలపాటి రవీంద్రనాథ్ నన్ను బెజవాడ గోపాలరెడ్డికి పరిచయం చేశారు. హైదరాబాద్ వచ్చినప్పుడు జూబ్లిహిల్స్ లో మాగంటి సుబ్బరామి రెడ్డి గెస్ట్ హౌస్ లో వుండే గోపాలరెడ్డి నాకు ఫోను చేస్తే వెళ్ళి కలసి కాలక్షేపం చేసేవాడిని ‘ఆమె’ కవితల రచనలు చేస్తున్న కాలం గనుక, అవి చదివి వినిపించేవారు. చక్కగా కబుర్లు చెప్పేవారు. కలసి సమావేశాలకు వెళ్ళేవాళ్ళం. ఇదంతా గోపాలరెడ్డి చివరి కాలంలో మాట.
అప్పటికి ఆయన పదవులనుండి రిటైర్ అయినందున, రిలాక్స్ అయ్యారు. ఆయన ఆహ్వానంపై నెల్లూరు వెళ్ళి కలిశాను. చాలా సింపుల్ గా ఎలాంటి భద్రతా దళం లేకుండా, సిబ్బంది సైతం లేకుండా వున్నారు.
అరమరికలు లేకుండా అనేక పాత సన్నివేశాల గురించి అడిగే వాడిని. కొన్నిటికి సమాధానం చెప్పేవారు. విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ అవార్డు యిప్పించడంలో తన కీలకపాత్ర వున్నట్లు అంగీకరించారు. వివాదాస్పద రాజకీయాలు ప్రస్తావనకు వస్తే దాటేసేవారు.
ఆయన రచనలు కొన్ని చదివాను. బెంగాలీ అనువాదాలు కృత్రిమంగా వుండేవి. బెంగాల్ లో శష్పం అంటే పచ్చగడ్డి అట. తెలుగులో ఆ మాటకు కొంత అశ్లీల ఆపాదన వుంది. అయినా గోపాలరెడ్డి అలాగే రాశారు.
ఇంతకూ మీరు తరచు రాసే ఆమె ఎవరు అని అడిగితే, నవ్వి, దాటేసేవారు.
గోపాలరెడ్డితో చివరి దశలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. ఆయన రాసిన ఉత్తరాలు కొన్ని స్టేట్ ఆర్కీవ్ తారనాక, హైదరాబాద్ వారికి అప్పగించాను.
రాజాజి మంత్రివర్గంలో (1937)
రాజకీయ జీవితం ఆరంభించి ఆంధ్ర ముఖ్య మంత్రిగా, తరువాత ఉప ముఖ్య మంత్రిగా సంజీవ రెడ్ది కింద చేయడానికి వెనుకాడక పోవడం విలక్షనమే.గవర్నర్ గా వివాదాలు లేకుండా గడిపారు .
నెల్లూరు యాస తో చక్కగా ఉపన్య సించే వారు.
రచనలు :
ఆమె జాడలు, ఆమె నీడలు, ఆమె తళుకులు, ఆమె బెళుకులు, స్ఫులింగాలు, దీపికలు, కళికలు, కలవాలనీ, సౌరభనీరజాలు, మలయమారుతాలు, ప్రసూనమంజరి, కలవాలనీ, సాహిత్య సుందరి, ఠాగూర్ రచనల తెలుగు అనువాదాలు, గాలిబ్ రచనల తెలుగు అనువాదాలు, ఇక్బాల్ కవితల అనువాదాలు మొదలగున్నవి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment