Monday, June 23, 2008

పుస్తక సమీక్ష-ఫ్రాయిడ్ కలలపై సరికొత్త శోధన!























రోగులను ఇలాంటి పడకపై ఉంచి ఫ్రాయిడ్ ప్రశ్నించి, విని విశ్లేషించేవాడు.




ఫ్రాయిడ్

1. Anti Freud. : Karl Kraus’s Criticism of Psychoanalysis & Psychiatry.
2. Myth of Mental Illness by Thomas Szasz.

ఇరవయ్యో శతాబ్దంలో కొత్త ఆలోచనలు పాదుకున్నాయి. మానసిక ప్రపంచంలోని అంశాల గురించి శోధించడానికి తగిన భూమిక అంతకుముందే ఏర్పడింది. ఇందుకు సిగ్మండ్ ఫ్రాయిడం చేసిన పరిశోధనలే మూలంగా ప్రచారమొందాయి. ఫ్రాయిడ్ పరిశోధనలు విభిన్నరంగాలపై, ప్రాంతాలపై ప్రసరించాయి. తెలుగునేల కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఆయన పరిశోధనల ప్రామాణికతపై ఇదివరలోనే ప్రశ్నలు తలెత్తాయి. సాహిత్య కళారంగాలకి సైతం ఫ్రాయిడ్ ఆలోచనల్ని అనుసంధానించి వ్యాఖ్యానించే పద్ధతి ఉంది. ఈ దృష్ట్యా ఫ్రాయిడ్ నేపధ్యాన్ని, ఆయన పరిశోధనల తీరును, వాటి ఫలితాల్ని గురించి తెలుసుకోవడం అవసరం. ఆయన ఆలోచనల్ని ఎంతవరకు ఆమోదించగలమన్న విషయాలపై సరైన అంచనాలకు రావడం తప్పనిసరి. ఇందుకు ఉపకరించే వ్యాసమిది.

జగమంతా సెక్స్ మయంగా చూసిన ఫ్రాయిడ్ ఒక శతాబ్దం పాటు ప్రపంచంలో ఎన్నో రంగాల్ని ప్రభావితం చేశాడు. ఐన్ స్టీన్, మార్క్స్, డార్విన్ కోవలో ఫ్రాయిడ్ ను చేర్చిన సంధర్భాలు లేకపోలేదు. రానురాను ఫ్రాయిడ్ ను బాగా అధ్యయనం చేసి, ఆయన చెప్పినవి, చేసినవి ఎంతవరకు నిలుస్తాయో పరిశీలించారు. ఆయన శిష్యులే గురువును కొంతవరకు నిరాకరించి, పనికొచ్చేవి ఏమిటో బేరీజు వేస్తున్నారు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ (1856-1939) నాస్తికుడు, హేతువాది, యూదు డాక్టరుగా ఆరంభమైన ఫ్రాయిడ్ ఈల్ లో గోనడ్స్ గురించి పరిశోధనతో రంగప్రవేశం చేశాడు. ఫ్రాయిడ్ పై గ్రీక్ సాహిత్య ప్రభావం అధికం. ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్ లలో జీవించిన ఫ్రాయిడ్, తన చివరి రోజులలో హిట్లర్ నాజీ నియంతృత్వ ధోరణుల వల్ల ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడే గడిపి కేన్సర్ తో చనిపోయాడు.

మతాన్ని ఆద్యంతాలు వ్యతిరేకించిన ఫ్రాయిడ్, మన చుట్టూ వున్న ప్రపంచంలో మనం సృష్టించుకున్న కోర్కెల లోకంపై, అదుపు పెట్టే యత్నమే మతం అన్నాడు. మతం అనేది ఒక భ్రమ అనీ, అయితే ఓదార్పు యిచ్చే విషయంగా అది పరిణమించిందనీ ఫ్రాయిడ్ అన్నాడు. మతం నుండి బయటపడినవారు, స్వేచ్ఛగా సంపూర్ణ జీవనం సాగించగలరని కూడా ఫ్రాయిడ్ చెప్పాడు. దీనితో మతస్తులు ఆయనపై విరుచుకపడ్డారు. క్రైస్తవ మతం, అందులోనూ కేథలిక్ శాఖ మానవ శ్రతువు అని కూడా స్పష్టం చేశాడు. ది ఫ్యూజర్ ఆఫ్ ఇల్యూజన్ లో ఫ్రాయిడ్ మత విమర్శ చేశాడు. (1927) విశ్వవ్యాప్తంగా వున్న మానసిక రుగ్మతగా మతాన్ని చిత్రించిన ఫ్రాయిడ్, దాన్నుండి బయటపడాలన్నాడు.















సృష్టి, ఊహ అనేవి ఫ్రాయిడ్ మూలాధారాలు. వాటిని జనం మధ్యకు తెచ్చి చర్చలో పెట్టాడు. ప్రతి వ్యక్తికీ కొద్దోగొప్పో యీ సృష్టి లక్షణాలుంటాయి. అందరూ వూహిస్తారు. సంకేతాలు వాడతారు. మనోవిశ్లేషణ సిద్ధాంతసారంగా ఫ్రాయిడ్ యీ సంగతి నొక్కి చెబుతాడు. ఫ్రాయిడ్ డాక్టరు. కాని అతని చికిత్సలో నయమైన రోగుల దాఖలాలు తక్కువ. అతని సిద్ధాంతాలు ప్రజాబాహుళ్యంలో తగ్గిపోతున్నా, కొన్ని మూలసూత్రాలు మాత్రం చర్చలో మిగిలాయి. బాధాకరమైన కోర్కెల్ని, వూహల్ని బలవంతంగా అణచివేస్తామనేది అందులో పేర్కొనదగింది. నోరుజారి మాట అనడంపై ఫ్రాయిడ్ వివరణ ఆకర్షణీయంగా మారింది. యంగ్ వంటి శాస్త్రపరుల పట్ల ఫ్రాయిడ్ రాగద్వేషాలు, సిద్ధాంత ప్రచారాలు సైకో ఎనాలసిస్ ఒక చికిత్సగా వ్యాప్తికి తేవడం, స్వప్నాలకు అర్థం చెప్పడం, యివన్నీ అతని ప్రజ్ఞకు నిదర్శనాలు. సనాతన మత నమ్మకాలు గల కుటుంబంలో పుట్టిన ఫ్రాయిడ్ తనకు నాస్తికుడుగా, అజ్ఞేయవాదిగా పేర్కొన్నాడు. కాని జీవితమంతా యూదుగానే వున్నాడు. యూదు సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లు ఫ్రాయిడ్ పాటించాడు.

వైద్యునిగా ఆరంభం

వియన్నా యూనివర్శిటీలో 1881లో ఫ్రాయిడ్ మెడిసిన్ డిగ్రీ పుచ్చు కున్నాడు. వియన్నా జనరల్ ఆస్పత్రిలో పనిచేశాడు. తరువాత 1883 నుంచీ నరాలపై దృష్టి పెట్టి అధ్యయనం చేస్తూ నిపుణుడుగా తేలాడు. పారిస్ లో అప్పటికే జీమార్టిన్ చార్కాట్ సుప్రసిద్ధుడుగా వున్నాడు. ఫ్రాయిడ్ 1885లో చార్కాట్ వద్ద అధ్యయనం చేశాడు. (1885-1886) తరువాత మెదడుపై ప్రత్యేక పరిశీలన మొదలెట్టి, రచనకు పూనుకున్నాడు. కాని అది ఎన్నడూ పూర్తి చేయలేదు. ఎందుకోమరి. నరాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఫ్రాయిడ్ తన తొలి రచన 1891లో వెలువరించాడు. నరాల విషయంలో అది గొప్ప గ్రంథంగా పేరొందింది. 1883లో నరాల పరిశీలన ఆరంభించిన ఫ్రాయిడ్ 1897 వరకూ అందులో నిమగ్ను డయ్యాడు. అది అతడి పరిశోధనగా దృష్టికి పరీక్షా సమయం. ఫ్రాయిడ్ కొత్తగా వైద్యం ప్రాక్టీసు చేస్తున్న రోజులలో ఎలక్ర్టో థెరపీ వుండేది. స్టడీస్ ఇన్ హిస్టీరియా అనే రచనలో ఫ్రాయిడ్ ఎలక్ట్రో థెరపీ ప్రస్తావన తెచ్చాడు.

ఫ్రాయిడ్ యిష్టపడిందీ, అసలు చికిత్సగా నమ్మిందీ మనోవిశ్లేషణ (సైకో ఎనాలసిస్) దీనివల్ల అతనికి పేరు, ప్రపంచ ఖ్యాతి వచ్చాయి. కొత్తపేర్లు ప్రచారంలోకి తేవడంలో, ఉపమానాలు వాడడంలో, గ్రీక్ రోమన్ గాథల నుండి ఉదాహరణలు స్వీకరించడంలో ఫ్రాయిడ్ దిట్ట. ముప్పయ్యవ యేట నరాల జబ్బులను కుదిర్చే డాక్టర్ గా జీవితాన్ని ఆరంభించిన ఫ్రాయిడ్ అనువాదాలు, పుస్తక సమీక్షలు చేసేవాడు. విద్యుత్ చికిత్స హిప్నాసిస్ (మోహనిద్ర) చికిత్సలు క్రమంగా విరమించి, కొత్త సిద్ధాంతంతో, సరికొత్త పదజాలంతో ఫ్రాయిడ్ తన ప్రాక్టీసు అవతారాన్నే మార్చేశాడు. అతన్ని ప్రపంచం గుర్తించింది. ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతం రావడానికి ముందు జోసఫ్ బ్రాయర్ (1842-1925) చికిత్స ప్రభావం వుండేది. దీనిని కథార్ సిస్ అనేవారు. ఇది కేవలం రోగితో సంభాషించడం. గ్రీక్ పదం కథార్ సిస్ ను చికిత్సలో చేర్చుకున్నారు.

రోగిని ఒకపడక కుర్చీపై ఆసీనులయ్యేటట్లు చేసి, మాట్లాడుతూ, వింటూ పోవడం యీ కథారసిస్ చికిత్స ప్రత్యేకత. పడుకున్న రోగి పక్కనే డాక్టరు కూర్చొని, ఒకానొక లక్షణం పై ఆలోచన నిలిపి, అందుకు సంబంధించిన పాత జ్ఞాపకాలన్నిటినీ చెబుతూ పొమ్మంటారు. ఆలోచనలకూ రోగానికీ సంబంధం చూడడం యీ చికిత్సలో ప్రధానాంశం. ఈ విధంగా వివిధ పద్ధతులు ప్రయోగిస్తూ ఫ్రాయిడ్, 1896లో మొదటిసారిగా సైకో ఎనాలసిస్ అనే మాట వాడాడు. ఆ మాటే ప్రపంచప్రసిద్ధి చెంది, వాడుకలోకి వచ్చింది. దీనికి పితామహుడుగా ఫ్రాయిడ్ సుప్రసిద్ధుడయ్యాడు. సైకో ఎనాలసిస్ (మనోవిశ్లేషణ) ఒక ఉద్యమంగా తలెత్తింది. వివిధ దేశాలలో ఎందరో యీ చికిత్సను అనుసరించారు.

ఫ్రాయిడ్ జీవితంలో విలియం ప్లెస్ (1858-1928) చాలా ముఖ్యుడు. అతనితో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాల వల్ల ఎన్నో లోతుపాతులు బయటపడ్డాయి. నరాల జబ్బుకు లైంగిక సంబంధమైన మూలం వున్నదని అతనివద్దే ఫ్రాయిడ్ గ్రహించాడు. సెక్స్ కారణాలుగా జబ్బులు వస్తాయని ఫ్రాయిడ్ అనేక ఉపమానాలు, కథలు, గ్రీకుగాథలు ఉదహరించి, విస్తారంగా వివరించాడు. పురుషులలో నరాల జబ్బు (న్యూరస్తేనియా) రావడానికి హస్తప్రయోగం కారణమని యిది యవ్వనారంభదశలో వస్తుందని అన్నాడు. యవ్వనదశలో స్త్రీలతో సంపర్కంగల పురుషులకు ఈ జబ్బు రాదన్నాడు. హస్తప్రయోగం వల్ల పిచ్చి వస్తుందనే నమ్మకం వైద్యరంగంలో ఫ్రాయిడ్ కాలం నాటికే బలపడి వుంది.
స్త్రీలలో హిస్టీరియాకు, నరాల జబ్బులకు యవ్వనారంభ దశలో బలవంతపు సెక్స్ ప్రయోగాలు కారణమని ఫ్రాయిడ్ అన్నాడు. పురుషులలో యవ్వనదశలో సెక్స్ ప్రయోగం రోగాన్ని రాకుండా చేస్తుంటే అదే సెక్స్ ప్రయోగం స్త్రీలలో రోగానికి దారితీస్తుందని ఫ్రాయిడ్ పరస్పర విరుద్ధనిర్ణయాలు చేశాడు.

ఫ్రాయిడ్ సెక్స్ సిద్ధాంతాలు ప్రపంచాన్ని బాగా ఆకర్షించాయి. తన సెక్స్ సిద్ధాంతాలకు తన సొంత అనుభవాలే కారణమని ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. సంభోగంలో రేతస్సు ముందుగానే పడిపోవడం, తృప్తిగా సంభోగం జరగకపోవడం రోగ లక్షణాలకు దారితీస్తున్నట్లు ఫ్రాయిడ్ చెప్పాడు. సుఖరోగాలను కూడా ఫ్రాయిడ్ తన సిద్ధాంతంలో స్వీకరించాడు. అలాంటి రోగాలను ఆపవచ్చుగాని, పూర్తిగా నయం చేయలేమన్నాడు. గనేరియా, సిఫిలిస్ వంటి లక్షణాలు దృష్టిలో పెట్టుకొని ఫ్రాయిడ్ తన సెక్స్ సిద్ధాంతంలో వివరణ యిచ్చాడు. క్రమేణా సైకో ఎనాలసిస్ అనే ఫ్రాయిడ్ సిద్ధాంతం పుంజుకున్నది. హిస్టీరియా, కలలు, కోర్కెల్ని అణచుకోవడం, చిన్నతనంలో సెక్స్, అచేతనం అనే వాటిని ఫ్రాయిడ్ ప్రచారంలోకి తెచ్చాడు. ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలోనే ఫ్రాయిడ్ తన సిద్ధాంత రచనలు లోకానికి చాటాడు. దీని ఆచరణకు ఉపక్రమించినవారు సైకో ఎనాలసిస్ ను ఒక ఉద్యమంగా స్వీకరించారు. ఎదురు చెప్పడానికి భయపడ్డారు. ఫ్రాయిడ్ పలుకుబడి అలా వుండేది.

మనోవిశ్లేషణ (సైకో ఎనాలసిస్)

ఫ్రాయిడ్ కనుగొన్నట్లు ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం పేరు సైకో ఎనాలసిస్. అంటే మనోవిశ్లేషణ. అదొక ప్రపంచ ఉద్యమంగా వ్యాపించి, సంఘాలు వెలిశాయి. అంతర్జాతీయ సంఘాధ్యక్షులుగా సుప్రసిద్ధ మనోవైజ్ఞానికుడు కార్ల్ యుంగ్ ను పెట్టి ఫ్రాయిడ్ ప్రచారం చేశాడు. వియన్నా సంఘాధ్యక్షుడుగా మరో మనో వైజ్ఞానికుడు యాడ్లర్ వున్నాడు. 1906 నాటికే ఫ్రాయిడ్ తన వినూత్న సిద్ధాంతాలు రాసి, ప్రచారంలో పెట్టాడు. వాటిని అమలులోకి తెచ్చాడు. ఎదురులేని విధంగా యీ సిద్ధాంతాలు అతిత్వరలో అల్లుకుపోయాయి. వైజ్ఞానిక దృక్పధంతో పరీక్షకు నిలుస్తాయా లేదా అని చూడదలచినవారు మైనారిటీ అయ్యారు. అలాంటివారు విమర్శలు ఆనాటి ప్రచారంలో కొద్ది మందికే చేరాయి.

హిస్టీరియా అంటే ఏమిటి, అణచివేతకు అర్థం ఎలా చెప్పాలి, కలలు వాటి స్వభావం, చిన్నప్పటి సెక్స్ ప్రవృత్తి, అచేతనం బలం గురించి ఫ్రాయిడ్ చెప్పినవి ఆకర్షణీయంగా అంటుకుపోయాయి. సైకో ఎనాలసిస్ రంగంలో ఫ్రాయిడ్ సిద్ధాంతాలు ప్రచారంలో పెట్టడానికి యాంగ్ యాడ్లర్ కు తోడు, కార్ల్ అబ్రహం, విల్ హెల్మ్ స్టెకల్ వంటివారు బాగా కృషి చేశారు. ఫ్రాయిడ్ అనంతరం కారన్ హార్నే, హారీస్టాక్ సల్లివన్, ఎరిక్ ఫ్రాంలు యీ రంగంలో నిలిచి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి గాంధి ఎలా వుండేవారో, సైకో ఎనాలసిస్ సంఘానికి ఫ్రాయిడ్ అలా నిలిచాడు. పదవులు నిర్వహించకపోయినా, పెత్తనం చేశాడు. ఆయన మాట చెల్లింది. వ్యతిరేకుల్ని చిత్తు చేసి నెగ్గుకురావడంలో ఫ్రాయిడ్ ఆరితేరాడు. యూంగ్, యాడ్లర్ క్రమేణా తమ సొంత వ్యాఖ్యానాలతో ఫ్రాయిడ్ కు దూరం అయ్యారు. అయినా ఫ్రాయిడ్ పలుకబడి తగ్గలేదు. సైకో ఎనాలసిస్ పై సర్వహక్కులూ తనకే వున్నాయని, అందులో అక్షరం మార్చాలన్న తన అనుమతి కావాలన్నట్లు ఫ్రాయిడ్ ప్రవర్తించాడు. మార్పులు చేసే హక్కు తన ఒక్కడికే వున్నదని చూపాడు. ఈ నేపధ్యంలో సైకో ఎనాలసిస్ సిద్ధాంతం ఆచరణ ఎలా సాగిందో గమనిద్దాం.

ఇది 20వ శతాబ్దపు విచిత్ర కథనం. ఫ్రాయిడ్ గొప్పతనం గమనార్హం. సైకో ఎనాలసిస్ లో మాట్లాడడమే ముఖ్యం. అటు వైద్యుడు, ఇటు రోగి ఇద్దరే వుంటారు. ఒకరు మాట్లాడుతుంటే మరొకరు వింటారు. రోగిని మాట్లాడనిచ్చి, అతని పదాలలో అర్థాన్ని గూఢార్థాన్ని సంకేతాలను విప్పి చెప్పడం సైకో ఎనాలసిస్ చికిత్స. ఈ విద్యలో ఫ్రాయిడ్ ఆరితేరినవాడు. గ్రీకు, రోమన్ గాథల నుండి ఎంతో అరువుతెచ్చి ఫ్రాయిడ్ తన రచనల్లో వాడాడు.

ఫ్రాయిడ్ మూలాధారం ఆవ్యక్త మనస్సు. అదే వ్యక్తుల్ని కదలించి, నడిపించి, మాట్లాడిస్తుంది. అంటే మానవుడిని అవ్యక్త మనస్సు నిర్దేశిస్తుంది. మానవుడు స్వేచ్ఛగా ఇచ్ఛాపూర్వకంగా ప్రవర్తించే శక్తిమంతుడు అనుకోవడం సరికాదు. మానవుడి ప్రవర్తన గురించి ది సైకో పాథాలజీ ఆఫ్ ఎవ్విరిడే లైఫ్ లో ఫ్రాయిడ్ వివరించాడు. దీని ప్రకారం స్వేచ్ఛగా ప్రవర్తించే అవకాశం లేదు. అవ్యక్త మనస్సు నడిపిస్తుంది. అవ్యక్తత నుండి ప్రవహించేవన్నీ మన చేతన దశను ప్రభావితం చేస్తాయి. ఇది తిరుగులేని విషయంగా ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. మార్టిస్ లూథర్, లియొనార్డో వంటి సుప్రసిద్ధ వ్యక్తుల ప్రవర్తన తన అవ్యక్త సిద్ధాంతాన్ని బలపరుస్తున్నట్లు చెప్పుకున్నాడు. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో చాలా వినూత్న ప్రయోగాలు, పదాలు, ఉపయోగాలు, కథలు కనిపిస్తాయి. అందులో గ్రీకుకథగా వుంటూ వచ్చిన ఒడిపస్ విషయాన్ని ఫ్రాయిడ్ స్వీకరించాడు. దీనినే ఒడిపస్ కాంప్లెక్స్ అంటారు. మనో విశ్లేషణలో కీలకపాత్ర వహించిన ఒడిపస్ కథను 1910లో మొదటిసారి ఫ్రాయిడ్ రంగం మీదకు తెచ్చాడు. ఫ్రాయిడ్ సెక్స్ సిద్ధాంతంలో మూల విషయంగా యిది పరిణమించింది. చిన్నతనంలో ఆరంభమయ్యే సెక్స్ ఆలోచన, ప్రవర్తన పెద్దదయిన తరువాత ఎలా ప్రభావితం చేస్తుందో చూపడానికి యీ కథను ఫ్రాయిడ్ వాడుకున్నాడు. ఫ్రాయిడ్ ప్రకారం ఏడాది వయస్సుకే పిల్లవాడికి తల్లిపై లైంగిక ప్రేమ అంకురార్పణ జరుగుతుంది. ఆడపిల్లలకు తండ్రిపై అలాంటి యిచ్ఛ వుంటుంది. ఇదే తండ్రిపై ద్వేషంగా పిల్లవాడిలోనూ, తల్లిపై ద్వేషంగా కుమార్తెలోనూ అంకురార్పణ అవుతుంది. దీనినే ఒడిపస్ కాంప్లెక్స్ గా చెబుతున్నారు. కానీ అసలు కథకి ఎన్నో వక్రీకరణలు చేశారు. కనుక మూలం ఏమిటో తెలిస్తే గానీ ఫ్రాయిడ్ విశ్లేషణల విశ్వసనీయత బయటపడదు.
రెండో భాగం లొ

ఒడిపస్ కథ ఏమిటి?

3 comments:

Bolloju Baba said...

ఒడిపస్ తో పాటు ఎలక్ట్రా కధ కూడా మీద్వారా వినాలని ఉంది. వివరించరూ?
బొల్లోజు బాబా

Anonymous said...

You have to write more than what you thought about him, He worte lots of books and it is not posble for common man like me to read his books. Hence I am going to read your article on him.

Anonymous said...

you can load free E books from this website
http://www.gutenberg.org/wiki/Main_Page