కావ్యజగత్తులో జి.వి. కృష్ణారావు
(1914-1979)
సాహిత్యంలో రామణీయకతల్ని చూపి, సిద్ధాంతీకరించిన గవిని వెంకట కృష్ణారావు కూచిపూడి (తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా)కు చెందిన పండిత కవి.
ఒరే, జనానికి అర్ధమయ్యేటట్లు రాయమని ఆయన మిత్రుడు ఎలవర్తి రోసయ్య అంటుండేవారు.
బి.ఎ. వరకూ చదివిన కృష్ణారావు తెనాలి వి.ఎస్. ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా, విజయవాడలో ఆలిండియా రేడియోలో ప్రోగ్రాం డైరెక్టర్ గా ఉద్యోగాలు చేశారు. బి.ఎ. డిగ్రీతోనే పి.హెచ్.డి. సంపాదించగలిగారు. కళాపూర్ణోదయం (పింగళి సూరన ప్రబంధ కావ్యం)పై ఇంగ్లీషులో సిద్ధాంతం రాసి మద్రాసు యూనివర్శిటీకి సమర్పించారు. కొంత తాత్సారం చేసిన ఎగ్జామినర్లు చివరకు డిగ్రీ యిచ్చారు. ఆ సిద్ధాంతాన్ని నేను తెలుగులోకి అనువదించాను. కొన్ని భాగాలు గోలకొండ పత్రికలో (హైదరాబాద్ నుండి వెలువడేది) ఆదివారాలు సీరియల్ గా 1962 ప్రాంతాల్లో ప్రచురించారు.
1940 నుండీ జి.వి. కృష్ణారావు మానవ వాద ప్రభావితుడై, ఎం.ఎన్. రాయ్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు ఆయన కళాసిద్ధాంత రచనల్ని ప్రోత్సహించారు. రాయ్ రచన తెలుగులో వర్గ సంబంధాలుగా కృష్ణారావు అనువదించారు. ఆయన కావ్య జగత్తు రామణీయకతల లోతుపాతుల్ని చూపింది.
కృష్ణారావు గద్యపద్య రచనలు చేశారు. నాటికలు రాశారు. నవలలు కథలు ఎన్నో రాశారు. అందులో కీలుబొమ్మలు మంచి ఆదరణ పొందింది. పాపికొండలు నవల పూర్తి కాకుండానే ఆగిపోయింది.
కృష్ణారావు వక్తకాదు. ఆకర్షణీయంగా కాకున్నా ప్రసంగాలు చేసేవాడు. ఆయన జీవితమంతా ఉబ్బసవ్యాధితో (ఆస్తమా) తీవ్రబాధ పడ్డారు. చివరి రోజులలో హైదరాబాద్ లో వున్నారు.
1955 నుండీ కృష్ణారావులో నాకు సన్నిహిత పరిచయం వుంది.
ఎం.ఎన్. రాయ్ సిద్ధాంతాలలో ముఖ్యంగా 22 సూత్రాలలో కొన్నిటితో విభేదించినట్లు చెప్పేవారు మానవుడు ప్రాయకంగా హేతువాది (Man is essentially rational) అనేది ప్రశ్నార్థకం అనేవారు. నిర్థారితవాదం, స్వేచ్ఛాపూరిత యిచ్ఛ అనేవాటిలో కూడా సందేహాలున్నాయనేవారు. కాని మార్గాంతరాలు సూచించలేదు.
కృష్ణారావు బాగా చదివేవారు. అధునాతన పాశ్చాత్య రచయితల్ని బాగా స్టడీచేసేవారు. తెనాలిలో అనేక సందర్భాలలో ఆయనతో కూర్చొని యిష్టా గోష్టి చర్చలు చేశాం. హైదరాబాద్లో యింటికి వెళి పరామర్శ చేసేవాడిని. రాడికల్ హ్యూమనిస్ట్ అధ్యయన శిబిరాలకు వచ్చి కృష్ణారావు ఉపన్యాసాలు చేసేవారు.
రచనలు : - Ph.D. Thesis Studies on Kalapoornodayam, విగ్రహ వ్యావర్తిని (అనువాదం), జే గంటలు (ప్లేటో తత్వం), ప్లేటో రిపబ్లిక్ అనువాదం (ఆదర్శ రాజ్యం), వరూధిని, శివరావు, యుగసంధ్య (కావ్యాలు), భిక్షాపాత్ర (నాటిక), బొమ్మఏడ్చింది (నాటకం), ఆదర్శ శిఖరాలు (నాటికలు), కీలు బొమ్మలు (నవల), పాపికొండలు (నవల), రాగరేఖలు (నవల), జఘనసుందరి (నవల), చైత్రరథం (కథలు), వర్గ సంబంధాలు (ఎం.ఎన్. రాయ్ రనచ అనువాదం).
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment