Saturday, June 21, 2008

సాహితీ పరులతొ సరసాలు 30 - సి నా రె


C. Narayana Reddy

సింగిరెడ్డి నారాయణరెడ్డి

ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాద్)లో సి.నా.రె. తెలుగు లెక్చరర్ గా వున్నప్పుడు, నేను కొన్నాళ్ళు ఫిలాసఫీ శాఖలో లెక్చరర్ గా (1967-68) పరిశోధకుడుగా పనిచేశాను. అప్పుడే మా పరిచయం ఆరంభమైంది.
నూరుల్ హసన్ కేంద్ర మంత్రిగా వున్న రోజుల్లో చరిత్ర గ్రంథాలను భారతీయ భాషల్లోకి అనువదించే పధకం తెచ్చారు. హిస్టారికల్ రీసెర్చ్ వారు తలపెట్టిన పుస్తకాలలో ఎం.ఎన్. రాయ్ రాసిన “మారుతున్న భారత దేశం” (India in transition) తెలుగు అనువాదం నేను చేపట్టాను. సినారె పరిష్కర్త, మొదటి ప్రతి రాసి, ఆయన దగ్గర చదివితే, సులభంగా అర్థం అయ్యేట్లు తెనిగించడం అవసరమని సలహా యిచ్చారు. నా ప్రథమ అనువాద ప్రతి కృత్రిమంగా వున్నట్లు భావించారు. నేనందుకు అంగీకరించి, మొత్తం తిరగరాశాను. ఆపథకం కొనసాగనందున, తెలుగు అకాడమీ వారు ప్రచురణకు స్వీకరించారు. కాని మారుతున్న భారత దేశం వెలుగు చూడలేదు. పరిష్కర్తగా సినారెకు, అనువాదకుడిగా నాకు కొంత డబ్బిచ్చారు. అలా మొదలైన మా పరిచయం స్నేహంగా మారింది.

నా పుస్తకాల, అనువాదాల సమావేశం 1988 లో తెలుగు అకాడమీ హైదరాబాద్ లో ఏర్పరచారు. ఎం.ఎన్. రాయ్ రచనలు, ఒక సెట్ గా విడుదల చేశారు. వైస్ ఛాన్సలర్ నవనీతరావు అధ్యక్షత వహించగా, సినారె ప్రధాన వక్త. ఆ రోజు సినారె రివ్యూ ప్రసంగం విని, జర్నిలిస్ట్ వి. సతీష్ (నాడు డేటా న్యూస్ ఫీచర్స్ లో, (నేడు జెమిని టి.వి.లో) పనిచేశారు). నాలుగు పెగ్గుల స్కాచ్ విస్కీ పుచ్చుకున్నట్లున్నదన్నారు.

ఎం.ఎన్. రాయ్ బృహత్తర గ్రంథం రీజన్ రొమాంటిసిజం రెవల్యూషన్ అనే రచనకు నేను వివేచన, ఉద్వేగవాదం, విప్లవం అని తెనిగించాను. సాహిత్యంలో ఉద్వేగం అనే పదానికి వున్న అర్థం వేరనీ, యీ రచనలో భావాన్ని నేను మరో కొత్త కోణంలో వివరించానని సినారె చెప్పారు. మొత్తం మీద అనువాదాలు చదివి, విశేషాలతో గంట ప్రసంగించారు.
సినారె తరువాత తెలుగు యూనివర్శిటి, ఓపెన్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ అయ్యారు.
తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా సినారె కు విజ్ఞప్తి చేస్తూ జ్యోతిష్యం అశాస్త్రీయమని, కోర్సుగా తగదని, విద్యార్థులకు జ్యోతిష్యం డిగ్రీలు యివ్వాలంటే శాస్త్రీయం అని సాక్ష్యాధారాలు చూపాలన్నాం.సినారే మా వాదనతో అంగీకరించి, శాస్త్రీయత చూపమని శాఖను అడిగారు. దీనిపై జ్యోతిష్యశాఖ సలహాదారుగా వున్న బెంగుళూరు జ్యోతిష్యుడు రామన్ మండిపడ్డాడు. సినారేపై నాటి ముఖ్యమంత్రి తదితరులకు ఫిర్యాదు చేశాడు. సినారె వెనక్కు తగ్గలేదు. అంతటితో ఆగక, నాకూ కొత్తపల్లి వీరభద్రరావుకూ తన ఛేంబర్ లో వాదోపవాదాలు పెట్టారు. ఉభయులవాదనా విని, సాక్ష్యాధారాలు చూపాల్సిందే అనే నావాదన వైపు మొగ్గారు.



Innaiah addressing the meeting in Ravindra Bharati Mini theatre-1973.
Sitting Right to left: C.Narayana Reddy, Sanjivadev, Mohanarao (Librarian,S.C.E.R.T) with child
Second row extreme left, behind Sinare : cbrao

సంజీవదేవ్ హైదరాబాద్ రాక సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశాను. అందులో సినారె వచ్చిపాల్గొని ప్రసంగించారు.

మిసిమిఎడిటర్ రవీంద్రనాథ్, నేనూ, సినారే అనేక పర్యాయాలు కలసి కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ, విస్కీ తాగాం. సినారేకు విస్కీ, కోడి మాంసం యిష్టం. అడిగి మరీ పెట్టించుకొని ఆనందించేవారు. బాగా కబుర్లు చెప్పేవారు. కాని విమర్శ సహించేవారు కాదు.Telugu Literary Personalities పై డి. ఆంజనేయులు ఇంగ్లీషులో ప్రచురించిన పుస్తకంలో (Publisher: P.Lal of Kolkataa) తనపై రాసిన విషయం పట్ల సినారె మండిపడ్డాడు. ఆంజనేయులు చాలా సమతూకంలో రాస్తూ, నిశిత వ్యాఖ్యానాలు చేశారు. అది సినారెకు నచ్చలేదు. ఆయనకు స్తోత్ర పాఠమే కావాలి. నేను ఆంజనేయులు వాదనవైపే మొగ్గాను.


నారాయణ రెడ్డి సభలలో మాట్లాడేటప్పుడు అందరూ శ్రద్ధగా వినాలని, నిశ్శబ్దంగా వుండాలని కోరేవాడు. సభలో ప్రథమ స్థానం, ప్రాధాన్యత కావాలనుకునేవాడు. తనకు గౌరవ ప్రదంగా యిచ్చిన బిరుదులు విధిగా ఇన్విటేషన్ లో వేయాలనేవాడు. కాని ఇతరులు మాట్లాడేటప్పుడు సినారే క్రమశిక్షణ పాటించేవాడుకాదు. సభారంజకంగా శబ్ద చమత్కారాలతో మాట్లేడే సి.నా.రే, బాగా డిమాండ్ లో వుండేవాడు.

నేనూ హేతువాదినే అని నాతో చెబుతుండేవాడు. తాను గుడులచుట్టూ ప్రదక్షణ చేయనని, బాబాలకు మొక్కనని, వారి సభలకు వెళ్ళననేవారు. కాగా, హేతువాదుల వలె బయటబడి ప్రచారానికి పూనుకోననేవారు.

సాహిత్య రంగంలో శ్రీశ్రీ పట్ల సినారేకి బాహట పోరాటమే వుండేది. సినారే భళారే, దేనికైనా సరే అంటూ శ్రీశ్రీ ఆయన్ను ఎద్దేవాచేశారు.
ఒకప్పుడు తెలంగాణా యువ జంటలుగా పేరొందిన దాశరథి (కృష్ణమాచార్య) సినారేలకు తరువాత అభిప్రాయ భేదాలు వీధికెక్కాయి. సినారే గత చరిత్ర విమర్శిస్తూ దాశరథి చెప్పారు.

అనేక సందర్భాలలో సినారే నేను కలసినప్పుడు, తన రచనలు సంతకం చేసి నాకు యిచ్చిన సినారే, నా రచనలు కూడా అలాగే స్వీకరించారు. ఆచార్య రంగా ఆయన యింట్లో అద్దెకుండేవారు కొన్నాళ్ళు. హైదరాబాద్ అశోక్ నగర్ లో, రంగా గారిని కలియడానికి వెళ్ళినప్పుడు సినారెని పలకరించేవాడిని. ఆతరువాత జూబ్లిహిల్స్ లో ఫిలింనగర్ క్లబ్ వద్ధ సినారే స్థిరపడ్డారు.

ఓపెన్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ గా సినారే ఏమంత సమర్థ పాలన చేయలేదు. అది ఆయన రంగం కాదు. అప్పుడు కలుస్తుండేవాడిని. ఒకసారి వెడితే, ఒక ఆకాశ రామన్న ఉత్తరం చూపెట్టారు. నేను వైస్ ఛాన్సలర్ ను ఉద్దేశించి రాసినట్లున్నది.
నేను చెప్పినట్లు వినకపోతే మంచిది కాదని హెచ్చరిస్తున్నట్లున్నది. నాకు చూపినప్పుడు, నవ్వుకొని, దొంగ ఉత్తరం అనీ, ఎవరో చిలిపిగా రాశారని అనుకున్నాం. అంతటితో ఆగింది. కాని అలాంటి ఉత్తరమే ఢిల్లీలో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా వున్న జి. రాంరెడ్డికి వచ్చింది. ఆయన అది నిజమేనని నమ్మి, నాకు ఫోను చేశాడు. అబద్ధమని చెప్పాను.
ఆ తరువాత ఒక సెమినార్ లో జి. రాంరెడ్డి ఓపెన్ యూనివర్శిటీ అసలు ఉద్దేశం అమలు పరచకుండా, తన వంది మాగధులతో పోస్టులు నింపి, సంప్రదాయ యూనివర్శిటి వలె నడిపాడని విమర్శించాను.

రామిరెడ్డి శిష్యులకు అది నచ్చలేదు. నా విమర్శకు రాంరెడ్డి బెంబేలెత్తి, నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయమని, అందరినీ కలసి చెప్పమనీ, ఢిల్లీ నుండి పురమాయించాడు. ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా వున్న కాలం అది. ఓ పెన్ యూనివర్శిటీ వారు సినారె నాయకత్వాన ముఖ్యమంత్రిని, అధికారులను, మంత్రులను, పత్రికల వారిని కలసి నాపై ప్రచారం చేశారు. దీని వలన నిష్ర్పయోజన మని నెలరోజులు తిరిగిన తరువాత తెలుసుకున్నారు. చాలా కాలం జి. రాం రెడ్డితో ఎడముఖం పెడముఖంగా వున్న సినారె, పదవుల వలన రాంరెడ్డికి యింత ప్రాధాన్యత యిచ్చారు. అదంతా వృధాశ్రమ అని తెలిసీ రాంరెడ్డి బంధుత్వం, పదవి దృష్ట్యా అలా చేశారు.

పింగళి జగన్మోహన రెడ్డి ప్రధాన న్యాయమూర్తిగా రిటైడ్ అయిన తరువాత, ఉస్మానియా విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ గా క్రమశిక్షణ తెచ్చారు. అప్పుడు జి. రాం రెడ్డి చేసిన తప్పుడు పనులు తెలిసి, తరువాత పుస్తకం రాశారు. రాం రెడ్డి గుట్టు బయట పెట్టారు. ఇంగ్లీషులో The university I served అని రాశారు. అది నేను తెనిగించాను. తెలుగు యూనివర్శిటీ వారు దానిని వేయడానికి అంగీకరించారు. ఆ లోగా వైస్ ఛాన్సలర్ మారి, సినారే వచ్చారు. రాం రెడ్డికి భయపడి వేస్తామన్న పుస్తకాన్ని పక్కన బెట్టారు. సినారే పక్షపాతం, పిరికితనం అలా వెల్లడయ్యాయి.

సినారే పబ్లిక్ డిమాండ్ వలన తానా, ఆటా సభలకు, అమెరికా ఇంకా కొన్ని యితర దేశాలు పర్యటించారు. సినిమాలలో కొంత వరకే రాణించారు. తరువాత ఆ రంగం నుండి విరమించారు. తెలుగు కవిత్వం, సాహిత్యంపై పిహెచ్ డి పుచ్చుకున్నారు.
జి. రాం రెడ్డి చనిపోయిన తరువాత మళ్ళీ సినారె నాతో మామూలుగా ప్రవర్తించారు. అధికార భాషా సంఘాధ్యక్షుడుగా సినారే ఏమీ చేయలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. పరిపాలనలో ఆయన మనస్సు పెట్టలేదు. తన భార్య పేరిట సాహితీ పురస్కారం ఏర్పరచాడు. ఆయనకు కుమార్తెలు వున్నారు. వారికి నదులు పేర్లు పెట్టారు. తెలంగాణా ఆంధ్రవివాదంలో, సమైక్య రాష్ట్రం వుండలన్నారు. ఆలపాటి రవీంద్రనాథ్ కు అమెరికా నుండి వచ్చిన బోగస్ డాక్టరేట్ డిగ్రీ సందర్భంగా సమావేశం ఏర్పరచి, ఆహ్వానిస్తే, సినారే నిరాకరించారు. ముందు డిగ్రీ సరైనదని నిర్ధారణ కావాలన్నారు. అలాంటి ఔచిత్యం పాటించిన సినారే, కుల పక్షపాతం పోగొట్టుకోలేదనే విమర్శ వుంది. కవితలలో అలాంటిది కనిపించదు.

రచనలు : కర్పూర వసంత రాయలు, విశ్వనాధ నాయకుడు, నాగార్జున సాగరం.
చదువు : ఉర్ధూ మీడియంలో
సినిమా పాటలు :
కవితలు : తెలుగు స్వతంత్ర
పద్యాలు : ఆంధ్రప్రభ, భారతి
ఉర్దూ, హిందీ : గజల్స్, రుబాయిలు
గేయనాటిక : అజంతా సుందరి

9 comments:

Kathi Mahesh Kumar said...

ఇన్ని రాజకీయాలు తెలుసుకుంటుంటే, ఆశ్చర్యంతో పాటూ బాధ కలుగుతోంది. చాలా కొత్త(తెలియని) విషయాలు చెప్పారు. నెనర్లు.

Bolloju Baba said...

బాగుంది. ఆశక్తికరం గా ఉంది.
బొల్లోజు బాబా

innaiah said...

the book title of Mr Dhulipudi Anjaneyulu is Glimpses of Telugu Literature.It is published by writers work shop of P Lal, Kolkata. It covers several personalities like Krishna Sastri, Viswanatha Satyanarayana, Palagummi Padmaraju, Sri Sri etc.

Anonymous said...

C NA Re's colours are known to the public for sometime.
your coments authenticat them.
you leftout his tirade againest
Seshandra

Anonymous said...

స్నేహితులలోని బలహీనతలను బయటపెట్టడం నీచం. నువ్వొక్కడివే పులుకడిగిన ముత్యానివా? నీకు దౌర్బల్యాలులేవా? నీకు ప్రముఖులతో ఉన్న పరిచయాలను ఈ విధంగా వారి వ్యక్తిత్వ హననానికి వాడుకోవటం బాగాలేదు. అయినా నేనుకూడా తప్పులు చేస్తాను అన్న ఆలోచన నీకు ఈ జన్మలో వస్తుందనుకోను.

Rajendra Devarapalli said...

అనానిమస్సు గారు(నంబరు రెండు)మీకు ఇన్నయ్య గారి గురించి బాగా తెలిసినట్లుంది.మీరూ ఒకబ్లాగురాయండి ఆయన గూర్చి,మేమూ తెలుసుకుంటాం.

రవి వైజాసత్య said...

సినారె గారి గురించి నాకు తెలీదు కానీ ఇన్నయ్య గారూ, హేతువాదమన్నారు, దేవుడు లేడన్నారు, జ్యోతిషం శాస్త్రం కాదన్నారు.. బావుంది. ఇలా వ్యక్తుల గురించి చర్చించడం మీలాంటి పెద్దవారికి తగునా? (only small minds discuss other people)

Kathi Mahesh Kumar said...

@అభిప్రాయానికి పేరైనా ఇవ్వలేని అనానిమస్ గారూ, సమజాన్ని ఉద్దరిస్తున్నట్టు మాట్లాడే అధికారం మీకు ఎవరు కట్టబెట్టారో అర్థం కావడం లేదు.

@రవి వైజాసత్య, బ్లాగులో ఏమిరాయాలో బ్లాగర్ల సొంతానికి వదిలెద్దాం. సమంజసమా అసమంజసమా అనికూడా తెలీని పెద్దవారు ఇన్నయ్యగారని నేననుకోను. వారికి ఆ మాత్రం విజ్ఞత ఉందని గుర్తిద్దాం. ఈ టపా శీర్షిక ఒక సారి మళ్ళీ చదవండి. ఇన్నయ్యగారి ఉద్దేశం, ఎవర్నీ కించపరచడం కాదు..అలా చెయ్యలంటే ఆయన బ్లాగు రాయరు, TV9 లో ప్రసంగిస్తారు.

సుజాత వేల్పూరి said...

బలహీనతలు మనుషులన్న వారికి ఎవరికైనా ఉంటాయి. కవులు, కళాకారులు, సంఘసేవకులను మనం గొప్పగ , రోల్ మోడల్స్ గా ఊహించుకుంటాం కాబట్టి, ఇలాంటివి చదివినపుడు బాధగా ఉంటుంది. ఈ వ్యాసం సినారె చూస్తే(ఈ వ్యాసంలో చర్చిన సినారె వ్యక్తిత్వం ప్రకారం) మనకు సినారె నుంచి మంచి వ్యాసం (బహుశా ఇన్నయ్య గారి గురించి) లభించగలదు.

ఇకపోతే సభలు సమావేశాల విషయంలో సినారె గురించి ఇన్నయ్య గారు రాసింది అక్షర సత్యం. హైదరాబాదులో ప్రతి సభకూ కాదనకుండా వచ్చే వక్తలుగా పేరు గడించిన ఏ, బి, సి, డి ల్లో 'సి ' ఎవరో కాదు!