Tuesday, June 5, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -7

ఆంధ్రజ్యోతి

1975లో నార్ల వెంకటేశ్వరరావుగారు ఇంటికి పిలిచి ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరోలో స్పెషల్ కరస్పాండెంట్ గా చేరమన్నారు. అందుకు అంగీకరించి చేరాను. సెక్రటేరియట్ ఎదురుగా ఒక మేడ గదిలో ఆఫీసు వుండేది. హెడ్ ఆఫీస్ విజయవాడలో. సంపాదకుడిపేరు నార్ల వెంకటేశ్వర రావు. అయినా వ్యవహారాలన్నీ విజయవాడలో నండూరి రామమోహన రావు చూసుకునేవారు. కొన్ని ప్రత్యేక శీర్షికలు రాయమని నార్ల కోరగా ప్రపంచంలో మహా పలాయనాలు, విశిష్ట రచయితలు, వివిధ భారతీయ భాషలలో సమకాలీన సాహిత్యతీరులూ రాశాను.
కార్ల్ మార్క్స్ కు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం సీరియల్ వ్యాసాలు సంచలనం కలిగించాయి. కమ్యూనిస్టు అగ్రనాయకుదు మాకినేని బసపున్నయ్య కు ఆ వ్యాసాలపై రియాక్షన్ రాయమని నండూరి రామమోహన రావు కోరారు. కానీ ఆయన రాయలేదు. ప్రామాణిక సమాధానాలేవీ చర్చలోకి రాలేదు.
హైదరాబాద్ బ్యూరో లో వున్న రామకృష్ణను ఢిల్లీకి మార్చి నన్ను చీఫ్ చేసారు. ఐ. వెంకట్రావు స్పెషల్ రిపోర్టర్ గా వచ్చారు. దామోదర స్వామి, వుడయవర్లు, రామానాయుడు పనిచేశారు. రాజకీయ నాయకులతో మెలిగే అవకాశం లభించింది. ముఖ్యమంత్రి గా జలగం వెంగళ రావు మంచి స్పందన చూపించారు. ముఖ్యమంత్రి గా చెన్నారెడ్డి నానుంచి ఇబ్బందికర ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆనాడు చెన్నా రెడ్డి పాలన కింద డ్రైనేజి బోర్డు ఛైర్మన్ కావడాన్ని నేను విమర్శించాను. అది సి.పి.యం. వారికి రుచించక పోయినా ఏమీ అనలేకపోయారు. చెన్నారెడ్డిని దుయ్యబట్టిన వందేమాతరం రామచంద్ర రావు ఆయనకిందే అధికార భాషాసంఘం అధ్యక్షుడయ్యారు. ఆయన్ను కూడా ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేశాను. భవనం వెంకట్రాం విద్యామంత్రి గా మిత్రులయ్యారు. వై ఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్. చంద్రబాబు నాయుడు, అనేకమంది రాజకీయవాదులకు, ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నాయకులకు సన్నిహితం గా మెలిగే అవకాశం లభించింది. ముఖ్యమంత్రి గా జలగం వెంగళ రావు మంచి స్పందన చూపించారు. ముఖ్యమంత్రి గా చెన్నారెడ్డి దగ్గరయ్యారు. శాసనసభ రిపోర్టులు బాగా అలవాటయ్యాయి. హైకోర్టులో సాగిన రమీజాబీ కేసు రిపోర్టు చేయడం, భార్గవ కమీషన్ జరిపిన ఎన్ కౌంటర్ విషయాల రిపోర్టింగ్ ఆకర్షణీయమైనవి. ఖమ్మం జిల్లలో పర్యటించి, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలు రిపోర్టు చేయడం. నాటి ఐ.ఎ.ఎస్. ఆఫిసర్ బాబుకు నచ్చక ఫిర్యాదు చేశాడు. కానీ వెంగళ రావు పట్టించుకోలేదు. గౌతు లచ్చన్న పై రాసిన విమర్శనాత్మక విశ్లేషణ పై ఆయన శిష్యులు ఫిర్యాదు చేయ గా నండూరి రామమోహనరావు పట్టించుకున్నారు. అయినా విశ్లేషణలో నాది తప్పులేదని తేల్చుకున్నారు.
హోం మంత్రి కొన్నిసార్లు నా రిపోర్ట్ వెనుక రహస్యాలు కావాలని పట్టుపట్టి విఫలమయ్యారు. ఎన్. జనార్ధన రెడ్డి, జి రాజారాం బాగా మిత్రులయ్యారు. పోలీసుశాఖ విషయాలు రాసినప్పుడు చాలా పరిశీలన జరిగేది. పర్వతనేని కోటేశ్వర రావు పోలీసు అధికారిగా కొన్ని సందర్భాలలో తోడ్పడ్డారు.
హైదరాబాద్ యూనివర్శిటీ తొలి వైస్ ఛాన్స్ లర్ గుర్బక్ష్ పై అవినీతి ఆరోపణలతో నేను రిపోర్ట్ ప్రకటీస్తే ఆంజనేయరెడ్డి పోలీస్ అధికారి గా, వెనుక ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు.
1980 నాటికి నన్ను విజయవాడ బదిలీ చేయగా రాజీనామా చేశాను. ఆంధ్రజ్యోతితో సంబంధాలు తెగిపోయాయి. నండూరి రామమోహనరావు ఎడిటర్ గా ఆనాడు తత్వశాస్త్రంపై రాయడానికి సాహిత్యం కోరగా, అనేక పుస్తకాలిచ్చాను.
కాకాని వెంకటరత్నం, గొట్టిపాటి బ్రహ్మయ్యలు పాలడుగు వెంకట్రావు, ఎం.వి.ఎస్.సుబ్బరాజు, తేళ్ళ లక్ష్మీకాంతమ్మ అప్పట్లో బాగా సన్నిహితులయ్యారు. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికార్లలో కొందరు మిత్రులయ్యారు. బి.ఎన్. రామన్, కాశీపాండ్యన్, అర్జునరావు, కె.ఆర్.మూర్తి, ఎం.ఆర్.పాయ్, విజయరామారావు, శ్రీనివాసన్, ఎ.ఎస్.వి.రెడ్డి, రెబెల్లో, పేర్కొనదగినవారు.
నార్ల వెంకటేశ్వరరావుకూ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికీ పేచీ వచ్చిన తరువాత నేను నార్లకే సన్నిహితుడనయ్యాను. నా రిపోర్టింగ్ కు అదేమీ ప్రభావం చూపించలేదు.
ఎడిటర్ గా నార్ల తరచు సలహాలు ఇవ్వడం శీర్షికలు సూచించడం ఉండేది. నార్ల పేరు వలన, ఆయన సంపాదకీయాల ప్రభావం వలన సర్క్యులేషన్ గొప్పగా లేకున్నా, పత్రిక పేరు ప్రతిష్ఠలుండేవి. నండూరి రామమోహనరావు పిరికివాడు కావడం వలన గట్టి రిపోర్టు చూసి ఉలిక్కిపడేవాడు. యాజమాన్యం కీలుబొమ్మ. బ్యూరోలో ఈ విషయాలు బాగా కనిపించాయి. సంపాదకీయ శైలిలో రామమోహనరావు నార్లను అనుకరించే విఫల ప్ర.యత్నం చేశారు. కె. రామచంద్రమూర్తి ఎడిటర్ అయిన తరువాత మళ్ళీ ఆంధ్రజ్యోతికి రాశాను.

సశేషం

1 comment:

కొత్త పాళీ said...

సార్ మీరు ఎంతో అనుభవజ్ఞులు, పెద్దవారు, ఇలా అంటున్నందుకు మన్నించండి. ఈ తీరుగా రాసిన జ్ఞాపకాల వల్ల ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ టపా చదివితే చాలా వరకూ ప్రముఖ రాజకీయుల పేర్ల జాబితా (name dropping) గానూ, కొంత స్వోత్కర్షగానూ అనిపించింది.
ఆ కాలపు రాజకీయ వాతావరణం గురించో, పరిస్థితుల గురించో, వ్యక్తుల గురించో ఈ కాలం వాళ్ళు తెలుసుకోదగిన విషయాలు రాస్తే బాగుంటుంది.