Thursday, June 28, 2007

నర హంతకులు -7

లెనిన్ గ్రాడ్ లో పార్టీ కాంగ్రెస్ లో వున్న 150 మందిలో 148 మందిని చంపేశారు. స్టాలిన్ ఆధ్వరంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుల్ని 10 లక్షల మందిని చంపేశారు. (షాపిరో-కమ్యూనిస్టు పార్టీ పుట 440) స్టాలిన్ మారణకాండలో తోడ్పడి, ఆయన ఆజ్ఞల్ని శిరసావహించి చేసిన ప్రముఖులలో కృచ్చేవ్, యెజోవ్, మాలెంకోవ్, బెరియా, మాలటోవ్, జడనోప్, బ్రెజ్నోవ్, కోసిజిన్లు వున్నారు.
1937 నుండి రెండేళ్ళపాటు యెజోవ్ ప్రతిరోజూ ఫైళ్ళు మోసుకొని స్టాలిన్ను కలుస్తుంటే ఆయన అరెస్టు ఉత్తర్వులిస్తుండేవాడు. 400 జాబితాలపై స్టాలిన్ సంతకం చేశాడు. ఈ జాబితాలలో 44 వేల మంది పార్టీ నాయకులు, ప్రభుత్వాధికారులు, సాంస్కృతిక ప్రముఖులు ప్రభృతులున్నారు.
రష్యాలో తలదాచుకోడానికి వచ్చిన విదేశీ కమ్యూనిస్టులు సైతం స్టాలిన్ మారణకాండకు గురైనారు. పోలెండ్ కమ్యూనిస్టు నాయకులు, హంగేరీ కమ్యూనిస్టు నాయకులు, యుగస్లోవియా కమ్యూనిస్టు ప్రముఖులు అలా రష్యాకు బలయ్యారు.
బల్గేరియా కమ్యూనిస్టు నాయకులు పొపోవ్, తనేవ్లు ఉరితీయబడ్డారు. కొరియా నుంచి వచ్చిన వారందరినీ చంపేశారు. ఇండియా నుంచి వచ్చిన వారికి అదేగతిపట్టింది. అందులో సరోజనీనాయుడు సోదరుడు వీరేంద్రనాథ్ కూడా వున్నారు. హిట్లర్ భయానికి పారిపోయి వచ్చిన జర్మనీ పార్టివారిని నిర్ధాక్షణ్యంగా చంపేశారు. చైనా, లాట్వియా, లిధుయేనియా, ఇరాన్, ఇటలీ, ఫిన్లండ్, హాలెండ్, జకొస్లోవేకియా, అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఆస్ర్టియా మొదలైన దేశాల కమ్యూనిస్టులు బహుశ వారి స్వదేశాలలో వుంటే బ్రతికి పోయే వారేమో. రష్యా వచ్చి చనిపోయారు. 842 మంది విదేశీ కమ్యూనిస్టులు రష్యాలో హతమార్చబడినట్లు ఆధారాలుండగా, లెక్కలు అందకుండా మార్మికంగా అదృశ్యమైన వారెందరో వున్నారు.
రష్యాలో స్టాలిన్ ఘాతుకాల నిమిత్తం హొటళ్ళు, దేవాలయాలు, స్నానశాలలు, గుర్రపుశాలలు కూడా జైళ్లుగా మార్చారు. కొత్తగా అనేక జైళ్లు నిర్మించారు. చిత్ర హింసలలో ప్రపంచ రికార్డు సృష్టించారు.
1938లో కోల్యమా శిబిరంలో రహస్య దళాలు 40 వేల మంది స్ర్తీలను, పిల్లల్ని, ఇతరుల్ని హతమార్చారు. మొత్తం మీద లెక్కకు వచ్చిన చిత్ర హింస చావులు రష్యాలో స్టాలిన్ ఆధ్వర్యాన 5 లక్షలు వున్నవి. 1936 నుండి 39 వరకు హతమార్చిన వారి సంఖ్య 45 లక్షలు కాగా మొత్తం స్టాలిన్ పుణ్యం కట్టుకున్న వారి సంఖ్య ఒకకోటి అని తేలింది.
స్టాలిన్ యిలాంటి పనులు చేశాడంటే చాలామంది చాలాకాలం నమ్మలేక పోయారు. ఇదంతా శతృవుల ప్రచారం అన్నారు. స్టాలిన్ అనంతరం కృశ్చేవ్ బయట పెడితే గాని శంఖంలో పోసిన తీర్థం కాలేదు.
ఇద్దరు నరహంతకులు కలసి రెండో ప్రపంచ యుద్దం సందర్భంగా ఒడంబడిక చేసుకొని జనాన్ని కాల్చుకుతిన్నారు. హిట్లర్, స్టాలిన్ ఒడంబడిక ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞులందరిని ఆశ్చర్యపరచగా, అంతవరకూ హిట్లర్ ను బూతులు తిట్టిన కమ్యూనిస్టులు ఒక్కసారి మాట మార్చి జర్మనీని పొగిడారు. హఠాత్తుగా జర్మనీ రష్యాలు పరస్పరం సుహృద్భావం చూపాయి.
నాజీ కమ్యూనిస్టు ఒడంబడిక వలన స్టాలిన్ కు సంవత్సరంన్నర విరామం లభించింది. యూరప్ లో ప్రజాస్వామిక దేశాలతో జర్మనీ యుద్ధం చేస్తుండగా స్టాలిన్ మరోవైపు లోగడ మొదటి ప్రపంచ యుద్ధంలో పోగొట్టుకున్న భూభాగాల్ని తిరిగి స్వాధీనం చేసుకోగలిగాడు. తూర్పు పోలెండ్ను నాశనం చేసిన స్టాలిన్, 15 వేల పోలిష్ అధికారులను హతమార్చాడు. 1939 సెప్టెంబరులో కుదుర్చుకున్న ఒప్పందం 1941 జూన్ 22 వరకు సాగింది. జర్మనీ కమ్యూనిస్టులను, యూదులను రష్యా చేతులారా హిట్లర్ కు అప్పగించగా వారంతా హత మార్చబడ్డారు.
హిట్లర్ కు 10 లక్షల టన్నులు ఆహార ధాన్యాన్ని లక్షటన్నులు విమాన ఇంధనాన్ని, 8 లక్షల టన్నుల ఆయిల్ను, ఇంకా ప్రత్తి, ఇనుము, మాంగనీసు స్టాలిన్ అందించాడు. జర్మనీ కూడా యధాశక్తి రష్యాకు సహాయపడింది. కనుక ఒడంబడిక కేవలం ఎత్తుగడ అనే కమ్యూనిస్టుల ప్రచారం బూటకమే.
స్టాలిన్, హిట్లర్ పరస్పరం పొగుడుకున్నారు. 1940 నవంబరులో స్టాలిన్ తన ఆశల్ని మాలటోవ్ ద్వారా హిట్లర్ కు వెల్లడించాడు. సోవియట్ రష్యా ప్రభావం క్రిందకు వదలి పెట్టాల్సిన దేశాలు, ప్రాంతాలు పేర్కొన్నాడు. హంగరీ, యుగస్లావియా పోలెండ్, స్వీడన్, ఫిన్లడ్, రొమానియా, బల్గేరియా, బ్లాక్ సముద్ర తీర ప్రాంతాలు కావాలన్నాడు. కాని రష్యా కోర్కెను హిట్లర్ నిరాకరించాడు. 1941 జూన్ 22న జర్మనీ దాడి చేయడంతో స్టాలిన్ మేల్కొన్నాడు. రష్యా ప్రజలనుద్దేశించి మాట్లాడిన స్టాలిన్, దేశభక్తిని పురికొల్పి, అంతర్జాతీయ కమ్యూనిస్టు గీతానికి స్వస్తి పలికాడు.

లెనిన్ వలె స్టాలిన్ కూడా సొంతంగా ఒక రహస్య సైనిక దళాన్ని రూపొందించాడు. ఈ విషయం సైనిక దళాధిపతులకు కూడా చెప్పలేదు. స్టావ్క కా అనే ఈ రహస్య దళాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించాడు. అధికారమదాంధలతో విజయోత్సాహంతో కళ్ళు మూసుకుపోయిన హిట్లర్ రష్యాపై దాడి చేసి తీవ్రంగా దెబ్బతిన్నాడు. జర్మనీ దాడి వలన రష్యా ఎంతో నష్ట పోయినప్పటికీ, చివరకు గెలుపు రష్యాదే అయింది. ఈ పోరాటంలో ప్రజాస్వామిక దేశాలు, ముఖ్యంగా ఇంగ్లాండు, అమెరికాలు రష్యాకు ఎంతో తోడ్పడ్డాయి.

రెండో ప్రపంచ యుద్ధం వలన రష్యాకు, పాశ్చాత్య రాజ్యాలకు కుదిరిన ఒప్పందాల వలన రొమేనియ, బల్గేరియా, హంగరీ కాస్తా రష్యాకు దక్కాయి. అమెరికా సైన్యాలన్నీ ఐరోపా నుండి రెండేళ్ళలో వైదొలగడానికి అంగీకరించడంతో, స్టాలిన్ ప్రచ్చన్న యుద్ధం ఆరంభించాడు. యాల్టావప్పందాన్ని ఉల్లంఘించాడు. తూర్పు ఐరోపా, బాల్కన్ దేశాలను స్టాలిన్ కబళించేశాడు.
స్టాలిన్ మళ్ళీ విచారణ పర్వం ప్రారంభించి, ఉరితీతలకు ఉపక్రమించాడు. ముందుగా 16 మంది పోలీస్ అధికారులను టెర్రరిస్టుల పేరిట విచారించినట్లు నటించి ఉరితీయించాడు. బల్గేరియాలో 20 వేల మందిని హతమార్చాడు. 1946 మార్చిలో ఇరాన్ నుండి సైన్యాన్ని ఉపసంహరించకుండా తాత్సారం చేసిన స్టాలిన్ పాశ్చాత్యదేశాలు కన్నేర్ర చేస్తే గాని అక్కడ నుంచి వైదొలగలేదు.
యుగస్లోవియాలో టిటోను అణచి, తన పెత్తనం సాగించుకోవాలని స్టాలిన్ వేసిన ఎత్తుగడల్ని టిటో సాగనివ్వలేదు. టిటో స్థిరపడడంతో అంతకు ముందు టిటో వెలి వేయడంలో ప్రముఖపాత్ర వహించిన జడనోవ్ ను స్టాలిన్ 1948 ఆగష్టులో చంపించాడు. జెకొస్లోవేకియాలో కుట్రపన్ని దానిని తన స్వాధీనంలోకి స్టాలిన్ తెచ్చుకున్నాడు.
యుద్ధానంతరం స్టాలిన్ నిరంకుశత్వం రష్యాలో మళ్ళీ వికృతరూపం దాల్చింది. ముందు మేధావులు రచయితలపై విరుచుకుపడ్డారు. లలిత కళల్లో నిపుణుల్ని చిత్రహింసలు పెట్టారు. శాస్ర్తజ్ఞులకు కూడా బాధలు తప్పలేదు. ఉద్యోగాలు వూడ బెరికి నిర్భంధ శిబిరాలకు తరలించారు.
హిట్లర్ వలె స్టాలిన్ కూడా యూదులపై బడి, వారి ప్రచురణలు నిషేదించారు. యూదుల నటుడు మికోల్స్ ను చంపేశారు. కొందరు అడ్రసు లేకుండా పోయారు. లెనిన్ గ్రాడ్ లో జడనోవ్ అనుచరుల్ని వెతికి పట్టి చంపేశారు వెయ్యి మందిని కాల్చేశారు. మాలటోవ్ భార్య పోలినా యూదు గావడంతో ఆమేను కజకస్తాన్కు పంపారు చాలామంది కమ్యూనిస్టు ప్రముఖుల భార్యలకు యిదేగతి పట్టింది.
1952లో స్టాలిన్ తన చిత్ర హింసలను ఇంకా ఎక్కువ చేశాడు. క్రెమ్లిన్లో వున్న యూదు డాక్టర్ లను నిర్భంధించారు. చివరకు తన వద్ద పనిచేసే బట్లర్ (వాసిన్)ను కూడా నమ్మలేక, గూడచారి అనే పేరిట అతడిని అరెస్టు చేశారు. చివరి రోజుల్లో అనుమానపు బ్రతుకులో స్టాలిన్ తన వ్యక్తిగత డాక్టర్ను కూడా సమీపానికి రానివ్వలేదు. 1953 మార్చి 5న స్టాలిన్ చనిపోయాడు.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం స్టాలిన్ చంపించిన వారి సంఖ్య రష్యాలో 5 లక్షల మంది అని ఉదారలెక్కలు చెబుతున్నవి. అప్పటికి స్టాలిన్ ఆటంబాంబులు తయారు చేయించాడు. (1919) రష్యా స్టాలిన్ కాలంలో ఎంత అభివృద్ధి చెందినా, మనుషులు మాత్రం బోనులో ఎలుకలవలె ఆధ్వాన్నపు బ్రతుకులో మ్రగ్గారు. ఇదొక ఆధునిక బానిసత్వం. ఆ విషయాన్ని చాలాకాలం తెలియకుండా బయట ప్రపంచాన్ని భ్రమలో పెట్టడం స్టాలిన్ గొప్పతనం.

No comments: