Monday, June 4, 2007
నర హంతకులు -4
నాజీ నరకాసురుడు హిట్లర్
జర్మనీలో హిట్లర్ ఈ శతాబ్దంలో చేసిన మారణహొమం చరిత్రలో మరువరానిది. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసిన హిట్లర్ జర్మనీ ఓటమి వలన అవమానంచెందాడు. పగతీర్చు కోవాలనే పట్టుదల వహించాడు. యుద్ధానికి ముందే వియన్నామేయర్ కార్త్ లూగెర్ నుండి సోషలిస్టు భావాలను, జార్జివాన్ షొవెరర్ నుండి యూదుల పట్ల ద్వేషాన్ని నేర్చుకున్న హిట్లర్. సైన్యానికి రాజకీయ విద్య గరపాలనే విథానాన్ని లుడెస్ డార్ప్ నుండి తెలుసుకున్నాడు.
1919లో మ్యూనిచ్లో సైన్యానికి రాజకీయ బోధకుడైన హిట్లర్ ఆ ఏడు సెప్టెంబరులో రాజకీయ పార్టీ స్థాపించాడు. 1920 ఏప్రియల్లో సైన్యానికి గుడ్ బై చెప్పి, పూర్తి రాజకీయవాది అయ్యాడు. హిట్లర్ పెట్టిన నాజీపార్టీలో 1923 నాటికి 4800 మంది సభ్యులు చేరగా అందులో 345 మంది కార్మికులే.
1923 నవంబరు 8న 3 వేల మందితో హిట్లర్ బవేరియాలో స్థానిక ప్రభుత్వాధికారులపై దాడి జరిపి, నిర్భంధించి ప్రభుత్వాన్ని ఏర్పరచినట్లు ప్రకటించాడు. కాని పోలీసులు కాల్పులు జరిపి హిట్లర్ ను నిర్భంధించి జైలు శిక్ష విధించారు. జైల్లొ వుండగా తన భావాలను అమలు చేయదలచిన రీతులను క్రోడీకరించి మైన్ క్వాంప్ అనే గ్రంథాన్ని వ్రాశాడు. 1924 డిశెంబరు 20న విడుదలైన హిట్లర్, నాజీభావాలతో విజృంభించాడు. యూదులకు వ్యతిరేక నినాదంతో 1926 నాటికి తన పార్టీపై పూర్తి ఆదిపత్యాన్ని సాధించిన హిట్లర్ ధారాళంగా మాట్లాడి మంచి వక్తగా తన ప్రేక్షకులను సమోహితుల్ని చేస్తుండేవాడు.
1928 ఎన్నికలలో హిట్లర్ పార్టీకి 28 శాతం ఓటు మాత్రమే వచ్చింది. కమ్యూనిస్టులకు ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి నుండి ఏటా నాజీ పార్టి పెరిగిపోయింది. 1932 నాటికి హిట్లర్ పార్టిలో 8 లక్షల మంది చేరారు. అప్పటికే నిరుద్యోగ సమస్యచూపి హిట్లర్ విద్యార్ధులను ఆకర్షించాడు. జాతీయవాద పార్టి హిట్లర్ ను వాడుకుందామని కావలసిన ధనాన్ని సమకూర్చిపెట్టగా అది నాజీలకు తోడ్పడింది. హిట్లర్ వస్తే కాసేపట్లో పడగొట్టి తాము పెత్తనం చేయవచ్చని కమ్యూనిస్టులు, మితవాదులు తప్పుడు అంచనా వేశారు.
1932 ఎన్నికలలో హిట్లర్ నాజీలకు 37.2 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి నుండి నాజీలు కమ్యూనిస్టులు వీధుల్లో కుక్కలవలె పోట్లాడుకుని జర్మనీ అంతా భీభత్సం గావించారు. అయేడు నవంబరులో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులకు 100 సీట్లు రాగా మితవాదులు బలపడి 196 సీట్లున్న హిట్లర్ కు మరింత బలాన్ని సమకూర్చిపెట్టారు. సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడింది. 1933 జనవరి 30న హిట్లర్ ఛాన్సలర్ అయ్యాడు.
ప్రపంచ చరిత్రలో అదొక పెద్ద దురదృష్టకర మలుపు. అధికారంలోకి వచ్చిన హిట్లర్ 25 వేల మందితో టార్చ్ లైట్ పెరేడ్ చేయించాడు.
1933 ఫిబ్రవరి 28న పూర్తి హక్కులు తనకు దత్తం చేసుకుంటూ హిట్లర్ ఆర్డినెన్స్ జారీ చేశాడు. అంతేగాక లాంఛన ప్రాయంగా ఆఖరుసారి తన ఆర్డినెన్స్ చర్చకు పెట్టి హిట్లర్ పార్లమెంటు ఆమోదాన్ని కూడా పొందాడు. అప్పటికే 81 మంది కమ్యూనిస్టు సభ్యులు పారిపోవడమో, అరెస్టు కావడమో జరిగింది. 441 ఓట్లు హిట్లర్ కు రాగా 94 మంది వ్యతిరేకించారు.
అప్పటి నుండి కమ్యూనిస్టులను దారుణంగా హతమార్చడం ఆరంభమైంది. కొందరు కమ్యూనిస్టులు బ్రతుకు జీవుడా అని రష్యాలో తలదాచుకోవడానికి వెడితే ఉరిత్రాడే ఎదురైంది.
1933 జూన్లో నాజీపార్టీ తప్ప మిగిలిన పార్టీలను నిషేదించారు. కొద్ది వారాలలోనే హిట్లర్ అనుమతితో గోరింగ్ జర్మనీ కమ్యూనిస్టు పార్టీని తుడిచిపెట్టాడు.
నాలుగు విధాలైన రహస్య పోలీస్ కేంద్రాలను హిట్లర్ ఏర్పరచి, ఒకరికి తెలియకుండా మరొకరిని తన దహన కాండకు వాడుకున్నాడు. గోరింగ్, హిమ్లర్ ఇందుకు తోడ్పడ్డారు దేశమంతటా నిర్భంధ శిబిరాలు వెలిశాయి. హిట్లర్ వాక్యమే చట్టం, న్యాయంగా జర్మనీలో 10 ఏళ్ళపాటు ఆటవిక పాలన సాగింది. జడ్జీలను సైతం డిస్మిస్ చేసే అధికారాలను హిట్లర్ సంక్రమింపజేసుకున్నాడు. ప్రజాకోర్టులు పెట్టి అక్కడక్కడే తీర్పు యిచ్చే పద్దతులు ప్రవేశపెట్టాడు. మంత్రిమండలి సమావేశాల్లో నిర్ణయాలన్ని హిట్లర్ తీసుకునేవాడు.
హిట్లర్ అధికారంలోకి రాగానే యూదులను ఊచకోత ఆరంభించాడు. కొందరిని దేశం వదలి పారిపోనిచ్చాడు. వారి ఆస్తుల్ని కొల్లగొట్టడం, స్వాధీనం చేసుకోవడం సర్వ సాదారణమైపోయింది. పేర్లలో గందరగోళం లెకుండా యూదులందరినీ ఇజ్రాయిలీ అని తెలిసేటట్లు నామకరణం చేయమన్నాడు. 1938 నవంబరు 8న యూదులను చీల్చి ఛండాడారు.
జర్మనీ ఆధ్యక్షుడు హిండెన్ బర్గ్ చనిపోవడంతో హిట్లర్ ఆ అధికారాలుకూడా సంక్రమింప జేసుకున్నాడు. జర్మనీలో ఎవరినీ చంపేయాలో ఒక జాబితాను సిద్ధం చేసి హింలెర్, హైడ్రిక్లు యిరువురు హిట్లర్ కు సమర్పించారు. పెన్సిల్ తో హిట్లర్ గుర్తు పెట్టి వారందరినీ కాల్చి చంపమన్నాడు. ఎప్పటికప్పుడు కాల్చేసిన వారి జాబితాను. ఇంకా కాల్చవలసిన వారి జాబితాను హిట్లర్, గోరింగ్, హిమ్లర్ చూస్తుండేవారు. రాజకీయ శత్రువులందరినీ ముందు హతమార్చారు. పాతకక్షలు తీర్చుకోవడానికి మరి కొందరిని మట్టుబెట్టారు.
చంపేసిన ప్రముఖులలో బవేరియా ప్రధాని గస్టావ్ వాన్ కర్, నాజీ పార్టీలో హిట్లర్ ప్రత్యర్ధి గ్రెగార్ స్ర్టాసర్, జనరల్ వాన్ స్లెషర్ అతని భార్య, జనరల్ వాన్ బ్రెడోవ్ కాథలిక్ నాయకుడు ఎర్నెస్ క్లాజనర్, మరో 150 మంది రాజకీయ వాదులను ముందుగా చంపేశారు. జర్మనీలో హిట్లర్ అధి కారాలపై జనవాక్య సేకరణ, చేస్తే 84.6 శాతం అనుకూలంగా చేశారు.
జర్మనీ రెండో ప్రపంచ యుద్ధంలోకీ పోవడం అక్కడి ప్రజలకు యిష్టంలేదు పోలండ్ను జయించివచ్చిన తరువాత ప్రజలు సంతోషంగా స్వాగతాలు పలుకలేదు. హిట్లర్ స్వయంగా సర్వసైన్యాధిపత్యం వహించాడు. మెరుపు దాడులతో యూరప్ను హడలగొట్టిన హిట్లర్ ఫ్రాన్స్ పైదాడి జరిపాడు. ఆ దాడిలో 27 వేల మంది జర్మన్లు చనిపోగా 135000 మంది ప్రత్యర్ధి సైన్యాలు పోయాయి.
(మిగతా వచ్చే వారం)
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
saar,
meeru entho mandini kalisaaru, vaarito interact ayyaaru. Memu telusukovalisindi daanilo emayina vunte appati saanghika, raajakiya ,aarthika vishayaala gurinchi, mukhyanga, telipite upayoganga vuntundi.
AK
Hitler gurichi chaala chadivamu,
diinilo kothavishayalu eemiti?
ippudu ikkada diini sandarbhamemiti?
Post a Comment