Wednesday, June 20, 2007

నర హంతకులు -6



నరుల్ని నలుచుకతిన్న స్టాలిన్

లెనిన్ చనిపోయేనాటికి స్టాలిన్ అధికారాన్ని దత్తం చేసుకున్నాడు. 1924లో పెత్తనాన్ని పట్టుకున్న స్టాలిన్ 30 సంవత్సరాల పాటు రష్యాను పాలించాడు. ఒకే దేశంలో విప్లవం సాధ్యమనే నినాదంతో స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగంపై పూర్తి అదుపు తెచ్చుకున్నాడు. లెనిన్ బ్రతికుండగా అతడి ఆజ్ఞననుసరించి పార్టీలోని వారినీ జారిష్టు అనుచరులనూ హతమార్చడంలో ఆరితేరిన స్టాలిన్ కు శత్రుశేషం లేకుండా చేయడం కష్టంగాదు.

లెనిన్ మత్తులో వుండగానే తన వ్యూహాన్ని ఏర్పరచుకున్న స్టాలిన్, చివరి రోజులలో లెనిన్ కు ఎదురుతిరిగాడు. అధికార పత్రాలు లెనిన్ కు పంపరాదని (ఆరోగ్యంగా లేని కారణంగా) పార్టీచే తీర్మానం చేయించాడు. లెనిన్ భార్యపై చర్యతీసుకుంటామని బెదిరించాడు. లెనిన్ ఈ విషయమై క్షమాపణ కోరినా స్టాలిన్ ఖాతరు చేయలేదు. ఇదంతా గమనించి లెనిన్ తన తుది పత్రంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ సహించదగిన వాడుకాదు గనుక ఆపదవి నుండి అతడిని తప్పించాలి అన్నాడు.

లెనిన్ చనిపోగానే, స్టాలిన్, కామెనోవ్, జినోవివ్లు త్రిమూర్తులుగా అవతారమెత్తి మున్ముందుగా ప్రధాన శత్రువు ట్రాటస్కీని తప్పించనారంబించారు. అతడిపై విమర్శలు దూషణలు చేసి, సైన్యాధిపత్యం నుండి తొలగించారు. 1926 అక్టోబరులో పోలిట్ బ్యూరో నుండి, నవంబరులో పార్టీ నుండి ట్రాటస్కీని తొలగించి సైబీరియాకు ప్రవాసం పంపారు. 1929లో రష్యానుండి పారిపోయిన ట్రాటస్కీని వెంటాడి చివరకు 1940లో మెక్సికోలో అతడిని చంపించడంతో స్టాలిన్ సఫలీకృతుడైనాడు.

ట్రాటస్కీ స్థానంలో సైన్యాధిపతిగా ఫ్రూన్ జేను తెచ్చిన స్టాలిన్ (1925 అక్టోబరు) అది అసహ్యంగా పరిణమించడం చూచి ఆపరేషన్ పేరిట ప్రూన్ జేనుచంపించాడు. 1925లోనే కామనేవ్ ను ప్రధాన స్థానం నుండి తప్పించాడు. అంతేగాక కామనేవ్, జినోవీవ్ లపై మాలటోవ్, బుఖారిన్ చే విమర్శ చేయించి, పార్టీ నుండి వారిని బహిష్కరించాడు. ఆవిధంగా స్టాలిన్ శత్రుసంహారాన్ని ముందు కమ్యూనిస్టు పార్టీలో ప్రారంభించాడు. రైతుల్ని నిర్బంధంగా సమిష్టి వ్యవసాయంలోకి మళ్ళించాలనే స్టాలిన్ ప్రయత్నాన్ని వ్యతిరేకించిన రైకోవ్, ట్రాటస్కీ, బుఖారిన్లను వారి స్థానాలనుండి 1929లో స్టాలిన్ తప్పించాడు.

పార్టిలో ఆంతరంగికంగా శత్రుసంహారం చేసిన స్టాలిన్, అంతకంటె విజృంభించి ప్రజలలో వివిధ వర్గాలపై ఆయుధ ప్రయోగం చేసాడు. 1929 మే-జులై మధ్య తొలుత డోస్ బాస్ గనుల ఇంజనీర్లు విద్రోహ చర్యకు తలపడ్డారంటూ విచారణ జరిపించారు. పొలిటు బ్యూరో సభ్యులు వ్యతిరేకించారు. పార్టీలో స్టాలిన్ ను వ్యతిరేకించడం అదే ఆఖరుసారి. యాకోవ్ బ్లెయింకిన్ను (పార్టి సభ్యుడు) కాల్చిచంపాడు. ఆ తరువాత విచారణ చేయడం, సాధారణమైపోయింది.

లెనిన్ అనంతరం తనను నాయకుడిగా రష్యాలో అన్ని రంగాలలో ప్రతిష్టాపన చేసుకోవడానికి స్టాలిన్ చేయనిపనిలేదు. యుజోవ్ కా అనేది స్టాలినొగా మారింది. యుజోవ్ కాస్తా స్టాలినిస్కిగా అయింది. 1929 నాటికి స్టాలిన్ 50 సంవత్సరాల జూరిట్సిక్ కాస్తా స్టాలిన్ గ్రాడ్ అయింది. ప్రాయానికి చేరుకున్నాడు. స్టాలిన్ వ్యక్తి పూజబాగా సాగింది. ఉక్కు మనిషిగా స్టాలిన్ ను చిత్రించడంతో బాటు, స్టాలినాబాద్, స్టాలిన్-ఆల్, స్టాలినిరి, స్టాలినిస్సి, సాలినో, స్టాలినో గోర్ స్కీ, స్టాలినిస్క్ అనే పేర్లు వచ్చేశాయి. పార్టీలో ముందు వామపక్షాన్ని, తరువాత కుడిపక్షాన్ని నాశనం చేసిన స్టాలిన్, ఉత్తరోత్తరా లెనిన్ విధానాలను కొనసాగిస్తున్నానంటూ, రైతులపై పడ్డాడు.

1928 జనవరి నాటికి రష్యాలోని నగరాలలో ఆహార కొరతఏర్పడింది. స్టాలిన్ పిలుపుపై 30 వేల సాయుధకమ్యూనిస్టులు గ్రామాలపై విరుచుకపడ్డారు. ధాన్యాన్ని దోచుకున్నారు. 1400 టెర్రరిస్టు చర్యలు రిపోర్టుకాగా రైతుల్ని చిత్రహింసకు గురిచేశారు. రైతులు పండించడం తగ్గించేశారు. దీని వలన 1928-29లో కరువు వచ్చింది. విదేశీ మారక ద్రవ్యంకొరకు రష్యాలో అతివిలువైన కళాఖండాలను రహస్యంగా అమెరికాకు అమ్ముకున్నాడు.

1928 తరువాత స్టాలిన్ ఏనాడు గ్రామాలకు వెళ్ళలేదు. రైతులలో ఆయనపట్ల వ్యతిరేకత పూర్తి దశకు చేరుకున్నది. వ్యవసాయరంగంలో సమిష్టి కరణకై ఒక కోటి మంది రైతులు హతమార్చబడ్డారు. కొందరు సైబీరియాకు తరలించబడగా, మరికొందరు నిర్బంధ శిబిరాలలో చిత్రహింసలకు గురైనారు. కొందరు రైతుల్ని ఫ్యాక్టరీలకు తరలించి, పనిచేయించారు. స్టాలిన్ తొలిసారిగా దేశంతో ఆంతరంగింక స్టాస్ పోర్టు విధానాన్ని ప్రవేశపెట్టాడు. అనుమతిలేకుండా గ్రామం నుండి నగరానికిగాని, ఒకచోట నుండి మరో చోటుకు గాని ఎవరూ రాకూడదు. రైతులు పారిపోకుండా స్టాలిన్ ఈచర్య తీసుకున్నాడు.

స్టాలిన్ బ్రతికున్నంత వరకూ ఈ పాస్ పోర్టు విధానం బాగా అమలు జరిపారు. (ఇప్పటికీ అది వున్నది).
రైతులు స్టాలిన్ కు లొంగకపోగా ధాన్యాన్ని తగుల బెట్టారు. వ్యవసాయ పనిముట్లు నాశనం చేశారు. పశువుల్ని చంపేశారు. దీని ఫలితంగా తీవ్రకరువు ఏర్పడింది. స్టాలిన్ చేయించిన దాడులవల్లనైతేనేమి, చంపించినవారు, చనిపోయిన వారి సంఖ్య కోటికిమించింది. స్టాలిన్ కృతిమంగా తెచ్చిన ఈ కరువు, హతమార్చిన విధానం చరిత్రలో మరొక ఉదాహరణలేదేమో.

స్టాలిన్ కిరాతక చర్యల పట్లపైకి బాహాటంగా పార్టివారు నిరసన తెలుపలేక పోయారు. ఎదురు తిరిగిన వారు, గొణిగిన వారు సైతం ఆహుతయ్యారు. కాని స్టాలిన్ రెండో భార్య నాడెజ్ధా తన ఇరువురు పిల్లలతో సహా 1926లో అతడిని విడిచివెళ్ళిపోయింది. స్టాలిన్ బ్రతిమలాడినా ఆమె తిరిగిరాలేదు. స్టాలిన్ దారుణ హత్యాకాండకు 1932 నవంబరున ఆమె అందరి ఎదుట స్టాలిన్ను నిందించి ఇంటికి వెళ్ళి కాల్చుకొని చనిపోయింది. స్టాలిన్ దగ్గర సేవకులు, వంటవారు, అందరినీ పార్టిరహస్య సంస్థ శిక్షణ యిచ్చి నియమించింది. అతడు తినే ఆహారాన్ని జాగ్రత్తగా పరీక్షించేవారు. స్టాలిన్ ను చూడాలంటే ఎంతో తనిఖీజరిగేది. స్టాలిన్ వ్యక్తిగతమైన రహశ్య పోలీస్ శాఖను సృష్టించి పెంచిపోషించారు.

రష్యాలో స్టాలిన్ హయంలో దేనికీ లెక్కలు ఒక పద్దతిలో వుండేవికావు 1929-33 మధ్య విపరీతంగా అరెస్టులు చేసి, నిర్బంధ శిబిరాలకు తరలించారు. ఈ శిబిరాలు ఆర్కిటిక్ ప్రాంతాలలో హెచ్చుగా వుండేవి. కొన్ని విచారణలకు బాగా ప్రచారం యిచ్చేవారు. 1931 మార్చిలో జరిపిన మెత్సివిక్ విచారణకు, 1933 ఏప్రియల్ లో జరిపిన మెట్రో-వైకర్స్ ఇంజనీర్ల విచారణకు తెగ ప్రచారం చేశారు. ప్రజలలో భయాన్ని వ్యాపింపజేయడానికి ఈ పని చేశారు. మిగిలిన విచారణలేవీ బయటకు చెప్పలేదు. అమాయకుల్ని అరెస్టుచేసి యావత్తు సమాజాన్ని భయంతో ముంచెత్తారు.

స్టాలిన్ చిత్ర విచిత్ర పనులలో కొన్ని ఆసక్తికరంగా వుంటాయి. ఒకసారి సాంకేతిక నిపుణులని 18 మాసాలపాటు నిర్భంధంలో పెట్టి ఉరిశిక్ష వేసి, మళ్ళీ క్షమించి, శిబిరానికి పంపేశారు. తరువాత విడుదల చేసి, ఉద్యోగం యిచ్చి పారితోషికం కూడా యిచ్చారు. (మెమోర్స్ ఆఫ్ ఏ రివల్యూషనరి-పిక్చర్ సెర్జ్, పుట 250).

1932లో రష్యా ఎదుర్కొన్న కాటకం బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. బయటప్రపంచంలో రష్యా ప్రచారం వల్ల మేధావులు, శాస్ర్తజ్ఞులు, రచయితలు ఆకర్షితులయ్యారు. స్టాలిన్ రాజ్యాన్ని పొగిడినవారిలో సిడ్ని బియాట్రిస్.వెబ్, జూలియన్ హక్సలీ, బెర్నాడ్ షా, హెచ్.జి. వెల్స్ మొదలైన వారున్నారు. పైపైన చూచి పొగిడినవారు కో కొల్లలు.

లెనిన్ గ్రాడ్లో జినోవిచ్ తరువాత అధిపతి అయిన సెర్జికిరోల్ ను 1934 డిశెంబరు 1న కాల్చి చంపారు. స్టాలిన్ స్వయంగా వచ్చి, కిరోను చంపిన వ్యక్తి లియోనిడ్ నికొలెవ్ను విచారించాడు. ఎందుకు చంపావని అడిగితే, అతడు మోకాళ్ళపై కూర్చొని, రక్షక భటులు చంపమన్నారన్నాడు. వెంటనే వాళ్ళు అతడిని చితకబాదారు కిరోప్ అంగ రక్షకుడు బొరిసోల్ను చావబాదించాడు స్టాలిన్. ఆ తరువాత కిరోప్ కేసు సందర్భంగా వందమందిని చంపారు. లెనిన్ గ్రాడ్లో 40 వేల మందిని నిర్భంధించారు.

జినోవివ్, కామనెవ్ లను స్టాలిన్ అరెస్టు చేయించాడు. 1936లో విచారణజరిపి, ఇరువురినీ కాల్చిచంపారు. స్టాలిన్ కు సన్నిహితంగా వ్యక్తిగత పనులు చేస్తున్న కె.వి. పాకర్ను జర్మనీ గూఢచారి అంటూ చంపించారు. నిర్బంధంలో వున్న, 5 వేల మంది కమ్యూనిస్టులను స్టాలిన్ చంపించేశాడు. రహస్య పోలిస్ దళంలో తీవ్ర మార్పులు చేశారు. పోలిట్ బ్యూరో సభ్యుడు జార్జియా స్నేహితుడు ఆర్దోనికిడ్జిని స్టాలిన్ చంపించాడు. తరువాత బుఖారిన్, రైకోప్లను అరెస్టు చేసిచంపించేశాడు.

1937లో స్టాలిన్ ఆధ్వర్యంలో 3 వేల రహస్య పోలీస్ అధికారులను చంపారు. వివిధ రష్యా రాష్ర్టాలలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను 90 శాతం చంపారు. సైనికాధిపతి షిమిడిట్ను 1936 జూలై 5న అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. 1937 జూన్ 11న 11 మంది సైనికాధిపతుల్ని చంపారు. ఆ తరువాత సైనికాధికారులలో ఏరివేత ప్రారంభించి 30 వేల మందిని చంపారు. అరెస్టు చేసిన 24 గంటల లోపే వీరిని హతమార్చారు. (More…..)

No comments: