Thursday, June 14, 2007

నర హంతకులు -5

ఒకవేపు ఇటలీ నియంత ముసోలినీతోను మరో ప్రక్క రష్యా నియంత స్టాలిన్తో ఒడంబడికలు చేసుకోగలిగిన హిట్లర్ కు పట్టపగ్గాలు లేకుండాపోయాయి. హంగరీ, రొమేనియా, యుగస్లేవియా, బల్గేరియాలపై హిట్లర్ దాడులు జరిపి విపరీత నష్టాలకు గురిచేశాడు. గ్రీకు, ఉత్తర ఆఫ్రికాలు అచిరకాలంలో జర్మనీకి దాసోహం అయినాయి.
1941 జూన్లో జర్మనులు ఆక్రమించుకున్న రష్యా భూభాగంలో 5 లక్షల మంది యూదుల్ని కాల్చి చంపారు. యూదుజాతిని నామరూపాలు లేకుండా చేయాలన్న హిట్లర్ ఉత్తరువులననుసరించి యీ చర్యగైకొన్నారు. వీరితో పాటు రష్యన్లను కూడా చంపారనుకోండి. న్యూరంబర్గ్ లో 1941లో 90 వేల మంది యూదు పురుష, స్ర్తీ, పిల్లలను కాల్చి చంపారు. ఆ తరువాత రష్యా మేల్కొని జర్మన్ సైన్యాలను తిప్పి కొట్టకపోతే ఇంకెలా వుండేదో.
రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు జర్మనీపై ఎదురుదాడి జరిపినప్పుడు సుమారు 6 లక్షల జర్మన్ లు చనిపోయారని అంచనా.
1939 సెప్టెంబరు 1న హిట్లర్ ఉత్తరువులు ఆధారంగా ప్రపధమంగా 90 వేల మందిని గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపారు. 1941 జులై 31న హిట్లర్ మరో ఉత్తరువుయిస్తూ యూదులను తుడిచిపెట్టమన్నాడు. ఎలా చంపాలో ఐక్ మస్, హైడ్రిక్ల ఆధ్వర్యాన ఒక చర్చా సదస్సు కూడా జరిగింది. 1941 ఆగస్టులో పట్టుబడిన రష్యా యుద్ధ ఖైదీలను జైక్లాన్-బితో 500 మందిని చంపారు. పురుగుల నివారణ కంపెనీ డెగ్షే (degesch) యీ మందును తయారు చేసి గ్యాస్ నిమిత్తం అందించింది.
1942 మార్చి 17న బెల్జక్ శిబిరంలో మూకుమ్మడి హత్యా కాండ ఆరంభమైంది. 15 వేల మందిని యీ శిబిరంలో చంపారు. దాని శక్తి అంతేవున్నదట. సోబిబోర్ కేంప్ లో రోజుకు 20 వేల మందిని గ్యాస్ తో చంపారు. టెబ్లింకా, మెడనక్ కేంప్ లలో 25 వేల మంది చొప్పున మరణించారు. ఆప్ విట్జ్ అన్నింటికంటే పెద్ద మరణాల శిబిరంగా తయారైనది.
1941లో 87 లక్షల యూదులు జర్మనీలో వున్నారు. ఇందులో 58 లక్షల మందిని 1945 నాటికి హిట్లర్ చంపించగలిగాడు. పోలండ్ నుండి పట్టుబడిన 26 లక్షల మందిని, రష్యా నుండి 7 లక్షల మందిని, రొమేనియా నుండి అంతే మందిని హంగరీలో 4 లక్షల మందిని, చకస్లోవేకియాలో రెండున్నర లక్ష, ఫ్రాన్స్లో లక్షకు కొంచెం తక్కువ, లాట్వియాలో 70 వేలు, గ్రీసులో 65 వేలు, అంతే సంఖ్యలో ఆస్ర్టియాలో, యుగస్లేవియాలో 60 వేలు, బల్గేరియాలో 40వేలు, బెల్జియంలో 28 వేలు, ఇటలీలో 9 వేలమంది యూదులను కసిగా హిట్లర్ మట్టుబెట్టించాడు.
జర్మనీలో యీ యూదులను చంపడానికి అనేక కంపెనీలు పోటీబడి, శిబిరాలలో గ్యాస్ ఛాంబర్లు ఏర్పరచి, హిట్లర్ దాహాన్ని తీర్చాయి. ఆష్ విట్జ్ శిబిరంలో 20 లక్షల మందిని చంపి ప్రథమస్థానం తెచ్చుకున్నది.
యూదులందరినీ చంపాలనే హిట్లర్ కోర్కె తీరలేదు. ఇంకా మిగిలిపోయారు, ఇందులో ఇంకో గొడవ ఏమంటే, హిట్లర్ కు తెలియకుండా కొందరు యూదులను నిర్భంద కార్మికులుగా కొన్ని కర్మాగారాలకు హిమ్లర్ అప్పగించి, వారివద్ద డబ్బుతిన్నాడు. ఆ విధంగా కొందరు బ్రతికిపోయారు.
ప్రతిరోజు రైళ్ళలో యూదుల్ని చేరవేసి, అందులో అనారోగ్యవంతుల్ని ఏరి, ముందుగా గ్యాస్ తో చంపేవారు. యూదుల వస్తువులన్నీ ఏరి, వేలం వేసేవారు. హిమ్లర్ యూదుల అస్తి పంజరాలలో మేలైనవి ఏరి ప్రదర్శనకై అట్టిపెట్టాడు.
ఈ మరణ శిబిరాల నుండి సాధారణంగా ఎవరూ బయటపడలేదు. 1944 ఆగస్టులో ఇద్దరు యూదులు ఎలాగో తప్పించుకున్నారు.
యూదులతో బాటు ఇతరులను కూడా ఈ చిత్ర హింసకు గురిచేయడం వలన, దారుణం జరిగిపోయినది.

3 comments:

Anonymous said...

అయ్యా..ఈ వ్యాసాలన్నీ తెలుగు వికీపెడియాలో వాడుకోవచ్చునా. ఒక వేళ మీరు అనుమతి ఇస్తే..స్వయంగా మీరే వికీలో పెడితే ఇంకా సంతోషిస్తాము.

cbrao said...

రచయిత ఇన్నయ్యగారి అనుమతి తీసుకుంటే బాగుంటుంది.నేను వారితో మాట్లాడతాను.వికిలో ఇవి ఎలా ఉపయోగించాలి? జీవిత చరిత్ర వర్గంలో ఉపయోగించాలా లేక చరిత్రా? సలహా కావాలి.

spandana said...

ఈ హిట్లర్ మారణహోమం చరిత్రే నన్ను శాకాహారిని చేసింది.

http://www.charasala.com/blog/?p=15

-- ప్రసాద్
http://blog.charasala.com