Friday, June 29, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -10

ఇండియన్ రేషనలిస్ట్

1967 ప్రాంతాల్లో మాసపత్రిక ఇండియన్ రేషనలిస్ట్ హైదరాబాదు నుండి కొనసాగింది. ఇంగ్లీషు పత్రికగా మద్రాసు నుండి నడిచిన సంచికలు ఆగిపోగా, పట్టుదలతో హైదరాబాద్ కు తరలించారు. జయశంకర్, సూర్యనారాయణ అనే హేతువాదులు అందుకు సహకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న ఆవుల సాంబశివరావు, ఎడిటర్ గా, ఎన్.కె. ఆచార్య, ఎ.ఎల్.నరసింహారావు నేనూ ప్రధాన పత్రిక నిర్వహించాం. ఆర్ధిక బలాన్ని ఆవుల అందించగా, రచనలు సేకరించేపని మేము చూశాం. నేను కొన్ని సంచికలలో సమకాలీన తాత్విక ధోరణులపై రాశాను. అందులో లాజికల్ పాజిటివిజం, ఎగ్జిస్టెన్సియలిజం, బెట్రాండ్ రస్సెల్ మొదలైనవి ఉన్నాయి. మద్రాసు నుండి ఎస్.రామనాథన్ వ్యాసాలు పంపారు. అప్పటికే ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు. ఎన్.కె. ఆచార్య చాలా వరకూ పత్రిక పట్టించుకున్నారు. కొన్నాళ్ళకు ఆవుల సాంబశివరావు హైకోర్టు జడ్జి కావడంతో బాధ్యత అంతా మా పైన పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వై. రాఘవయ్య పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రీడర్ గా వ్యాసాలు రాసేవారు. పత్రిక కొన్నాళ్ళు నడిపి ఆపేశారు. మళ్ళీ మద్రాసు మిత్రులు ఆ బాధ్యత స్వీకరించారు.

అన్వేషణ

1960 నుండీ 64 వరకూ సంగారెడ్డి (మెదక్ జిల్లా)లో మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూలులో అన్ ట్రయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వృత్తి చేశాను. అప్పుడు ఎం. నాగేశ్వరరావు అన్వేషణ అనే మాసపత్రిక పెట్టారు. అందులో యించుమించు చాలాభాగం నేను రాసేవాడిని. టీచర్ యూనియన్ పక్షాన యీ పత్రిక నడచింది. ఉపాధ్యాయుల సమస్యలు, బోధన, సిలబస్, ఇత్యాది విషయాలు చర్చించాను. అందుకుగాను వివిధ ఉపాధ్యాయ సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. పాలో ఫ్రెయరీ వంటి వారి రచనలు చూచాను. మెక్సికోలో విద్యను పాపులర్ చేసిన పద్ధతులు చదివాను. కొఠారి కమిషన్ చర్చలు కూడా వచ్చాయి. ఎ.బి.షా వంటి వారు విద్యాసమస్యలు చర్చించిన తీరు చూచాను. అమృక్ సింగ్ రచనలు కూడా ఉపయోగించాయి. షేక్ మౌలా కొత్త పద్ధతులతో గ్రామర్ చెప్పిన తీరు కూడా గ్రహించాం. పత్రిక చిన్నదైనా ఉపాధ్యాయులకు ఆకర్షణీయంగా తెచ్చాను. ఎం. నాగేశ్వర రావు బాగా పర్యటించి సమస్యలు తెలుసుకునేవారు. ఆయన సోదరుడు ఎం. రాజగోపాలరావు ఎ.సి. కాలేజి గుంటూరులో ఫిలాసఫి లెక్చరర్ గా నాకు పరిచయస్తుడు. అన్వేషణ పత్రిక ఎక్కువ కాలం సాగలేదు.


ఆంధ్రజనత

హైదరాబాద్ నుండి వెలువడిన ఆంధ్రజనత దిన పత్రిక కొంత కాలం తెలంగాణాలో పాపులర్ గా వుండేది. చాలామంది ఎడిటర్లు మారిన యీ దినపత్రిక, కాంగ్రెసు పార్టీ పక్షానే నడచింది.1960 నుండే 64 మధ్యలో నేను సంగారెడ్డి నుండి తరచు వ్యాసాలు రాస్తుండేవాడిని. పత్రికలో ఎవరూ నాకు అప్పట్లో పరిచయస్తులు కాదు.1965 నుండే హైదరాబాద్ కు నేను మారాను. ఆ తరువాత కొన్నాళ్ళు ఆంధ్రజనతతో సంబంధాలు వుండేవి. ఎ.ఎల్. నరసింహారావు అందులో పనిచేస్తుండేవారు. కె.ఎస్. సుబ్రహ్మణ్యం సంపాదకులు. పాండురంగారావు వుండేవారు. ఆంధ్రజనత ఆర్థిక సంక్షోభాలతో, ఆఫీసు కూడా మార్చేస్తూ, నడిచేది. పత్రిక అచ్చుతప్పులతో అంద విహీనంగా సాగేది.ఉత్తరోత్తరా జి.సి. కొండయ్య కొన్నాళ్ళు ఎడిటిర్ గా వున్నారు. గాంధి భవన్ కు మారిన ఆంధ్ర జనతలో పోత్తూరి వెంకటేశ్వరరావు సన్నిహితంగా పనిచేశారు. సర్కులేషన్ కూడా అంతంత మాత్రమే.

ఆంధ్రజనత ఆగిపోయింది. గోల్కొండ పత్రిక అంతకు ముందే ఆగిపోయింది. తెలంగాణా పత్రికలుగా పేరు తెచ్చుకున్న యీ రెండు పత్రికలూ అలా చరిత్రను మిగిల్చాయి.


తెలుగు విద్యార్ధి

1967 నుండే పదేళ్ళపాటు తెలుగు విద్యార్థి మాసపత్రికలో అనేక వ్యాసాలు రాశాను.
కొల్లూరి కోటేశ్వరరావు 1953 నుండీ ప్రారంభించిన తెలుగు విద్యార్థి విద్యాసంబంధిత విషయాలతో బందరు (మచిలీపట్నం) నుండి రెగ్యులర్ గా వెలువడింది. పాఠశాల, కళాశాల, గ్రంథాలయాలకు యీ పత్రిక అందేది. ఎందరో ప్రముఖులను పత్రిక ద్వారా పరిచయం చేయడం, వ్యాసాలు రాయించడం కోటేశ్వరరావు కృషి. అందులో మామిడి పూడి వెంకట రంగయ్య, ఆవుల సాంబశివరావు, ఎం.వి.రాజగోపాల్ వంటి వారున్నారు. ఉపాధ్యాయులకు తగిన సమాచారం అందించేవారు.

నేను రాసిన వాటిలో భారతపునర్వికాసం పేరిట సీరియల్ వున్నది. మార్క్స్ పై విమర్శ, మతాలపై చర్చ ప్రధానంగా సాగింది. అనేక విద్యాసంస్థల్ని, పేరు తెచ్చుకున్న పాఠశాలల్ని పరిచయం చేశాను. కొఠారి కమిషన్ యిచ్చిన విద్యా విషయ నివేదికపై వ్యాసాలు అందించాను. విద్యావేత్తల్ని, వైస్ ఛాన్సలర్లను, విద్యామంత్రులను ఇంటర్వ్యూ చేశాను. అందులో సి.డి. దేశముఖ్, డి.ఎస్.రెడ్డి, పి.వి. నరసింహారావు, కాసు బ్రహ్మానందరెడ్డి, మొదలైన వారున్నారు. అంతర్జాతీయ విద్యారంగంలో వస్తున్న విద్యారంగ విషయాలు కూడా అందించాను. నేను అలా రాసిన వాటిలో కొన్నిటిని గ్రంథాలుగా కొల్లూరి కోటేశ్వరరావు ప్రచురించారు. అందులో భారత పునర్వికాసం పేరిట-రాజా రాంమోహన్ రాయ్ నుండి ఎం.ఎన్.రాయ్ వరకూ బాగా ఆకర్షించింది. మార్క్స్ కు గ్రహణం పట్టించిన కమ్యూనిస్టులు అనే రచనను ఒక హిందీ టీచర్ అభిమానంతో పుస్తకంగా వెలువరించారు. ఎ.బి.షా. రాసిన శాస్ర్తీయ పద్ధతి కూడా అనువదించాను. మత సంబంధమైన విషయ చర్చలో ఎ.ఎస్. అవధాని వంటివారు పాల్గొన్నారు. మార్క్స్ మార్క్సిజం అనే శీర్షికన రాసిన సీరియల్ కూడా గ్రంథంగా వెలువరించారు.

విద్యోదయ

ఉపాధ్యాయ ప్రతినిధిగా ఎన్నికైన పి. భుజంగరావు విద్యోదయ మాసపత్రిక కడపనుండి నడిపారు. తెలుగు విద్యార్థి వలె తనకూ రాయమని ఆయన కోరగా తరచు వ్యాసాలు రాశాను. అంత రెగ్యులర్ గా కాకున్నా, అప్పుడప్పుడూ రాసేవాడిని. ఆర్థిక యిబ్బందులతో పత్రిక ప్రచురించడానికి భుజంగరావు యిబ్బందులు పడేవారు. అయినా పట్టుదలతో కొన్నేళ్ళు నడిపారు. ఎం.ఎల్.సి.గా వుండగా విద్యోదయను నడపగలగినా ఆ తరువాత ఆ పేశారు. విద్యా సంబంధమైన వ్యాసాలే నేను రాసేవాడిని. విద్యోదయకు సిబ్బంది లేనందున అన్నీ భుజంగ రావే చూసుకోవలసి వచ్చేది.

No comments: