Thursday, June 21, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -9

వార్త



దినపత్రిక వార్తకు కె.రామచంద్రమూర్తి ఎడిటర్ గా ఉన్నప్పుడు చాలా వ్యాసాలు రాశాను. అదే సమయంలో అమెరికాకు వెళ్శాను. వార్త ప్రతినిధిగా అమెరికా నుండి విశేషాలు పంపమన్నారు.


దానికి మద్దతుగా నాకు ప్రతినిధి పత్రం ఇవ్వగా దాని ఆధారంగా అమెరికా రాజధానిలో విలేఖరి పాస్ కూడా ఇచ్చారు. దానివలన సెనేట్ కు, ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్)కు, తదితర చోట్లకు వెళ్ళగలిగాను. భారత రాయబార కార్యాలయం వార్త ప్రతినిధిగా ధృవపత్రాన్ని ఇచ్చింది. దీనిమూలంగా అనేక సదవకాశాలు లభించాయి.



అమెరికా నుండి తరచు విశేషవార్తా వ్యాసాలు పంపగా ప్రచురించారు. కొన్ని ఫొటోలు కూడా సేకరించి పంపగలిగాను. అదొక మంచి అనుభవం. వార్త ద్వారా రామచంద్రమూర్తి అవకాశం కల్పించారు. అలా ఆయన వార్తకు ఎడిటర్ గా ఉన్నంతకాలం అలా రాస్తూ పోయాను. వివిధ ఆసక్తికర విషయాలు రాయగలిగాను.

మళ్ళీ కొంతకాలానికి గుడిపాటి వెంకటేశ్వర్లు వార్త వారపత్రిక చూస్తుండగా అటు అమెరికానుండి, ఇటు ఇండియాలోనూ వ్యాసాలు రాశాను. మాజిక్ ద్వారా మూఢనమ్మకాలు ఎలా పోగొట్టుకోవచ్చునో సీరియల్ గా రాశాను. విశేషాంశాలనే ఎంపిక చేసి వార్త పత్రికకు రాశాను.

భిన్న పత్రికలు
1982 తరువాత కొన్నాళ్ళు కందనాతి ఛెన్నారెడ్డి సంపాదకత్వాన నడిచిన ఈతరంలోనూ దేవీప్రియ సంపాదకత్వాన సాగిన ప్రజాతంత్రలోనూ, సతీష్ నడిపిన నేటి రాజకీయంలోనూ వివిధ వ్యాఖ్యానాలూ, వ్యాసాలూ రాశాను. దేవీప్రియ పత్రికలో అంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర సీరియల్ గా కొంతకాలం వేశారు. ఈ పత్రికలు అంతగా సర్క్యులేషన్ వున్నవి కావు. వాటి ప్రభావం అంతంత మాత్రమే. ఆ పత్రికలన్నీ కొద్దికాలం నడిచి ఆగిపోయినవే. వి హనుమంతరావుగారు డేటా న్యూస్ ఫీచర్స్ పక్షాన బులెటిన్ నడిపితే, అందులోనూ రాశాను. సి. నరసింహరావు జయప్రదంగా విజయవాడ నుండి రేపు మాసపత్రిక నడిపారు. ఆయన మరోపత్రిక నూతన ప్రపంచం పెట్టారు. రెండే సంచికలు వచ్చి ఆగింది. రెంటిల్లోనూ నేను రాశాను.


హేతువాది
రావిపూడి వెంకటాద్రి సంపాదరత్వాన వెలువడుతున్న హేతువాది మాసపత్రికకు 20 ఏళ్ళపాటు వ్యాసాలు రాశాను. అందులో పాపులర్ సైన్స్, మానవవాదం, ప్రత్యామ్నాయ వైద్యచికిత్సలు, మూఢనమ్మకాల విశ్లేషణ, హేతువాదం, అధునాతన వైజ్ఞానిక విశేషాలు రాశాను. చిన్నపిల్లలపట్ల సమాజంలో జరుగుతున్న అపచారాలపట్ల బాగా నొక్కు పెట్టాను. అంబేద్కర్ ఉద్యమం, గాంధీ స్థానం, ఎం.ఎన్.రాయ్ సిద్ధాంతాలు - ఈ విధంగా చాలా విస్తృతంగా వివిధాంశాలు రాశాను. వెంకటాద్రి సూచనపై కొన్ని వ్యాసాలు రాశాను. శాస్త్రీయ పద్ధతి ప్రచారానికి ఈ వ్యాసాలద్వారా తోడ్పడ్డాను.

మిసిమి
ఆలపాటి రవీంద్రనాథ్ 1985 తరువాత తలపెట్టిన మిసిమి పత్రికకు ఆది నుండీ సహాయపడగలిగాను. తొలుత పక్షపత్రికగా 4 సంచికలు వచ్చాయి. వాటికి వ్యాసాలు కావాలి అని రవీంద్రనాథ్ కోరారు. జ్యోతి ప్రెస్ కు విదేశాల నుండి పేపర్ తెప్పించుకొవడానికి, పత్రిక పేరిట సులభం అని తలపెట్టారు. ఆ విధంగా మొదలైన పత్రిక మాసపత్రికగా మారింది. రవీంద్రనాథ్ కు కాలక్షేపంగా ఉంటుంది, కొనసాగనివ్వాలని ఆయన కుమారులు అభిప్రాయపడ్డారు. క్రమేణా రవీంద్రనాథ్ మిసిమితో లీనమై అదే లోకంగా కృషి చేశారు. సంపాదకుడుగా మిసిమి క్వాలిటీ కోసం విపరీతమైన శ్రమ చేసి, సఫలీకృతులయ్యారు. ప్రతి వ్యాసాన్నినిశిత పరిశీలన చేసి, కొన్ని తిరగ రాయించేవారు. సెన్సార్ చేసేవారు. రిజక్ట్ చేసినవి కూడా లేకపోలేదు.ఇంచుమించు తొలిదశలో ప్రతిసంచికకు నేను రాసేవాడిని. ఎంత జటిలమైన అంశమైనా అర్థమయ్యేటట్లు చెప్పాలనేది పాలసీ. ఆ విధంగా సైంటిస్టులు, తాత్వికులు, చింతనాపరుల్ని ఎంపిక చేసి రాశాను. నా వ్యాసాలపై రవీంద్రనాథ్ ఎన్నడూ సెన్సార్ పెట్టలేదు. కనీసం సూచన ప్రాయంగానైనా విమర్శించలేదు. అంగీకారమైతే అలా చేసేవాడు.

ఎవరిచేత ఏమి రాయించాలనే విషయం తరచు చర్చించాం. పురాణం సుబ్రహ్మణ్య శర్మచే వ్యంగ్య రచనలు చేయించడానికి మధుర వాణి పాత్రను ఎంపిక చేసింది రవీంద్రనాథ్ గారే. సి. నరసింహారావు వ్యక్తిత్వ వికాసం, సంజీవదేవ్ అనుభవాలు మిసిమిలో చోటు చేసుకున్నాయి. వెంకటేశ్వర రెడ్డి చేత మేథావుల మెతకలు రాయించాలని, మేమిద్దరం (నేనూ, రవీంద్ర నాథ్), ఇంటలెక్చువల్స్ (రచయిత - పాల్ జాన్సన్) పుస్తకం చదివిన తరువాత నిర్ణయించాం. అవి తన సొంతం అన్నట్లు వెంకటేశ్వర రెడ్డి ప్రవర్తించి, తరువాత ఎవరూ గమనించని చోట ఎక్కడో ఆ విషయం ప్రస్థావించారు. పురాణం సుబ్రహ్మణ్యశర్మ తీవ్రస్థాయికీ రవీంద్రనాథ్ సంకెళ్ళు వేశారు. ఈ విషయం కూడా ఇద్దరం చర్చించాం.
మిసిమి రవీంద్రనాథ్ ఒరవడిలో బాగా పేరు తెచ్చుకున్నది. ఆయనతోనే ఆ పదును ఆగింది. అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సంపాదకుడుగా మిసిమి కొనసాగుతుండగా, అందులో ఎడిటర్ కోరిక పై కొన్ని వ్యాసాలు రాశాను. బౌద్ధం, కళలు ఎక్కువగా ప్రాధాన్యాలను సంతరించుకొని, పత్రిక వెలువడుతున్నది.

No comments: