Wednesday, December 31, 2008

హోమియోశాస్త్రీయం అయితే రుజువు చేసే పద్దతులు ఎందుకు చేయరు

హొమియో లొ నమ్మకమే ప్రధానమా?




హోమియో చికిత్స జర్మనీలో ప్రారంభించిన హేనిమన్ 1819లో యువరాజు షవర్జన్ బర్గ్ కు చికిత్స చేశాడు. ఆనాడు యువరాజు ప్రజలలో ప్రాచుర్యంగల ఆకర్షణీయ వ్యక్తి. హేనిమన్ ప్రత్యామ్నాయ చికిత్సవలన అతడు మరణించాడు. ఆధునిక వైద్య విధానాన్ని విమర్శిస్తూ బయలుదేరిన హేనిమన్ వైఫల్యాన్ని పండితులు గానీ, ప్రజలు గానీ హర్షించలేదు. అతని వెంటబడి తరిమికొట్టారు. అప్పుడు హేనిమన్ జర్మనీ వదలి ఫ్రాన్స్ పారిపోయాడు. ఆగ్రహావేశులైన ప్రజలు అతని మందులను పారబోసి, పుస్తకాలను తగులబెట్టారు. ఫ్రాన్స్ లో స్థిరపడిన హేనిమన్ వయసులో తనకంటే 45 సం. తేడాగల సంపన్న యువతిని పెండ్లాడు. అయితే ఫ్రాన్స్ లో హోమియో ప్రాక్టీసు ద్వారా బాగా ఆర్జించాడు.
హేనిమన్ సమకాలీనుడు ఆండ్రాల్ అతని అనుచరుడు కూడా వైద్య వృత్తిలో ఉంటూ హేనిమన్ చెప్పిన ఔషధాలు పరిశీలనార్థం తీసుకున్నారు. సింకోనా, ఎకోనైట్, సల్ఫర్, ఆర్నికా వంటి హోమియో ఔషధాలు వేసుకున్నారు. ఎం.డబుల్ కూడా సింకోనా తీసుకున్నాడు. అలాగే ఎం. బోనెట్ హేనిమన్ ను పారిస్ లో సవాల్ చేస్తూ అతడు చెప్పిన ఏ ఔషధాన్నయినా స్వీకరిస్తాననీ, అతడు చెప్పిన లక్షణాలు కనిపిస్తే హోమియోను అంగీకరిస్తాననీ, 1835లో ప్రకటించారు. హేనిమన్ గానీ, అతని అనుచరులు గానీ అలాంటి సవాల్ను స్వీకరించడానికి ముందుకు రాలేదు. ఔషధాలు స్వీకరించిన వారికి హేనిమన్ చెప్పిన లక్షణాలేవీ కనిపించలేదు. అయినప్పటికీ ఆనాడు వైద్యవిధానం లోపాల వలన హేనిమన్ సిద్ధాంతాలూ, రచనలూ బహుళ ప్రచారంలోకి వచ్చాయి. యూరప్ లో హేనిమన్ బాగా పేరు తెచ్చుకున్నాడు. క్రమేణా నమ్మకం ఆధారంగానే హోమియో ప్రచారంలోకి వచ్చింది. హేనిమన్ బ్రతికుండగానే యూరప్ లో ప్లేగు, కలరా, మసూచి వంటి రోగాలు అంటు వ్యాధులుగా లక్షలాది జనాన్ని తుడిచి పెడుతుంటే హోమియో నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. ఉత్తరోత్తర ఆధునిక వైద్య విధానం వలననే ఈ అంటు రోగాలను అరికట్ట గలిగారు.

హోమియోను యూరోప్ దేశాలలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో భిన్న కాలాలలో నాటి నుండి నేటి వరకు శాస్త్రీయ పరిశోధనలకు గురి చేశారు. ఏ ఒక్క సందర్భంలోనూ హోమియో శాస్త్రీయ పరిశోధనలకు నిలవలేకపోయింది. రుజువు పరుచుకోలేకపోయింది.

1977లో ఆస్ట్రేలియా పార్లమెంటుకు వైద్య శాస్త్రజ్ఞుల నిపుణుల సంఘం తన నివేదికను సమర్పించింది. అనేక వాదోపవాదాల తరువాత నిగ్గు తేల్చాలని ఈ సంఘాన్ని నియమించారు. మందులో మూల పదార్థాన్ని తగ్గించుకుంటూ, కుదుపుతూపోతే పొటెన్సీ పెరుగుతుందనే హోమియో సిద్ధాంతం రుజువు కాలేదని వారు స్పష్టం చేశారు.

అమెరికాలో తొలుత 19వ శతాబ్దంలోనూ, 20వ శతాబ్దంలోనూ హోమియో జనాన్ని ఆకట్టుకుంది. 1920 ప్రాంతానికి హోమియో కళాశాలలో ప్రభావం తగ్గిపోగా వాటన్నిటినీ మూసివేశారు. అయినప్పటికీ హోమియో ప్రచారం కొందరు సాగిస్తూనే ఉన్నారు. దీనికి ఎలాంటి డిగ్రీలు, అర్హతలు అక్కరలేకపోవడం, గుర్తింపు లేని హోమియో కేంద్రాలు వ్యాప్తిలో ఉండడం జరుగుచున్నది. ఆకర్షణీయంగా మార్గాంతర వైద్యం పేరుతో పుస్తకాలు రాసి ప్రచారం చేస్తున్నారు. పత్రికలు అచ్చు వేస్తున్నారు. కొందరు హోమియో చికిత్సలో కంప్యూటర్లను వాడుతున్నారు. అదొక ప్రత్యేకతగా జనానికి చూపుతున్నారు. అమెరికా, ఫ్రాన్స్ లో, ఇజ్రాయల్ లో కొందరు హోమియో వాదులు రుజువునకు నిలబడతామని విఫలమయ్యారు. శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు నేచర్ పత్రికలో ప్రచురించగా, అమెరికా నుండి శాస్త్రీయ పరిశోధనా సంఘం వెళ్లి నిజానిజాలు తెలుసుకున్నది. దొంగ లెక్కలతో అబద్ధాలతో నివేదిక రాసినట్లు రుజువయింది. పారిస్ లో ఉన్న హోమియో పరిశీలనా కేంద్రాన్ని అంతటితో మూసివేయవలసి వచ్చింది. అమెరికాలో కూడా హోమియో రుజువుపరచలేక కోర్టుకు వెళ్ళి కూడా ఓడిపోయి నార్త్ కెరోలైన్ రాష్ట్రంలో హోమియో డాక్టర్లు క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది. హ్యూమనిస్ట్ పరిశోధనాకేంద్రంవారు హోమియో అధ్యయనానికి ఒక నిపుణుల సంఘాన్ని నియమించారు. వీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హోమియో వారు చెప్పుకుంటున్నరుజువులు అనే అబద్ధాలను బయట పెడుతున్నారు.

వైఫల్యాలకు బాద్యత వహించె పద్దతి వున్నదా ?

రోగ నిరోధక శక్తి అనే సూత్రాన్ని హోమియో వారు చెప్పిన రీతిలో ఆధునిక వైద్యం కూడా అనుసరిస్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇందుకు టీకాల వైద్యం హోమియోకి విరుద్ధంగా నడుస్తున్న చికిత్స. టీకాల మందు పెద్ద మోతాదులలో ఇస్తే ఆ లక్షణాలు హోమియో సూత్రం ప్రకారం మనిషికి కావాలి. కాని అలాంటిదేమీ రుజువు కాలేదు. టీకాల మోతాదు హోమియో చెప్పినట్లు తగ్గిస్తూ పోతే దాని ప్రభావమే ఉండదు. అంతేగాక, కుదపటం అందువలన శక్తి పెరుగుతుందటం కూడా టీకాల వైద్యంలో జరగదు. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచటానికి టీకాల మందు ఇస్తారు. ఈ మందు కూడా అలాగే పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి.

హోమియోపతి ఎయిడ్స్ మొదలు, కేన్సర్ వరకు చికిత్స చేయగలదని చెపుతుంటారు. దీనికి కూడా రుజువుకు నిలిచిన ఆధారాలు లేవు. తల్లిదండ్రుల నుండి పారంపర్యంగా కొన్ని లక్షణాలతో కూడిన మియాజంలు పిల్లలకు సంక్రమిస్తాయని హోమియో చెబుతుంది. వ్యక్తి స్వభావం, ప్రవర్తన, అలోచన ఉద్వేగాలు పరిగణనలోకి తీసుకుని రోగనిర్ణయం చేస్తుందని వ్యక్తిత్వ ఔషధం నిర్ధారిస్తుందని చెబుతారు. (కాన్ట్సిట్యూషనల్ మెడిసిన్) ఈ పద్ధతిని హోమియో సంపూర్ణ వ్యక్తిత్వ చికిత్సగా పేర్కొన్నారు. మిగిలిన చికిత్సలకంటే ఇది ఉన్నతం కావడానికి ఇది వ్యక్తిత్వ చికిత్సే పేర్కొనదగినదన్నారు. ఇలాంటి నమ్మకాలతో హోమియో వైద్యం జనాన్ని ఆకట్టుకోవటానికి తోడ్పడుతున్నది. ఏదీ రుజువు చేయనక్కరలేని స్థితిలో హోమియో సాగిపోతున్నది.

1986లో బ్రిటిష్ జర్నల్ లాసెట్ ప్రచురించిన నివేదిక ప్రకారం జ్వరపీడితులైన రోగులకు, జ్వరం లేని వారికీ పంచదార మాత్రలు, హోమియో ఔషధాలు యిచ్చి పరిశీలించగా హోమియో ప్రభావం కనిపించలేదని రుజువయినట్లు రాశారు. ఇలాంటి నివేదికలు 1989లో కూడా లాన్ సెట్ ప్రచురించింది.

ఇంగ్లండులో హోమియో వైద్య విధానం అక్కడి ఆధునిక వైద్యశాఖలో భాగంగా ఉండాలని హోమియో వైద్యుడికి ఎం.డి. డిగ్రీ ఉండాలని ఆంక్షలు పెట్టారు. హోమియోవారు వాటిని అంగీకరించి ఆ పరిమితులకు లోబడి పనిచేస్తున్నారు. వృత్తి వ్యాపార నిమిత్తం ఎలాంటి రాజీ ధోరణి అయినా హోమియో అవలంబిస్తుందని ఇది ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. భారత దేశంలో హోమియో వైద్యం ప్రభుత్వ గుర్తింపు పొందినది. వైద్య అధ్యయనంలో ఆధునిక వైద్య పద్ధతులు నేర్చుకుంటున్నారు. ఈ పద్ధతులకూ, వారి వైద్యానికీ పూర్తి వైవిధ్యం ఉన్నది. హోమియోలో ఆధునిక పరిశోధనా, పరిశీలన భారతదేశంలో జరగటం లేదు. కాని హోమియో వైద్యులు మాత్రం డిగ్రీలు పుచ్చుకుని ప్రాక్టీసు చేస్తున్నారు. ఏ డిగ్రీలూ లేకుండా హోమియో గ్రంథాలు చదివి కేవలం అనుభవంతో వైద్యం చేసేవారు చాలామంది ఉన్నారు. వీరిపైన నామమాత్రమయిన ఆంక్షలే ఉన్నాయి. రోగులతో చెలగాటమాడే యీ వైద్య విధానంలో యిలాంటివారి బాధ్యతారహితమైన ప్రాక్టీస్ ప్రమాదాలను తెచ్చిపెడుతున్నది. హోమియో చికిత్సకు భీమా లేదు. చికిత్స చేయించుకున్న రోగుల విషయం సర్వే లేదు. వైద్యులు సాధారణంగా రికార్డు అట్టిపెట్టరు. మందులు ఏది వాడారు అనే విషయం బహిరంగంగా చెప్పరు. హోమియో చికిత్సలో రోగి చనిపోతే పోస్ట్ మార్టమ్ పద్ధతి లేదు. ఒకవేళ ఉన్నా ఏ మందు తీసుకున్నదీ తెలియదు. మందు లేదు గనుక తెలియడానికి వీలు లేదు. ప్రభుత్వం హోమియోకి నిధులు యిచ్చేటప్పుడు యిలాంటి విషయాలను పట్టించుకోవటం అవసరం.

వైఫల్యాలకు బాద్యత వహించె పద్దతి వున్నదా ?

కేంద్ర ప్రభుత్వం హోమియోను గుర్తించింది గనుక రాష్ట్రాలు రబ్బరు స్టాంపువలె గుర్తింపునిచ్చాయి. ఈ గుర్తింపు కేవలం నిధుల కోసమేనని గమనించాలి. ఇంగ్లండులో వలె ఆధునిక వైద్య కౌన్సిల్ ఆధ్వర్యంలో హోమియోను అదుపులో పెట్టాలి. నిరంతర పరిశోధనలు జరపటానికీ, రుజువు పరచడానికీ ఒక బోర్డును నియమించాలి.

హోమియో మందుల వలన చెడు జరగదనీ, ఇంగ్లీషు మందులవలె దుష్ఫలితాలు ఉండవనీ ప్రచారం చేస్తున్నారు. సీరియస్ జబ్బులకు, కలరా వంటి అంటు రోగాలకు హోమియో చికిత్స పనికిరాకపోగా, ప్రాణాపాయం కలిగిస్తున్నది. హోమియో చికిత్స విఫలం కాగా లివర్, కిడ్నీ జబ్బులతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికొచ్చినవారున్నారు. ఒక హోమియో కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల కిడ్నీలో రాళ్ళు తీయించుకోటానికి హైదరాబాదులో అత్యంత అధునాతనమైన ఆస్పత్రిలో చేరాడు. ఇలాంటి విషయాలు దృష్టికి వచ్చినప్పుడు హోమియో వారు చెప్పేదానికీ, చేస్తున్నదానికీ అవినీతికరమైన వ్యత్యాసం కనిపిస్తున్నది.



హోమియో కొన్నిటికే బాగా పనిచెస్తుందా? అవి ఏవి?







కొందరు హేతువాదులు హోమియో చికిత్స చేస్తున్నారు. మిగిలిన అన్ని విషయాలలో హేతుబద్ధం కాని వాటిని విమర్శిస్తూ, హోమియో విషయం వచ్చేసరికి హేతువాదాన్ని అన్వయించలేకపోతున్నారు. ఇందుకు సంపాదనే ప్రధాన కారణం. హేతువాదం ఒకవేళ హోమియోను సమర్ధిస్తే, హేనిమన్ సిద్ధాంతాలలో వైటల్ ఫోర్స్ వంటి నమ్మకాలు, వ్యక్తిని వర్గీకరించడం, పొటెన్సీ సిద్ధాంతం శాస్త్రీయంగా ఎలా రుజువు చేస్తారో చెప్పగలగాలి. హోమియోలో అత్యంత ఆధునిక శాస్త్రీయ జ్ఞానం అనుసరిస్తున్నట్టు ఎప్పటికప్పుడు మార్పులూ, చేర్పులూ చేస్తున్నట్లు కొందరు రాస్తున్నారు. హోమియో మూలగ్రంథాలు ఆర్గానన్ వంటివి ఏ మేరకు సవరించారు, ఖండించారు, తృణీకరిస్తున్నారు అనేది స్పష్టం కావాలి. హేనిమన్ చనిపోయిన తరువాత ఆధునిక విజ్ఞానం ఎంతో పెరిగింది. సూక్ష్మజీవుల విషయం మొదలు సూక్ష్మాణువుల విషయం వరకూ అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. వాటిని వైద్యశాస్త్రం మానవులకు ఉపయోగకారిగా మలుచుకుంటుంది. హోమియో అలాంటిదేమీ చేయలేకపోయింది.

----

1 comment:

చింతా రామ కృష్ణా రావు. said...

హోమియో విషయంలో మీరు ఆర్గ్యూ చేయడంలో అర్థం లెకపోలేదు. ఐతె " బ్రతికేది ఊరు, మానేది మందు కదండీ. మీకూ తెలుసు ఎన్ని మందులు వాడినా తగ్గని ఎన్నెన్నో అన్ క్యూరబుల్ డిసీజెస్ కేవలం హోమియో వైద్యం వల్ల క్యూరవుతున్న విషయం. దానిలోని శాస్త్రీయతను ప్రశ్నించే బదులు ప్రయోజన వైరళ్యాన్ని గుర్తించడం సమాజానికి శ్రేయోదాయకం అని మీకు తెలియనిది కాదు.
{ ఆంధ్రామృతం }