Tuesday, January 27, 2009

తస్లీమా సాహసోపేత జీవితం








left Prof Amlan Datta -vice chancellor of Viswa Bharati University, Taslima Nasrin, N.Innaiah in Delhi ,Gandhi peace foundation ,meeting of Indian Renaissance Association 2005

తస్లీమా
1992లో అమెరికాలో మేరీలాండ్ యూనివర్సటీలో తస్లీమాను మొదటిసారిగా నేను కలిశాను. నాతోపాటు నా భార్య కోమల కుమార్తె డా. నవీన ఉన్నారు. యూనివర్సిటీలో ఇరాన్ విద్యార్థుల అభ్యుదయ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో తస్లీమా మాట్లాడి, తన కవితలు చదివి వినిపించింది. ప్రశ్నలకు సమాధానమిచ్చిది. ఆమె ఇంగ్లీషులో నెమ్మదిగా మాట్లాడుతుంది. రాతలో ఉన్న బలం మాటలలో కనిపించదు. సమావేశానంతరం ఆమెతో కలిసి మాట్లాడి ఫొటోలు తీయించుకుని యింటికి ఆహ్వానించాను. అప్పటికే ఆమెపై ఛాందస ముస్లిములు ఫత్వా జారీ చేయటం, ఆమె తన స్వదేశమైన బంగ్లాదేశ్ వదలి స్వీడన్ ఆశ్రయం పొందటం ఒక చరిత్ర..
రెండవసారి తస్లీమా నస్రీన్ ను న్యూయార్క్ లో వారెన్ ఎలెన్ స్మిత్ (హూ ఈజ్ హూ ఇన్ హెల్ ఫేమ్) తో ఒక విందులో కలసి చాలాసేపు కాలక్షేపం చేశాం. అప్పట్లో తస్లీమా విపరీతంగా సిగరెట్లు తాగేది. నేను చనువుగా అది మానేయమని సలహా ఇచ్చాను. నా సలహా వలన కాకపోయినా ఉత్తరోత్తరా మానేసింది. అప్పుడు కూడా ఫొటోలు తీయించుకున్నాము. వారెల్ ఆమెకు సంరక్షకుడుగా అప్పటినుండీ ఆమె వెబ్ సైట్ ఏర్పాటు చేసి, ఎన్నో విధాల తోడ్పడ్డాడు.
తస్లీమా కవితలు ది గేమ్ ఇన్ రివర్స్ అనే శీర్షికన వెలువడ్డాయి. వాటిలో కొన్ని తెలుగులోకి నా భార్య కోమల అనువదించింది. ఇసనాక మురళీధర్ కొన్ని గేయాలు తెలుగులోకి తెచ్చారు. తరువాత ఆమె గేయాలు రచనలు అనువదించటానికి అనుమతిచ్చింది. తస్లీమా బెంగాలీలో రచనలు చేస్తుంది. వివిధ భాషలలోకి అవి వచ్చాయి.
తస్లీమా విదేశాలలో పర్యటించటం, ఐక్యరాజ్య సమితి బహుమతులందుకోవడం, సెక్యులర్ హ్యూమనిస్టులు ఆమెకు మద్దతుగా నిలవడం, క్రమేణా ఆమె కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించటం తెలిసినదే. మరోవైపు ఆమె రచనలను ఖండిస్తూ, ఇస్లాం పైన దాడి చేసినదని కనుక ఆమెను చంపేయాలని ముస్లిం సనాతనులు పిలుపు ఇచ్చారు. అందువలన భారత దేశంలో కూడా ఆమె రహస్యంగానే బతకవలసి వచ్చింది.
ఢిల్లీలో పునర్వికాస సంస్థ వారు ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించింది. గాంధీ పీస్ ఫౌండేషన్ లో ఆమెకు వసతి కల్పిస్తే బొత్తిగా సౌకర్యాలు లేవని బాధపడింది. ఇరువురం ఢిల్లీలో కానాట్ సర్క్ ల్లో హోటలుకు వెళ్లి భోజనాలు చేశాం. తరువాత నేను, ఇసనాక మురళీధర్ కలకత్తాలో ఆమె నివాసానికి వెళ్ళాము. స్వయంగా వంట చేసి వడ్డించింది. తన పెయింటింగులు చూపింది. ఎన్నో విశేషాలు మాట్లాడుకున్నాం.
తస్లీమా లజ్జ అనే పుస్తకాన్ని రాస్తూ బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిములు జరిపిన అత్యాచారాలను ఏకరువు పెట్టి తీవ్ర నిరసన తెలిపింది. అంతటితో ముస్లిములు విచక్షణ విస్మరించి ఆమెపై విరుచుకు పడ్డారు. తస్లీమాకు డాక్టరుగా ప్రాక్టీసు ఉండేది. అది వదిలేసి భర్తను కూడా వదిలేసి పారిపోవలసి వచ్చింది. మళ్లీ తల్లి చనిపోయినప్పుడు రహస్యంగా వెళ్లి చూచి ఏదో ఒక విధంగా బయటపడింది. ఆమె విస్తృతంగా తన జీవిత చరిత్రను రాసి ముస్లిం సమాజాన్ని స్త్రీల పట్ల వారి అమానుషత్వాన్ని, చిన్నతనం నుండీ ఇస్లామును నూరిపోసే నిరంకుశత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఆమె గ్రంథాలన్నీ బంగ్లాదేశ్ లో నిషేధించారు. చివరకు చాలా అభ్యుదయ వాదులమని చెప్పుకునే కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్ లో పరిపాలిస్తూ కూడా ఆమె రచనలు నిషేధించటం సిగ్గు చేటు. కలకత్తా హైకోర్టు ఆ నిషేధాన్ని తొలగించింది.
షోద్ అనే తస్లీమా రచనను చెల్లుకు చెల్లు అనే పేరిట తెలుగులో కోమల అనువదించింది. దాని ఆవిష్కరణకు తస్లీమా 2007 ఆగస్టు 9న హైదరాబాదు వచ్చింది.
కోమల అనువదించిన యంగ్ చాంగ్ పుస్తకం అడవి గాచిన వెన్నెల ను ఆగస్త్ 9, 2007 న తస్లీమా ,చెల్లుకు చెల్లు థోపాటు విడుదల చేశారు.
ప్రెస్ క్లబ్బులో కార్యక్రమమంతా ముగిసిన తరువాత ముగ్గురు మజ్లీస్ శాసన సభ్యులు తమ అనుచరులను వెంట బెట్టుకుని తస్లీమాపై అమానుషంగా దాడి చేశారు. పోలీస్ సహాయంతో ఆమె కలకత్తా వెళ్లినా ముస్లిం సంఘాలు వెంటబడ్డాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ ఆమెకు అండగా నిలవలేదు. దేశంలో ఉండనిస్తామంటూ జైలులో పెట్టినట్లు ఆంక్షలు విధించారు. దేశం వదిలి వెళ్ళిపోయి కొన్నాళ్ళకు తిరిగి వచ్చినా పరిస్థితి మారలేదు. సెక్యులర్ ప్రభుత్వమని చెప్పుకునే వారు ఇలాంటి ధోరణి అవలంబించటంతో తస్లీమా వెళ్లిపోవలసి వచ్చింది. కలకత్తాలో ఉంటే బెంగాలీ మాట్లాడుకోవచ్చని, తను పుట్టి పెరిగిన సంస్కృతికి చేరువగా ఉంటానని ఆమె ఆశించింది. చివరకు సాల్మన్ రష్డీ, అయన్ హర్షీ అలీ విదేశాలలో ఉండవలసి వచ్చింది.
see the website: http://taslimanasrin.com

2 comments:

సుజాత వేల్పూరి said...

అయితే చెల్లు కు చెల్లు నవలను అనువదించిన కోమల గారు మీ శ్రీమతి గారా? చాలా సంతోషం. ఈ నవల ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చినపుడు చదివాను. అనువాదం సహజంగా ఉంది.

మొత్తానికి తస్లీమా జీవితం గాయాల బాట.ఒక చోట స్థిరంగా జీవించలేకపోవడం చాలా బాధాకరమైన అనుభవం ఎవరికైనా!

naprapamcham said...

సీరియల్ గా నవ్య లో వచ్చింది.అది ఆంధ్ర జ్యోతి వారి వార పత్రిక.
శ్రీ రమణ


ఎడిటర్ గా వుండేవారు.