Friday, January 9, 2009

హేతువాద మిత్రులు నర్రా కోటయ్య ,కోటపాటి మురహరి రావు


middle Mr Kotapati Muraharirao, right Mr Narra Kotaiahహేతువాద ఉద్యమంలో నేను పనిచేస్తుండగా అనేక మంది సన్నిహితులయ్యారు. అందులో నర్రా కోటయ్య పేర్కొనదగినవారు. ఆయన 1960 ప్రాంతాల నుండి నాకు దగ్గర మిత్రులయ్యారు. కోటయ్య ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యక్తి. 1934లో పుట్టారు. ఆయనది ఓలేటి వారి పాలెం (కందుకూరు తాలూకా, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్). ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ జయప్రదను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆమెది తెలంగాణ ప్రాంతం కాగా వారిరువురిది వేరు వేరు కులాలు కూడా. ఆ విధంగా జీవితంలో కులాంతర వివాహం చేసుకున్న హేతువాది ఆయన.

త్రిపురనేని గోపీచంద్ కు, తాపీధర్మారావు (తాతాజీ)కు బాగా సన్నిహితంగా ఉన్న కోటయ్య వ్యాపారాలు చేసుకుంటూ, తమ సాహిత్య అభిమానాన్ని కోనసాగిస్తూ హేతువాద ఉద్యమానికి యధా శక్తి తోడ్పడ్డారు. అనేక రచయితలను ప్రొత్సహించి ఆర్థిక సహాయం చేసేవారు. త్రిపురనేని సుబ్బారావు, రావూరి భరద్వాజ వంటి ఎందరో రచయితలు ఆయనకు దగ్గర మిత్రులు. కొందరు తమ రచనలను కోటయ్యకు అంకితమిచ్చారు. ఆవుల సాంబశివరావు, ఎన్.కె. ఆచార్య, రావిపూడి వెంకటాద్రి మొదలైన వారికి దగ్గరవారయ్యారు. మేము హైదరాబాద్ నుండి నడిపిన ఇండియన్ రేషనలిస్ట్ పత్రికకు బాగా తోడ్పడ్డారు. హేతువాది పత్రిక పోషణకు కోటయ్య గారు ఇతోధికంగా చేయూతనిచ్చారు. రేడియో ప్రసంగాలు ఎన్నో చేశారు. ప్రత్యేక సంచికలలో వ్యాసాలు రాశారు. ఆయన కుమారులు ఇరువురూ సుప్రసిద్ధ డాక్టర్లు గా అమెరికాలో స్థిరపడటంతో ఆయనకూడా అమెరికా పర్యటించి వచ్చారు. ప్రస్తుతం రిటైర్డ్ జీవితం కోనసాగిస్తున్నారు. హేతువాద ఉద్యమానికి మాత్రం మద్ధత్తు ఇస్తూనే ఉన్నారు. తెలుగు సాహిత్యం ముఖ్యంగా హేతువాద గ్రంధాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
నర్రా కోటయ్య సినిమా రంగం లో ప్రయోగాలు చేసి దేవాలయం, అరుణ కిరణం ,వందేమాతరం అనే మూడు ప్రొడ్యూస్ చేసి, 100 రోజులు ఆడిన తరువాత ఆ రంగం నుండి విరమించుకోవడం విశేషమే. సినీ హీరో రాజశేఖరును రంగ ప్రవేశం చేసినది కూడా కోటయ్య గారే.

కోటపాటి మురహరి రావు రైతు. గ్రామస్థాయి నుండి హైదరాబాద్ కు వచ్చి విత్తనాలు శాస్త్రియంగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో చక్కని వ్యక్త. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు తోడ్పడే అనేక కార్యక్రమాలు చేపట్టి వెనుక బడిన ప్రాంతాల్లో అమలు పరచి మెప్పు పొందారు. అనేక మంది ఆయన కృషిని శ్లాఘించారు. ఆయనకు రచనలను అంకితం చేశారు. త్రిపురనేని రామస్వామి భావాలతో ప్రభావితుడైన మురహరి రావు సెక్యులర్ వివాహం చేసుకుని, ఇతరులను కూడా అలాంటి వివాహాలను పాటించమని ప్రోత్సహించారు. వ్యవసాయ నిపుణులతో నిరంతరం సంబంధాలు పెట్టుకోని ఆ రంగంలో వస్తున్న అధునాతన అభివృద్ధిని పరిశీలిస్తూ, సాధ్యమైనంత వరకు అమలు పరుస్తూ ఉన్నారు. విదేశీ పర్యటనలు చేశారు. అనేక హేతువాత, మానవవాద సభల్లో పాల్గొని ప్రసంగించారు. రావిపూడి వెంకటాద్రి వంటి ప్రముఖ హేతువాదులతో సన్నిహితులై ఉద్యమ వ్యాప్తికి కృషి చేస్తున్నారు. ఆర్థికంగా హేతువాద పత్రికను, సాహిత్యాన్ని ఆధుకుంటున్నారు. ఆయన కుమార్తె చంద్రలత మంచి రచనలు చేయటానికి తండ్రి ప్రభావం ఎంతో ఉన్నది. తెలుగు సాహిత్యాన్ని, ఇంగ్లీషులో హేతువాద రచనలను మురహరి రావు అత్యయనం చేశారు. కొద్ది కాలం సినిమా రంగంలో ప్రవేశించి ఓక సినిమా కూడా తీసి తరువాత అందులోనుంచి తప్పుకున్నారు. దాతగా, ఆయనకు పేరుఉన్నది. వ్యవసాయ అభిమానిగా అటు ప్రభుత్వం నుండి, ఇటు సైంటిస్టులనుండి ఆయనకు అభినందనలు నిరంతరం లభిస్తున్నాయి. హేతువాద ఉద్యమానికి ఎప్పుడూ చేయూత అందిస్తూనే ఉన్నారు. ఆవుల సాంబశివరావుకు బాగా దగ్గరగా ఉండేవారు.
ప్రేమానంద్ మాజిక్ శిక్షణ తరగతులు గ్రామంలొ పెట్టించి యువకులను హేతువాదులుగావడానికి క్రిషి చేసారు.కొత్త భావాలుగల రచయితలను ప్రోత్చహిస్తారు .
మురహరిరావు, కోటయ్యలతో నేను తరచు కలసి ఉద్యమాల్లో పనిచేశాను.

1 comment:

Anonymous said...

త్రిపురనేని రామస్వామి 66 వర్ధంతి సభ (తెనాలిలో)
http://kaviraju.blogspot.com/2009/01/blog-post.html