Wednesday, January 14, 2009

అసాధారణ పత్రిక ‘ఉల్లి’









పత్రిక పేరు ఉల్లి అని పెట్టడానికి సాహసం కావాలి చికాగో విశ్వ విద్యాలయంలో జర్నలిజం శాఖలో కొందరు యువకులు అలాంటి సాహసం చేశారు. పత్రిక పెట్టినప్పుడు ఇది ఎన్నాళ్ళు నడుస్తుందిలే అని వెక్కిరించారు. రాను రాను అది వినూత్న పద్ధతిలో నడుస్తుండటంతో అందర్నీ ఆకట్టుకున్నది. ఉత్తరొత్తరా జర్నలిజం శాఖ నుండి బయటపడి స్వతంత్ర పత్రికగా కొన్నాళ్ళు నడిపారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఆరంభమైన ఈ పత్రిక ఆమెరికా దేశ వ్యాప్తంగా కన్నులు తెరిపించింది. చివరకు అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా తన పై చేసిన విమర్శలు సైతం మెచ్చుకున్నాడు.

అందరివలె కాక వినూత్నంగా వ్యంగ్యంగా హాస్యంగా హెడ్డింగులు పెట్టి విషయాన్ని ఉల్లి పొరలవలె విప్పుకుంటూ పోవటం ఈ పత్రిక ప్రత్యేకత. ఇప్పుడు అదే పత్రికను న్యూయార్క్ నగరానికి మార్చారు. 1988లో మొదలైన ఈ పత్రిక 17 వేల కాపీలతో ఆరంభించి కుంటుతూ నడిచింది. రాను రాను ఆ నోట ఆ నోటా దీని ఖ్యాతి వ్యాపించగా ఇప్పుడు అమెరికా దేశ వ్యాప్తంగా ఈ పత్రిక ఏమి రాసిందోనని పట్టించుకుంటున్నారు. పత్రికలో రాసే వాటిని, బయట నుంచి వచ్చే విషయాన్ని అందరూ కలసి కూర్చొని చర్చించి చిత్రిక పట్టి ప్రచురిస్తారు. చాలా కొత్త తరహా శీర్షికలు పెట్టటం, నిగూఢ సత్యాలను వ్యంగ్యంగా వెళ్ళడించటం ఈ పత్రిక ప్రత్యేకత. అడుగడుగునా హాస్యం గుమ్మరిస్తూ ఉంటారు.
ఈ పత్రికలో టాడ్ హ్యాన్ సన్ స్టోరీ ఎడిటర్ గా విశిష్ఠ స్థానాన్ని పొందాడు. మరొక ఉప సంపాదకుడు మైక్ డి సెంజో అందరూ వెళ్ళిపోయిన తరువాత విషయాలన్నిటినీ పరిశీలించి తుది రూపాన్నిస్తూ ఉంటారు. రోజూ జరిగే చిన్న పత్రికా సమావేశం పేర్కొన దగినది. అందులోనే రకరకాల చర్చలతో ఏ విషయాన్నీ ఎలా ప్రచురించాలనేది నిగ్గు తెల్చుతారు. అక్కడ సీనియారిటీ, జూనియర్ రచయితలు అనే విచక్షణ లేదు. అందరూ విమర్శలకు, హాశ్యానికి గురి కావాల్సిందే.
ఇప్పుడు వెబ్ సైట్ లో కూడా ఈ పత్రికను పెట్టారు. ఆరున్నర లక్షలకు సర్కులేషన్ పెరిగింది. 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వార పత్రికగా ఇది సఫలం కావటానికి వ్యంగ్య హాస్య దోరణి ప్రధాన కారణమని సర్వేలో తేలింది. ఈ పత్రిక విమర్శకు, హాస్యానికి గురి కాని ప్రముఖులెవ్వరూ లేరు. పోపు దగ్గర నుండి ప్రధాన సినిమా నటీనటులు, క్రీడాకారులు ఏదో సందర్భంలో వీరి చతురోక్తులకు గురి కాక తప్పలేదు. ఇక్కడ సిబ్బందికి కాని, సంపాదక వర్గంలోని వ్యక్తులకు గాని చెల్లించే మొత్తాలు చూస్తే వ్యాపార సరళిలో ఉండవు. అయినా దీక్షగా ప్రతికకు పనిచేయటం విశేషం.

2 comments:

దేవన said...

ఇన్నయ్య గారు,

నేను 'the Onion' రోజు వారిగా చదువుతాను. బాగుంటుంది. మంచి పత్రికను పరిచయం చేసారు.

శ్రీ said...

ఇన్నయ్య గారూ, మీరు సంక్రాంతి జరుపుకోరా?