Sunday, January 18, 2009

గిన్నిస్ రికార్డ్ లో చిన్నారిపాపలు









వీరమాచనేని సరోజిని - గిన్నిస్ రికార్డ్ లో చిన్నారిపాపలు
చిన్నారి పాపలు అనే తెలుగు సినిమా గిన్నిస్ రికార్డ్స్ లోకి చేరడం గొప్ప విశేషం. వీరమాచనేని సరోజిని ఈ సినిమాని నిర్మించారు. ఇందులో గొప్పతనమేమంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్లు, నేపథ్యగాయకులు, సాంకేతిక సిబ్బంది స్త్రీలు కావడమే. డైరెక్టర్ సుప్రసిద్ధ సినీనటి సావిత్రి. మాటలు, పాటలు అన్నీ కూర్చారు. విక్టరీ మధుసూదనరావు అని పేరు తెచ్చుకున్న సినీ డైరెక్టర్ భార్య ఈమె. మంచి గాయకురాలు.
సరోజిని కీర్తి శేషులయ్యారు. ఆమె కృష్ణా జిల్లాకు చెందిన అభ్యుదయవాది. కమ్యూనిస్టులు 1940 నుండి ప్రజా ఉద్యమాలు చేపట్టి, నాటకాలు, బుర్రకథలు జనంలోకి తీసుకెళ్ళి చైతన్యాన్ని రగిల్చిన రోజులవి. బెజవాడలో (ఆ తరువాత విజయవాడ అయింది) అచ్చమాంబ క్లీనిక్ కమ్యూనిస్టు యువతలను పోషించిన కేంద్రంగా పేరు తెచ్చుకున్నది. సరోజిని కూడా అక్కడ తర్ఫీదు అయింది. ఆమె అల్లూరి సత్యనారాయణరాజు బుర్రకథ చెప్పి జనాన్ని ఏడిపించి, బ్రిటిష్ వ్యతిరేక ధోరణిని, జాతీయ భావాన్ని పెంపొందించడంలో పేరు తెచ్చుకున్నారు. వీరమాచనేని మధుసూదనరావు పెళ్లి చేసుకున్న తరువాత మదరాసులో సినిమా వారి మధ్య కొన్నేళ్ళు గడిపారు. చివరి రోజులలో హైదరాబాదులో ఉండేవారు. 70వ పడిలో కూడా ఆమె కంఠం మాత్రం మాధుర్యాన్ని కోల్పోలేదు.
ఒకసారి మా యింటికి వచ్చి తన అనుభవాలు చెపుతూ పాటలు వినిపిస్తుంటే రెండున్నర సంవత్సరాల నా మనవడు రోహిత్ బల్ల ఎక్కి ఆనందంతో చప్పట్లు కొట్టాడు. వాడి జన్మదినానికి స్వయంగా పాటరాసి పాడి కేసెట్ ఇచ్చింది.
అప్పటికే ఆమె కమ్యూనిజాన్ని ఇంచుమించు వదిలేసింది. నేను రాసిన పుస్తకాలు కొన్ని చదివి, అందులో నరహంతకుడు అనే చిన్న పుస్తకంలో లెనిన్ ను గురించి ఉన్న విషయాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అదంతా నిజమేనా అని అంటూ, నిజం కాకపోతే కమ్యూనిస్టులు బతకనిచ్చేవారా అని ఆశ్చర్యపడింది. సినీనటి సావిత్రి గురించి ఆమె జ్ఞాపికలు నెమరు వేసుకుంటుంటే, సావిత్రిని ఎదుట చూస్తున్నట్లే అనిపించేది. అనేకమంది సినీ తారలతో ఆమెకు గల పరిచయాన్ని చెబుతుండేది. ఆమెను ఇంటర్వ్వూ చేసి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వ్యాసం కూడా రాశాను.

No comments: