Thursday, January 22, 2009

విజయరాజకుమార్ - ఉపన్యాసాల ఉర్రూతలు

స్వాతంత్ర్యం వస్తున రోజులలో గుంటూరు జిల్లా చేబ్రోలు ఎంతో ఉత్సాహ వంతంగా పోరాట కార్యక్రమాలు చేపట్టింది. అది 1947 నుండి జరిగిన సంగతి. అక్కడ విజయరాజకుమార్ యువ సిబిరాలు నడిపి, సుభాష్ చంద్రబోస్ ప్రేరణతో రాజకీయ చైతన్యాన్ని రగిల్చారు. ఆయనకు తోడుగా వి.ఎల్. సుందరరావు ఉండేవారు. చేబ్రోలులో వారు నడిపిన అధ్యయన శిబిరాలకు యువతీ యువకులు ఉత్సాహవంతంగా వచ్చేవారు. బెంగాల్ నుండి సుభాష్ బంధువు శరత్ చంద్రబోస్ వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవారు. వీరంతా బోసు పెట్టిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందినవారు. అయితే ఆంధ్రలో ఆ పార్టీ అంతగా ముందుకు సాగలేదు. విజయరాజకుమార్ ఆనాడు సుభాష్ చంద్రబోస్ పై ‘విప్లవాధ్యక్షుడు’ అనే శీర్షికతో పుస్తకం ప్రచురించారు.
ఫార్వర్డ్ బ్లాక్ లో.....
తొలి ఎన్నికలలో ఎన్.జీ. రంగా గొప్ప నాయకుడిగా జనాకర్షణతో కాంగ్రెసె నుండి విభేదించి, కృషీకార్ లోక్ పార్టీ స్థాపించారు. రంగా అనుచరులుగా ఉన్న నర్రిశెట్టి రాజయ్య (పాత రెడ్డి పాలెం గ్రామ నాయకులు) తన పెద్ద కుమారుడు విజయరాజకుమార్ ను రంగా గారికి పరిచయం చేసి, చల్లపల్లిలో జరిగిన రాజకీయ శిక్షణ శిబిరానికి పంపారు. అక్కడ విజయరాజకుమార్ పార్టీలో చేరి అందరి దృష్టీ ఆకర్షించి ప్రముఖ స్థానాన్ని పొందారు. ఆనాడు పి. రాజగోపాల్ నాయుడు, సుంకర సత్యనారాయణ, వీరాచారి, కె. రోశయ్య మొదలైన వారు రంగా శిష్యులుగా ఉండేవారు. తొలి ఎన్నికలలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా విజయరాజకుమార్ ఉపన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ పొందాయి. ఆ తరువాత రంగా గారి రచనలు కొన్ని తెలుగులోకి అనువదించారు. అందులో విప్లవ రైతాంగాం పేర్కొనదగినది. రైతుల పక్షాన రంగా గారు పోరాడటం వీరికి బాగా నచ్చింది.
రంగా గారి శిష్యుడుగా.....
ఎన్నికల అనంతరం కృషికార్ లోక్ పార్టీ ప్రజా ఉద్యమాలు చేపట్టింది. అందులో గౌతులచ్చన్న, కందుల ఓబుల రెడ్డి మొదలైన వారు సారధ్యం వహించారు. 1954లో రాష్ట్రానికి గవర్నర్ గా చందులాలా త్రివేది ఉన్నప్పుడు గౌతులచ్చన్న నాయకత్వాన కల్లు గీత పనివారి ఆందోళన సాగింది. వారికి వృత్తి రక్షణ ఉండాలని, గీతను నిషేధించరాదని కార్యకర్తలు జైళ్ళకు వెళ్ళారు. అందులో భాగంగా విజయరాజకుమార్ కూడా రాజమండ్రి జైలు పాలయ్యారు. అప్పటికే ఆయన చేబ్రోలు నుండి గుంటూరుకు వచ్చి రాజకీయల్లో పాల్గొంటున్నారు. 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదలై, ఒక వైపు కుటుంబాన్ని చూచుకుంటూ మరో వైపు రాజకీయాల్లో రంగా శిష్యులుగా పాల్గొన్నారు.
సెక్యులర్ వివాహం...
1955లో విజయరాజకుమార్ గుంటూరులో సెక్యులర్ గా కన్యాకుమారిని వివాహమాడారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి పెళ్ళి ప్రమాణాలు చేయించి త్రిపురనేని రమస్వామి వివాహ విధి పద్దత్తిలో, గుంటూరు సరస్వతి మహల్ లో పెళ్ళి జరిపించారు. దీనికి ఆచార్య రంగా, కొత్తా రఘురామయ్య (కేంద్రమంత్రి) మొదలైన ప్రముఖులెందరో వచ్చారు. తెనాలిలో ఆంధ్రపత్రిక విలేఖరిగా ఉంటున్న వెంకటప్పయ్య శాస్త్రి గారి కుమార్తె కన్యాకుమారి. వారి పెళ్ళి నిర్వహిస్తూ ఆవుల గోపాలకృష్ణమూర్తి గొప్ప ఉపన్యాస సందేశాన్నిచ్చారు. ఆయన ప్రముఖ రాడికల్ హ్యూమనిస్ట్. తెనాలిలో న్యాయవాదిగా ఉంటున్నారు. విజయరాజకుమార్ కుటుంబానికి ఆయన సన్నిహితులు.
1955లో ఆంధ్రలో ఎన్నికలు జరిగాయి. అవి చరిత్రాత్మకమైనవి. అప్పుడు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఐక్య కాంగ్రెస్ పక్షాన, రంగా గారి శిష్యులుగా విజయరాజకుమార్ చేసిన ఉపన్యాసాలు చిరస్మరణీయమైనవి. కమ్యూనిస్టులను కామన్ ప్లాట్ల్ ఫారాలపై సవాల్ చేస్తూ పర్యటన జరుపుతూ జనాన్ని సమ్మోహితులను చేసిన ధోరణి చరిత్ర గమనించింది. ఆయనకు తోడు సుంకర సత్యనారాయణ, వీరా చారి మొదలైన వారు ఉండేవారు.
ఎన్నికల అనంతరం 1958 నాటికి స్వతంత్ర పార్టీ ఏర్పడింది. అందులో రంగా గారు అధ్యక్షుడు కాగా రాష్ట్ర స్థాయిలో విజయరాజకుమార్ వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. పుస్తకాలు, వ్యాసాలు, కరపత్రాలు నిరంతరం ప్రచురిస్తూ పోయారు. రైతుల పక్షాన రంగాగారు పోరాడుతుంటే, వీరంతా అండగా నిలిచారు.
సంజీవ రెడ్డి పై పోరాటం -
1958-59 ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డికి తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరెట్ ప్రసాధించారు. అప్పటికే విజయరాజకుమార్ ఆ యూనివర్శటిలో స్థానిక సంస్థల ప్రతినిధిగా సెనేట్ మొంబరయ్యారు. కాని సెనేట్ కి చెప్పకుండానే అలా డిగ్రీనివ్వటం విరుద్దమైనదని కోర్టులో విజయరాజ్ కుమార్ కేసు వేశారు. ఆనాడు ఎదురులైని సంజీవరెడ్డి సైతం కేసు ముగిసే వరకు తనను డాక్టర్ అని సంబోధించరాదని ఛీప్ సెక్రటరీ భగవాన్ దాస్ ద్వారా ఉత్తరువులు ఇవ్వటం గమనార్హం. ఆ కేసును ఆవుల గోపాలకృష్ణ మూర్తి వాదించారు. వారికి అసిస్టెంట్ గా నెల్లూరులో గుప్తా ఉండేవారు. కేసు ఎటూ తేల్చకుండా చివరకు తిరుపతిలో వేసుకోమని నానబెట్టారు. ఆ విధంగా కేసుని నీళ్ళు కార్చారు.







రంగాగారి రాజకీయాల్లో ఉంటూ వచ్చిన విజయరాజకుమార్ తన సాహిత్య రచనలను కొనసాగిస్తూ కొన్ని అనువాదాలు, కొన్ని సొంత రచనలు చేశారు. అయితే రంగాగారు ఉత్తరోత్తర కాంగ్రెస్ లో చేరినప్పుడు విజయరాజకుమార్ మాత్రం ప్రతిపక్షాల్లోనే ఉండిపోయారు. రైతు నాయకుడిగా ఉన్న చరణ్ సింగ్ గంధాన్ని తెలుగులోకి అనువదించారు. దీన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది. విజయరాజ కుమార్ కొన్నాళ్ళు మేదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఉంటూ, వ్యవసాయం చేస్తూ, ప్రింటింగ్ ప్రెస్ కూడా నడిపాడు. ఆయనకు ఇరువురు కుమారులు, పెద్ద కుమారుడు దేవరాజ కుమార్ సంగారెడ్డిలో శాంతిని పెళ్ళి చేసుకున్నారు. ఆమె గుడ్లవల్లెరు (కృష్ణా జిల్లా)కు చందినది.
విజయరాజకుమార్ కొన్ని సందర్భాలలో పట్టుదలగా ఎన్నికలను ఢీ కొన్నారు. ఒక దశలో సుప్రసిద్ధ గణిత నిపుణురాలు శకుంతలా దేవిని సమర్థించారు. ఎందరో సంగీత మిత్రులు విజయరాజ కుమార్ కు అండగా నిలిచారు. కె.బి. సత్యనారాయణ, నర్రావుల సుబ్బారావు, ఎస్.వి. పంతులు వంటి వారు పేర్కొవ దగినవారు. 1985 విజయరాజ్ కుమార్ కిడ్నీ వైఫల్యం పలన చనిపోయారు.
విజయరాజకుమార్ చిన్న తనం నుండి మతాతీతంగా పెరిగారు.



No comments: