Thursday, June 14, 2007

వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు -8

ఉదయం

దినపత్రికగా హైదరాబాద్ నుండి 1980 ప్రాంతాల్లో వెలువడిన ఉదయానికి సంపాదకులుగా ఎ..బి.కె. ప్రసాద్, గజ్జల మల్లారెడ్డి, కె. రామచంద్ర మూర్తి, పొత్తూరి వెంకటేశ్వరరావు పురాణం సుబ్రహ్మణ్యశర్మ (మాగజైన్ విభాగం)ఉండేవారు.నేను ఉదయం పత్రిక, వార పత్రిక అనుబంధం లోనూ రాశాను. త్రిపురనేని రామస్వామి పై రాసిన వ్యాసం, చర్చావివాదాలకు దారితీసింది. చేకూరి రామారావు వంటివారు పాల్గొన్నారు.

జస్టిస్ పింగళి జగన్మోహన రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ అనుభవాలు రాస్తూ, జి. రాంరెడ్డి వంటి వారి గుట్టు ఉతికి ఆరేశారు. ది యూనివర్సిటీ ఐ సర్వడ్ అనే పుస్తకం నేను తెనిగించగా ఉదయంలో సీరియల్ గా వేశారు. ప్రచురించాలా వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడు,పెద్ద మనిషి రాసిన సత్యాల్ని వెయ్యాల్సిందే అని గజ్జల మల్లారెడ్డి పట్టుబట్టి వేశారు. అదే విషయం ప్రచురణగా తీసుకురావడాన్ని,తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ సి. నారాయణ రెడ్డి అడ్డుపడ్డారు. జి. రాంరెడ్డిని చూసి,వెరసి అలా చేశాడాయన. ఉదయంలో తరచు వివిధ వ్యాసాలు రాశాను. దినపత్రిక ఉదయం ఆగిపోయింది. వివేకానంద పై నా వ్యాసానికి పెద్ద రియాక్షన్ వచ్చింది. హైందవ ఛాందసులు పత్రికపై దాడి చేశారు. ఎ.బి.కె. ప్రసాద్ తరువాత సంపాదకీయం రాయవలసి వచ్చింది. కడపవంటిచోట్ల పత్రికలు తగలపెట్టారు.


ఆంధ్ర ప్రభ

ఆంధ్రప్రభ దినపత్రికకు అనుబంధంగా వెలువడిన వారపత్రికలో పొత్తూరి వెంకటేశ్వర రావు ఎడిటర్ గా కొన్నాళ్ళున్నారు. అప్పుడు అగేహానందభారతి రాసిన స్వీయ అనుభవాలు వరుసగా నేను తెనిగించగా, ప్రచురించారు. ఆ పుస్తకం ఆఖర్ రోబ్ ఇంగ్లీషులో వచ్చినప్పుడు 1968లో భారత ప్రభుత్వం నిషేధించింది. తరువాత అమెరికాలో మరొక ప్రచురణ రాగా, దానిని నేను అనువదించాను. అందులో రామకృష్ణ పరమహంస, వివేకానంద ఆశ్రమాల్లో జరిగే విషయాలు లోతుపాతులతో అతడు స్వీయగాథలుగా రాశాడు.

అలాంటి ఇతివృత్తాన్ని ప్రచురించడం పొత్తూరి వెంకటేశ్వరరావు సహనాననికీ, ఉదార స్వభావానికీ, ఇతరుల అభిప్రాయాలను,ఆపరాదనే ధోరణికి నిదర్శనం. ఇది 1990 ప్రాంతంలో విశేషం. అదే సీరియల్ న్యూ హ్యూమనిస్ట్ లోనూ వచ్చింది. 1987లో అతడిని పిలిపించి, ఉస్మానియా, ఓపెన్ యూనివర్శిటీలలో ఎం.ఎన్.రాయ్ శతజయంతి ఉపన్యాసాలు ఇప్పించాను.

5 comments:

Anil Atluri said...

త్రిపురనేని రామస్వామి మీద రాసిన వ్యాసం వివరాలు తెలుపగలరు.

మన్యవ said...

స్వామీ వివేకానంద గురించిన వ్యాసం ఆన్ లైన్ లో వున్నాదా?

సత్యసాయి కొవ్వలి Satyasai said...

హేతువాదం అంటే హిందూ వ్యతిరేకతా అనిపిస్తుంది. ఏవివేకానందనో, పరమహంసనో విమర్శించడం లాంటివల్ల జనాలకి ఏంప్రయోజనం. అంతకన్నా ప్రజలకి పనికివచ్చే రచనలు చేయచ్చుగా. ప్రజలని ఎడ్యుకేట్ చేయడానికి అధికశాతం అభిమానించే వాళ్ళ ఐకన్స్ ని చెడ్డవాళ్ళని ప్రూవ్ చేయక్కర్లేదేమో. నమ్మేవాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళు రెచ్చితే చాందసు లనడం - అంత అవసరంకాదేమో. ఉన్న సమస్యలు చాలవా?

మన్యవ said...

అదీ నిజమే!!...ఇట్లాగే జన విజ్ఞాన వేదిక వాళ్ళు దేవుడు దేవుడు లేడు అని దండోరా వేస్తుంటారు. మరి వాళ్ళకి పాత బస్తీకి వెళ్ళి "అల్లా లేడు " అనే ధైర్యం ఉందో లేదో!!

cbrao said...

సత్యశాయి,మన్యవ -‘నేనెందుకు ముస్లిం ను కాను? ‘‘Why I am not a Muslim?’అని ఇబ్బన్ వారక్ రాసిన ఆంగ్ల రచనకు, తెలుగు అనువాదం,మదర్ థెరిసా పై నిశిత పరిశీలన, శాస్త్రీయ దృక్పధం అంటే ఏమిటి? అనే A.B.Shaw రచనకు తెలుగు అకాడమీ ద్వారా ప్రచురించిన, ఇన్నయ్య గారి తెలుగు సేత, తస్లిమా నస్రీన్ పై సమర్ధిస్తూ చేసిన రచనలు మీ సందేహాలకు, అనుమానాలకు తావులేకుండా చేస్తాయి.అన్ని మతాలను శాస్త్రీయ దృక్పధం తో పరిశీలించటం హేతువాద దృష్టి.కనుక కెవలం హిందూ మతాన్ని విమర్శిస్తున్నారనే ధొరణి సరైనది కాదని గ్రహించగలరు.