Wednesday, December 19, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం -6

మార్క్సు జీవితంలో కమ్యూనిస్టులు దాచిన కొన్ని ఘట్టాలు

మార్క్సు మానవ మాత్రుడు కనుక కోపతాపాలు ఇత్యాదులన్నీ సహజం. అందులోనూ జీవితమంతా కష్టాలు, అపనిందలు, ప్రవాసాలు ఇత్యాదులన్నీ ఎదుర్కోవవలసి వచ్చింది. జీవితంలో ఎన్ని ఒడుదుడుకులున్నా నమ్మిన సిద్ధాంతాలకు నిలబడిన వ్యక్తి మార్క్సు. ఆధునిక పరిశోధనలు విశ్లేషణలననుసరించి ఏ వ్యక్తి గురించి అయినా పూర్తిగా అర్థం చేసుకోవడానికి చిన్నతనం నుంచి జరిగిన విషయాలన్నీ సాకల్యంగా తెలుసుకోవాలని మనో విజ్ఞాన శాస్త్రం చెబుతున్నది. ప్రపంచ ప్రముఖులను గురించి ఈ విధమైన అధ్యయనాలెన్నో ఇటీవల వెలువడినాయి.
మార్క్సు సమగ్ర జీవిత చరిత్ర 1973లో తొలిసారిగా ప్రకటించిన ప్రోగ్రస్ పబ్లిషర్స్, మాస్కోవారు ఇంకా అనేక విషయాలను దాచి పెట్టడానికి ప్రయత్నించడం అవివేకమే అనిపించుకుంటుంది. ఐరోపాలో జరిగిన పరిశోధనల ఫలితంగా 1973లోనే డేవిడ్ మెక్లన్ వ్రాసిన మార్క్సు సమగ్ర జీవిత చరిత్రను మాక్మిలను వారు ప్రచురించారు. ఇవి కాక మార్క్సు జీవిత విశేషాలు తెలిపే అనేక రచనలు వెలువడ్డాయి. వీటిలో అప్రియమైనవి ఉన్నవి. అంతమాత్రాన మార్క్సుకు ఆయన సిద్ధాంతాలకు పోయేదేమీ లేదు. కాని వ్యక్తిని సరిగా అర్ధం చేసుకోవడానికి ఇవి ఉపకరించవచ్చు.
లండన్ లో ఉండగా మూర్ కు (మార్క్సును ఇంట్లో ఆప్యాయంగా పిలిచే పేరది.) భార్య పక్షంగా ఇద్దరు సహాయకురాళ్ళు వచ్చారు. ఒకామె హెలెన్ దెముత్, తరువాత ఆమె చెల్లెలు వచ్చింది. కాని అచిరకాలంలోనే చనిపోయింది. మార్క్సు ఇంట్లో హెలెన్ కీలక పాత్ర వహిస్తూ ఇంటి బాగోగులు చూస్తూ క్లిష్ట సమయాలలో చాకచక్యంతో ఆదుకుంటూ అప్పుల వారి బారి నుండి మార్క్సును కాపాడుతుండేది. ఆమె మాటంటే మార్క్సుకు సైతం సుగ్రీవాజ్ఞగా ఉండేది. పెద్ద అందగత్తె కాకున్నా 27 ఏళ్ళ ప్రాయంలో యవ్వనంతో తొణికిసలాడుతుండేది. ఆమెకు పెళ్ళి కాలేదు.
1851 జూన్ లో ఒకనాడు హెలెన్ డెముత్ పుత్రుని కన్నది. లండన్ లో 28 డీన్ స్ట్రీట్ లో మార్క్సు ఇంట్లోనే ప్రసవించింది. అతని పేరు ఫ్రెడరిక్. అసలే కష్టాలలో ఉన్న మార్క్సు కుటుంబానికి ఇది పెద్ద ఆశనిపాతమైంది. ముఖ్యంగా మార్క్సు భార్య జెన్నీ తల్లడిల్లిపోయింది.
ఫ్రెడరిక్ తండ్రి ఎవరు. ఎవరో అయితే జెన్నీకి అంత బాధ ఉండేది కాదు. సాక్షాత్తు మార్క్సు అని తెలిసినందువలననే ఈ గొడవ వచ్చింది. మార్క్సు పై రాళ్ళు రువ్వడానికి జర్మన్ ప్రవాసులలో చాలామంది ప్రత్యర్ధులు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం తెలిస్తే వారందరూ పరువు తీస్తారు.
ఫ్రెడరిక్ పుట్టిన ఐదు వారాలకు లండన్ లో పేరు రిజిష్టర్ చేశారు. తండ్రి పేరు దగ్గర ఏమీ రాయకుండా వదిలేశారు. పిల్లవాడిని లూయీ అనే ఆమెకు పెంపకానికి ఇచ్చారు. హెలెన్ మాత్రం మార్క్సుతోనే ఉన్నది. ఈ విషయాన్ని రహస్యంగా అట్టి పెట్టడానికి మార్క్సు కుటుంబం చాలా ప్రయత్నించింది. ఫ్రెడరిక్ పుట్టిన తరువాత ముందు రెండు వారాలపాటు మార్క్సు - ఎంగెల్స్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ జాగ్రత్తగా తొలగించారు.
తండ్రి ఎవరని చెప్పవలసి వస్తే చివరకు ఎంగెల్స్ తానే అని భారం వహించాడు. ఫ్రెడరిక్ ను ఎవరైనా సరిగా చూడకపోతే రహస్యంగా చెప్పమని కార్ల్ కాట్ స్కీ తొలి భార్య లూయీ ఫెబర్గర్ కు చెప్పాడు.
మార్క్సు బతికుండగా ఫ్రెడరిక్ తన ఇంటికి రావడం ఇష్టపడ లేదు. అందువల్ల అతను దొడ్డి త్రోవన రహస్యంగా తల్లిని చూసిపోతుండేవాడు.
ఫ్రెడరిక్ పుట్టినప్పుడు జెన్నీ మానసికంగా క్షోభపడడానికి మార్క్సు ఆ తరువాత పైడిమేయర్ కు రాసిన లేఖలో ప్రస్తావించాడు. జెన్నీ కూడా తన స్వీయ గాథలలో స్థాలీ పులాక న్యాయంగా ఈ విషయాన్ని ప్రస్తావించక పోలేదు.
విల్లిక్ - మార్క్సు విబేధాలు
కమ్యూనిస్టులీగ్ చీలడానికి విల్లిక్ - మార్క్సు అభిప్రాయభేదాలు సిద్ధాంత రాద్ధాంతాలే కాక వ్యక్తిగత విషయాలు కూడా దోహదం చేశాయి.
ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన విల్లిక్ 12వ ఏట నుంచి సైనిక శిక్షణ పొందాడు. ప్రష్యన్ ప్రభుత్వ సేననుంచి వైదొలగి ఎంగెల్స్ తోపాటు 1849లో బేడెన్స్ తిరుగుబాటులో పోరాడాడు. పెళ్ళి చేసుకోలేదు.
లండనులో ప్రవాసుల మధ్య నివసిస్తూ వారి కష్ట సుఖాలు తీరుస్తూ వారి మన్ననలకు పాత్రుడయ్యాడు. మంచి దుస్తులు వేసుకుని తెల్లవారకముందే మార్క్సు ఇంటికి వస్తుండేవాడు. అతని దృష్టి అంతా మార్క్సు భార్య జెన్నీ పైన ఉండేది. ఈ విషయం కూడా జెన్నీ గ్రహించి మార్క్సుకు తెలియజేసింది. సహజంగానే మార్క్సు అతడిని ద్వేషించేవాడు. అతడి రాక సహించేవాడు కాదు. ఈ వ్యక్తిగత ద్వేషాలు కమ్యూనిస్టు లీగ్ లో ప్రవేశించాయి. ప్రపంచమంతా ఒకటి తానొక్కడినే ఒక పార్టీ అనుకుంటాడని విల్లిక్ మార్క్సుపై విసురు విసిరాడు. మొత్తం మీద వీరిరువురి కక్షలు 1850లో కమ్యూనిస్టు లీగ్ ను చీలదీశాయి.
ఆ తరువాత 1863లో విల్లిక్ అమెరికా వెళ్ళి మార్క్సు పుస్తకాలకు అనుకూలంగా సమీక్షలు రాశాడు. మార్క్సు కూడా విల్లిక్ పై తన పాత భావాలు మార్చుకున్నాడు. సిద్ధాంతాల వెనుక వ్యక్తిగత విషయాలుంటాయి.
మార్క్సు - ఎంగెల్సు
1842లో మార్క్సు - ఎంగెల్సు తొలిసారిగా రైన్ లాండ్సలో కలుసుకున్నప్పుడు ముభావంగా ఉదాసీనంగా ఉన్నాడు. ఫ్రెయిన్ స్నేహితుడుగా ఎంగెల్సు భావించిన మార్క్సుకు రాగ ద్వేషాలు ఎక్కువ. అయితే మార్క్సు పత్రిక రైనిషె సైటుంగుకు ఎంగెల్సు వ్యాసాలు వ్రాశాడు.
అందులో ‘Outlines of Critique of Political Economy’ అనే వ్యాసంతో ఎంగెల్స్ పై తన అభిప్రాయాన్ని మార్చకుని ఉత్తరప్రత్యుత్తరాలు ఆరంభించాడు మార్క్సు. మార్క్సు దృష్టిని ఆర్ధిక విషయాలపైకి మళ్ళించింది ఎంగెల్సే. అంతకు ముందు తాత్విక రాజకీయ విషయాలే మార్క్సు దృష్టిలో ఉండేవి.
1814 ఆగస్టులో మార్క్సు, ఎంగెల్సు కలిసి చర్చలు జరిపి ఇరువురి భావాలు సన్నిహితం అని గ్రహించి ఆప్త మిత్రులై జీవితాంతం ఒకరికొకరు అండగా నిలిచారు. బ్రస్సెల్స ప్రవాస జీవితంలో జెన్నీ కూడా ఎంగెల్సును చూసింది.
మార్క్సు కుటుంబ జీవితానికి అంకితమయ్యాడు. ఎంగెల్సు పెళ్లి చేసుకోలేదు. స్త్రీల సాంగత్యం అంటే ఇష్టపడేవాడు. మేరీ బర్న్సతో కలిసి ఉండేవాడు. ఇంచుమించు ఆమె భార్యగా ఉన్నది కానీ ఆమెతో పరిచయానికీ, సన్నిహితత్వానికీ మార్క్సు భార్య జెన్నీ విముఖత చూపింది.
స్విట్జర్లాండ్ లో ప్రవాస జీవితం గడుపుతున్న ఎంగెల్సుకు మార్క్సు ఒకసారి డబ్బు పంపించాడు. ఆ తరువాత జీవితమంతా ఎంగెల్సు చాలా డబ్బు పంపి మార్క్సును ఆదుకుంటూ వచ్చాడు. అప్పుల వాళ్ళ బాధపడలేక తలదాచు కోవడానికి మాంఛెస్టర్ వెళ్ళి ఎంగెల్సు శరణు పొందడం మార్క్సుకు పరిపాటి అయింది.
అమెరికాలో ట్రిబ్యూన్ కు సైకోసీడియాకు పత్రికా ప్రతినిధిగా మార్క్సు వ్యాసాలు రాయడానికి ఒప్పుకున్నప్పుడు కూడా ఎంగెల్సు ఆదుకున్నాడు. ఆంగ్లంలో వ్రాయడం మార్క్సుకు రానందున ఎంగెల్సు వ్రాసి మార్క్సు పేర పంపిస్తుండేవాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు కానీ మార్క్సు ఇంగ్లీషులో వ్రాయడం నేర్చుకోలేదు. ఈలోపు ఎప్పుడైనా ఎంగెల్సు జబ్బుపడితే మార్క్సు తాను పంపానని, పోస్టులో పోయి ఉంటాయని అబద్ధం చెప్పవలసి వచ్చేది. ఎంగెల్సు - మార్క్సు ఇంచుమించు రోజూ ఉత్తరాలు వ్రాసుకునేవారు. ఇతర స్నేహితులపై ఎంగెల్సు దృష్టి పెట్టి సన్నిహితంగా ఉండడం కూడా మార్క్సు సహించలేనంత ఆప్తులయ్యారు.
అలాంటి స్నేహితుల మధ్య ఒక్కసారే అనుకోని వైమనస్యత ఏర్పడింది. ఎంగెల్సు ఆప్తురాలు మేరీ బర్న్ చనిపోగా మార్క్సు ఉత్తరం వ్రాస్తూ సంతాపం వెలిబుచ్చాడు. సంతాపానికి ఒక ఉత్తరం వ్రాసి తరువాత తన కష్టాలు ఏకరువు పెట్టుకున్నాడు. ఎంగెల్సుకు ఇది బాధ అనిపించింది. కాని ఉత్తరం పోస్టుచేసిన మరుక్షణంలోనే మార్క్సు తన పొరపాటును గ్రహించి పశ్చాత్తాపపడుతూ ఉత్తరం వ్రాశాడు. మళ్ళీ స్నేహితులిరువురూ కలిసిపోయారు.
కష్టాలు భరించలేక ఏదైనా వ్యాపారం చేయాలని మార్క్సు తన అభిప్రాయాన్ని ఎంగెల్సుకు చెప్పాడు. కాని పెట్టుబడి లేక ఊరుకోవలసి వచ్చింది. అమెరికా స్టాక్ మార్కెట్ లాటరీలో మార్క్సుకు 400 పౌండ్లు లభించాయి. ఈ లాటరీ ఆట ఎలా ఆడాలో ఎంగెల్సుకు కూడా మార్క్సు నేర్పాడు.
కాపిటల్ వ్రాస్తూండగా మార్క్సు వంటినిండా రాచకురుపులు వచ్చి విపరీతంగా బాధపడ్డాడు. చివరకు మర్మావయవము పై కూడా ఈ పుండు వచ్చినప్పుడు ఆ బాధ మర్చి పోవడానికి తాను చదివిన ఫ్రెంచి అశ్లీల కవిత్వమంతా వ్రాసి ఎంగెల్సుకు పంపాడు.
ఇలాంటి ఘట్టాలు వెలుగు నీడలు ఎన్నో మార్క్సు జీవితంలో ఉన్నవి. మార్క్సు మార్క్సిజం గురించి ఇంకా వివరాలకు సమగ్ర అధ్యనం అవసరం. (చూడండి మార్క్సు మార్క్సిజం, రచన ఎన్.ఇన్నయ్య, తెలుగు విద్యార్ధి ప్రచురణలు మచిలీ పట్నం 1976)

(More..)

No comments: