శాస్త్రంతో విమోచన
విద్యవల్ల విముక్తి లభిస్తుందనేది విజ్ఞానపరంగా వాస్తవం. అజ్ఞానం, మూఢనమ్మకాలు, వాటి వల్ల కలిగిన రాగద్వేషాల నుంచి మానవుడిని విముక్తుడిని చేయడంలో విజ్ఞానం ఉపయోగపడింది. ఇటీవలి వరకు తనను తెలుసుకోవడానికి, విశ్వాన్ని తెలుసుకోవడానికి ఈ నమ్మకాలు అడ్డుపడి, మానవుడిని హేతుబద్ధంగా నైతికంగా పరిపూర్ణదశకు రాకుండా చేశాయి.
ఈ వియోచన ఎలా ఉన్నదో చూడాలంటే, వందేళ్ళ కిందట ఈ దేశంలో ఇంచుమించు అందరూ, నేటికీ కొందరు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, జీవ నిర్జీవ వస్తువులు, సముద్రం, గాలి, మానవుడి గురించి ఏమనుకున్నారో చూస్తే సరిపోతుంది. ఈ నమ్మకాలు మన ఆదర్శాలను నిర్ధారణ గావించాయి. మతేతరంగానూ పారలౌకికంగానూ ఎలా ప్రభావితం చేశాయి, వ్యక్తిగతంగానూ, పరస్పర వ్యక్తుల మధ్య సంబంధాలలోనూ ఈ ప్రభావం ఎలా ఉన్నదీ తెలుసుకోవచ్చు. మానవుడిని గురించి, లోకాన్ని గురించి మన భావాలను, విజ్ఞానం దృష్ట్యా ఎలా పునరాలోచించుకోవాలో పరిశీలించాలి. ఆధునిక విజ్ఞానం సూచించిన ధోరణిలో మన దృష్టిని మార్చుకుంటే మానవుడిలోని సృజనాత్మక శక్తులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. అప్పుడు సాంకేతిక శాస్త్రాన్ని మానవుడి మంచితనం కోసం మలచవచ్చు. విధ్వంస లక్ష్యాలకోసం దుర్వినియోగ పరచకుండా ఆపవచ్చు.
ఖగోళ శాస్త్రం
పురాణాలలో లోకం అంతా స్వర్గనరకాలుగానూ, భూమిగానూ విభజించారు. ఇవి ఒకదానిపై ఎకటి ఆధారపడి ఉండగా భూమి అడుగున పాతాళ లోకంలో, ఆదిశేషు వీటన్నిటినీ మోస్తుంది. ఆ సర్పంపై విష్టువు శనించి ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నీ ప్రత్యేక దేవతలకు నివాసాలు. రాహువు, కేతువులు తరచు సూర్యచంద్రులను కబళిస్తుంటాయి. అప్పుడు గ్రహణా లేర్పడతాయి. కాంతి పుంజాలు వెదజల్లే ఈ నిస్సహాయ దేవతలను రాహు కేతువుల కబంధ హస్తాల నుంచి తప్పించటానికి పూజా పునస్కారాలతో ఎన్నో వస్తువులు సమర్పించుకోవలసి ఉంది. గ్రహణాలే కాక, వరదలూ, కరువు కాటకాలూ, భూకంపాలూ అన్నీ ఏదో ఒక దేవతకు అంటగట్టారు. వాటి ముందు మానవుడు నిస్సహాయుడు. ఆరాధనతో దేవతలను శాంతింపజేయటం, లేదా పూర్తిగా లొంగిపోవడం, కాదంటే, యోగాభ్యాసం, తపస్సు వల్ల కొన్ని శక్తులు సంపాదించటం మాత్రమే మానవుడు చేయగలిగింది. అంతేగాని దైవశక్తి పనిచేసే తీరును, వివేచనాత్మకంగా తెలుసుకొని వాటి బారి నుంచి తప్పించుకోవటం, లేదా మరొక మార్గాన్ని చూడటం అనేది జరగదన్న మాట. నియమ బద్దమైన ప్రకృతి అనే భావన వస్తువులలోగాని, తీరు తెన్నులలో గాని చూడలేక పోయారు. సైన్సు వల్ల నియమబద్దత వచ్చింది.
నక్షత్రాలను, గ్రహాలను, దేవతా నివాసాలుగా నేడు అందరు మానవులు నమ్మటం లేదు. దుష్ట దేవతల ప్రయత్నం వల్ల శిష్టమైన వాటిని నాశనం చేయటానికి గ్రహణాలేర్పడుతున్నాయని అందరూ నమ్మటంలేదు. మనం ఇప్పుడు, గ్రహణాలను ఊహించవచ్చు. లోగడ మనలను ఆశ్చర్య పరిచే అనేక సంఘటనలను ఇప్పుడు, గంటలూ, నిమిషాలతో సహా అంచనా వేసి చెప్పవచ్చు. భూమి సూర్యుని చుట్టూ గంటకు 65 వేల మైళ్ళ వేగంతో తిరుగుతున్నదని తెలుసుకున్నారు. దీని కాధారంగా శేషనాగు లేదుగాని, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి నిలబడిందని గ్రహించాం. సూర్యోదయం, సూర్యాస్తమయం, సముద్రాల ఆటుపోట్లు, రుతువుల మార్పులు, ఏడాదికొకసారి పక్షులు, చేపలూ వలసపోవడం, నక్షత్రాల, మనుషుల, జీవజాలాల పుట్టుక, చావు కూడా దేవుడు, దేవతవల్ల గాక, అంతర్గతంగా ఉండే నియామాల వల్ల జరుగుతున్నాయి. మానవుడి వివేచనకు ఇవన్నీ అవగాహన అయ్యేవే. తన సాంస్కృతిక పరిణామ భిన్నదశలలో మానవుడు తనను పోలిన దేవుడిని సృష్టించుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలియటం వల్ల ఇంతకు ముందెన్నడూ లేనంతగా మానవుడి సృజనాత్మక శక్తి విమోచన పొందింది.
1 comment:
ఇన్నయ్య గారికి నమస్కారం..
వీలైనంత త్వరలో మీ అభిప్రాయాలు (నా దృష్టిలో) ఎంత వరకు సరైనవో తెలుపుతాను...
దయచేసి వేచియుండగలరు..
Post a Comment