Friday, December 21, 2007

Scientific method- turning points

విజ్ఞానంలో రాశి విధానాలు
అంచనావేసే శక్తి ఉంటేగాని పరీక్షకు నిలబడటం సాధ్యం కాదు. అంచనా అనేది తుదిఘట్టం. కీలకమైన పరీక్షలో విఫలమైతే ప్రతిపాదనతో పొందికగా ఉన్న ఇతర విషయాలను చూసి సరిపెట్టుకోడానికి వీల్లేదు. పరీక్షకు అర్థాన్ని గమనిస్తే ఇటువంటి సందర్భాలలో రాశివిధానాలు (Quantitative Methods) చాలా ఫలవంతంగా ఉన్నట్లు గమనించవచ్చు. అయితే పరీక్ష నిమిత్తం, వైజ్ఞానిక స్థాయి కోసం, రాశి విధానాలనేవి తార్కిక విశ్లేషణకు, నిగమన పద్ధతులకు పనికి వచ్చే మేరకే స్వీకరిస్తాయి. ఉదాహరణకు, మేఘాలు ఏర్పడే విషయమై ప్రతిపాదనలు, అలోపతి వైద్యం ప్రకారం రోగకారణాలు, నయం చేసే రీతులలో రాశివిధానాల ప్రయోజనం అట్టేలేదు. అయినప్పటికీ వైజ్ఞానిక ప్రమాణాన్ని, పరీక్షకు నిలబడటాన్ని సంతృప్తి పరచడం వల్ల అవి కూడా వైజ్ఞానికాలే.
అంచనా వేయడంలో నిర్ధిష్టంగా ఉండడానికి, ప్రతిపాదనలో ఇమిడి ఉన్న విషయాలను ఇంకా సునిశితంగా పరిశీలించడానికి రాశిపద్ధతులు ఉపయోగపడే మాట నిజమే. కాని ఒకానొక సిద్ధాంతం విజ్ఞానయుతంగావడానికి దాని తార్కిక నిర్మాణం, దానికే ప్రపంచానుభవంతో కూడిన వాస్తవాలకూ గల సంబంధం ముఖ్యం. ఇదంతా గణితపద్ధతులలో ఉన్నా లేకున్నా ఫరవాలేదు. అంతవరకూ వస్తున్న నమూనారీతులన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ఒక ప్రతిపాదన చేయడం అందులో ఇమిడి ఉన్న విషయాలను నిగమన తర్కంలో ఉన్నాయోలేదో చూడడం, తరవాత పరిశీలిస్తూ పరీక్షకు గురికావించడం జరగాలి. దీనిలో ఇమిడి ఉన్నవన్నీ సరిపోతే, సిద్ధాంతానికి (తార్కికంగా) అందరూ ఆమోదిస్తారు.
(ఇది కచ్చితంగా సరైందనలేం. కొన్ని సందర్భాలలో అంచనాలు విఫలమైనప్పటికీ, వ్యవస్థాపిత సిద్ధాంతాన్ని అట్టిపెడతారు. కలవరపెడుతున్న విషయాన్ని భవిష్యత్తు కనుక్కోవచ్చుననే ఆశతో ఇలా చేస్తారు. యురేనస్ గ్రహం విషయంలో ఇంతే జరిగింది. సిద్ధాంతం ఏ మేరకు సఫలమైందనే దాన్ని బట్టి, అంచనా విఫలమై సిద్ధాంతం కూడా విఫలమైనట్లు పరిగణించే పరిస్థితి వస్తుంది).
వైజ్ఞానిక నిర్మాణ నమూనాను ప్రతిపాదన-నిగమన నమూనా అంటారు. విషయం ఏదైనా అన్ని విజ్ఞాన సిద్ధాంతాలకు ఈ నమూనా సర్వసాధారణంగా ఉంటుంది. ఆర్థిక, నైతిక, రాజకీయ విషయాలలో ఈ పద్ధతి అంతగా అన్వయించలేకపోడానికి సాంఘిక శాస్త్రాలలో మార్పులే కారణం. మానవేచ్చ పనిచేయడంతో నిర్దిష్టంగా అంచనావేయడం సాధ్యపడటం లేదు. పరిమితంగా తప్ప, గణిత విధానాలు అన్వయించడం కూడా కుదరడం లేదు. మానవ ప్రవర్తన అధ్యయనానికి సైతం అన్వయించగల స్థాయికి గణితం ఇప్పుడే చేరుకుంటున్నది. సాంఘిక శాస్త్రాలలో అగ్రగణ్యం ఉన్న ఆర్థిక శాస్త్రం వంటివాటికి వైజ్ఞానిక పద్ధతులు అన్వయిద్దామనుకున్నప్పటి ఆగమన పద్ధతి ప్రాధాన్యం ఒక శతాబ్దం నుంచే గుర్తించడం జరిగింది. సామాజిక రాజకీయ శాస్త్రాలలో ఈ పద్ధతి ఇప్పుడిప్పుడే వస్తున్నది. నైతికశాస్త్రంలో ఇది మొదలు కాలేదు. కనక సాంఘిక శాస్త్రాలు ప్రతిపాదన-నిగమన నమూనాను చెప్పుకోదగినంతగా అన్వయించలేదు. సాంఘిక శాస్త్రాలలో ఆగమన ప్రాతిపదికలు సరిగా ఉన్నచోట, సిద్ధాంత ప్రతిపాదనలు, వైజ్ఞానిక సిద్ధాంతంగా ఉంటాయి. అంటే రూపొందించిన సిద్ధాంతాలు నిజమా, అబద్దమా అంటే, పరీక్షా ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. అయితే సిద్ధాంత నిర్మాణం మాత్రం దెబ్బతినదు.
విజ్ఞాన సత్యం సంభావ్యమే
విజ్ఞాన సిద్ధాంతాన్ని గురించి ఇంతవరకు జరిపిన చర్చవల్ల లోగడ చెప్పని విజ్ఞానసత్యం ఒకటి తెలుస్తోంది. విజ్ఞానం నిర్మాణంలో వివేచనాత్మకమనీ, విషయంలో ప్రపంచానుభవం గలదనీ, మతరహిత స్వభావంతో కూడినదనీ పరిశీలించాం. విషయపరంగా ప్రపంచానుభవంతో కూడినదంటే, ఇందలి సత్యం సంభావ్యమనీ, కచ్చితంకాదనీ అర్థం, కేవల వివేచనా లేదా, అంతర్భుద్ధి వల్ల వెల్లడించే సత్యాల వంటిది కాదన్నమాట. మార్మికవాదిగాని కేవలం వివేచనాత్మకుడుగాని పెర్కొనే సత్యంకంటే, విజ్ఞానపరమైన సత్యం తక్కువ అని అనుకోరాదు. ఈ రెండు సందర్భాలలోనూ సత్యం అనే పదాన్ని వివరణ లేకుండా వాడితే తప్పుదారిన పట్టించినట్లవుతుంది. మార్మికుని సత్యం ప్రకారం ప్రపంచానుభవంతో సరిపోయినా, లేకున్నా ఫరవాలేదు. కేవల హేతువాది చెప్పే సత్యం ప్రాయికంగా ఒకప్రతిపాదన స్వభావం గలది మాత్రమే. కనక ఇందులో నిర్ధారణ భిన్న రంగానికి చెందినది.
సత్యం అనే పదాన్ని రెండు భిన్నమైన అర్ధాలలో వాడుతున్నారు. ఒకానొక ప్రకటన సత్యమైనదంటే, అర్థం ఏదైనా కావచ్చు.
1. లోగడ పేర్కొన్న ప్రతిపాదన తాత్కాలికంగా సత్యమైనదిగా భావిస్తుంటే అందులోంచి సత్యాన్ని సరిగ్గా రాబట్టడం జరగవచ్చు.
2. ప్రపంచరీతిని సరిగా చిత్రించవచ్చు.
మొదటి ప్రకటన తార్కికంగా సత్యమైంది. కనక తార్కికంగా సరైందనవచ్చు. సత్యం అంటే ఇక్కడ తార్కికంగా సరిపడినదన్న మాట. రెండోది ప్రాపంచికాను భవం దృష్ట్యా వాస్తవం. ఒకో పర్యాయం ఒక ప్రకటన తార్కికంగా సరైంది కావచ్చు. ప్రాపంచికానుభవంలోనూ సరైందికావచ్చు. లేదా రెండింటిలో ఏదో ఒకదానికే చెందవచ్చు. ఈ విషయం సాధ్యమవడానికి ఉదాహరణలు చూద్దాం.
ఎ బి
1. మనిషి నాలుగు కాళ్ళతో ఉంటాడు. 1. కనక నాకు నాలుగు కాళ్ళున్నాయి.
2. నీరు రాయికంటే భారమైంది. 2. కనక రాయి నీటిలో మునగుతుంది.
3. రోమ్ కు ఉత్తరదిశగా లండన్ ఉంది. 3. కనక రోమ్ కంటే లండన్ చల్లగా
ఉంటుంది.
4. నీరు గాలికంటే తేలిక. 4. కనక రాయి నీటిలో తేలుతుంది.
పై ప్రకటనలన్నింటిల్లోనూ, మొదటి భాగం ప్రతిపాదనకాగా, రెండో భాగం దాని నుంచి వచ్చిన నిర్ణయం. ఈ నిర్ణయాలను పరిశీలిద్దాం.
1 బి) తార్కికంగా సరైందే, ప్రపంచ అనుభవంలో తప్పు.
2 బి) తార్కికంగా చెల్లదు. ప్రపంచంలో వాస్తవమే.
3 బి) తార్కికంగా సరైంది. ప్రపంచంలోనూ వాస్తవమే.
4 బి) తార్కికంగా చెల్లదు. అనుభవంలో దోషపూరితం.
ఈ ఉదాహరణ వల్ల, తార్కికంగా సరిగా ఉండడం, ప్రపంచ సత్యం అనేవి స్వతంత్ర ప్రతిపాదనలని గ్రహించవచ్చు.
పూర్వాపర సంబంధాలను బట్టి తర్కం నిర్ధారణ అవుతుంది. ప్రపంచాను భవం అనేది వాస్తవాన్ని బట్టి ఉంటుంది. తర్కంలో ఒక ప్రకటన చెల్లడమో, చెల్లకపోవడమో తప్ప, మధ్యే మార్గంలేదు. తార్కికంగా సరైన ప్రతిపాదనలోని సత్యం ఎంత నిర్ధారితమైనదో, తార్కికంగా చెల్లని ప్రతిపాదనకూడా అంతే నిర్ధారణతో కూడింది. ప్రపంచానుభవంతో కూడిన సత్యంలో వాస్తవాలు రెండు విషయాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు వర్షం కురుస్తున్నది అనే ప్రతిపాదనలో వాస్తవమో, అసత్యమోతప్ప, సందేహానికి చోటు లేదు. కాని, హంసలు తెల్లనివి అంటూ ఒక సర్వ సాధారణ ప్రతిపాదన చేసినప్పుడు, ఇందలి సత్యం కచ్చితమని చెప్పజాలం. అన్ని హంసలనూ పరిశీలించే వీలులేదు. గనక ఇలా చెప్పజాలం. భవిష్యత్తులో రానున్న హంసల విషయం పరిశీలించడం అసలే సాధ్యపడదు. కనక అటువంటి ప్రతిపాదన కొన్నిటికే పరిమితం. ఆ మేరకు ఈ ప్రతిపాదనలోని సత్యం నిర్ధారితం కాదు. ఇదంతా కేవలం కోడి గుడ్డుపై వెంట్రుకలు లెక్కించడం వంటిదేమీ కాదు. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఒక నల్లని హంసను చూశారు కూడా.
సర్వ సాధారణమైన ఇలాంటి ప్రతిపాదనల మాట అలా ఉంచి, విజ్ఞాన సిద్ధాంతంలో ఒకే ఒక ప్రతిపాదన సైతం సంభావ్యంగానే భావించాలి. అలాంటి ప్రతిపాదనలు సైతం సాధారణ సత్యాలుగా భావించే వాటి నుంచి రాబట్టినవేగదా. ప్రతిపాదనలలో భావనలు, సంబంధాలుకూడా ఇమిడి ఉంటే, పరిశీలించదగిన ప్రాపంచిక విషయాలు ఉంటే, పరిమిత సంఖ్యకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వాటికి సంబంధించిన సత్యం అసంపూర్తి సాక్ష్యాధారాలపైనే ఉంటుంది. అటువంటి వాటి నుంచి రాబట్టిన ఏ ప్రతిపాదన అయినా నిర్ధారితంగా ఉండదు. నిగమనం అంటే సర్వసాధారణత్వం నుంచి ఒకానొక ప్రతిపాదనకు దారితీసే పద్దతే గదా.
మేదస్సు అవగాహనతో కూడిన భావనలపై ఆధారపడి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితిలో మెరుగు ఉండదు. ఇమిడి ఉన్న వాటన్నిటినీ పూర్తిగా పరిశీలించినప్పటికీ అది ప్రాపంచికానుభవం సత్యంగా గాక, ప్రతిపాదనల సంభావ్యతనే సూచిస్తుంది. కొన్ని ప్రతిపాదనలు ఒక గణిత సిద్ధాంతాన్ని నిర్ధారించ వచ్చు. అయితే సిద్ధాంతం మాత్రం ప్రతిపాదనలను రుజువు చేయలేక పోవచ్చు. భిన్న ప్రతిపాదనల నుంచి తార్కికంగా సిద్ధాంతాలను నిర్దిష్టంగా రాబట్టవచ్చు. ప్రతి పాదనలలోని సత్యాన్ని సిద్ధాంతాలలో ఇమిడి ఉన్న వాటికి అన్వయించవచ్చు. ఇమిడి ఉన్నవాటి సత్యం ఆధారంగా ప్రతిపాదనలు నిర్ధారితాలని చెప్పజాలం. దీనిని బట్టి తేలేదేమంటే మేధస్సు భావనల ఆధారంగా ఏర్పడిన వైజ్ఞానిక సిద్ధాంతం, అందుకు సంబంధించిన ప్రాపంచికానుభవ సత్యం కూడా సంభావ్యంగానే నిలుస్తాయి. నైరూప్యతకూ వీటికీ తేడా ఉంది. మేథోభావనలకు సరిపడే ప్రాపంచిక పరిశీలక విషయాలు లేవు. ఇక్కడే చిక్కులో ప్రవేశిస్తున్నాం. విజ్ఞానం అభివృద్ధిచెందే కోద్దీ తార్కికంగా కచ్చితమయిన సిద్ధాంతంలో సత్యం తగ్గిపోతున్నదన్నమాట. కేవలం వివేచనాత్మక పద్దతిలో ఇటువంటి చిక్కులేదు. అటువంటి పద్ధతిలో ఆద్యంతాలు తర్కం పైన ఆధారపడడాన్ని చూడొచ్చు.
ఈ స్థితిలో వైజ్ఞానిక సత్యాన్ని గురించి పరిశీలించదగిన అంశం మరొకటి ఉంది. ఒక సిద్ధాంతం స్థానంలో మరొకటి చోటు చేసుకున్నప్పుడు, తొలుత ఉన్న సిద్ధాంతాన్ని ఉత్తరోత్తరా వచ్చిన సిద్ధాంతం స్వీకరించినట్లే. ఐన్ స్టీన్ సిద్ధాంతం సంప్రదాయ పదార్థ విజ్ఞానాన్ని స్వీకరించింది. అయితే సంప్రదాయ పదార్థ విజ్ఞానం పేర్కొన్న ప్రపంచ దృక్పథం దోషపూరితమని, ఆధునిక పదార్థ విజ్ఞానం చూపింది. అయితే వీటిలో ఏది సరైంది. అని ప్రశ్నించడం సబబే, ఉజ్జాయింపుగా వాస్తవం అనడానికీ, దోషపూరితం అనడానికీ చాలా తేడా ఉంది. కానీ రెండూ విభిన్న విషయాలకు సంబంధించినవని తెలిస్తే చిక్కువిడిపోతుంది. న్యూటన్ సిద్ధాంతం ఐన్ స్టిన్ సిద్ధాంతానికి సన్నిహితమైనదంటే సంప్రదాయ పదార్థ విజ్ఞానం నుంచి రాబట్టిన గణితాన్నే దృష్టిలో పెట్టుకున్నారు. గ్రహచలనానికి చెందిన కెప్లర్ నియమాలు ఒక ఉదాహరణగా చూపవచ్చు. సాపేక్షతా, సిద్ధాంతంలోని గణితసూత్రాలలో కెప్లర్ నియమాలు ఉన్నాయి. పరిశీలించే వస్తువుకు సంబంధించి, పరిశీలకుడి గమనవేగాన్ని గ్రహించకపోవడంలోనే ఈ సన్నిహితత్వం ఉంది. ఏ సిద్ధాంతమైనా కొంత కాలం నిలబడాలంటే, దాని అంచనాలు సరిగా ఉండాలి. చాలా సందర్భాలలో ఇలానే జరుగుతుంది.
ఒకానొక గణిత సిద్ధాంతాన్ని రాబట్టడానికి అనేక ప్రతిపాదనలు ఉపకరించ వచ్చు. పూర్వ ప్రతిపాదన వల్లనే ఉత్తరోత్తరావచ్చే ఫలితం ఉండకపోవచ్చు. ఒక సిద్ధాంతం మరొక సాధారణ సిద్ధాంతంలో కలిసినప్పుడే అది పెంపొందే అవకాశం లభించవచ్చు. లోగడ సిద్ధాంతంతో పోల్చి చూస్తే, సాధారణ సిద్ధాంత ప్రతిపాదనలు భిన్నమైనవికావచ్చు. తొలి సిద్ధాంతానికి చెందిన గణిత అంచనాలు కొత్త ప్రతిపాదనలో వాస్తవాలుగా కొనసాగవచ్చు. అప్పుడు తొలుతఉన్న ప్రపంచ దృక్పథం తనవిలువను కోల్పోతుంది. కొత్త సిద్ధాంతం సమర్పించే దృక్పథంలో పాత అంతా కలిసిపోతుంది. సంప్రదాయస్థితి నుంచి ఆధునిక స్థాయికి పెంపొందిన పదార్థ విధానంలో ఇదే జరిగింది. అందుకే నేటికీ న్యూటన్ పదార్థ విజ్ఞానాన్ని రోడ్లు, వంతెనల నిర్మాణంలో, విద్యుత్తును ఉత్పత్తి చేసి, పంపిణీ చేయడంలో, మోటార్లు తయారు చేయడంలో ఇంకా అనేక విషయాలలో వాడుతున్నాం. వాటిని ఆధునిక విజ్ఞానానికి సమీపంలో ఉన్న సూత్రాలుగా భావించడమే. ఇందుకు దోహదం చేసింది. ఇవన్నీ ప్రాపంచికరీతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో దోషాలు ఏమంత పట్టించుకోదగినవి కావు. అయితే న్యూటన్ పదార్థ విధానం భౌతిక విశ్వాసానికి సంబంధించిన మౌలిక విషయాలగురించి సరిగ్గా చెప్పిందని మాత్రం ఒప్పుకోవడం లేదు. విశ్వంలో ప్రతి సంఘటనకూడా మరో సంఘటనతో కార్యకారణ సంబంధంతో ఉందని ఇప్పుడు ఒప్పుకోలేం. దూరాన్ని కొలవాలంటే కాలవ్యవధితో నిమిత్తం లేదనేది కూడా ఇప్పుడు అంగీకరించం. ఈ విధంగా న్యూటన్ రోజులలోని పదార్థ విధానం కాస్తా ఆధునిక పదార్థవిధానంలో ఐక్యమైపోయింది. ఆ విధంగా సజీవంగా ఉందనవచ్చు. న్యూటన్ పదార్థ విధానపు ప్రపంచ దృక్పథం మాత్రం మౌలికంగా దోషపూరితమైంది గనక తోసిపుచ్చడం.

No comments: