ఇతర సిద్ధాంతాలతో సఖ్యత
ఇతర సిద్ధాంతాలలో సఖ్యతగా ఉండటమనేది విజ్ఞాన సిద్ధాంతం సంతృప్తిపరచవలసిన లక్షణాలలో ఒకటి. భూమి, చంద్రుడు కూడా సూర్యునితో బాటే ఒకే కక్షలో ఉన్నప్పుడు గ్రహణం వస్తుందని గ్రహచలన సిద్ధాంతం పేర్కొంటున్నది. కనక రాహువు, కేతువుల దుష్టపథకం వల్ల గ్రహణం ఏర్పడుతుందని అంగీకరించ వీల్లేదు. విజ్ఞానం, వైద్యం చెబుతున్న రీతిగా కలరా, స్పోటకం అనే వ్యాధులకు కారణాలు, చికిత్స అంగీకరిస్తే, క్షుద్రదేవతల ఆగ్రహం వల్ల ఆ వ్యాధులు వస్తాయని ఒప్పుకోరాదు ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. తాత్కాలిక ప్రతిపాదనలు విజ్ఞాన సిద్ధాంతంలో ఉండవు. కొత్తగా కనుక్కొన్న వాటిని వివరించడానికి గాను ఒకదాని తరవాత మరొక ప్రతిపాదన చేస్తూ పోరాదు. ఇలా చేస్తే మౌలిక ప్రాతిపదనపై నమ్మకం సడలుతుంది.
ఒక పర్యాయం ప్రతిపాదన సంతృప్తికరంగా ఉందంటే, అందులో ఇంకే మార్పులూ చేయరాదని అర్థం కాదు. పాతవాటిని బలిపెట్టకుండా, కొత్త వాస్తవాలను వివరిస్తూ, సమర్థనీయమైన మార్పులు ఉంటే ఆహ్వానించవచ్చు. సాక్ష్యాధారాలు లభిస్తుంటే, సాధారణీకం గావిస్తుంటాం. అది వాంఛనీయం. కాని ప్రతిపాదనకు ఉప ప్రతిపాదనలు చేస్తుంటే, మౌలిక సిద్ధాంతంలో దోషం ఉన్నట్లే. కొత్త వాస్తవాలను సహజమైన సాధారణీకరణ ద్వారా గనక సిద్ధాంతం వివరించలేకపోతే, తొలి పదాలు, ప్రతిపాదనలు సమూలంగా మార్చాలన్నమాటే.
పదార్థ విజ్ఞానంలో ఇదే జరిగింది. సంప్రదాయ పదార్థ విజ్ఞానం అనేక ప్రతిపాదనలపై ఆధారపడింది. అందులో కొన్ని పేర్కొందాం.
1. పరిశీలకుని వేగంతో నిమిత్తం లేకుండా కాలం, దూరం ఉంటాయి. ఇవి మారవు.
2. యూక్లిడ్ చెప్పిన తీరులో ప్రదేశం ఉన్నది. దూరాన్ని కొలవాలంటే కాలంతో నిమిత్తం లేదు.
3. ప్రదేశం యావత్తు ఈథర్ ఆవరించి ఉంది. పదార్థ రేణువుల మధ్య విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారమయ్యేచోట సైతం ఈధర్ ఉంది.
4. శక్తిని అనంతంగా విభజిస్తూ పోవచ్చు.
5. ద్రవ్యరాశి ఎప్పుడూ పదార్థాన్ని అంటి పెట్టుకొని మారకుండా ఉంటుంది. శక్తితో దీనికి సంబంధం లేదు. ఎంత వేగంగా ఏ వైపుకు వెడుతున్నప్పటికీ ద్రవ్యరాశి అలానే ఉంటుంది.
6. పదార్థ విశ్వంలో కార్యకారణ నియమం కచ్చితంగా ఉంది. సూత్రప్రాయంగా ప్రతి సంఘటననూ అవసరమైనదిగా, తిరుగలేనిదిగా దానికారణాలను బట్టి వివరించవచ్చు.
మైకల్ సన్-మోర్లే పరిశోధనల ఫలితంగా వచ్చిన పరోక్ష ఫలితాలు, ఇంకా అనేకానేక పరిశోధనలు 19వ శతాబ్దం చివరి వరకూ జరిగినవాటిని గమనిస్తే పైన పేర్కొన్న వాటి ఆధారంగా ఉన్న పదార్థ విజ్ఞానం సమూలంగా మార్చాలని తేలింది. ప్రతిపాదనల జోలికి పోకుండా సిద్ధాంతాన్ని మార్చాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోగా, పరస్పర విరుద్ధ విషయాలకు దారితీసింది.
ఐన్ స్టీన్, ప్లాంక్ లు తుదకు ఈ సన్నివేశంలో వచ్చిన సమస్యను పరిష్కరించారు. వారి సాపేక్షతా, క్వాంటం (తేజఃకణ) సిద్ధాంతాలు సంప్రదాయ పదార్థ విజ్ఞాన ప్రాతిపదికలకు పూర్తిగా భిన్నమైంది.
పోటీపడుతున్న సిద్ధాంతాల మధ్య ఎంపిక
ఒకోసారి అనేక సిద్ధాంతాలు పోటీపడుతూ రంగంలో ఉండవచ్చు. ప్రతిదీ కూడా పైన పేర్కొన్న స్థితిని సంతృప్తి పరచవచ్చు. అటువంటప్పుడు ఈ కింద పేర్కొన్నవాటిలో ఏదొకటి సాధ్యమౌతుంది. ప్రత్యామ్నాయ సిద్ధాంతాలనేవి మౌలికంగా ఒకే సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహించవచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ స్వీకరిద్దాం. మరాఠీ, గుజరాతీ, తమిళం, హిందీ, ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలలోని అనేక వాక్యాలు ఒకే అర్థాన్ని ఇవ్వవచ్చు. భిన్న మాటలలో వ్యక్తపరుస్తున్నా, విభిన్న వాక్యాలన్నీ సమానమేనని అనవచ్చు. అలాగే ఒకే సిద్ధాంతానికి సరిపడే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సమానంగా ఉన్నాయంటే వాటి తొలిపదాలు, ప్రతిపాదనలు సరిపడేవి కావడమైనన్న మాట. ప్రతిపాదకులకు తొలుత ఈ విషయం అవగాహనకాకున్నా ఇది సాధ్యమే. ఇలాంటి ప్రతిపాదనలు పరస్పరం మౌలిక భేదం ఉన్నా, ఒకే రూపం గలవిగా పేర్కొనవచ్చు. ఒక సమస్యను పరిష్కరించడానికి అనేక ప్రతిపాదనలు ఉన్నప్పుడు, అవి మౌలికభేదం గల ఒకే రూపంగలవికాకుంటే, సాధారణత్వం ఒక్కటే ప్రమాణంగా స్వీకరించాలి. సాధారణత్వం మాత్రమే. అంటే తొలిపదాలు, ప్రతిపాదనలు బహు స్వల్పంగానూ, సాధారణ స్వభావంతోనూ ఉంటాయని అర్థం. సాపేక్షతా సిద్ధాంతంలో చాలా చిక్కుతోకూడిన గణితం ఉన్నప్పటికీ, తార్కికంగా న్యూటన్ పదార్థ చలనంకంటే ఇది సాధారణంగా ఉంటుంది. ఈ రెండు సిద్ధాంతాలలో మిగతా విషయాలు సమానంగా ఉన్నాసరే, సాపేక్షతా సిద్ధాంతాన్ని స్వీకరించాలి.
కొన్ని సందర్భాలలో సాధారణీకరణ అనే ప్రమాణం కూడా విఫలంగా వచ్చు. న్యూటన్, హ్యుగిన్స్లు ప్రతిపాదించిన వెలుగునకు సంబంధించి ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ఇందుకు ఉదాహరణగా స్వీకరించవచ్చు. అటువంటప్పుడు పరిశోధనా సాక్ష్యాధారులు లభించేవరకూ వేచి ఉండడం మినహా చేయగలిగింది లేదు. అప్పుడు ఒక సిద్ధాంతానికి అనుకూలంగా మిగిలిన సిద్ధాంతాలను తోసిపుచ్చడానికి వీలౌతుంది.
Next- Crucial test
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment