Friday, December 28, 2007

good and bad aspects-SCIENTIFIC METHOD contd

విజ్ఞానం - మానవ సంబంధాలు

వైజ్ఞానిక పద్ధతిలో సర్వ సాధారణత్వం

ఆధునిక విజ్ఞానం పెంపొందడానికి వైజ్ఞానిక పద్ధతే ముఖ్యకారణం. ఆర్థిక పరిసరాలు మొదలైన ఇతరేతర కారణాలు అంతగా ప్రాముఖ్యం వహించలేదు. వైజ్ఞానిక అన్వేషణ మూడు అంచెలలో సాగుతుంది. విశ్లేషణదశ, సహజచారిత్రక దశ, సాధారణ సూత్రాల నుంచి రాబట్టే సిద్ధాంతం అనేవి పేర్కొనదగినవి. వైజ్ఞానిక సిద్ధాంతానికి తుది ప్రమాణం వాస్తవాలు మాత్రమే. సిద్ధాంతం మారవచ్చు. నిరాకరణకు గురికావచ్చు. కొత్తగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి సమగ్ర సిద్ధాంతంలో ఇమడవచ్చు. ఈ విధానంగా వైజ్ఞానిక సత్యమనేది తాత్కాలిక మైంది. వైజ్ఞానిక పద్ధతి తనను తాను చక్కదిద్దుకుంటూ పోయే స్వభావం ఉన్నది.

ఇందులో విజ్ఞానానికి మాత్రం పరిమితమైన విలువ అంటూ ఏమీ లేదు. ప్రకృతి పనిచేసే తీరు, మానవ సంస్థలు కృషి చేసే విధానం అర్థం చేసుకోవాలన్నప్పటికీ వాటిలోని భాగాలు తెలుసుకోటమేగాక, పరస్పర సంబంధాలు కూడా గ్రహించవలసి ఉంటుంది. అంటే సమస్యను విశ్లేషించిన, మూలాధారమేదో కనుక్కోవాలన్న మాట. అందుకు సంబంధించిన వాస్తవాలన్నీ సేకరించాలి. వాస్తవాలను వివరించే సిద్ధాంతాన్ని రూపొందించాలి. సమస్య పరిష్కార మార్గాన్ని సూచించాలి. సారాంశమేమంటే వైజ్ఞానిక పద్ధతులతోనే అన్వేషణ జరపాలన్న మాట. ప్రకృతి శాస్త్రాలకు వైజ్ఞానిక పద్ధతి తప్పనిసరి అయినట్లే మానవ సంబంధాల విషయంలోనూ ఈ పద్ధతి కావాలన్నమాట.
ఈ నిర్ణయం వల్ల చాలా పరిణామాలకు దారితీసే అవకాశముంది. వాటిల్లో కొన్నిటిని పరిశీలిద్దాం.

వైజ్ఞానిక పద్ధతిలో సహనం

సిద్ధాంతాలన్నీ వాస్తవాలవల్ల విలువను సమకూర్చు కుంటాయి. కనక సూత్రప్రాయంగా జ్ఞానం అంతా అస్థిరమైందే. అంటే కార్యాచరణకు ఆధారపడదగిన ఏ మార్గదర్శకత్వం లేదని భావించరాదు. కావలసినంత ఆధారంఉంది. తొలకరి ఏ తేదీనవస్తుందో ముందుగా నిర్ధారణగా చెప్పలేము. కొంకణ తీరంలో ఈ సంవత్సరం ఫలానా తేదీన తొలకరి ఆరంభమవుతుందని చెప్పలేము. మార్పు చెందే విషయాలు అనేకం ఉన్నందున వాతావరణం నిక్కచ్చిగా అంచనా వేయటం సాధ్యపడదు. అంత మాత్రాన వేసవి నిరవధికంగా కొనసాగుతుందని గానీ, లేదా తొలకరి జూన్లో గాక ఏప్రిల్ లోనే మెదలవుతుందని గానీ భావించరాదు. కొన్ని పరిమితులకు మనకు లభిస్తున్న జ్ఞానం ఆధారంగా వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతాం. స్వల్ప మార్పులకు ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాం. వాతావరణ సిద్ధాంతానికి సంబంధించిన అనుభవ ఆధారాలను ఇంకా విస్తృతం చేసుకోవటం ద్వారా ఆ స్థిరత్వాన్ని తగ్గించుకుంటూ పోవచ్చు. అయితే పూర్తిగా ఆస్థిరత్వం తొలగించటం సాధ్యం కాకపోవచ్చు కూడా.
ఇంకే మాత్రం అస్థిరత్వాన్ని తగ్గించలేమనుకున్న తరవాత, అందులో భిన్నాభిప్రాయాలకు, వివిధ పంథాలకు అవకాశముండవచ్చు. కాని మూల సిద్ధాంతాలనికి విరుద్ధంగా మాత్రం ఇవేవీ ఉండరాదు. వైజ్ఞానిక సిద్ధాంతం ప్రాపంచికానునభవంతో ఉండటం వల్ల అది తాత్కాలికమైనదిగా భావించాలి. న్యూటన్ పదార్థ విజ్ఞానం ఎంతో సుస్థిరతను చేకూర్చుకున్నప్పటికీ, ఆ తరవాత అదే సిద్ధాంతం మరొక సమగ్ర సిద్ధాంతంలో ఇమిడిపోయింది. ఈ సమగ్ర సిద్ధాంతం సమస్యలను భిన్న కోణాలనుంచి పరిశీలించింది.

అస్థిరత, తాత్కాలిక స్వభావం అనే రెండు లక్షణాల వల్ల విజ్ఞానంలో పిడివాదానికి, మేథస్సుతో కూడిన తలబిరుసుతనానికి చోటు లేదు. వైజ్ఞానిక పద్ధతిలో భిన్నాభిప్రాయానికి, భేదాభిప్రాయానికి సహనం ఉంటుంది. అన్వేషణ నిరంతరం సాగకపోతే విజ్ఞానం స్తంభించిపోతుంది. కనక భేదాభిప్రాయాన్ని సహనంతో చూడటం గాక అందులో సత్యం ఉండవచ్చుననే గౌరవంకూడా చూపటం విజ్ఞానానికి శ్రేయస్కరం. సహనం అంటే ఉదాసీనతగా భావించరాదు. అంగీకరించని దానితో సహజీవనం చేస్తున్నట్లుగా తలచరాదు. ఇతరుల అభిప్రాయాలు మన అభిప్రాయాల లాగే గౌరవించదగినవని గుర్తించే లక్షణంగా భావించాలి. అయితే ఇవన్నీ వైజ్ఞానిక పద్ధతికి కట్టుబడి ఉండాలి.

మానవ సంబంధాలలో వీటి ఫలితాలుస్పష్టమే. బ్రిటన్లో ప్రతిపక్షాన్ని గౌరవంగా చూడటం కేవలం నామమాత్రమే కాదు. కాగా ప్రజాస్వామిక నడవడికి కట్టుబడి ప్రతిపక్షం వ్యవహరించాలి. అభివృద్ధి, మార్పు కోరేవారు నచ్చజెప్పే పద్ధతిని అనుసరించాలేగాని, ఒత్తిడితోనూ, జిత్తులతోనూ ద్రోహచర్యకు పూనుకోరాదు.

సహకారంతో కూడిన పోటీ

సహకారంతో కూడిన పోటీధోరణిలో వైజ్ఞానిక కృషి సాగుతుంటుంది. అంతమాత్రాన శాస్త్రజ్ఞులు రుషులు అనుకోరాదు. ఇతర మానవులకున్న బలహీనతలన్నీ ఏదో ఒక మోతాదులో వీరు చూపుతారు. కాని ఇతర శాస్త్రజ్ఞులకంటే ముందుకు పోవాలని భావించినప్పుడు, తమ వైరి శాస్త్రజ్ఞులు చేసిన కృషిని సహితం మెచ్చుకోవటమేగాక, ప్రతిభను ఎక్కడ కనుగొన్నా సరే గుర్తిస్తారు. సహకారం సమైక్యత అనేవి శాస్త్రజ్ఞుని లక్షణాలు అనటానికి వైజ్ఞానిక పద్ధతే కారణం. భాష, జాతి, మతం, ఆదర్శాలు ఇత్యాది సుంకుచిత అవరోధాలు, స్వల్ప ఎత్తుగడల వల్ల విజ్ఞానార్జనకు అవరోధం ఏర్పడుతుంది.

అశాస్త్రీయ విజ్ఞానవేత్తలు

తరచు విజ్ఞానవేత్తలు తమపరిధికి సంబంధించని విషయాలలో అర్థం, పర్థం లేని మాటలు వల్లించడం గమనిస్తాం. ఇది కేవలం వారి దోషమే కాదు. ఒక నిపుణుడు తన పరిధికి చెందని రంగంలో కూడా తాను గొప్పవాడినని భావించడం కద్దు. బ్రిటన్లో ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు పదార్థ విజ్ఞానంలో తాను జరిపిన గొప్ప కృషివల్ల, దేవుడున్నాడా అనే విషయం మొదలు, చిత్తానికి స్వేచ్ఛ ఉన్నదా అనే సమస్యవరకూ మాట్లాడే అర్హత ఉందనుకొంటాడు. శస్త్ర చికిత్సలో నిపుణుడు అంతర్జాతీయ రాజకీయాలలో సునిశిత లోతుపాతులను అవగాహన చేసుకున్నట్లు భ్రమ చెందుతాడు. ఒక రుషి తనను తత్వవేత్తగా, విద్యావేత్తగా స్వీకరించాలనుకుంటాడు. మామూలు మనుషులలో కూడా దోషం లేకపోలేదు. ఆదిమ మానవుడు మంత్రగాడివైపు ఆశ్చర్యపోయి చూసినట్లు, అతడే సర్వశక్తి మంతుడని భావించినట్లు, నిపుణుడు తనకు సంబంధించిన పరిధిలో ఏది చెప్పినా అదే ప్రమాణవాక్యంగా స్వీకరించటానికి సిద్ధంగా ఉంటాడు. 1830 ప్రాంతాలలో సర్ జేమ్స్, సర్, ఆర్థర్ ఎడింగ్టన్లు ఇటువంటి ప్రతిష్ఠనే పొందారు. ఒక రంగంలో నిపుణుడైతే ఇక అన్ని విషయాలపై అతడు మాట్లాడగలడని సాధారణ మానవులంతా నమ్ముతారు. ఎంతో కాలం శిక్షణ, అధ్యయనం చేసిన తరవాత గానీ ఒకానొక రంగంలో నైపుణ్యం సాధ్యంకాదు. అప్పుడే ప్రత్యేకమైన మేధస్సుతో కూడిన క్రమశిక్షణకూడా అలవడుతుంది. ప్రకృతి విజ్ఞానంలో ఇది స్పష్టం. ఈ రంగంలో ఒక సమస్యను ప్రతిపాదిస్తే అది అవగాహన చేసుకోటానికి కూడా సాంకేతికంగానూ, భాషాపరంగానూ ఎంతో శ్రమపడవలసి ఉంటుంది. నిపుణుడు కాని వ్యక్తి ఇటువంటి శ్రమచేయడు. ప్రకృతి శాస్త్రాల సమస్యను మానవుడి ఉద్వేగాలపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపకపోవడమే ఇందుకు కారణం, తత్వంలోనూ, సామాజిక శాస్త్రాలలోనూ పరిస్థితి వేరేవిధంగా ఉన్నది. ఆత్మ, దేవుడు, సమానత్వం, సాంఘిక న్యాయం, మొదలైన వాటిని గురించి ప్రతివాడూ తనకు తెలుసుననుకుంటాడు. అలా కాకున్నప్పటికీ ఈ విషయాలలో ఇతరులు చేసే వాటి ప్రభావం మిగిలినవారిపై ఉంటున్నది. విజ్ఞానవేత్త తన వృత్తికి సంబంధించిన పని నుంచి కొంత ఉపశమనం పొందటానికి, తత్వంపైనో, రాజకీయాల గురించో రాస్తే అతడికి ఎక్కడో ఒకచోట అభిమానులు తయారవుతుంటారు. కనకనే విజ్ఞానం సాంస్కృతికంగా విమొచన కలిగించే పాత్రను నిర్వరిస్తుందని నొక్కి చెప్పటం అవసరం. ఇందుకుగాను మానవుడి సమస్యలకు వైజ్ఞానిక పద్ధతుల ప్రాధాన్యతను చూపడం అవసరం. జాన్ డ్యూయీ చెప్పినట్లు ఆధునిక ప్రపంచంలో మేధస్సును ఒక క్రమంలో పెట్టటానికి ఈ వైజ్ఞానిక పద్ధతి వినియోగపడుతుంది.

No comments: