Sunday, December 16, 2007

SCIENTIFIC MATHOD 12

. ప్రాతిపదికలు-తొలిపదాలు

ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగా ఉన్నదే మరొక సిద్ధాంతానికి నిర్ణయం కావచ్చు. వంశపారంపర్యత, జన్యుశాస్త్ర సిద్ధాంతాలలోని నిర్ణయాలు పశువుల కృత్రిమ సంపర్క సిద్ధాంతానికి ప్రాతిపదికలయ్యాయి. ఇలా ఒక సిద్ధాంతం నుంచి మరొక సిద్ధాంతానికి తార్కికంగా కారణాలు అన్వేషిస్తూ అనంతంగా వెనక్కు పోజాలం. ఎక్కడో చోట ప్రతిపాదన ఆరంభం కావాలి. దానిని సమర్థించడం ప్రాపంచిక అనుభవరీత్యానే తప్ప, తార్కికంగా కాదని గ్రహించాలి. అవి నిజమైనవని అంగీకరిసే. వాటిని మరొక ప్రాతిపదిక నుంచి రాబట్టవచ్చు. అంతమాత్రాన నిజమైనవనడంలేదు. అవి ఫలప్రదమైనవి. వాటి నుంచి నిజమైన నిర్ధారణలను రాబట్టడానికి వీలౌతున్నది.
ఒక సిద్ధాంతంలో తార్కికంగా వెనక్కు వెళ్ళడానికి వీల్లేని వాటిని ప్రాతిపదికలు అంటున్నాం. ఒకానొక సిద్ధాంతంలోని ప్రాయికమైన భావనల మధ్య కొన్ని సంబంధాలను ప్రాతిపదిక నిర్ధారిస్తుంది. ప్రాతిపదికలలాగే, ఈ భావనలు కూడా అప్పటి వరకు ఉన్న ప్రాతిపదికల ఆధారంగా రూపొందించినవే. వీటిని వాటితో నిర్వచించే పరిస్థితి ఉండదు. కనక అలాంటి వాటిని అనిర్వచనీయ పదాలనీ, తొలి పదాలు అనీ అంటాం. ప్రతి సిద్ధాంతం కూడా ఇలాంటి తొలి పదాలతోనూ, ప్రాతిపదికలతోనూ ప్రారంభిస్తుంది. లేకుంటే అనంతంగా వెనక్కు పోతూనే ఉండవలసి వస్తుంది. అప్పుడు ఏ సిద్ధాంతమూ సాధ్యం కాదు.
తొలి పదాలు, ప్రాతిపదికలు అనేవి ఆధునిక విజ్ఞానానికే ప్రత్యేక లక్షణాలని భావించరాదు. ప్రాచీన, ఆధునిక వివేచనాత్మక సిద్ధాంతాలన్నింటికీ ఇవి ప్రారంభదశలే. సంప్రదాయ పదార్థ విజ్ఞానంలో రేణువు (పార్టికల్)ను నిర్వచించలేదు. న్యూటన్ చలన సూత్రాలు, గురుత్వాకర్షణ నియమాలు కూడా ప్రాతిపదికలే. స్థిర పదార్థం (రిజిడ్ బాడీ) అనేది రాబట్టిన పదమే. కెప్లర్ గ్రహచలన సిద్ధాంతాలు పైన పేర్కొన్న ప్రాతిపదికల నుంచి రాబట్టినవే.



నైరూప్యాలు-మేధోభావనలు
ప్రతి సిద్ధాంతానికి తొలి పదాలు, ప్రాతిపదికలు ఉండడం తప్పనిసరి అయినప్పటికీ, అవి అవగాహనకు అందనట్టివవనిగాని, అయోమయమైన వనీ అనుకోరాదు. వాటికి అర్థం లేదని, భావించరాదు. ఇతరపదాల సహాయంతో వీటిని వివరించడం, నిర్వచించడం కుదరనప్పటికీ, ఒకటి రెండు పద్ధతులతో తెలిసేటట్లు చేయవచ్చు. కొన్ని వస్తువులకు ఎరుపు సాధారణ వర్ణమైనట్లు మనం పేర్కొంటాం. అలాగే మరికొన్ని సందర్భాలలో సాధారణ లక్షణాన్ని చూపవచ్చు. ఇటువంటి పద్ధతిని నైరూప్యం అంటారు. (ప్రోఫెసర్ నార్త్ రఫ్ గ్రంధంలో ఈ విషయాన్ని వివరించాడు). కలగాపులగంగా ఉన్న అనేక వస్తువుల సముదాయం నుంచి ఒక సాధారణ లక్షణాన్ని రాబట్టి, దానికి ఒక స్వతంత్రభావ ప్రతిపత్తిని, తార్కిక స్థాయిని సమకూర్పు తున్నామన్నమాట. మనం సాధారణంగా వాడే పదాలు మంచితనం, చతురస్రం, ఒక దానికంటె ఎక్కువ, నీలం అనేవి ఇలాంటి భావనలే. నైరూప్యతలో ప్రధానలక్షణం ఏమంటే ప్రపంచంలోని వస్తువుల విధానాలు ఆధారంగా పూర్తి అర్థాన్ని చిత్రీకరించవచ్చు.
తొలిపదం అర్థం కావాలంటే ఆ పదం వచ్చే ప్రాతిపదికలను ప్రస్తావించాలి. ఇతర భావాలతో దీనికిగల సంబంధాన్ని ప్రత్యేకించి పేర్కొనవచ్చు. అంటే గర్భితంగా నిర్వచించడమేనన్నమాట. అణుపదార్థ విజ్ఞానంలోని ఎలక్ట్రాన్, వేవ్ పాకెట్ గాని, సంప్రదాయ పదార్థ విజ్ఞానంలోని పార్టికల్ గాని తత్వంలోని ఆత్మ గాని వివరించాలంటే, ఇదొక్కటే పద్ధతి. వేవ్ పాకట్ అనే పదాలు నిర్దిష్టంగా ఒకానొక వస్తువుకు చెందుతాయని చూపడం సాధ్యంకాదు. కనక ఇలాంటి భావనలు ఎరువు వంటి నైరూప్యాలు కాదు.
ప్రాతిపదికల ఆధారంగా పూర్తి అర్థాన్ని వివరించగల భావనలను మేధోభావనలంటాం. ఇందుకు ఉదాహరణలు ఎలక్ర్టాన్, ఎనర్జి, ఎంట్రోఫి, ఎలక్ట్రొ మేగ్నటివ్ వేవ్స్, గ్రావిటేషనల్ వేవ్స్, కెమికల్ బాండ్, ఆత్మ ఇత్యాదులు.
నైరూప్యతతో పోల్చిచూస్తే మేధో భావనలో వాస్తవికత తక్కువ అని ఊహించరాదు. నైరూప్యతలో సైతం ప్రపంచానుభవంతో పోల్చినప్పుడు కొంత మేరకు అఖాతం ఉంటుంది. ఎర్రదనం, జీవితం అనే వాటికి వస్తుగతంగా చూడడానికి విడిగా ఏవీలేవు. దానికంటే ఎక్కువ, ఎడమపక్కకు, అతని యొక్క సోదరుడు ఇత్యాదుల సంబంధాలలోని నైరూప్యతలలో ఈ విషయం స్పష్టమే. మేదో భావనలలో, ప్రపంచవస్తువులకూ భావనలకూ అఖాతం ఇంకా ఎక్కువ. ఒక వస్తువును లేదా వస్తువులను చూసి, ఫలానా భావనకు అవి మారురూపాలని మేధస్సులో అవగాహన చేసుకునే వాటిలో చూపలేం. మనం చేయగలిగిందల్లా, ఒకానొక సన్నివేశాన్ని చూసి, వివేచనాత్మక వివరణ, అవగాహన కావాలంటే మేధోభావన, వాటిని గర్భితంగా నిర్వచించే ప్రాతిపదికలు అవసరం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటున్నది. ఈ ప్రాతిపదికల నుంచి తార్కికంగా మనం కొన్ని వాస్తవ ప్రకటనలు రాబట్టవచ్చు. నైరూప్యతలలాగే వీటిని కూడా ప్రాపంచకానుభవంతో పరిశీలించి రుజువు పరచవచ్చు. ఒక విధంగా ఇది ప్రాయోజికతావాదంగా అనిపించవచ్చు. అయితే ఆలోచనారంగంలో ఈ మాత్రం ప్రాయోజికతావాదం ఉంటుంది. మానవుడి మేధస్సుకు, అది అవగాహన చేసుకోదలచిన ప్రపంచానికి ఈ విధానం ఒక్కటే వారధి.
మేధాభావనలు ఆధునిక విజ్ఞానానికి, తత్వానికి మాత్రమే పరిమితంకాదు. సహజచారిత్రక దశస్థాయి నుంచి విజ్ఞానం ముందుకు సాగిపోయినప్పుడు, కేవలం వర్ణనగాక, వివరణ అవసరమైనప్పుడు, మేధాభావనలతో కూడిన ప్రాతిపదికలు వస్తాయి. సహజ చారిత్రక దశ పూర్తిగాక పూర్వమే కొన్ని సందర్భాలలో తాత్వికులు, శాస్త్రజ్ఞులు మేధాభావనలు చేసిన ఉదాహరణలు లేకపోలేదు. ప్లేట్లో భావాలు కణాదుడు, ఎసిక్యూరస్ లు పేర్కొన్న అణువు హెగెల్ (భావం) ఇందుకు మచ్చు తునకలు. విజ్ఞానాభివృద్ధిలోని ఒక స్థాయిలో భావనలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ఉత్తరోత్తరా ఇంకా సునిశితమైన వాటిని ఇముడ్చుకోవలసి ఉంటుంది. అయితే మాటలు పాతవే ఉండవచ్చు. 19వ శతాబ్దిలో రసాయనిక శాస్త్రం పేర్కొన్న అణువుకూ ఆధునిక రసాయనిక విజ్ఞానం చెప్పే అణువుకూ అర్థం పూర్తిగా మారిపోయింది. మేధాభావన దశపై ఆధారపడనిదే ఏ విజ్ఞానం కూడా పరిపక్వస్థాయికి చేరదు.
నైరూప్యతపై ఆధారపడిన సిద్ధాంతాలలో అంచనావేసే శక్తి బహుస్వల్పం పరిశీలించిన సమాచారం ఆధారంగా తొలిపదాలు, ప్రాతిపదికలు రాబట్టిన దృష్ట్యా అంతకు మించి ముందుకు పోజాలని స్థితిలో నైరూప్యదశ ఉంటుంది. ప్రతిపాదన నుంచి వాస్తవాలను రాబట్టినప్పటికీ, వర్ణన చేయడం తప్ప, సిద్ధాంతం ఏమంతగా ముందుకు సాగలేదు. మేధాభావనపై ఆధారపడిన సిద్ధాంతం, అవధులు దాటిపోయి. కొత్త పరిశోధనలకు, నూతన విషయాలు కనుక్కోవడానికి దారితీయగలదు. నిత్యానుభవం నుంచి భావన ఎంతదూరమైతే అంత ఫలవంత మౌతుందని చెప్పవచ్చు. అందుకే గణితభావనలు, పద్ధతులు అన్వయించిన చోటల్లా, సాధారణ అనుభవంకంటే ఎంతో ఫలప్రదమైనట్లు రుజువైంది.
సాధారణంగా నైరూప్యతతో సాగిపోతుంటాం. మన దృష్టి, శక్తి సామర్ధ్యాలు స్పర్శేంద్రియాధార ఊహలు కొన్ని హద్దులకు పరిమితమై ఉంటాయి. విజ్ఞానరంగంలో ప్రతి విభాగం కూడా తన సిద్ధాంతానికి గణిత రూపాన్నివ్వాలని కలలు కంటుంది. పదార్థ విజ్ఞానం ఈ విషయంలో గణనీయదశకు చేరింది. ఏ విజ్ఞాన విభాగమైనా ఇలా చేయగలదా అనేది ఆయా విషయాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ విజ్ఞానం ఈ స్థాయికి చేరుకోగలగడం చాలా సందేహాస్పదమైన విషయం.
అంత మాత్రాన గమన రూపంలో సిద్ధాంతంగా రాజకీయ శాస్త్రం ముందుకు పోలేదని భావించరాదు. సహజ విజ్ఞఆనంలోగల నిర్దిష్టత కచ్చితంగా పేర్కొన్నడం అనే స్థాయికి చేరుకోలేదనే ఇక్కడ ఉద్దేశ్యం. అయితే రాజకీయాలలో వాస్తవాలను వివరించవచ్చు. ఒకే తీరును సాధించవచ్చు. అంచనావేయవచ్చు. లోగడ ఇలా చేయలేదంటే, ఆగమన కృషి జరగలేదు. రాజకీయ సిద్ధాంతాన్ని రూపొందించడానికి ఇటువంటిపని జరగాలి. ఏ మేరకు ప్రతిపాదనలు రూపొందించవచ్చునో ఆ మేరకు మార్క్స్ ప్రయత్నించి ఇంచుమించు సఫలీకృతుడైనాడు. అతడు నిర్మాణ క్రమం కోరినవాడు. బైబిల్ లోని పాత నిబంధనల ప్రవక్తవంటివాడు. కనక తన ఆలోచనలకు పదును పెట్టే తీరులో తనలోని సామాజిక శాస్త్రాల ధోరణికి స్వేచ్ఛను ఇవ్వలేదు
Next : The Structure of Scientific Theory

No comments: