Monday, December 24, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం -ముగింపుబైబిలు పై ప్రమాణం

ముగింపుకు ఒక ఆసక్తికర సంఘటన పేర్కొందాము. మార్క్సు అల్లుడు లాఫార్గ్ పారిన్ కమ్యూన్ ప్రవాసి లెమౌసూలు ఒక వ్యాపారం ప్రారంభించాడు. జార్జిమూర్ అనే అతడు కూడా వచ్చి చేరాడు. త్వరలోనే లాఫార్గ్ పేచీపడి వైదొలగాడు. ఆ స్థానంలో మార్క్సు చేరాడు. కావలసిన పెట్టుబడి ఎంగెల్సు అందజేశాడు 1874లో కథ ఇది.
లెమౌనూ ఒక కొత్త కాపీయింగ్ మెషీన్ కనిపెట్టాడు. దానిపై పేటెంట్ హక్కు విషయమై మార్క్సు, లెమౌనూ పేచీపడ్డారు. కోర్టుకు పోతే గొడవ అవుతుందని ఫ్రెడరిక్ హరిసన్ అనే మధ్యవర్తి వద్దకు వెళ్ళారు. అతను ఆనాటి ఆచారం ప్రకారం ముందుగా ఇరువురినీ బైబిలు పై ప్రమాణం చేయమన్నాడు. ఇరువురూ అవమానం అన్నారు. తరువాత ఒకరిఎదుట మరొకరు చెయ్యమన్నారు.
చివరకు సర్దుబాటు చేసుకొని, ఏమీ మాట్లాడకుండా బైబిలుపై ఇరువురు ఒకే పర్యాయం చేతులు పెట్టారు. ఇంతా చేస్తే మార్క్సు కేసులో ఓడిపోయాడు. (చూ. . F.Harrison Autobiographic Memoirs 1911 London)

మార్క్సుకు పట్టిన ఏంగెల్సు గ్రహణం
మార్క్సిజాన్ని మార్క్సు రచనల ద్వారా అవగాహన చేసుకోవాలి. కాని మార్క్సు రచనలలో మకుటాయమానమైనవి చాలా కాలం అందకపోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. మార్క్సిజాన్ని ఇతరులు చెప్పినదాన్ని బట్టి అర్ధం చేసుకున్న తీరే ఎక్కువ.... అందులో ముఖ్యంగా ఎంగెల్సు వ్యాఖ్యానం వలన ప్రామాణీకరించబడింది. కాని ఎంగెల్సు చెప్పింది మార్క్సిజం కాదు. మార్క్సిజానికి ఎంగెలిజం అయింది. రెండింటికీ తాదాత్మ్యం ఎంత ఉన్నదో తేడా కూడా అంత ఉన్నది. కాబట్టి ఎంగెలిజాన్నివిడదీసి చూసుకుంటే కానీ మార్క్సిజం బయట పడదు.
ఎంగెల్సు సిసలైన రచనలన్నీ మార్క్సులో సత్తా అయిపోయిన అంత్య దశలోనూ, ఆ తరువాత బయటపడినవి. ఎంగెల్సు రచన (ఏంటీ డ్యూరింగ్) మార్క్సు మరో నాలుగేళ్ళకు మరణిస్తాడనగా వచ్చింది. (1878) మార్క్సు చనిపోయిన సంవత్సరంలో సోషలిజం, సైంటిఫిక్ అండ్ ఉటోపియన్ వెలువడింది. అసలు సిద్ధాంత గ్రంథం ది డయలెక్టిక్ ఆఫ్ నేచర్ లోకానికి 1927లో గాని తెలియలేదు. లడ్ విగ్ - ఫ్యూయర్ బాహ్ అండ్ ది ఎండ్ ఆఫ్ క్లాసికల్ జర్మన్ ఫిలాసఫీ 1888లో వెలువడింది. ది ఆరిజన్ ఆఫ్ ఫ్యామిలీ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ స్టేట్ 1884లో బయట పడింది.
వీటన్నిటిల్లోనూ అసలైన ఎంగెల్సు, మార్క్సు ప్రభావం లేని ఎంగెల్సు మనకు కనిపిస్తాడు. అందువలన ఈ రచనలన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. అంతే కాదు ఇవి ఎంగెల్సు సొంత భావాలే గాని మార్క్సుకు సంబంధం లేనివని కూడా గమనించకపోతే, మార్క్సిజాన్ని, ఎంగెల్సిజాన్ని కలగాపులగం చేసే ప్రమాదం ఉన్నది.
1883 నుండి 1895 వరకు ఎంగెల్సు నిజస్వరూపం, వ్యక్తిత్వం రూపం దాల్చినవి. అంతకు పూర్వం అనగా మార్క్సు సజీవుడుగా, ఉన్నంతకాలం ఎంగెల్సు తన అభిప్రాయాలకు స్వతంత్ర రూపాన్నివ్వలేదు. మార్క్సుతో తనకుగల ఏకాభి ప్రాయాలనేగాని, భేదాభిప్రాయాలను వెల్లడించలేదు. మార్క్సు నాయకత్వాన్ని అంగీకరించి, జీవితాంతం అతని సహచరుడుగా, ఆర్ధిక సహాయం అందించిన ఎంగెల్సు తన వ్యక్తిత్వాన్ని దాచుకున్నాడు. సైనిక వ్యవహారాలు, వైజ్ఞానిక విషయాలకే పరిమితమైన రచనలు చేశాడు. ఈ విషయాలలో అవసరమైనప్పుడు మార్క్సుకు వ్యాసాలు, రచనలు చేశాడు. మార్క్సు ఇష్టం వచ్చినట్లు దిద్దితే అభ్యంతర పెట్టలేదు. కాని మార్క్సు రచనలను దిద్దే సాహసం ఎంగెల్సు ఎన్నడూ చేయలేదు.
మార్క్సు, ఎంగెల్సు కలసి వ్రాసిన గ్రంథాలు మూడున్నవి. కమ్యూనిస్ట్ మానిఫెస్టో, ది జర్మన్ ఐడియాలజీ, గ్రేట్ మెన్ ఆఫ్ ది ఎక్సైల్, వీటిలో కూడా మార్క్సు అనుచరుడిగా, సహాయకుడిగానే ఎంగెల్సు పాత్ర ఉన్నది గానీ అంతకు మించి కాదు.
విషయ సేకరణకు, వాస్తవాలను వ్యాఖ్యానించటానికీ ఎంగెల్సు ఎప్పుడూ మార్క్సుకు తోడ్పడుతూ వచ్చాడు. సిద్ధాంతపరమైన గ్రంథాలలో ముఖ్యంగా కేపిటల్ విషయంలో ఎంగెల్సు అనేక చోట్ల తన అవగాహనకు మించినట్లు భావించాడు.
బేరీజు వేసి చూస్తే, మార్క్సు మానవుడు, సమాజపరంగా దిట్ట. వైమనస్యత పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు మార్క్సు. శ్రమకు తగిన కూలంకష విషయం మార్క్సుకు కరతలామలకం. మానవ శ్రేయస్సుకు ఉత్పత్తి కావాలనేది మార్క్సు తత్వం.
ఎంగెల్సు దృష్టి వేరు. ఆర్ధక విషయాలలో ఆసక్తి ఉన్నా, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల విలువలు ఎంగెల్సు లోతుగా అధ్యయనం చేశాడు. సైనిక కార్యకలాపాలంటే అతనికి కొట్టిన పిండి. వాస్తవాలకు మించి పోనివాడు ఎంగెల్సు. తత్వచింతన, వైమనస్యత ఎంగెల్సుకు వంటబట్టని ఆలోచనలు. ప్రకృతిని సైన్స్ ను యాంత్రికంగా చూసినవాడు. మార్క్సు తన సిద్ధాంతాలలో ఆద్యంతాలు అంతర్లీనంగానూ, స్పష్టంగానూ నొక్కి చెప్పిన వై మనస్యత, బాహ్యాకరణ, మానవ జీవి అనేవి ఎంగెల్సుకు అంతుబట్టని అవాస్తవికాలు. ఈ విషయమై ఫ్యూయర్ బాహ్, హెగెల్ తత్వాన్ని మార్క్సు పరిశీలించినట్లు ఎంగెల్సు ఎన్నడూ చూడలేకపోయాడు. ఎంగెల్సుకు నేలబారు దృష్టి. వాస్తవాలు అతని ఆయుధాలు. యాంత్రిక విధానాలు అతని సాధనాలు.
ఎంగెల్సు తల్లితండ్రులు వ్యాపారస్ధులు. కుమారుడు కూడా వ్యాపారంలో పైకి రావాలని వారి ఆకాంక్ష. కాని ఎంగెల్సు ఎదురు తిరిగాడు. కార్మికుల స్థితిగతులు స్వయంగా చూసిన ఎంగెల్సు వ్యాపారం చేయదలచలేదు. అందువలన కుటుంబంతో తాత్కాలికంగా తెగతెంపులు చేసుకుని పత్రికా వ్యాసంగం ఆరంభించాడు. సైన్యంలో చేరి ఒక్క ఏడాది పని చేశాడు. కవితలు, నాటకాలు వ్రాశాడు. యూనివర్సిటీలో చదవని ఎంగెల్సు, తాత్విక విషయాలను తొలుత పట్టించుకొనక కవితావేశంలో తేలాడు. జాతీయవాదిగా జర్మనీ ఐక్యత కాంక్షించాడు. సాంఘిక ఉద్యమాల్లోకి దూకాడు. హెగెల్ తత్వంపట్ల ఆకర్షితుడైనాడు. అందులోనుండి క్రమంగా బయటపడి హేతువాదిగా, పిమ్మట కమ్యూనిస్టుగా మారాడు. యువకుడుగా ఎంగెల్సు మతం నుండి హేతువుకు రావడానికి కొంత కాలం పట్టినా, త్వరితంగానే ఉరకలు తీశాడు.
అయితే మార్క్సుతో 1842లో పరిచయమైన తరువాత ఎంగెల్సుకు పెద్ద దిక్కు లభించినట్లు, జీవితంలో మేథావి అండదొరికినట్లయింది. మానసికంగా కుదుటబడిన ఎంగెల్సుకు బ్రతుకు తెరువు సమస్య ఎదురయింది. తన కంటె అధ్వాన్న స్థితి మార్క్సుది. ఈ పరిస్థితులన్నీ తిరిగి తండ్రితో రాజీపడి, మాంఛెస్టర్ లోని ప్రత్తి, నూలు వ్యాపారంలోకి దిగేటట్లు చేశాయి ఎంగెల్సును. ఆ తరువాత అక్కడ కార్మికుల స్థితిగతుల గొడవ ఎంగెల్సు పట్టించుకోలేదు. అందరు వ్యాపారస్థులవలే, దోపిడీ విధానంలో ఎంగెల్సు పయనించక తప్పలేదు. తాను సాధారణంగా జీవించటమే గాక తన పెద్ద దిక్కు మార్క్సును అతని కుటుంబాన్ని తరచు ఆర్ధికంగా ఆదుకోవలసిన బాధ్యత ఎంగెల్సుపై పడింది. కనుక పెట్టుబడిదారీ విధానం అనుసరించటం ఎంగెల్సుకు అవసరమైంది.
ఎంగెల్సు మానసికంగా, వైజ్ఞానికంగా మార్క్సు మేథస్సును గుర్తించాడు. మార్క్సు చెప్పినట్లు అనుసరించాడు. తన పేరిట మార్క్సు న్యూయార్క్ ట్రిబ్యూన్ కు వ్యాసాలు వ్రాయమంటే వ్రాసి పెట్టాడు ఎంగెల్సు. వాటికి వచ్చిన డబ్బు మార్క్సుకే అందించాడు. తన వ్యాపారంలో మార్క్సు ఎట్లా మార్పులు, చేర్పులు చేసినా ఎంగెల్సు వ్యాఖ్యానించలేదు. ఇద్దరూ కలిసి పుస్తకాలు వ్రాసినా మార్క్సుదే పై చేయిగా ఉండేది. తాత్విక విషయాలలో తన శక్తి యుక్తులు పరిమితమని ఎంగెల్సు గ్రహించి మార్క్సు ఆధిపత్యాన్ని అంగీకరించాడు. అయితే ఎంగెల్సుకు సొంత భావాలు లేకపోలేదు. మార్క్సు మరుగున పడుతున్న అంత్యదశలో కాని ఎంగెల్సు బయట పడలేదు. ఇక మార్క్సు అనంతరం ఎంగెల్సుకు ఎదురు లేకపోయింది. తన భావాలే మార్కిజంగా, కమ్యూనిజంగా ఎంగెల్సు చలామణి చేశాడు. జీవిత కాలం ఇంచుమించు ఇరువురు తాదాత్మ్యం చెందినట్లు లోకానికి కనిపించిన కారణంగా, ఎంగెల్సు చెప్పేదంతా మార్క్సిజమేనని భ్రమ కలిగింది. ఈ భ్రమ చాలా కాలం కొనసాగింది. మార్క్సు రచనలు అనేకం బయటపడకపోవడంవలన, ఎంగెల్సు అధికార వ్యాఖ్యానాలవలన ఇలా జరిగింది.
నిజానికి ఎంగెల్సు చెప్పింది ఏంగెల్సిజం మాత్రమే. ఇట్లా విడమరచి చూడడం అవసరం. ఇది మార్క్సుకూ, ఎంగెల్సుకూ న్యాయం చేసినట్లవుతుంది కూడా.
మార్క్సు పరిధిలోకి రాక పూర్వం ఎంగెల్సును ప్రభావితం చేసిన వారు మోసెస్ హెన్, సెంట్ సైమన్, ఇంగ్లండులో ఛార్జిస్టు ఉద్యమం.
ఎంగెల్సు ప్రకృతిని కేంద్రంగా తన తత్వాన్ని పెంపొందించగా, మార్క్సు మానవుణ్ణి కీలక స్థానంలో ఉంచాడు. సాంకేతిక విజ్ఞానం సమాజాలలో మార్పులన్నిటికీ కారణమని, ఆ విజ్ఞానం అభివృద్ధి చెందుతుంటే, ఆస్తి సంబంధాలలో, వర్గ సంబంధాలలో సామాజిక మార్పులు వస్తాయని ఎంగెల్సు స్పష్టం చేశాడు. బ్రిటిష్ ఆర్ధిక శాస్త్రాల ప్రభావంగల ఎంగెల్సు, వైమనస్యతను ఆర్ధిక రంగానికీ అన్వయించలేదు. బ్రిటిష్ ఆర్థిక శాస్త్రాలను దుయ్యబట్టి, తిరస్కరించిన మార్క్సుకు మానవుడు, అతని వైమనస్యత చాలా ప్రాధాన్యత వహించాయి.
అదనపు విలువ, శక్తి అనే భావంతో మార్క్సు ఆర్ధిక సిద్ధాంతాలు ఉంటాయి. ఎంగెల్సులో ఇవి కనిపించవు. ఆస్థి అంటే శ్రమ స్థితి అని మార్క్సు ఉద్దేశం. భూమి, వస్తువులు ఇత్యాదులపై మానవుడు శ్రమించే దాన్నిబట్టి ఆస్థి ఉంటుంది. ఆ వస్తువులు మానవుడికి అందాబాటులో లేకుండా కొందరు భుక్తం చేసుకోవటమే మార్క్సు చెప్పే వ్యక్తిపరమైన ఆస్తికి దారితీసింది.
ఎంగెల్సు దృష్టిలో, ఆస్తి అంటే హక్కు భుక్తమై ఉండటం మాత్రమే. అట్లాగే వర్గమంటే సంపదను బట్టి, ఆస్తినిబట్టి విభజించబడిందే వర్గమంటాడు ఎంగెల్సు.
ఎంగెల్సు ఆర్ధిక రచనలన్నీ, పోటీ, మార్పిడి, కౌలు ఇత్యాదుల దృష్ట్యా అభివృద్ధిగావించిన భావనలతో ఉంటుంది. అందుకే విలువ, అదనపు విలువ, ఉత్పత్తి మొదలైన వాటిని మానవుడి చర్యలుగా ఎంగెల్సు చర్చించడు. మానవుడికి ప్రాధాన్యత లేని రచనలు ఎంగెల్సువి.
తత్వంలో ఎంగెల్సు మూడు భావనల్ని ప్రధానంగా చర్చిస్తాడు. గుణం రాశిగా మారే నియమం -- పదార్థం లేక చలనం జరిగే చేర్పు కూర్పుల ఫలితంగా రాశి గుణం మారుతుంటుంది. నిర్జీవ పదార్ధాన్ని విభజించుకుంటూ పోతే అణువు పరమాణువులు వస్తాయి. ఒక స్థాయి కంటే మరొక స్ధాయి గుణంలో తేడాలు చూపుతుంది. అంటే పదార్ధానికి కొంత చేర్చటం వలన లేదా కొంత తగ్గించడం వలన ఈ గుణంలో మార్పు వస్తుందని ఎంగెల్సు సాధారణంగా పేర్కొన్నాడు.
విరుద్దాల పరస్పర సమ్మిళిత నియమం మరొకటి.
ప్రకృతిలో పదార్ధం, చలనంపై ప్రతిదీ ఆధారపడి ఉన్నది. పదార్ధాలన్నీ నిత్యమూ స్థానాన్ని మార్చుతూ పరస్పరం చర్యలో నిమగ్నమై ఉంటున్నవి. వీటి మారు రూపాలే వేడి, విద్యుత్తు, అయస్కాంతం మొదలైనవి. పదార్థం చలనం శాశ్వతాలు, సృష్టి రహితాలు, నాశరహితాలు. యాంత్రిక మార్పులలో రాశి గుణంగా మారటంతో గతి తార్కిక రీతి ఉన్నది. వీటన్నిటి వెనుక ముఖ్యమైనది చలనం అంటాడు ఎంగెల్సు. అన్ని నియమాలకు మూలం వ్యతిరేకతకు వ్యతిరేక నియమం, సమాజపరంగా ఉన్న అస్థి వ్యక్తిపర ఆస్థిగా మారటంతో ఈ నియమాల్ని గమనించవచ్చునంటాడు ఎంగెల్సు. ప్రతిదీ పదార్ధానికీ, చలనానికీ తీసుకెళ్ళే ఎంగెల్సు, మానవుడ్ని, జీవితాన్ని, ఆలోచనను, ఉనికిని కూడా అట్లాగే వ్యాఖ్యానిస్తాడు. సమకాలీన విజ్ఞాన శాస్త్రాల ఆధారంగా ఎంగెల్సు తన తత్వాన్ని రాబట్టాడు. మానవుడి జీవితంలో భాగంగా ఆలోచన జనించింది. ఆలోచనకు రాకపూర్వం మెదడు ఉన్నది. మెదడు ఉంటే మానవుడి ఆలోచనకు అవకాశం లేదు. మెదడు కూడా చలనంలో భాగమే. ఇది కూడా శక్తి రూపమే. మనం చూపే బాహ్య ప్రపంచానికీ వాస్తవంగా బాహ్య ప్రపంచానికీ తేడా లేదనీ, యథాతధంగా చూస్తున్నామనీ ఎంగెల్సు చెప్పాడు.
ప్రకృతి గతితార్కికంగా ఉంది. మానవుడిలో అదే ప్రతిబింబిస్తున్నది. కనుక ఆలోచన అంతా తార్కిక బద్ధమే అంటాడు ఎంగెల్సు.
ఎంగెల్సు తత్వంలో మానవుడు నిమిత్తమాత్రుడు. అతనికి ఏమీ స్థానం లేదు. ప్రాధాన్యత లేదు. కేవలం ప్రకృతిలోని గతితార్కిక నియమాల్ని ప్రతిబింబించే జీవి మాత్రమే.
మార్క్సు తాత్విక భావాలు ఇందుకు పూర్తిగా భిన్నం. ఆచరణాత్మక మానవుడు మార్క్సుకు ముఖ్యం.
హెగెల్ తాత్వాన్ని మార్క్సు, ఎంగెల్సులు ఇంత విభిన్నంగా అర్ధం చేసుకుని, ఎవరి ధోరణిలో వారు వ్యాఖ్యానించుకుంటూ పోయారు.
ప్రకృతి సమాజం ఉన్నవి. వాటిలో మానవుడి అచరణ ఏమిటి అనేవి మార్క్సు ఆలోచనా సారాంశం.
ప్రకృతి చలనంతో కూడిన నిర్ధారణ. అందులో మానవుడి ఆలోచన సైతం నిర్ధారించబడిందే. కనుక మానవుడి సొంతం ఏమీ లేదనేది ఎంగెల్సు సారాంశం.
మార్క్సు, ఎంగెల్సు తాత్త్విక, శాస్త్రీయ, ఆర్థిక, చారిత్రక భావాలలో హస్తిమశకాంతరాలున్నాయి. వారి వ్యక్తిగత సాన్నిహిత్యం ఈ తేడాలను కప్పివేసింది. ఎంగెల్సు చెప్పేదే మార్క్సిజం అని భ్రమింపజేసింది.
లెనిన్ రచనలు చూస్తే మార్క్సు, ఎంగెల్సు రచనల ప్రభావం బాగా ఉన్నట్లు కనబడుతుంది. తేడాలు చూసే కాలవ్యవధి గాని, అవకాశం గాని ఆయనకు లేదు. స్టాలిన్ విషయం వ్యాఖ్యానించదలచలేదు.

Reference Books
1. LEVINE, NORMAN : The Tragic Deception
Marx Contra Engels Oxford 1975
2. Engels : 1. Anti-Duhring
2. The origin of the family, Private property and the State
3. The Role of force in History
4. The Principles of Communism
5. Dialectics of Nature
3. Marx : 1. Grundrisse
2. The German Ideology
3. The Holy Family
4. Das Capital
4. Bottomore (tr) : Karl Marx : Early Writings
5. Mc Lellan, David : Karl Marx
Macmillan 1973

4 comments:

duppalaravi said...

ఔరా అనిపించేలాంటి విషయాలను ఇలా బ్లాగులకు పరిమితం చేయకండి, దయచేసి. చాలా ఆసక్తికరమైన, శాస్త్రీయమైన ఈ విషయాలను మాలాంటి యువ పాఠకులకు అందజేయడానికి వీలుగా ఒక పుస్తకంగా తీసుకురండి. అప్పుడు నిజంగా ఉపయోగకరంగా ఉంటాయి. మీ బ్లాగును దర్శించడం నాకిదే తొలిసారి. చాలా విలువైన విషయాలను అందిస్తున్నారు. కృతజ్ఞతలు.

innaiah said...

ఒకప్పుదు 1975 లొ ఆంచ్ర జ్యొతి సీరియల్ గా నూ, తెలుగు విద్యార్థి సీరియల్ గానూ వెలువరించింది.వుయ్యురులొ ఒక టీచర్ పుస్తకం గా ప్రచురించారు.మీ సూచన ప్రకారం పుస్తకం గా ప్రయత్నిస్తాము.
చరిత్రను పెడదారిన పెత్తకుండా ఇలాంటివి అవసరం. కమూనిస్టులు మార్క్స్కు ద్రొహం చెసారు. శాస్తీయ పరిసీలన వలన అది బయట పడింది.

Anonymous said...

It will be useful having this ( on Karl Marx)articles in PDF foramt. People who are staying outside AP, they will spend time to read these articles during weekends. I am expecting from you this articles in PDF format soon. Thanks in advance.

Regds,

cbrao said...

Windows XP Operating system వాడుతున్న వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వ్యాసాలను చదువవచ్చు. అంతే కాదు, కూడలి లో వస్తున్న అసంఖ్యాక తెలుగు వ్యాసాలు చదవవచ్చు. తెలుగు చదవటం లో మీ కేమన్నా ఇబ్బందులు ఉంటే, మీ Operating system version రాస్తూ, మాకు జాబు రాయండి.పరిష్కారం చెప్తాము.ఇన్ని వందల సంఖ్యలో వస్తున్న వ్యాసాలను PDF లో ఇవ్వటం చాలా కష్టం.