Tuesday, December 11, 2007

scientific Method 8WHAT IS SCIENCE ?


3. సైన్స్ అంటే?
క్రియాత్మక నిర్వచనం
విజ్ఞాని చేసేదే విజ్ఞానం అని నిర్వచనం చెప్పవచ్చు. బయట నుంచి చూసే వారు విజ్ఞాన స్వభావాన్ని గురించి అసంబద్ధంగా, సాధారణీకరించి చెప్పకుండా జాగ్రత్తపడడానికి ఇదొక ప్రయోజనాత్మక నిర్వచనం కావచ్చు. అయినప్పటికీ, విజ్ఞాని చేసేది కేవలం ఒక సర్వసాధారణ విషయం కాదు, అతడు పరిశోధనలు చేసి, ఫలితాలు రాసుకుంటాడు. సహజ, సాంఘిక సంఘటనలను గమనిస్తాడు. తన అధ్యయనంపై ధ్యానమగ్నుడై, సమస్యలను పరిష్కరిస్తాడు. ఎంతో కాలం తీవ్రంగా ఆలోచిస్తాడు. కొన్ని వారాలపాటు తన మనస్సులోనే సమస్య అలా అట్టి పెడతాడు. పరిష్కారం ఒక కొత్త ప్రతిపాదనగా మెదలుతున్నట్లు లేదా, మెరపులాగా కొత్త పద్ధతి తట్టడం కనుక్కొంటాడు. వివిధ దశలలో అతడు వీటిలో దేనికైనా చేయవచ్చు. ఒకే సమయంలో వీటిలో ఒకటికి మించి కూడా చేస్తుండవచ్చు.
విజ్ఞాని పనిచేసే తీరు ఇలా ఉంటే, పైన ఇచ్చిన క్రియాత్మక నిర్వచనం విజ్ఞానాన్ని అవగాహన చేసుకోడానికి మనలను అట్టే దూరం తీసుకుపోదు. విజ్ఞాని ఉద్దేశాన్ని మనం పరిగణనలోకి స్వీకరించక పోవడంలో నిర్వచన లోపం ఉంది. సహజ సంఘటనలు అవగాహన చేసుకోడానికి అవి ఎలా జరుగుతాయో తెలుసుకుంటే చాలు. కాని మానవకార్యకలాపాలు అవగాహన చేసుకోడానికి కనిపించే వాటి వెనుక ఏమున్నదో చూడాలి. అవి ఎందుకు స్వీకరించాడో కనుక్కోవాలి. విజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోడానికి విజ్ఞాని చేసేపని పరిశీలిస్తే చాలదు. విజ్ఞానం తన అభ్యాసంగానో, జీవిత లక్ష్యంగానో ఎందుకు చేపట్టాడో కనుక్కోవలసి ఉంది.

పిపాసగా విజ్ఞానం
విజ్ఞానం అంటే జ్ఞానాన్వేషణ. అంటే విజ్ఞానిలో ఉన్న జ్ఞానాభిలాష, కొన్ని విషయాల తీరు తెన్నుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని సంతృప్తి పరచడం, అటువంటి పిపాసకు తృప్తి లభించినప్పుడు, కనుక్కోవడంలోనూ, అవగాహనలో వచ్చే మహదానందం అన్నమాట. విజ్ఞాన కార్యకలాపాలకు కేవలం జ్ఞానాభిలాష ఒక్కటే ఉద్దేశ్యం కాదనేది వాస్తవమే. మానవుడి మనస్సు అనుకున్నంత అతి సాధారణమైంది గాదు, ఇతర ఉద్దేశాలను కాదనేటంతగా ఏక మార్గాన మనస్సు ఉండదు. ధనాభిలాష, అధికారం, ప్రతిష్ఠకై ప్రాకులాడటం, మానవజాతిని అభివృద్ధి చేడం. వీటిలో ఏదైనా విజ్ఞాని ఉద్దేశాలు గావచ్చు. ఇతర విషయాలన్నీ సమానంగా ఉండగా, ఎవరైనా విజ్ఞానాన్ని అభిలషిస్తే, పరిశ్రమ, రాజకీయాలు, విద్యకంటే ప్రాధాన్యం ఇస్తే, అతడి మేధస్సు అలా పయనించిందనే చెప్పాలి. కొత్త విషయాలు కనుక్కోవాలి అనే ప్రయత్నాలతో వైఫల్యాలు ఉన్నాయని తెలిసికూడా అతడీ దారి చేబడుతున్నాడని గుర్తుంచుకోవాలి. ఏదో తీవ్ర పరిస్థితి వస్తే తప్ప, ప్రకృతిని, మానవుడిని అవగాహన చేసుకోవాలనే పిపాసను అతడు అణచలేడు. మిగిలిన అవకాశాలెన్ని ఉన్నా కాదంటాడు. ఈ విషయంలో విజ్ఞాని ప్రాచీన కాలపు రుషి వంటివాడు. సత్యాన్వేషణకై రుషులు సంపదను కాలదన్నడం వంటిదన్న మాట. ఆధునిక సన్యాసిగా విజ్ఞానికి ఒక సమకాలీన తాత్వికుడు పేరు పెట్టాడు.
వైజ్ఞానికి సత్యస్వభావం
విజ్ఞానికీ రుషికీ ప్రేరణ పొందడంలో పోలిక ఉన్నప్పటికీ, సత్యాన్ని గురించిన వారి భావనలో చాలా తేడా ఉంది. రుషి దృష్టిలో సత్యం అంటే మార్మిక మైంది. అంతర్భుద్ధి, పారలౌకిక లక్షణాలు గలది. వైజ్ఞానిక సత్యం విమర్శనాత్మక నిర్మాణంతోనూ, ప్రాపంచికానుభవంతోనూ, మతంతో నిమిత్తం లేని స్వభావంతోనూ ఉంటుంది. వీటిని వివరించవలసి ఉంది.
ప్రతిపాదన, నిర్ణయాలు అనే పద్ధతిలో అంతర్వాణి (Inner Voice) ఇమడదు. జీవితంలో ఏకత్వం, కవి అంతస్సాక్షి, చిత్రకారుడి రూపకల్పనా దృష్టి, మార్మికుడి ఆనందసాగర భావన, పైకి భిన్నంగా కనిపించే వాస్తవాలను, ఐక్యపరచే నియమాలను కనుక్కొనే విజ్ఞాని దృష్టి ఇవన్నీ వాస్తవానికి చెందినవి. అంతర్భుద్ధి అవగాహన ఒక మెరుపులాగే వస్తుంది. రుషికీ దివ్యదృష్టి కలిగిందన్నమాట. ఈ అంతస్సాక్షి దోషపూరితం కానక్కరలేదు. నిజం, అబద్ధం అనేవి వీటికి అన్వయించవు. పైన ఉదహరించిన నాలుగింటిలో కవి, మార్మికుడి విషయంలో భావన ప్రధానమైతే, చిత్రకారుని విషయంలో సృష్టి ముఖ్యం. ఈ దృష్ట్యా వాటిని నిజం, అబద్ధం అనడం అర్థం లేదు. కొద్ది మార్పులతో ఈ విషయాన్నే కళలకు కూడా అన్వయించవచ్చు. అజంతా, ఎల్లోరా చిత్రాలు, శిల్పాలు కళాఖండాలుగా వచ్చు. ఎందుకూ కొరగానివి కావచ్చు. అంతేగాని అందులో నిజం, అబద్ధం ప్రసక్తి లేదు. అని ఉన్నాయి అంతే. కాని విజ్ఞాని కనుక్కొన్న నియమం విషయంలో అబద్ధమో, నిజమో నిర్ధారించవచ్చు. నియమం అనగానే కొన్ని సంబంధాలు వ్యక్తమౌతాయి. ఈ సంబంధాన్ని వాస్తవంతో సరిచూసినప్పుడు, విజ్ఞాని కనుక్కొన్నట్టలు చెబుతున్న సత్యం సరైందో కాదో చెప్పవచ్చు. 1916లో ఐన్ స్టీన్ తన సాధారణ సాపేక్షతా సూత్రాన్ని చెప్పినప్పుడు, విజ్ఞానవేత్తలు, దీన్ని ఆమోదించే ముందు 1919లో కీలకమైన పరీక్షకు పెట్టారు. అప్పుడు ప్రకృతిని గురించి ముఖ్యమైన సత్యంగా ఈ సూత్రాన్ని ఆమోదించారు.
వైజ్ఞానిక సత్యం వివేచనాత్మకం
సాపేక్షతా సిద్ధాంతం రూపొందించిన ఐన్ స్టీన్, హఠాత్తుగా అంతర దృష్టితో చెప్పాడా, సుదీర్ఘమైన ఆలోచన చేశాడా (ఇవి రెండూ పొసగనివి కావు) అగమ్య గోచరంలో అన్వేషించాడా అనే విషయాన్ని బట్టి అతడి సిద్ధాంతం ఆధారపడి లేదు.
ఒకానొక విశిష్టమైన వ్యక్తికి హఠాత్తుగా సాక్షాత్కరించడం, అనుభవం లేనివారికి పూర్తిగా అవగాహన కాదనటానికి వీలులేదు. ఈ సిద్ధాంతం కొన్ని ప్రతిపాదనలతో కూడింది. ఒకవిధమైన సంఘటనలను, వాటి సంబంధాలను ఈ ప్రతిపాదన నిర్ధారణగా చెపుతుంది. ప్రతిపాదనలో కొన్ని మౌలిక ప్రాతిపదికల తాత్విక ఫలితాలు రాబట్టటం జరిగింది. వీటి విలువ ప్రత్యక్ష ప్రాపంచిక అనుభవాన్ని బట్టి లేదా పరోక్షంగా ఊహించి నిర్ధారణ రూపంలో ఉంటుంది. దీనినే వివేచనాత్మక రూపం అంటారు.
వైజ్ఞానిక సత్యం వివేచనాత్మకం, కనక స్పష్టంగా ఆలోచించగలవారికి ఎవరైనా, వైజ్ఞానిక భాషను లోతుపాతులతో గ్రహించగల అభిరుచి ఉన్నవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంటే వైజ్ఞానిక సత్యం బహిరంగ సత్యం అన్నమాట. కళాకారుడి లేదా మార్మికుని సాక్షాత్కారం లాగేకాక, వైజ్ఞానిక సత్యంలో వ్యక్తి పరమైంది గాని, గోప్యమైంది కాని ఏమీ లేదు.
వైజ్ఞానిక సత్యం ప్రాపంచిక అనుభవపరమైంది, మత రహితం కూడా
ఈ ప్రపంచంలో జరిగే వాటితో మాత్రమే విజ్ఞానానికి సంబంధం ఉంటుంది. మానవ పరిశీలనకు అందుబాటులో లేని ఊహాపూరిత ప్రపంచంతో సైన్సుకు నిమిత్తంలేదు. ఈ దృష్టితో చూస్తే వైజ్ఞానిక సత్యానికి సంబంధించిన విషయమంతా ప్రపంచానికి సంబంధించిందే. అంతమాత్రాన విజ్ఞానంలో ఊహకు (పరికల్పనకు) స్థానం లేదని అనుకోలేదు. ఆధునిక వైజ్ఞానిక సిద్ధాంతాలలో భావనలలో, ముఖ్యంగా ఆధునిక పదార్థ విజ్ఞానంలో మన సిద్ధాంతాలకంటే ఎక్కువ ఊహ అవసరమవుతున్నది. మన అవగాహన పెరగటం, మన వివేచన సునితంగా ఉండటం వల్ల మన ఊహ కూడా సంప్రదాయ బద్ధమైన సంకెళ్ళనుంచి విమోచన పొంది, గతంలో ఊహించినవారికి అందుబాటులో లేనంతగా విస్తరిస్తున్నది. కాని వైజ్ఞానిక సిద్ధాంతం కొన్ని సందర్భాలలో ఊహతోకూడినట్లు కన్పించినా, ఒక ప్రమాణాన్ని సంతృప్తి పరచవలసి ఉంటుంది. ఏదో ఒక క్లిష్ట అనుభవదశలో భౌతిక వాస్తవంతో సంబంధం పెట్టుకోకతప్పదు. అలాకానట్లయితే కట్టుకధకూ, విజ్ఞానానికీ విచక్షణ లేకుండా పోతుంది. ఈ విషయంలోనే వైజ్ఞానిక సత్యానికి, పారలౌకిక సత్యానికి తేడా ఉన్నది. పారలౌకిక సత్యం పరీక్షకు నిలబడలేదు.
వైజ్ఞానిక సత్యంలో గల అనుభవానికి, మతరహిత విధానానికి సన్నిహిత సంబంధం ఉంది. చిట్ట చివరకు మానవుడికి మంచి జరుగుతుందనే భావన, ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మంచి ఉంటుందనే భావన మతరహిత ప్రాధాన్యం తగ్గిపోతుంది. అంతే గాక సిద్ధాంతాన్ని వాస్తవం దృష్ట్యా పరీక్షించటం, ఆదర్శాన్ని ఆచరణ దృష్ట్యానూ, వాస్తవాన్ని ఆదర్శం దృష్ట్యానూ పరిశీలించనవసరం లేకుండా పోతుంది. జీవితానికి సంబంధించిన పారలౌకిక దృష్టిని బట్టి, జీవన్మరణ బంధనం నుంచి ఆత్మ విమోచన చేయటానికి లోకంలో జీవితం అనేది ఒక సోపానంగా భావించనందున పరోలక దృష్టితో పోల్చి చూసినప్పుడు సెక్యులర్ ఆదర్శాలు (స్వేచ్ఛ, సమానత్వం) సెక్యులర్ ధర్మాలు (అందరి మంచికై సహకారం, సహనం) ద్వితీయ ప్రాధాన్యం కలవిగానే భావించబడుతున్నాయి. పారలౌకిక సత్యాన్ని నిశిత పరిశీలనకు గురిచేయటానికి వీలులేదు కనక దీనికి నమ్మకమే ఆధారంగా ఉంటుంది. నచ్చ చెప్పటానికి బదులు ఒత్తిడి చేయటం వల్ల పారలౌకిక సత్యానికి ప్రమాణం రూపొందిస్తున్నారు. మానవతలో వివేచనతో కూడిన నీతిశాస్ర్తం ఉంటుంది. సెక్యూలరిజంలో చెప్పేదాన్ని బట్టి మానవుడు స్వేచ్ఛగా ఆత్మ గౌరవంతో ఈ ప్రపంచంలోనే సంపూర్ణ భౌతిక సాంస్కృతిక జీవితాన్ని అనుభవిస్తాడు. సత్యాన్ని గురించి ఇటువంటి వివేచనాత్మకమయిన భావనగల సెక్యులరిజం, మానవుడు తనను, తన పరిసరాలను అవగాహన చేసుకో గలడంటుంది. ఈ అవగాహనలను నిర్మాణాత్మకంగా ఉపయోగపెట్టు కోవడానికి వీలుగా తోటివారితో మానవుడు సహకరించగలడు. నీతి శాస్త్రానికి మతంతో సంబంధం లేని ఆదర్శానికి పొత్తు కుదరటం వల్ల దీన్ని సాధించుకునే మార్గాన్ని చూపటం వల్ల ప్రపంచంలో నీతికి స్థానాన్ని ఏర్పరుస్తుంది, అదే వైజ్ఞానిక సత్యం విశిష్టత.
వైజ్ఞానిక విజయభేరి
విజ్ఞానానికి మరొక దృక్పథం ఉంది. సాంకేతికాభివృద్ధి, జ్ఞానాభివృద్ధికి దోహదం చేస్తూ మానవ విలువలను సాధించుకోవటానికి వీలుగా భౌతిక, సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంటే విజ్ఞానం ప్రకృతిని, అజ్ఞానాన్ని, పేదరికాన్ని, జబ్బులను వీటన్నిటి వల్ల వచ్చే దోషాలను జయిస్తున్నదన్న మాట. ఓపెన్ హైమర్ అభిప్రాయాన్ననుసరించి ఎనిమిదేళ్ళలో నేటి జ్ఞానం రెట్టింపు అవుతున్నది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఈ జ్ఞానాభివృద్ధికి 30 సంవత్సరాలు పట్టింది. అంతకు ముందు ఆధునిక విజ్ఞానయుగంలో ప్రవేశించటా నికి శతాబ్దాలు పట్టింది. జ్ఞానాభివృద్ధి ఇంత వేగంగా జరగటానికి సాంకేతిక శాస్త్రం ఎంతో తోడ్పడింది.
విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టటమే సాంకేతికశాస్త్రం. కాని అనేక సందర్భాలలో ఒకానొక పరికరం కొత్త జ్ఞానాన్ని ఆర్జించుకోవటానికి తోడ్పడుతుందో, అదనంగా శక్తిని సమకూర్చుకోవటానికి ఉపయోగపడుతుందో నిశ్చయంగా చెప్పటం కష్టం. రాడార్ లాగ, దీని పాత్ర కూడా రెండు విధాలుగా ఉంటుంది. విజ్ఞానానికి సాంకేతికానికి, సిద్ధాంతానికి అన్వయానికి గిరిగీసి తేడా చూపడం దుర్లభం. జ్ఞానమే శక్తి అనే విషయాన్ని ఆధునిక విజ్ఞానం, సాంకేతిక శాస్త్రాలకు అన్వయించి నప్పుడు చాలావరకు వాస్తవం అనిపిస్తుంది.
విజ్ఞానం తప్పనిసరిగా అన్వయించగలం అనటానికి వీలులేదు. ఉదాహరణకు విశ్వశాస్త్రజ్ఞానం సాంకేతికంగా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటికీ ఇంకా స్పష్టం కాలేదు. అయినప్పటికి 20వ శతాబ్దిలో సునిశిత వైజ్ఞానికులు కొందరు ఆకాశం అంచులు కనుక్కోవటానికి, ప్రకృతి ఎలా ఆరంభం అయిందీ తెలుసుకోవటానికి, ప్రకృతిలోని భాగాలు ఒకదాని నుంచి మరొకటి అతి వేగంగా దూరమయి పోతున్నప్పటికీ మొత్తం మీద ప్రకృతి నిర్మాణం అలాగే కొనసాగటం ఎలా సాధ్యమనేది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
సమాజంపై సాంకేతిక విజ్ఞాన ప్రభావం
ఇంకొకందుకు కూడా విజ్ఞానానికీ, సాంకేతికానికీ తేడాను గమనించటం అవసరం. విజ్ఞానం జ్ఞానతృష్ణకు చెందింది. ప్రకృతికి సంబంధించిన జ్ఞానం, అందలి కార్యకారణ సంబంధాలు విజ్ఞాన విషయాలుగా ఉంటున్నాయి. సాంకేతిక శాస్త్రం శక్తి సాధనం. విజ్ఞానం విమోచన శక్తిగా మాత్రమే పనిచేస్తుంది. సాంకేతిక శాస్త్రం మానవుడి స్వేచ్ఛను అదుపులో పెట్టగలదు, విస్తరించగలదు. ముఖ్యంగా భారీ సాంకేతిక శాస్త్రంలో ఇది వాస్తవమే. ఉత్పత్తి పెరగటం, కాలాకాశ అవధులు పోవటం సాంకేతిక శాస్త్ర పరంగానే జరిగింది. కాని అధికార కేంద్రీకరణ, మానవుడు లోని పాశవికత్వం చోటుచేసుకోవడం ముఖ్యంగా నగర సమాజాలలో చూడవచ్చు. మానవజాతి నంతటిని రూపు మాపే అణ్వస్త్రాల ప్రమాదం ఆధునిక సాంకేతిక శాస్త్రంలో గర్భితంగా ఉంది. అధికార కేంద్రాలపై అదుపు ఉన్న వారు నైతికంగా, మేధస్సు సంబంధంగా పరిణమించకపోతే ఈ ప్రమాదం తప్పదు.
ఈ ప్రమాదానికి విజ్ఞానాన్ని తప్పుపట్టడం సరైందని కాదు. ఫలానా సాంకేతిక శాస్త్రం కావాలని విజ్ఞానం చెప్పదు. ఒకానొక సమాజం మరమగ్గాలను, లేదా నేత మిల్లులను ఉపయోగిస్తుందా అనేది ఆ సమాజంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రెండు విధాలైన సాంకేతిక పద్ధతులకు ఆధారంగా ఉన్న పదార్థశాస్త్రం ఒక్కటే. ఈ పదార్థ విజ్ఞాన సూత్రాలను అవగాహన చేసుకోవటం మానవ జాతి సాంస్కృతిక చరిత్రకు ఎంతో ఉపయోగకరం. కనక విజ్ఞానాన్ని ఎక్కువ ఉంచాలనేది సమస్య కాదు. మానవ లక్షణాలకు సాంకేతిక శాస్త్రాన్ని అనుకూలం గావించటమే సమస్య.
ఇందు నిమిత్తం సాంఘిక, విద్యా సంబంధమైన ధోరణి కావాలి. అధికారంలోని చైతన్యతను అధ్యయనం చేసి, అధికార కేంద్రీకరణ జరగకుండా మన సంస్థలను తీర్చి దిద్దుకోవాలి. అంటే అధికారం ఏ ఒక్క ముఠా గుత్తాధిపత్యం కింద లేకుండా చేయాలి. ఇందుకు వికేంద్రీకరణ ఒక్కటే చాలదు. గ్రామస్థాయిలో సహితం ఏ ఒక్క ముఠావారు కూడా వివిధ అధికారాలను చేజిక్కించుకొని మిగిలిన సమాజాన్ని అటాడించే పద్ధతులను పోగొట్టాలి.
ఈ లక్ష్య సాధనకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఉదాహరణకు మన సాంస్కృతిక సంపద అంతా పెత్తందారీ లక్షణాలలో ఉన్నది. కనక మనలో ఉత్తములు కూడా అధికారాన్ని ఆరాధిస్తూ మానవ విలువలను బలిచేయటం కద్దు. ఈ ధోరణి వల్ల దేశంలో మానవతా విలువలు పెంపొందకుండా ఆటంకం వాటిల్లుతుంది. ఈ విలువలను సాధ్యమైనంతవరకు విస్తరింపచేస్తే సాంకేతిక శాస్త్రం మానవుడికి హాని చేయజాలదు. అదీకాక సాంస్కృతిక పరిణామంలో అధికారం స్వభావం గురించి మనకు అంతగా తెలియదు. ఇది సామాజిక విజ్ఞానానికి సంబంధించిన సమస్య. విజ్ఞానం, సాంకేతికం ఎలాంటి సామాజిక సంబంధాలు తెచ్చి పెడుతుందనేది కూడా సామాజిక శాస్త్రజ్ఞులే పరిశీలించాలి.
ఈ చిక్కులను విడదీయడానికి, సామాజిక పునర్నిర్మాణానికి, వైజ్ఞానిక పంథా అవసరం. మన విద్యారంగంలో ప్రస్తుత పద్ధతుల స్థానే కొత్త విధానాలను ప్రవేశపెడితే తప్ప పెత్తందారీ సంప్రదాయ భారాన్ని పోగొట్టుకోజాలం. వివిధ విజ్ఞాన శాఖలు కనుక్కొన్న వాటిని సమన్వయించి చూస్తే గాని అధికారంలోని లోతుపాతులు అవగాహన కావు. అలాగే సామాజిక రంగంలో భిన్న శాఖలను కొత్త దృక్పథంతో పరిశీలించాలి. ఇందుకు వైజ్ఞానిక పద్ధతి అంటే ఏమిటో తెలుసుకోవాలి.

2 comments:

Anonymous said...

I read article in this blog. I appreciate your effort. You are writing positive side of science (in the sense how it helped mankind) I would like to know negtive side of science.

Regards,

innaiah said...

It is not Science that has negative side. On the basis of Scicence technology developed.That is where some negative aspects developed due to politicians, rulers and religion.These are indicated in this scientific method.