Friday, December 14, 2007

కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం -5

కొన్ని సాంకేతిక కారణాల వల్ల, గతంలో ఈ పుస్తకాన్ని పూర్తిగా ప్రచురించ లేకపోయినందులకు చింతిస్తున్నాము.ఇది కొనసాగిస్తున్నామని తెలియచేయటానికి,సంతొషిస్తున్నాము. ఎప్పటి వలే చదివి, మీ అభిప్రాయాలు తెలియచెయ్యగలరు.

-cbrao


జార్జిస్ట్ రష్యా సామ్రాజ్యవాదం పట్ల మార్క్సు భయాందోళనలు

రష్యాను జారు చక్రవర్తులు పరిపాలిస్తుండగా, మార్క్సు రష్యా సామ్రాజ్య వాదాన్ని చూచి విపరీతంగా భయాందోళనలు వ్యక్తం చేశాడు. ఐరోపాలో అనేక దేశాలను కబళించాలని రష్యా ప్రయత్నించిందించి. వివిధ దేశాల స్వాతంత్ర్య పిపాసను అధ్యయనం చేస్తూ అంతర్జాతీయ కార్మిక సంస్థకై కృషిచేసిన మార్క్సు పోలెండ్ విషయమై శ్రద్ధ పట్టించుకున్నాడు. పోలెండ్ దేశంపట్ల చుట్టుపట్ల రాజ్యాల ధోరణి ననుసరించి విప్లవాల ఆనుపానులు కొలవదగునంటాడు. 1856లోనే పోలెండ్ విషయమై మార్క్సు పరిశీలనకు పూనుకున్నాడు.
1856 డిసెంబరు 2న లండన్ నుంచి మార్క్సు ఒక ఉత్తరం వ్రాస్తూ తాను పోలెండ్ చరిత్ర పరిశీలిస్తున్నట్టు ఎంగెల్స్ కు తెలియజేశాడు. (మార్క్సు-ఎంగెల్స్ సెలెక్టడ్ కరస్పాండెన్సు (పోగ్రెస్ పబ్లిషర్స్ మాస్కో 1975).
1863లో పోలెండ్ లో పెద్ద యెత్తున తిరుగుబాటు జరిగింది. అది ఐరోపాలో విప్లవానికి బాగా దోహదం చేస్తుందని మార్క్సు ఆశించాడు. వెంటనే ఎంగెల్సుతో కలిసి పోలెండ్ విషయమై ఒక చిన్న గ్రంథం వ్రాశాడు. సైనిక విషయాలకు సంబంధించినదంతా ఎంగెల్సు వ్రాశాడు. ఆర్ధిక విషయాలకు సంబంధించినదంతా ఎంగెల్సు వ్రాశాడు. ఆర్థిక విషయాల ప్రసక్తే లేకుండా కేవలం రాజకీయ చర్చ చేశాడు. మార్క్సు 1863 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ రచన మే వరకు సాగి ఆగింది.
1863లో మార్క్సు వ్రాసిన ఈ గ్రంథం పోలిష్ క్వశ్చన్ ఒక శతాబ్దానికి బయటకు రాలేదు. 1961లో మొట్టమొదట ఇది ప్రచురితమైంది.
ఈ రచనలో రష్యాపట్ల మార్క్సు తన భయాందోళనలు బాగా వ్యక్తం చేశాడు. ఆయన భయపడింది జారిస్టు రష్యాను గురించే. అయినా కమ్యూనిస్టులు జాతీయ వాదులుగా మారినందున కాబోలు, గతంలో రష్యాను విమర్శించినా సెంటిమెంటు అడ్డు వచ్చి ప్రచురణ ఆపారు. అన్నట్టు 1940లో ద్వితీయ ప్రపంచయుద్ధం సాగుతుండగా అంతర్జాతీయ గీతం విరమించి, రష్యా జాతీయ గీతాన్ని ఆలాపించిందని ఈ సందర్భంలో గుర్తు చేయక తప్పదు.
పోలెండ్ ను కొంత భాగం రష్యా, మరికొంత భాగం ప్రష్యా పంచుకుని చాలా కాలంగా పాలిస్తూ అనుభవిస్తున్నవి. 18వ శతాబ్దంలోనే రష్యా తన సామ్రాజ్య విస్తరణ ఆరంభించింది. 1795లో పోలెండును పంచుకొని ప్రష్యా, రష్యా, ఆస్ట్రియాలు అనుభవించసాగాయి. అంతటితో అప్పటివరకు శక్తివంతంగా ఉంటూ వచ్చిన పోలెండు కాస్తా విదేశీ శక్తుల బానిసత్వం కింద మగ్గింది. ఆ తరువాత రష్యా తన దృష్టిని అరబ్ రాజ్యాలవైపు మళ్ళించింది. పోలెండ్ లో స్వేచ్ఛా స్వాతంత్ర్య పిపాసగల వారు సంఘటితపడి నిలద్రొక్కుకుని పోరాటానికి దిగటానికి అర్ధ శతాబ్దంపైగా పట్టింది. రష్యా ప్రభువు అలెగ్జాండరు 1862లో పోలెండు ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే ఉద్దేశ్యంతో కొంత ఉదారంగా ప్రవర్తించాడు. కట్టుబాట్లు సడలించాడు. ఇది ఆసరాగా తీసుకొని పోలీస్ జాతీయవాదులు తమ దేశానికి పూర్తి స్వాతంత్ర్యం కావాలని పూర్వపు సరిహద్దులు పునరుద్ధరించాలన్నారు. అది ముదిరితే ప్రమాదమనుకున్న అలెగ్జాండర్ వెంటనే నిర్భంధ సైనిక శిక్షణలో అందరినీ చేరమన్నాడు. రష్యా ఇలా మార్గం మళ్ళించేసరికి, పోలెండు జాతీయవాదులు తిరుగుబాటు చేశారు. గెరిల్లా పోరాటానికి దిగారు. ఫ్రెంచి ప్రభుత్వ సహాయాన్ని ఆశించిన తిరుగుబాటుదార్లు నిరాశపడవలసి వచ్చింది. ప్రష్యా, రష్యాలు ఏకమై తిరుగుబాటును హతమార్చాయి. అంతకు ముందున్న ఉదార ధోరణి స్థానే పూర్తి నియంతృత్వం ప్రవేశ పెట్టారు. సంస్కరణలు తలపెట్టిన రష్యా ఇంతటితో ఇంకా ఉచ్చులు బిగించింది.
పోలెండ్ తిరుగుబాటు జయప్రదమయితే, రష్యా ప్రపంచాధిపత్యం వహించాలనే సామ్రాజ్యవాద ధోరణికి ఉద్వాసన పలుకుతుందని మార్క్సు భావించాడు. రష్యాకు వ్యతిరేకంగా పోలెండ్ పోరాడే నిమిత్తం వెయ్యిమంది జర్మన్ లతో కూడిన సైన్యం సమకూర్చాలని మార్క్సు తలపెట్టాడు. (డేవిడ్ మెక్లన్ - కార్ల మార్క్సు పుట 362)
మార్క్సు మొదటి నుంచి రష్యాకు తీవ్ర వ్యతిరేకత కనబరుస్తూ వచ్చాసడు. నోయరైని షెన్టెటుంగ్ పత్రిక పెట్టినప్పుడే రష్యాకు వ్యతిరేకంగా విప్లవాత్మక యుద్ధం జరపాలని చాటాడు. రష్యాను అణచకపోతే ఐరోపాలో ఏ విప్లవోద్యమాన్ని అయినా అది అణచివేస్తుందన్నాడు. రష్యాపై యుద్ధం జరపడం వలన జర్మనీలో ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమౌతాయన్నాడు. పోలెండ్ కు విమోచన కలుగుతుందన్నాడు.
రష్యాలో ఉన్న విధానాన్ని ఆసియా ఆటవికత్వంగా మార్క్సు చిత్రించి ఖండిస్తుండేవాడు. ఫ్రీప్రెన్ పత్రికకు మార్క్సు రాసిన పెక్కు వ్యాసాలలో రష్యాపట్ల వ్యక్తమయిన భయాందోళనలు ఉన్నాయి. మార్క్సు రష్యా వ్యతిరేకత మోతాదు మించిందనే అభిప్రాయాన్ని ట్రిబ్యునల్ పత్రిక సంపాదకుడు దానా వ్యక్తం చేశాడు. రష్యా ప్రభుత్వ కబంధ హస్తం ఐరోపా దేశ ప్రభుత్వాలన్నిటిలో ఉన్నదని మార్క్సు అభిప్రాయం. అంతర్జతీయ కార్మిక సంఘ చర్చలలో ప్రత్యేకించి రష్యానే మార్క్సు ఖండించడం కూడా చాలామందికి నచ్చలేదు.
రష్యాకు, టర్కీకి యుద్ధం సంభవించినప్పుడు టర్కీనే మార్క్సు సమర్ధించాడు.
మార్క్సు కాపిటల్ తొలుత రష్యన్ భాషలోకి అనువదించింది. చాలా మందిని ప్రభావితం చేసింది. కాపిటల్ మూడవ భాగం వ్రాయడానికి రష్యా పరిస్థితులను క్షుణ్ణంగా మార్క్సు పరిశీలించాడు. రష్యాలో చాలామంది వ్యక్తులు మార్క్సు వైపు సలహాకై చూచారు. రష్యా విప్లవాన్ని ఆశించిన మార్క్సుకు నిరాశే మిగిలింది. టెర్రరిస్టులను శ్లాఘించి రష్యాలో వారి చర్యలను సమర్ధించాడు.
రష్యాను గురించి మార్క్సు ధోరణిని కమ్యూనిస్టులు తాము ప్రచురించిన పుస్తకాలలో మనకు తెలియకుండా చేశారు. మార్క్సు విమర్శించింది జారిస్టు రష్యానని మర్చపోయారు. లేదా పితృ భూమిపై మార్క్సు సైతం రాళ్ళు రువ్వరాదని భావించారేమో, రామాయణ మహాభారతాలు చదువుతున్న రష్యాలో మార్క్సు భావాలకు తావు లేకపోవడం ఆశ్చర్యం.

గతి తార్కిక భౌతికవాదం
మార్క్య్ద్ ది కానేకాదు
జీవకణ పరిశోధనలో నోబెల్ బహుమతి స్వీకరించి కొద్ది రోజుల క్రితమే చనిపోయిన జాక్విన్ మోనో తన పుస్తకం ఛాన్స్ అండ్ నెసెసిటీలో మార్క్సిజాన్ని విమర్శించాడు. టెల్ హర్డ్ డి షార్టిన్ స్పెన్సర్, బెర్గసన్ తోపాటు మార్క్సిజం కూడా ప్రకృతికి జీవాన్ని ఆపాదించిన దోషం చేసిందని అతని విమర్శలోని సారాంశం.
అయితే ఈ దోషం చేసిందెవరు మార్క్సు కాదు. మార్క్సు తన రచనలలో ఎక్కడా గతి తార్కిక పద్ధతిని భౌతిక వాదానికి అన్వయించలేదు. చారిత్రక భౌతిక వాదం, గతి తార్కిక భౌతిక వాదం అనే పదాలు మార్క్సు ఉపయోగించినవి కావు. ఎంగెల్స్ తన ఏంటి డూరింగ్ లోనూ, డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ లోను ఈ చర్చ చేశాడు. మార్క్సు - ఎంగెల్స్ లను కలిపి చూడడం అలవాటు కనుక ఎంగెల్స్ వ్రాసినదంతా కూడా మార్క్సు భాగంగానే పరిగణింపబడుతూ వచ్చింది ఇదీ తిరకాసు.
గతి తార్కిక పద్ధతిని హెగెల్ నుండి స్వకరించిన మార్క్సు యథాతథంగా కాక తల క్రిందులుగా ఉన్న వాదనను సరిచేసి వాడానన్నాడు. ఏమైనా గతి తార్కిక పద్ధతిని చరిత్రకు సమాజానికి పరిమితం చేసినవాడు మార్క్సు. దాన్ని ప్రకృతికి విస్తరించింది హెగెల్స్ మాత్రమే. కనుక జీవత్వారోపణ లోపం ఉంటే అది ఎంగెల్స్ కే చెందాలి కాని మార్క్సుకు కాదు.
గతి తార్కిక పద్ధతి గ్రీకు కాలం నుండి వస్తున్నా, హెగెల్ దీన్ని తన తత్వానికి అన్వయించాడు. విశ్వ పరిణామ నియమాలు గతి తార్కిక పద్ధతిని అనుసరిస్తాయని, మనస్సు తప్ప శాశ్వతంగా వాస్తవమైనదేదీ లేదని హెగెల్ వాదన సారాంశం.
అయితే మనం గ్రహించేది మన అనుభవాల ఫలితంగా వచ్చేదే కనుక, ఇది పాక్షికమైనదే. ఇందుకు విరుద్ధంగా గతి తార్కిక పథంలో పయనిస్తే కేవలం వాస్తవం ఒక్కటేనని, అది మనస్సు అనే విదితమవుతుందన్నాడు. హెగెల్ గతి తార్కిక పద్ధతిని అతని సైన్స్ ఆఫ్ లాజిక్ లో విస్తృతంగా చర్చించాడు.
ఇందులో సిద్ధాతం, ప్రతి సిద్ధాంతం, సమన్వయ సిద్ధాంతం అని ఎక్కడా మనకు కనబడదు. కాని హెగెల్ క్లిష్ట వాదనను పాఠకులకు సులభంగా చెప్పడానికై భాష్యకారులు ఈ పదజాలాన్ని విరివిగా వాడుకలోకి తెచ్చారు.
తన కాలంలో ఉన్న వైజ్ఞానిక శాస్త్రాలను మార్క్సు పరిశీలించాడు. ప్రకృతి శాస్త్రాలలో ముఖ్యంగా ఫిజియాలజీ జువాలజీ గణితం చదివాడు. ఆదిమ మానవ శాస్త్రం కూడా క్షుణ్ణంగా పట్టి చూశాడు. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకున్నాడు. ఆర్ధిక శాస్త్రాన్ని పరిశీలించడంలో జీవశాస్త్ర సూత్రాలను మార్క్సు గ్రహించాడు. కానీ, ప్రకృతికి జీవచైతన్యం ఉన్నదనేటంతవరకు మార్క్సు తన గతి తార్కిక పద్ధతి సాగదీయలేదు. ఇది ముఖ్యంగా గమనించదగిన విషయం.
అంటే గతి తార్కిక పద్ధతి ఆధారంగా సమాజాన్ని, ఆర్ధిక రీతులను మాత్రమే మార్క్సు చూశాడు. గతి తార్కికాన్ని భౌతికానికి మార్క్సు ముడి పెట్టలేదు. మార్క్సు తత్వం పదార్థవాదమే. జగత్తుకు మూలం పదార్ధమని నమ్మిన మార్క్సు ఈ విషయంలో ఇతర తాత్వికులకు వలె లోతుగా చర్చించ లేదు. పైగా బూర్జువా భౌతిక వాదాన్ని, చరిత్ర గమనాన్ని గ్రహించని భౌతిక వాదాన్ని మార్క్సు తోసిపుచ్చాడు. ఆర్ధిక తాత్విక ప్రతులలో తనది సహజ వాదమని, లేదా మానవుని తత్వమని మార్క్సు స్పష్టం చేశాడు. మానవ ఉనికికి ఆధారం పదార్ధమని మార్క్సు ఉద్దేశ్యం. ఆ మానవులను వారి ఆర్ధిక, సామాజిక జీవన రీతులను మార్క్సు పరిశీలించాడు. మనిషి అంటే వాస్తవంగా సజీవంగా ఉండే మనిషిగాని, తత్వాలలో ఊహించే మనిషి కాదు. చరిత్ర అంటే మానవుల సామాజిక ఆర్ధిక జీవనాలను పరిశీలించేదే కాని, నేలవిడిచి సాము చేయడం కాదు. అందుకే హెగెల్ ఆధ్యాత్మిక లేక ఆదర్శవాదాన్ని ఖండించిన మార్క్సు, బూర్జువా పద్ధతిలో మనిషి విస్మరించిన పదార్ధ వాదాన్ని ఈసడించాడు.
బూర్జువా పదార్ధ వాదం తిను, తాగు, అనుభవించు అంటుంది. మనిషి కోర్కెలు తీర్చడమే ప్రధానం. అదే పదార్ధ వాద లక్ష్యం అంటుంది. అంటే మానవుడు బాగు పడడమంటే ఆర్ధికంగా సుభిక్షంగా ఉండడమే. పెట్టుబడిదారీ విధానంలో డబ్బు గడించడం, ఆర్ధికంగా బాగుపడడం ప్రధానంగా కనబడుతుంది. ఆ విధానంలో ఎంత దోపిడీ జరిగిన్ ఫరవాలేదు.
సరిగ్గా ఈ భౌతిక వాదాన్నే మార్క్సు ఖండించాడు. భౌతిక సుఖం అంటే సమాజ లక్ష్యం కాదు.
సంపూర్ణ మానవుడు, వైమనస్యత లేకుండా స్వచ్ఛగా బతకాలి. మానవుడు తన చరిత్రకు తానే అధిపతిగా ఉండాలంటాడు మార్క్సు. మార్క్సు కేవలం ఆర్ధికతకే ప్రాధాన్యం ఇచ్చాడని, భావాలకు నీతికి ప్రాధాన్యం ఇవ్వలేదనే అపవాదు కూడా ఆయన రచనలు అందుబాటులో లేనందువలన వచ్చి పడినట్టిదే. ఆర్ధిక విధానాలకు నీతికి అవినాభావ సంబంధం ఉన్నదనే పారిస్ ప్రతులలో మొదలు పెట్టిన మార్క్సు కాపిటల్ వరకూ కొనసాగించాడు.
గతి తార్కిక పద్ధతిని సామాజిక శాస్త్రాలకు పరిమితం చేయడానికి మార్క్సు ప్రయత్నించాడు. దాన్ని ప్రకృతికి అన్వయించి సంపూర్ణ శాస్త్రం చేయాలని ఎంగెల్స్, లెనిన్ ప్రయత్నించారు. ప్రకృతిలో గతి తార్కిక నియమాలను గురించి మార్క్సు చర్చించకపోయినా, మార్క్సు చనిపోయిన అనంతరం అతని రచనలు పరిష్కరించడానికి మార్క్సుకు భాష్యం చెప్పడానికి ఎంగెల్సు కృషి చేసినందున ఇరువురి భావాలు ఒకటిగా చూడడం పరిపాటి అయింది. ప్రకృతికి, సమాజానికి, చరిత్రకు ఒకే మూల సూత్రాలను అన్వయించిన దోషం ఎంగెల్స్ దే కాని, మార్క్సుది కాదు. అందువల్ల మార్క్సుకు, ఎంగెల్స్ కుగల తేడాను సునిశితంగా పరిశీలించి గ్రహించడం చాలా అవసరం.
(ఇంకా ఉంది...)

7 comments:

వింజమూరి విజయకుమార్ said...

అయ్యా రావు గారూ. ఈ రచన బాగానే వున్నది గానీ రకరకాల వాదనల పేరుతో ఒకే వాదాన్ని Split చేసి confussion లో ముంచెత్తుతున్నది. అసలు మౌలికంగా ఉన్నది రెండే రెండు వాదాలు. అవి భావ, భౌతిక వాదాలు. హెగెల్ అందులో భావవాదం చెప్పాడు. చైతన్యం శాశ్వతమైన దన్నాడు. ఆ పేరున గతితార్కిక భావవాదం రాసాడు. అది గ్రీకు తత్వ చరిత్రలో క్లిష్ట దశను అందుకున్న సిథ్ధాంతం. ఆదే విధంగా మార్క్స్ పదార్ధం ప్రాధమికమని నమ్మాడు. హెగెల్ వాదాన్ని యథాతథంగా తీసుకుని దాన్ని చైతన్యానికి బదులుగా పదార్ధం జోడించి గతితార్కిక భౌతికవాదం చేసి అందులో మూడు సూత్రాలూ చెప్పాడు. అంతే కానీ, మీరు పొందుపరచిన రచనలో గతితార్కికానికి మార్క్స్ భౌతికాన్ని కలపలేదు లాంటివి నాకు భోద పడడం లేదు. అలాగే నా ప్రకారం మార్క్స్ అసలు తత్వవేత్తలా అన్పించరు. బీదరికంతో మల మలా మాడిపోయే ధీన ప్రపంచాన్ని చూసి బీదరికాన్ని రూపుమాపడానికి నడుం బిగించిన మహోన్నత ఆర్ధికవేత్త. వీటిలో ఆయన ప్రజాస్వామ్య, సామ్రాజ్యవాద దేశాల లోని ప్రజలు పెట్టుబడిదారులు, దళారుల మూలంగా ఎలా 'అదనపు విలువ'ను నష్ట పోతున్నారనేది ఆయన కనిపెట్టిన మహద్విషయం. ప్రజాస్వామ్యం లోంచి పారిశ్రామిక పురోగతి సాధించిన దేశాలు భౌతిక, భావ విప్లవాల ద్వారా మరింత అత్యున్నత వ్యవస్థలు సోషలిజం (పరిమితమైన పని, పనికి తగిన ప్రతిఫలం), కమ్యూనిజం (పూర్తి కాలం పని, పూర్తి ప్రతిఫలం)ఆయన కన్న కలలు. మొదట ఈ సోషలిజం వ్యవస్షను పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఫ్రాన్సు లో వూహించారు. అది రష్యాలో కన్పిచడం చూసి అబ్బురపడ్డారు. అప్పుడే అది పక్వత లేని పరిణామంగా ఆయన భావించినాడు. చివరకి రష్యా అట్లానే ఏడ్చిందనుకోండి. ఇంతకీ నే చెప్పొచ్చేదేమిటంటే కారల్ మార్క్స్ భౌతికవాది. ఆయన భౌతిక వాదాన్ని గతితార్కిక వాదానికి జోడించి గతితార్కిక భౌతికవాదాన్ని సిథ్దాంతీకరించినాడు. ఆయన జీవిత సర్వస్వం ఆర్థిక ప్రమేయం గలిగిన ఈ సిథ్దాంతమే. ఏమంటారు?

చదువరి said...

ఈ బ్లాగు నుండి సూడోసెక్యులరిజము (http://pseudosecularism.blogspot.com)బ్లాగుకు iరిచ్చిన లింకు కాస్త అశ్చర్యం కలిగించింది. :)

innaiah said...

ఏరిక్ ఫ్రాం వెల్లదించిన తొలి దశ మార్క్స్కు మానవవిలువలు వున్నాయని తరువాత మార్క్స్ లొ అవి కొరవద్దయనెది సారాంశం.తరువాతి దశలొ మీరు ప్రస్తావించిన అంశం సరి అయినది.

వింజమూరి విజయకుమార్ said...

ఓ ధనికుడి కుమారుడ్ని పేదవాడి గురించి ఒక కథ రాయమన్నాట్ట వాళ్ళ టీచరు. ఆ పిల్లవాడు కథ రాసాడు. "ఓ పేదవాడు ఉండెను. ఆ పేదవాడికి ఒక పేద తోట, పేద తోటమాలి ఉండెను. అతడికి ఓ పేద కారు, పేద డ్రైవరు ఉండెను." ఇదీ కథ. అంటే ఒక ధనవంతుడికి పేదవాడి ఆకలి ఎప్పటికీ తెలియదనేది ఈ కథ వెనుక సారాంశం. అయినా, కులీన కుటుంబంలో జన్మించినప్పటికీ అఖండ మానవత్వాన్ని వెంట తెచ్చుకుని కారల్ మార్క్స్ పేదవాడి గురించి రచనలు సాగించినాడు. అవి ప్రపంచం అంచుల్ని స్పశించాయి. కార్మికుడు మేల్కొన్నాడు. మార్క్స్ రచనల మూలంగా జరగాల్సిన ప్రయోజనం కొంత జరిగింది. ఇంకా జరుగుతూనే వున్నది. భవిష్యత్తులోనూ జరుగుతుంది. ఇప్పుడు ఆయన మలి జీవితం చెడినా, చెత్తయినా మనకి నష్టం లేదు. ఉదాహరణకి చలం ఏదో రచన కాపీ చేశారంటారు. కాపీ చేయడమనేది చలం నిజాయితీకి సంబందించింది. కానీ తెలుగులో చలం కాపీ రచన స్త్రీకి బానిసత్వం నుండి విముక్తిని ప్రసాదించ గలిగింది. కనుక, మార్క్స్, చలం వ్యక్తులు కాదనుకుంటా మనకి అవసరం. సమాజానికి వాళ్లు ఒనగూర్చిన మేలు గుర్తించదగింది. అట్లాగని 'ఎరిక్ ఫ్రాం' రచనలు తెలుగువారికి పరిచయం చేయొద్దని గాదు నా విన్నపం. అవి మంచివే. మామూలు సంగతులు బ్లాగుల్లో ప్రస్తావించడం కంటే యిటువంటివి వెయ్యి రెట్లు ప్రయోజనకరం. కాకుంటే ఒక స్పష్టత కోసం ఈ మాట చెప్పాల్సి వచ్చింది. ఇన్నయ్య వారికీ, రావు వారికీ కృతజ్ఞతలు.

Anonymous said...

I request you to provide all your articles in PDF format. It will be easier and convienient for me/us to read.

Thanks

innaiah said...

Your suggestion is well taken. Hope you realise that the criticism is not against Marx here but against communists who camouflaged the humanism of Marx.

వింజమూరి విజయకుమార్ said...

నిజమే. పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారిని చూసిన కళ్ళతో వీళ్ళని చూడాల్సి రావడం బాధాకరం. "కారల్ మార్క్సుకు కమ్యూనిస్టులు పట్టించిన గ్రహణం" అన్న టైటిల్ కి ఆకర్షితుడనై ఈ బ్లాగు చూశానంటే నేటి ఈ కమ్యూనిస్టుల మీద నాలో ఎంత జుగుప్స నెలకొనివుందో నాకే తెలుసు. ఇన్నయ్య వారూ కొనసాగించగలరు. కృతకజ్ఞతలు.