
urine therapy

reiki

electropathy
ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 13 ప్రత్యామ్నాయ చికిత్సలు అశాస్త్రీయమని తేల్చి చెప్పారు. అఖిల భారత వైద్య నిపుణుల సంఘం నాలుగు సంవత్సరాలు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించిన అంశం ఇది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఈ నివేధికను ఆమోదించాయి. అమలు పరచమని రాష్ట్రాలకు తాఖీదులిచ్చాయి.
ఏమిటాచికిత్సలు?
1. రేకి, 2. ఆక్యుపంక్చర్, 3. ప్రాణిక్ హీలింగ్, 4. ఎలక్ట్రోపతి, 5. మూత్ర వైద్యం, 6. అయస్కాంత చికిత్స, 7. హిప్నోథెరపి, 8. మ్యూజిక్, 9. రిప్లెక్సాలజీ, 10. కలర్ చికిత్స, 11. జెమ్స్ స్టోన్స్ వైద్యం, 12. ఎలక్ట్రోహోమియోపతి.
సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్లప్తత కారణంగా ఆశాస్త్రీయ వైద్యాన్ని అందిస్తూ... చాలా మంది డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. జస్టిస్ వై.కే. సభర్ వాల్, జస్టిస్ డి.యం. ధర్మాధికారి. 2004 నవంబరు 25న ఈ విషయమై శాసనం కూడా చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్గాంతర చికిత్స (ఆల్టర్ నేటివ్ మెడిసన్)కు శాస్త్రీయ పునాదుల్లేవని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది.
నిర్దారించిన వారెవరు?
డా. ఎన్.కె. గంగూలీ (ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు) ఆధ్వర్యాన ఏర్పడిన నిపుణుల సంఘంలో డా. ఎస్.పి. అగర్వాల్, డా. ఆర్.ఎ. మషేల్కర్, అశ్వనీ కుమార్, ప్రొఫెసర్ బి.ఎన్. ధవన్, ప్రొఫెసర్ ఎస్.ఎస్. హండా, డా. వి.ఎన్. పాండే, డా. ఆర్.హెచ్. సింగ్, ఎస్. ఖలీఫతుల్లా, డా. ఆర్. కన్నన్, డా. లీనా మెహందలే, డా. ప్రమీలాచారీ, డా. జె.ఎన్. పాండే, డా. బి.కె. శర్మ, డా. వసంత ముత్తు స్వామి ఉన్నారు.
ఎలక్ట్రోపతి, ఎలక్ట్రోహోమియోపతి వారు తమ వైద్యాలకు కూడా ప్రభుత్వ సహాయం ఇవ్వాలని కోరినప్పుడు, ఎందుకు ఇవ్వరాదు, అవి శాస్త్రీయం అవునా కాదా అనే అంశాన్ని పరిశీలించమని ఢిల్లీ హై కోర్టు కోరింది (1998). అంతటితో వ్యవహారమంతా కదిలింది. సారాంశమేమంటే పరిశీలించిన సంఘం ఆధ్యంతాలు చూచి నిర్ణయానికి వచ్చి నివేధిక సమర్పించారు. వీటిలో శాస్త్రీయత లేదని, అవి పుట్టిన దేశాల్లోనే అక్కడి ప్రభుత్వాలు గుర్తించలేదని, ప్రజల్ని ఇలాంటి చికిత్సలతో ఆకర్షించి, మోసగించరాదని హెచ్చరించారు. ఈ చికిత్సల నిమిత్తం డిగ్రీలు ఇవ్వటం, కోర్సులు నడపటం నిషిద్ధమని స్పష్టం చేశారు. ఎవరైనా వీటి పేరిట వైద్యం చేస్తే శిక్షలు వేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం 1903లో ఈ ఉత్తరువులను రాష్ట్రాలకు పంపింది. మన రాష్ట్రంలో నవంబరు 25న ఉత్తరువులు అందాయి. ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా, మౌనం వహించింది. దీనిపై శాస్త్రీయ పరిశోధనా కేంద్రం, హేతువాద సంఘాలు, జనవిజ్ఞాన వేదిక, మానవ వికాస వేదిక తదితరులు రాష్ట్ర గవర్నర్ కు, ఆరోగ్యశాఖామంత్రికి, వైద్యశాఖ అధికారులకు, డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమిడీస్ డైరెక్టర్ కు ఈ నివేధికను అమలు పరచవలసిందిగా విజ్ఞప్తులు చేశారు. కానీ ఆచరణలో ప్రభుత్వం మౌనమే పాటించింది.
రేకీ విధానం పుట్టిన జపాన్ లో దానికి అక్కడ గుర్తింపు లేదు. చేతితో శరీరాన్ని తాకుతూ శక్తిని ప్రసరింజేసి, చికిత్స చేస్తామంటున్నవారు మొదట్లో రాగా, ఇప్పుడు అలా తాకకుండానే శక్తిని ప్రసరించే విధానం వచ్చింది. రోగి బలహీనతల్ని ఆసరగా చేసుకుని డబ్బులు గుంజడం ఒక్కటే వీరి పరమావధి.
ఇక ఆక్యుపంక్చర్ పుట్టుక ప్రాచీన చైనాలో కమ్యూనిస్టు విధానాలకు ఆక్యుపంక్చర్ కు ఎలాంటి సంబంధం లేదని తేలాక ఆ దేశంలో ఈ విధానానికి గుర్తింపు కొద్ది కాలంపాటు కమ్యూనిస్టు పాలనలో దీనిని వాడినా రాను రాను ఇది సైంటిఫిక్ గా నిలబడదని కొట్టి పారేశారు. ఇందులో శాస్త్రీయ ప్రమాణాలు లేవని తేలింది.
దేశానికి ప్రధానిగా చేసిన మొరార్జి దేశాయ్ పుణ్యమా అని ప్రచారంలోకి వచ్చిన మూత్ర వైద్యం కూడా అశాస్త్రీయమని తేలింది. అలాగే ఆటో మూత్ర వైద్యం కూడా దారుణమైన మూఢనమ్మకమని రుజువైంది.
అయస్కాంత చికిత్స కూడా మోసానికి పరాకాష్ట అని నిపుణుల సంఘం తేల్చింది. శరీరాన్ని ఆయస్కాంతం ఆకర్షించదు. అది నిజమే అయితే స్కానింగ్ లో ఉపయోగించే ఎం.ఆర్.ఐ లో ఉన్న అయస్కాంతం వల్ల అన్ని జబ్బులు నయం కావాలి కదా.
ఎలక్ట్రోపతి, ఎలక్ట్రోహోమియోపతి (ఇది హోమియోపతి కాదు) విధానంలో కొన్ని విద్యుత్ పరికరాలు, ఆధునిక పరీక్షా యంత్రాలు వాడతారు. దీంతో చాలా మంది ఇది నిజమైనదేనని నమ్ముతారు. కాని ఇందులో ఏమాత్రం శాస్త్రీయత లేదని నిపుణుల సంఘం అధ్యయనంలో వెల్లడైంది.
ఎలాంటి శాస్త్రీయత లేని, ఆకర్షణీయ సిద్ధాంతాలతో జనాన్ని బుట్టలో వేసుకుంటున్న ప్రాణిక్ హీలింగ్ కూడా ఏ వ్యాధిని నయం చేయదు. రవిశంకర్ వంటి వారిని పిలిచి రాష్ట్రప్రభుత్వమే ఉద్యోగులకు ప్రాణిక్ హీలింగ్ ఇప్పించటం వారి అజ్ఞానానికి, నిపుణుల సంఘ నివేధికను దిక్కరించటానికి తార్కాణంగా పేర్కొనవచ్చును.
జెమ్స్ స్టోన్ వైద్యం కూడా ఇదే తరహాలోనిదే. ఫ్రాన్స్ లో మొదలైన హిప్నోథెరపి కూడా ఆ దేశంలో దిక్కులేదు. కాని మనం మాత్రం వేలం వెర్రిగా వ్యాపార ప్రకటనలకు ఆకర్షితులమై ఉంగరాలు ధరించటం, విపరీతంగా ఆభరణాల పేరిట జ్యోతిష్యం వంటి వాటి వలలో పడి కొనుగోలు చేస్తున్నారు.
రాష్ట్రప్రభుత్వం ఈ విషయంలో ఎప్పటికీ కన్ను తెరిచి ఆదేశాలని అమలు పరుస్తుందో గమనించాలి. బహుశా చికిత్సల వారి బలమైన లాబీలు ప్రభుత్వాన్ని వత్తిడి చేస్తుండవచ్చు.