Monday, September 1, 2008

నిప్పులపై నడక

ఇసుక వేస్తే రాలనంత జనం. బాబా నిప్పులపైన నడుస్తారని ఆనోటా ఆనోటా ప్రచారం అయింది. వూరి వెలుపల చింత నిప్పుల గుండం ఏర్పరచారు. చుట్టూ జనం వున్నారు. ఇంతలో ఎక్కడినుండో బాబా ఆ స్థలానికి చేరుకున్నారు. చింత నిప్పుల కణాలు గుండంలో వున్నాయి. ఆత్రుతగా జనం చూస్తున్నారు. పూర్వం సీతమ్మవారు యిలాగే రాములవారి కోరికపై నిప్పుల మీద నడచి పాతివ్రత్యం నిరూపించారని అనుకున్నారు. అంటే శీలపరీక్ష కూడా చింతనిప్పులు తేల్చి పారేస్తాయన్నమాట.
బాబా గబగబా కొన్ని సెకండ్లలో చెప్పులు లేకుండా అగ్నిగుండంలో 8 అడుగులు నిడివిని నడచి వెళ్ళారు. కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది. అద్భుతం అనుకున్నారు.
ఎక్కడి నుండో ఆగండి అంటూ కేక వినిపించింది. ప్రేమానంద్, మరి కొందరు హేతువాదులు వచ్చారు. మేమూ నడుస్తాం అన్నారు. అంటూనే ముందుగా ప్రేమానంద్ నిప్పులపై నడవగా, ఆయన్ను అనుసరించి కొందరు హేతువాదులు నడిచారు.
బాబాగారంటే మహత్తు వలన నడిచారన్నారు. మరి వీరెలా నడవగలిగారు? ప్రేమానంద్ వివరించారు.
నిప్పుకణాలపై బూడిద వుంటుంది. అది వేడిని వెంటనే రానివ్వకుండా ఆపగల్గుతుంది. అలాంటి నిప్పులపై ఏడెనిమిద క్షణాలు నడచినా కాలుకాలదు. ఎక్కువ సేపు వుంటే కాలుతుంది. నిప్పుల్లో మేకులు, సీసపు పెంకులు, లోహాలు లేకుండా జాగ్రత్ పడాలి. వేడి పాత్రలో నీరు కాస్తే వేడి ఆవిరి వస్తుంది. అందులో చేయి పెడితే వెంటనే కాలదు. అయితే పాత్రకు చేయి తగలకుండా చూచుకోవాలి. ఏ బాబా కూడా కాలే లోహపు పాత్రల మీద, ఇనుపకడ్డీల మీద నడవలేడు.
హేతువాదుల వివరణతో బాబా పస తేలిపోయింది.

No comments: