Thursday, September 4, 2008

బాబా నిప్పు మింగాడు








టక్కర్ బాబా విడిదిచేసి నెల రోజులైంది. పక్క గ్రామాల నుండి కూడా తండోపతండాలుగా జనం వస్తున్నారు. క్రమ బద్ధం చేయడానికి పోలీస్ కూడా వచ్చింది. బాబా ఆదాయం పెరిగిపోతున్నది. పత్రికల వాళ్ళు, టి.వి. వాళ్ళు పోటీపడి బాబా మహిమల్ని చూపుతున్నారు.
ఈ రోజు ఏం జరుగుతుందోనని జనం ఎదురుచూస్తున్నారు. వేచి వున్న జనాన్ని ఆదుకోడానికి కొందరు మంచి నీళ్ళు అందిస్తున్నారు.
చివరకు స్వామీజీ రానే వచ్చారు. చిన్న ప్రసంగం చేశారు. బాబాకు తెలుగురాదు గనుక ఆయన ప్రవచనాన్ని శిష్యులు తెలుగులో చెప్పారు.
మాటల అనంతరం బాబా అరచేతిలో కర్పూరం పెట్టుకొని, మంత్రాలు చదువుతూ వెలిగించారు. చూస్తుండగానే మండుతున్న కర్పూరాన్ని నోట్లో వేసుకున్నారు.
భక్తులంతా ఆశ్చర్యపోయారు. బాబా మామూలుగానే మాట్లాడారు. ఆయనకు నోరుకాలదా?
ఇంతలో హేతువాది ప్రేమానంద్ వచ్చాడు. నేనూ బాబావలె చేయగలనని చేతిలో కర్ఫూరపు ముద్ద వెలిగించి, నోట్లో వేసుకున్నాడు.
నిప్పు రావాలంటే ఆక్సిజన్ అవసరం. కర్పూరం వెలుగుతుండగా నోట్లో వేసుకొని, నోరు మూసుకుంటే ఆక్సిజన్ లేక ఆరిపోతుంది. నోట్లో కర్పూరపు ముద్ద వేసుకొని నోరు మూసి గాలి బయటకు వదలాలి. మనం వదిలేది కార్బన్ డైయాక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు). అది మంటను వెంటనే ఆర్పేస్తుంది. కాకుంటే నోట్లో వెలిగే కర్పూరపు ముద్ద వున్నప్పుడు గాలి పీల్చకూడదు. పీల్చేది ఆక్సిజన్ (ప్రాణవాయువు) గనుక, అది మంటను ఆర్పదు.
ప్రేమానంద్ వివరణలో బాబా ట్రిక్కు, అందిరీక బట్టబయలు అయింది. అయినా భక్తులు కొత్త మహత్తులకు ఎదురుచూస్తున్నారు.

.
.

No comments: