Saturday, September 27, 2008
New Yorkప్రపంచ వాణిజ్య రాజధాని
Broadway theater glimpse
New york map
ప్రపంచ వాణిజ్య రాజధానిగా పేరు తెచ్చుకున్న న్యూయార్క్ ను టూరిస్ట్ పరిభాషలో బిగ్ యాపిల్ అని కూడా అంటారు. నేను అనేకసార్లు న్యూయార్క్ వెళ్ళాను. ఎన్నో రోజులు న్యూయార్క్ లో గడపగలిగాను. నా కుమారుడు రాజు నరిసెట్టి అక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఉన్నందున నాకు అవకాశం లభించింది.
న్యూయార్క్ లో అన్ని భారీ ఎత్తున ఉంటాయి. తిరిగి చూడడానికి సబ్ వే రైళ్లు, బస్సులు పుష్కలంగా ఉన్నాయి. రాత్రింబగళ్ళు సిటీలో భయం లేకుండా రైళ్లలో తిరగొచ్చు. ఎంత దూరం వెళ్ళినా రైలు టికెట్టు డాలర్ న్నర మాత్రమే. ఒకసారి దిగి బయటకు వస్తే మళ్లీ డాలర్ న్నర పెట్టి టికెట్టు కొనుక్కోవాలి.
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మనుషులను న్యూయార్క్ వీధులలో చూడవచ్చు. వివిధ దేశాల రుచులు ఆయా రెస్టారెంట్లలో చౌకగా తినవచ్చు. గ్రెనిచ్ విలేజ్ ఒక ప్రత్యేక ప్రాంతం నగరం మధ్యలో ఉన్నది. అక్కడ తిరిగి చూస్తే రచయితలు, కవులు, గాయకులు, చిత్రకారులు వివిధ సంఘాలవారు యథేచ్చగా వ్యక్తం చేయడం గమనించవచ్చు.
చిన్న చిన్న రెస్టరెంట్లు పేవ్ మెంట్ల మీద కనిపిస్తాయి. పక్కనే చెల్సీ ప్రాంతం కూడా వివిధ స్వేచ్ఛాపరుల సంచలనాలకు నిలయంగా ఉంది. పాత పుస్తకాలు బాగా లభించే, చౌకగా కొనుక్కోవటానికి వీలయిన స్ట్రాండ్ బుక్ షాపు కొంచం వెతికితే కనిపిస్తుంది.
వాల్ స్ట్రీట్ ప్రపంచ వాణిజ్యానికి పెత్తనం వహించే కేంద్రం. ఆ వీధిలో నడుస్తుంటే భవనాలు మీదపడతాయేమో అన్నట్టుంటుంది. అక్కడే స్టాక్ ఎక్స్ ఛేంజ్ కేంద్రంలోకి వెళ్లి చూస్తే మనకు అంతుపట్టని హడావుడి ఉంటుంది. సాయంత్రం 5గం.లకు ముగుస్తుంది.
న్యూయార్క్ వీధులలో అక్కడక్కడ సబ్ వేలో కొన్ని చోట్ల వివిధ వాయిద్య పరికరాలతో సంగీతం వినిపించే నల్లవారు కనిపిస్తారు. విని ఆనందించినవారు కొద్దోగొప్పో డబ్బులు పడేసి పోతుంటారు. అందరికీ సుప్రసిద్ధమయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట నిర్మణాలను ముస్లిం ఉగ్రవాదులు నాశనం చేసేవరకు అవి ఆకర్షణీయమైన యాత్రా స్థలంగా ఉండేవి. అక్కడకు ఎన్నోసార్లు వెళ్ళి పై వరకూ లిఫ్ట్ లో పోయి న్యూయార్క్ నగరాన్ని చూచాను.
సర్వసాధారణంగా యాత్రికులందరూ చూచేది లిబర్టీ విగ్రహం. ఇది ఫ్రెంచి వారు దానం చేశారు. అక్కడికి వెళ్ళి తిలకించి ఆనందించటం ఒక విశేషం.
న్యూయార్క్ రాష్ట్రంలో న్యూయార్క్ నగరం చాలా పెద్దది. కానీ రాష్ట్రానికి రాజధాని మాత్రం కొంచెం దూరంగా అల్బనీ అనే చోట పెట్టుకున్నారు. న్యూయార్క్ లో అతి ఖరీదైనవి అతి చౌకయినవి అన్ని రంగాలలోనూ ఉన్నాయి. తొందరగా చూడాలనుకునేవారు టూరిస్టు బస్సులలో గబగబ చూడవచ్చు. నగర ప్రముఖ వాణిజ్య ప్రాంతాలను డౌన్ టౌన్ అంటారు. కొన్ని ప్రాంతాలు కేవలం పేదవారు నల్లవారు నివసించేవి కనిపిస్తాయి. అలాంటి చోట మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన ఆఫీసు పెట్టుకున్నాడు. నగరంలో కేంద్ర రైల్వే స్టేషన్ ను టెన్ స్టేషన్ అంటారు. పూర్తి పేరు పెన్సిల్ వేనియా. ఇతర రాష్ట్రాలకు అక్కడనుండే రైళ్ళు వెడతాయి. మరొక పెద్ద కేంద్రం టైమ్ స్క్వేర్. అది వాణిజ్య వినోద వార్తా కేంద్రం.
న్యూయార్క్ లో ఇతర చోట్ల లేని ఒక ప్రత్యేకత థియేటర్ ప్రాంతం. బ్రాడ్ వే థియేటక్ అంటారు. ఇందులో 30 నాటక స్టేజీలున్నాయి. అక్కడ ప్రదర్శన రాణిస్తే ప్రపంచ ఖ్యాతి వస్తుంది. సంవత్సరాల తరబడి ఆడే నాటకాలున్నాయి. రోజుకు రెండు ప్రదర్శనలుంటాయి. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. టికెట్టు కొంచెం ఖరీదనిపిస్తుంది. నాటకం చూసిన తరవాత ఖరీదు సంగతి మర్చిపోతాం. సైగాన్, డా. జకిల్ అండ్ మిస్టర్ హైడ్, లయన్ కింగ్ వంటివి బహుళ ప్రచారంలో ఆకర్షించాయి. నటుల వయస్సు పెరుగుతుంటే ఎప్పటికప్పుడు కొత్తవాళ్ళకి తర్ఫీదు ఇస్తుంటారు. దీని వెలుపల మరొక 30 థియేటర్లున్నాయి. వాటికి ఆఫ్ బ్రాడ్ వే అని పేరు పెట్టారు. తక్కువ ఖర్చులో నాటకాలు వేసుకోటానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని ఆఫ్ ఆఫ్ బ్రాడ్ వే థియేటర్లు అంటారు. నాటకాలలో కొత్త ఫక్కీలు, వీధి నాటకాలు మొదలైన వాటికి అక్కడ అవకాశాలు కనిపిస్తాయి. వ్యయం కూడా తక్కువే ఉంటుంది.
న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి కేంద్రం ఉన్నది అది స్వతంత్ర ప్రాంతం. దానికి వేరే పాస్టాఫీసు తదితర సౌకర్యాలున్నాయి. వివిధ నాన్ గవర్నమెంట్ సంఘాలు పనిచేస్తుంటాయి. అందులో హ్యూమనిస్టు సంఘం కూడా ఉన్నది. నేను అనేక పర్యాయాలు అక్కడికి వెళ్ళాను. పిల్లలకు సంబంధించిన సమస్యలపై చర్చించి విషయ సేకరణ చేశాను.
న్యూయార్క్ లో బేలే ( Ballet)థియేటర్ మంచి ఆకర్షణ. ఇది ఖరీదును బట్టి యాత్రికుల నంతగా ఆకర్షించదు కాబట్టి స్టేజి ప్రియులకు గొప్ప నిలయం. ఎవరైనా ఉచితంగా తమ ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు.
క్వీన్స్ ప్రాంతంలో టెన్నిస్ కోర్టు సముదాయం ఉన్నది. సెప్టెంబరులో యు.ఎస్. ఓపెన్ టెన్నిస్ జరుగుతున్నప్పుడు క్రీడా ప్రియులకు పండుగవలె ఉంటుంది. నేను టెన్నిస్ అటలకు వెళ్ళినప్పుడు అక్కడ క్రీడాకారులను చూడడం కొందర్ని పలకరించడం ఆనందదాయకమైన అనుభూతి. న్యూయార్క్ పెద్ద నగరం కావటం వలన అక్కడ పనిచేసే చాలామంది లాంగ్ ఐలండ్, న్యూజెర్సి, ఇంకా చుట్టుపట్లం నుండి వచ్చీ పనిచేసి పోతుంటారు. అదొక ప్రత్యేక లోకం. అక్కడున్నవారు జనం సందడికి అలవాటై, ఎక్కడికైనా వెడితే తోచనట్లుగా భావిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment