Tuesday, September 2, 2008

గుడిశెలు తగులబడుతున్నాయి


PREMANAND


తెలంగాణా మారుమూల గ్రామం సింగారంలో ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వున్నట్లుండి ఒక గుడిశపై మంటలు చెలరేగాయి. మగవాళ్ళంతా కూలీకిపోయారు. మంటలు చూచిన ఆడవాళ్ళు గుండెలు బాదుకున్నారు. కష్టపడి నీళ్ళు పోసి ఆర్పేశారు.
మరునాడు ఇంకోగుడిసెపై అలాగే మంటలు లేచాయి. ఈ వార్త ప్రాకిపోయి, ఆ వూరికేదో శాపం తగిలిందన్నారు. జనం పొరుగూళ్ళ నుండి వచ్చి చూచి, వింతకథలు అల్లారు. స్థానికపత్రికలలో కూడా వార్త వచ్చింది.
హేతువాదులకు యీ విషయం తెలిసి, వెళ్ళి పరిశీలించదలచారు. ప్రేమానంద్ అనే మాంత్రిక హేతువాదిని వెంటబెట్టుకొని ఆ వూరు చేరారు. జనం చెప్పిన కథలు ఆలకించారు.
ప్రేమానంద్ తగులబడిన గుడిసెలు పరిశీలించాడు. పిడకలు ఎండ బెట్టిన గుడిశెలే తగులబడ్డాయి. పిడకలు లేని ఇళ్ళకు మంటలు రాలేదు.
ఏం జరిగింది? పరిశీలించగా తేలిన సారాంశం.
పిడకలు చేసేటప్పుడే పచ్చ ఫాస్పరస్ కలిపి పెట్టారు. పిడకలలో తడి ఆరగానే, పచ్చ ఫాస్ఫరస్ నుండి వేడి వచ్చి, క్రమేణా గుడిసెపై పొగరావడం, తగులబడడం జరిగింది. కావాలని పచ్చ ఫాస్ఫరస్ ను కలిపి పెట్టారన్నమాట. ఎవరు పిడకలు చేశారో తెలుసుకుంటే దొంగ దోరికిపోతాడు. ఎందుకు అలా చేసిందీ ఆరా తీయవచ్చు. ఇది చేయకుండా నమ్మకాలతో వుంటే, ఇంకా జనాన్ని భయకంపితుల్ని గావించి, వ్యాపారం చేసుకునే వారుంటారు.

.

No comments: