Monday, August 4, 2008
టెంకాయ భక్తి
భక్తికీ కొబ్బరికాయలకూ చిరకాలంగా సన్నిహిత సంబంధం వుంది. కొబ్బరి బొండాలతో, టెంకాయలతో చిత్రవిచిత్ర చర్యలు చూపి భక్తులను ఆకట్టుకోవడం, భయపెట్టడం కూడా చూస్తున్నాం. కేరళలో యిది మరీ ఎక్కువ.
కొబ్బరికాయలు తనకు వేసి కొట్టుకొని అది భక్తిగా కొందరు ప్రదర్శిస్తారు. కొబ్బరికాయ పగులగొట్టినప్పుడు రెండు సమాన భాగాలైతే మంచిదనీ, ఒకే దెబ్బతో పగిలితే శుభమనీ, అలాంటి నమ్మకాలెన్నో వున్నాయి. కొబ్బరికాయ పగులగొట్టినప్పుడు లోన పుష్పాలు, రంగునీళ్ళు, ఎరుపు కనిపిస్తే దానిపై వ్యాపారం చేసి, చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేసే గ్రామ వైద్యులున్నారు, భూతవైద్యులున్నారు. ఇలాంటి కొబ్బరికాయ మహత్తులను హేతువాదులు, ప్రేమానంద్ ఆధ్వర్యాన ఎన్నో పర్యాయాలు బట్టబయలు చేశారు. అందులో కొన్ని చూద్దాం. లేత కొబ్బరికాయలు మూడు కన్నులచోట తలకేసి కొడితే వూరికే పగులుతాయి. అలాంటివి కేరళలో, శ్రీలంకలో 101 తలకు కొట్టుకొని అదే మహత్తుగా చూపిన బాబాలున్నారు. అలాంటి కొబ్బరికాయలలో ముదురుకాయల్ని హేతువాదులు చాటుమాటుగా పెట్టినప్పుడు బాబాలకు నొసట రక్తం కారింది. కాని, కొబ్బరికాయ పగలలేదు!
గట్టి టెంకాయ పగులగొట్టాలంటే తలకు దెబ్బ తగులుతుంది. కొబ్బరిపీచు తీసేసి కత్తితో మెల్లగా కొట్టి, చిట్లే వరకూ చూడాలి. తరువాత మూడు రోజులు ఎండబెట్టి, చిట్లినచోట కుంకుమ, గంధం రాసి, మంత్రాలు చదువుతూ, భక్తుల ఎదుట, తలకు, కొట్టుకుంటే వూరికే పగులుతుంది. చిట్లిన విషయం వారికి తెలియదుగదా.
కొబ్బరికాయ పీచు తీసేసి నిమ్మరసం వున్న పాత్రలో పెట్టి తరువాత మూత తీయాలి. అప్పుడు కొబ్బరికాయపై మంత్రాలు చదువుతూ నీళ్ళు చల్లితే, పగులుతుంది.
కొబ్బరికాయ పీచుతీసి, కన్నులవద్ద పట్టుకోడానికి వీలుగా పీచు అట్టిపెట్టాలి. ఇంజక్షన్ తో నీళ్ళు కలిపిన పొటాషియం పర్మాంగనేటు ద్రావణాన్ని కన్నుద్వారా పంపాలి. తరువాత మైనం పెట్టాలి. పట్టుకొనే పీచులో సోడియం మెటల్ ముక్క పెట్టాలి. భక్తుణ్ణి పట్టుకోమని, మంత్రాలు చదువుతూ, కొబ్బరికాయపై నీళ్ళు చల్లాలి. హఠాత్తుగా నిప్పు రగులుతుంది. కొబ్బరికాయ పగిలి, ఎర్రని రక్తం వంటి ద్రవం కారుతుంది. నీటితో కలసిన సోడియం రసాయనిక మార్పు అది. మహత్తుగా దీని చుట్టూ ఎన్నో కథలు అల్లవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
టెంకాయ గురించి బ్లాగొచ్చు కూడా !
చాలా బాగా చెప్పేరు.
కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు జరుగుతుందని కొందరు భయపెడితే, మరికొందరు 'కుళ్ళిపోతే మరీ మంచిది ' అని సర్ది చెప్పేవాళ్ళు ఉంటారు. అన్నీ మన నమ్మకాలతో ఆడుకునే ట్రిక్కులే!
అది సరే, ఈ బాబాలు, హేతువాదులు ఈ ప్రయోగాలన్నింటినీ ఎలా కనుక్కుంటారు?
శాస్త్రీయ పద్దతి అన్వయిస్తే నిజ నిర్థారణ జరుగుతుంది. ప్రశ్న ,సందేహం వీటికి ఉపకరిస్తుంది.ఇది ఎవరైనా చేయ వచ్చు. కొంత ట్రైనింగ్ బాగా తో డ్పడుతుంది.
అమెరికాలొ జేంస్ రాండి, ఇండియాలొ ప్రే మా నంద్ చాలమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు.
ఇన్నయాగారూ;బాగున్నాయి మీ టెంకాయ మహత్యాలు.
నేనూ మీలాగే చిన్నప్పట్నుంచీ హేతువాదిని. లాజిక చెబితేతప్ప దేన్నీ అంగీకరించేవాణ్ణికాదు. బహుశా నేను 7వతరగతిలో ఉన్నప్పుడనుకుంటా, మా నాన్నగారిని ఇదే ముక్క అడిగా "దేవుడికి టెంకాయే ఎందుకు కొట్టాలి? అది దేవుడికి ఇష్టమనా లేక ఆయన ఇదే కావాలని కోరాడా?" అని.
నా ప్రశ్నకు మా నాన్న ఇచ్చిన సమాధానం ఒక్కటే,"అన్నింటినీ సృష్టించిన దేవుడు తనకు ఇది కావాలి అని ఎప్పుడూ కోరడు.టెంకాయ మానవుడి అహానికి గుర్తు(బయటనున్న గట్టి భాగం).దాన్ని పగలగొడితేగానీ లోపలున్న ఆత్మ(మెత్తటి కొబ్బరి) సాక్షాత్కారమవదు. అహాన్ని పగులగొట్టి దేవుడికి మన ఆత్మల్ని అర్పించడమే దీని పరమార్థం" అని చెప్పారు.
లాజికల్గా ఆలోచించినా, అది సరైనదే అనిపించింది. ఇప్పటికీ నేను దేవుడ్ని నమ్మకపోయినా టెంకాయ కొట్టడంలోని పరమార్థాన్ని గౌరవిస్తాను.నాకు కొబ్బరంటే ఇష్టం కూడా లెండి అది వేరే విషయం.
మహేష్ గారు,
దేవుడికి కొబ్బరికాయ కొడితే ఆ రోజో, మర్నాడో కొబ్బరి పచ్చడి చేస్తారని తెలుసు గానీ కొబ్బరి కాయ కొట్టడం వెనక ఇంత భావముందా! మీ నాన్న గారు చెప్పింది నాకు భలే నచ్చింది.
chala bagundi ..
Post a Comment