ఎమ్.ఎన్. రాయ్ తో పరిచయం
ఒకరోజు ప్రొద్దున్నే అమెరికా పండితుడొకడు ఢిల్లీ నుండి గీతాభవనానికి వచ్చాడు. తనతో పాటు మస్సోరీ రమ్మని అడిగాడు. నేను వెంటనే అంగీకరించాను. త్రోవలో డెహ్రాడూన్లో 14 మోహిని రోడ్లో ఉంటున్న ఎమ్.ఎన్. రాయ్ దగ్గర ఒక అర్థగంట సేపు ఆగాల్సి వుంటుందన్నాడు. ఎమ్.ఎన్. రాయ్ పుట్టుకతో సనాతన బ్రాహ్మణుడు. ఒకప్పుడు కమ్యూనిస్టు కొమిన్ ఫామ్ లో ఇండియా పక్షాన ఏకైక సభ్యుడు. చైనాలో పనిచేశాడు. రాయ్ సిద్ధాంతకర్త. ఆచరణవాది కాదు. ఇండియాకు తప్పించుకొని వచ్చిన రాయ్ ని పట్టుకొని, ఫిలిప్ స్పాట్ర్ తో పాటు విచారణ జరిపారు. రాయకు 12 సంవత్సరాలు శిక్షవేసి, తర్వాత ఆరేళ్ళకు తగ్గించారు. ఆ సమయంలో మనిషి మారగలిగినంతగా మారాడు. కమ్యూనిస్టు కాస్తా హ్యుమనిస్టు అయినాడు.
మోహిని రోడ్ వరకు తీసుకు వెళ్ళి నన్ను కారులోనే కూర్చుండమని 15 నిముషాలలో రాయ్ తో మాట్లాడి వస్తానని అతడు ఇంట్లోకి వెళ్ళాడు. 10 నిముషాల తరువాత కారులో వున్న నా దగ్గరికి రాయ్ వచ్చి ఆప్యాయంగా, స్వామీజీ కనీసం కాఫీ తాగి వెళ్లకూడదా? అన్నాడు. ఆనందించాను. అయిదు కప్పుల కాఫీతో అయిదు గంటల చర్చ జరిగింది. అమెరికాలో మానస అధ్యయన శాస్త్రజ్ఞుడు ఫిల్ సింగర్, ఎలెన్ రాయ్, ఎమ్ ఎన్ రాయ్ నేను చర్చల్లో మునిగిపోయాం. పొద్దుబోయింది. నేను ఆవ్యక్తంగా కోరుకుంటున్న పదార్థాలతో ఎలెన్ భోజనాలు వడ్డించింది. క్రీమ్ కాఫీ, బేకన్, ఛీజ్ అన్ని ఉన్నవి. మత్తు పానీయాలు సేవిస్తూ చాలా సేపు గడిపాము. జీవితంలో మొదటిసారి నేను మత్తు పానీయాలను ఆనందించిన రోజు అది.
రాయ్ భారత జాతీయవాదిగా జాతీయతను నిరసించాడు. హిందువుగా హిందూ మతంలోని సాంఘిక బంధాలను తృణీకరించాడు. కమ్యూనిష్టులు అతడిని బ్లాక్ లిస్టు చేశారు. దశనామి శాఖ స్థాపకుడు శంకరాచార్యుడితో సహా భారతీయ మతతాత్వికుల పట్ల రాయ్ కు ప్రేమాదరాలు ఉన్నవి. శంకరాచార్యుడి పారమార్థిక దృష్టి మానవతా వాదులకు ముఖ్యం కాదు. వ్యక్తిని కాదనే శంకర సిద్ధాంతం రాయ్ కు అంగీకారం కాదు. మానవతావాదికి వ్యక్తే ముఖ్యం.
ఇండియాలో శాఖాహారిగా వుండటం సులభం. సన్యాసం స్వీకరించే శాకాహారం అమెరికా ప్రోటీన్ ఆహారం కంటే చాలా బాగుంటుంది. ఆహారం లైంగికం తదితర వ్యక్తిగత విషయాలకు నైతిక విలువలు అంటగట్టడం మంచిది కాదు. ఎమ్.ఎన్. రాయ్ తో కలిసి బోజనం చేసిన తరువాత శాఖాహారానికి గొప్పలు కట్టిపెట్టడం తప్పదనుకున్నాను. నాపై రాయ్ ప్రభావం కొంతకారణం కావచ్చు.
మరునాడు పగలూ రాత్రీ రాయ్ తోనే గడిపాను. ముస్సోరీకి పోనే లేదు. నా అమెరికా స్నేహితుడు ఢిల్లీ వెడుతూ నన్ను హరిద్వార్ లో దింపి వెళ్ళాడు. నన్ను ఉత్తర కాశీ వెళ్ళి రమ్మని జె.కొ. బిర్లా సూచించారు. యాత్రికులకు అది తుది శిబిరం. త్రోవలో ఉన్నది బిర్లా అక్కడ ఒక విశ్రాంతి మందిరం నిర్మించాడు. మా సామాను అక్కడ పెట్టాము. ఉత్తర కాశీలో వేదాంత పండితులు ఉన్నారు. శంకరాచార్య తత్వాన్ని విడమర్చి చెప్పిన ముఖ్యులలో ప్రముఖుడైన స్వామి విష్ణుదేవానంద కూడా ఉన్నారు. సాయం కాలం వాహ్యాళిలో తనతో పాటు రావడానికి ఆయన నన్ను అనుమతించారు. వారితో పాటు మరికొందరు స్వాములు కూడా అనుసరిస్తుంటారు.
ఒకనాటి రాత్రి మేము అలా పొతుండగా స్వామి ఇలా అడిగారు. మన గ్రహణ గ్రంథాలు పేర్కొంటున్నట్లుగా ఇదంతా వాస్తవం కాదని అప్పుడప్పుడు నీకనిపించదా? ప్రమాణ గ్రంథాలు పేర్కొన్నట్లుగా అనే పదాలు చేర్చటం నాకు ఆశ్చర్యం వేసింది. ప్రమాణ గ్రంథాలను, వాటిపై ఉత్తమ భాష్యాలను స్వీకరించాలి. అంతగా పాండిత్యం లేనివారి మీద వీటిని రుద్దకూడదు. పాశ్చాత్య ఆలోచనారీతుల ప్రభావం నాపై వున్నదని నీవనుకోవచ్చు. నాకు అవేవీ తెలియవు. మన సంప్రదాయంలోనూ మూల గ్రంథాలను నిశితంగా పరిశీలించిన వారున్నారు. అంత మాత్రాన ఆ గ్రంథాల పట్ల విశ్వాసం తగ్గలేదు. మన ఆదిగురువు ఈ కోవకు చెందినవాడు కాడు, శ్రీహర్షుని గ్రంథాలు చదువు, అప్పుడు బౌద్ధుల వద్దకు పోనక్కరలేదు వారి పునాదులను వారే తృణీకరించారు.
స్వామి విష్ణుదేవానంద అద్వైత వేదాంతంలో అత్యున్నత పాండిత్య ప్రకర్ష సాధించిన ఉత్తరకాశీ గంగోత్రి పండిత వర్గానికి చెందిన వాడాయన. స్వామి వివేకానంద 8 సంపుటాలలో ప్రవచించిన వేదాంతానికి, ఉత్తర కాశీ రుషులు చెప్పే వేదాంతానికీ చాలా తేడా ఉన్నది. రామకృష్ణ మిషన్ వారు వేదాంతాన్ని ప్రచారంలోకి తీసుకురావడానికి చాలా బలపరిచారు.
నేను ఢిల్లీ వచ్చేసరికి యూనివర్శిటీలో నాకు స్వస్తి పలికారు. కారణాలు చెప్పలేదు. యువతీ యువకులను నేరుగా కూర్చోబెట్టకపోవడం ఒక కారణం కాగా, సాధువుల మహాసభలో పాల్గొనడం మరొక కారణమని తెలిసింది. కొన్నాళ్ళు ఢిల్లీలో ఏకాంతంగా ఒక వ్రాతప్రతిని అనువదిస్తూ ధ్యానం చేసుకుంటూ గడిపాను. బిర్లా నిర్మించిన పిలాని సంస్థకు వెళ్ళి జబ్బుబడ్డాను. డాక్టర్ అవలేగోంకర్ నన్ను కాపాడాడు. చాలా బలహీన స్థితిలో తిరిగి వచ్చాను. పండిత గోవింద మాలవ్య కలిశారు. ఆయన అక్కడ పార్లమెంటు సభ్యులు. కాశీ హిందూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కూడా కాశీకి వచ్చి బోధిస్తూ విద్యార్థులు అధ్యాత్మిక అవసరాలు చూస్తూ మీరెందుకు గడపకూడదు? అని అడిగారు.
కాశీ విద్యాలయంలో
1951 నవంబరు 17న కాశీ విశ్వవిద్యాలయంలో నేను ఉద్యోగం ప్రారంభించే నాటికి అక్కడ ఉండి చదువుకునే విద్యార్థులు పది వేలమంది ఉన్నారు. జియాలజి వంటి కొన్ని శాఖలలో సహా విద్యను అనుమతించడం లేదు. ఫిలాసఫీ శాఖాధిపతి నన్ను పరిచయం చేస్తూ స్వామి అగేహానంద భారతి మన గౌరవ తత్వశాస్ర్తాచార్యుడిగా ఉంటాడని చెప్పాడు. ఇంగ్లండ్లో విశ్లేషణ తత్వం, ఫ్రాన్సులో సత్తావాదం, జర్మనీలో నూతన మార్మిక వాదం అనేక సమకాలిక శాఖలను చెప్పాను. ఇంగ్లీషులో ప్రసంగిస్తూ మధ్య మధ్య హిందీలో చెప్పేవాడిని, ముందు వరసలో కూర్చున్న వారంతా రాగద్వేషాతీతంగా ముఖాలు పెట్టారు. మొదటిరోజు ఉపన్యాసమైన తరువాత ప్రశ్నలు అడగమంటే ఎవరూ ముందుకు రాలేదు. కాస్సేపటికి ఒక సన్నని వ్యక్తి లేచి విశ్లేషణాత్మక మార్మిక తత్వాన్ని వివరించమని, జర్మన్ మాట్లాడే దేశాలపై విశ్లేషణాత్మక ఆలోచన ప్రభావం ఏమిటని అడిగారు. విట్ గైస్ స్టెన్, వియన్నా సర్కిల్ వారిని స్వస్థలంలో విడ్పించి పంపించివేశారని చెప్పాను. నన్ను ప్రశ్న అడిగిన వ్యక్తి ప్రొఫెసర్ జె.యల్. మెహతా, అప్పటికాయన తప్ప, విట్ గైన్ స్టెన్, న్యూరప్, మాహ్ పేర్లు విన్నవారే లేరు. ఆ తరువాత జె.యల్. మెహతా నేను వారి పేర్లు వినిపించినా వారు ఆసక్తి చూపలేదు.
ఈ దేశంలోని యూనివర్శిటీలలో పాఠ్యపుస్తకాల చుట్టూబోధన గిరిగీసి ఉంటుంది. తరచు వీటిని మార్చటం కూడా ఇష్టం ఉండదు. సైన్స్ లో కూడా ఇలాగే ఉందని విన్నాను. నేను ఫిలాసఫీ శాఖలో చేరేనాటికి, ఇండియాలో ఇతర చోట్ల ఉన్న పరిస్థితే ఉన్నది. కొందరు ప్రొఫెసర్లు సింబాలిక్ లాజిక్ పుస్తకాలు తెప్పించాము. తత్వశాఖ వారు వాటిజోలికి పోలేదు కాని, గణితశాఖ వారు మాత్రం వాటిపట్ల ఉత్సాహం చూపారు. అద్వైత వేదాంతానికి చేరువగా ఉన్న పాశ్చాత్య ధోరణులను ఫిలాసఫీ ఆహ్వానించేది వివేకానంద రచనల ప్రభావం వలన ఈ ధోరణి ప్రబలింది. కనుకనే ఇండియాలో ఫిలాసపీ శాఖలలో బర్కిలీ, బొసాంకే బ్రాడ్లే తత్వవేత్తలు బహుళ ప్రచారం పొందారు. రస్సెల్ ను అప్పటి కెవరూ చదవడం లేదు, నేనూ, మెహతా కలిసి సిలబస్ లో ఆధునిక తత్వవేత్తలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాం. ప్రొఫెసర్ యస్.కె.మెత్రా మా పథకాన్ని వ్యతిరేకించారు. ఇండియాలో సమకాలీనం అంటే రెండు వేల ఏళ్ళ నాటిదన్నమాట. ఎలాగైతేనేమి ఏ.జె. అయ్యర్, సుపాన్ స్టెబ్బింగ్ రచనలను పెట్టించగలిగాము. విశ్లేషణాత్మక తత్వాన్ని ప్రవేశపెట్టగలిగాం. సత్తా వాదాన్ని తత్వశాఖలలో ప్రవేశపెట్టలేదు. కేవలం ప్రాచీనమైన ఆలోచనపట్ల భక్తి భావంతో ఉండటం కంటె మానసిక అవరోధాలను తెంచుకోవాలని కొంతమంది విద్యార్థులు నచ్చచెప్పగలిగాను. శంకరా చార్యుడి కంటే రస్సెల్ తెలివైన తార్కికుడని, పంతజలికంటే సి.జి.యూంగ్కు మానవ మేధస్సును గురించి బాగా తెలుసని, ఒక పట్టాన హిందువులు ఒప్పుకోరు. ఏమైనా బోధన రచ్చలు ప్రతిరోజు అసలటనే తెచ్చాయి. మధ్య మధ్యలో సేవించే తేనీరు మాత్రమే హాయిని సమకూర్చేది. హిందూ మతంలోని విశిష్టతను, రామణీయకతను కొందరు విద్యార్థులకు నచ్చచెప్పగలిగాను. ఇదే మంత సులభమైన పనికాదు. హిందుమతం రామణీయకతను అనుమానాస్పదంగానే చూస్తుంది. ఈ విషంయలో నలుగురు విద్యార్థులకు, ఒక విద్యార్థికి నచ్చజెప్పటంలో సఫలీకృతు డనయ్యాను.
కాశీలో సంస్కృత విద్యాపీఠంలో చదివే విద్యార్థులు సనాతన శాస్ర్తాలను అధ్యయనం చేస్తున్నప్పటికీ వారి దీక్ష అనన్య సామాన్యమైంది. వారితో పోలిస్తే ఇతర విశ్వ విద్యాలయాల వారి దీక్ష తక్కువే, సనాతన విద్యార్థి దైవం దిన చర్యలోనూ, వేషంలోనూ సనాతనంగా వుంటాడు చాలా కష్టపడి అధ్యయనం చేస్తాడు, కంఠస్తం చేస్తాడు. కాని మామూలు విశ్వవిద్యాలయాలలో బోధించే అర్హత అతనికి లభించదు. సంప్రదాయ విద్యను అభ్యసించిన వారిలో పండిత రామచంగ్దర దీక్షితార్, తర్కతీర్థ లక్ష్మణ శాస్త్రి జోషి మొదలైన వారున్నారు. నేను ఒకసారి రస్సెల్ తార్కిక భావాలను గురించి ఇరువురు పండితులకు చెప్పగా చాలా సూక్ష్మదృషి అని వారు ్భినందించారు. వివాహం, ఈతి గురించి రస్సెల్ భావాలు వారితో చెప్పినప్పుడు మౌనం వహించారు. కాసేపటికి ఇరువురిలో ఒకరు, ఇంగ్లీషు పండితులు చెప్పేది మనం అంగీకరించం. కాని రాముడు సీతకు చేసినది కూడా ఇంగ్లీషువారు అంగీకరించక పోవచ్చు అన్నారు.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజకీయం ఎక్కువ, పండిత్ మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన విశ్వ విద్యాలయంలో హైందవ జాతీయ వాదాన్ని అర్థం చేసుకోవచ్చు. కలకత్తా, మద్రాసు నుండి వచ్చిన యువకులు మతాన్ని మత్తుమందుగా భావించి, హిందూ మతాన్ని ఆమోదించేవారిని విమర్శిస్తుండేవారు, నేను ఒకసారి ఐక్యరాజ్య సమితి దినోత్సవ సభలో మాట్లాడాను. మానవతావాద వ్యక్తిత్వాన్ని వివరించాను. జాతి, ప్రజ, మానవాళి అనేవి అవకాశం కొద్దీ వాడే మాటలే తప్ప అవి వ్యక్తికి పనికొచ్చేవి కాదన్నాను వ్యక్తి మాత్రమే వాస్తవమని, మిగిలినవి కేవలం పదజాలమని, వాటికోసం వ్యక్తిని ఆహుతి చేయరాదని అన్నాను. వ్యక్తిని పరిగణించే వాదం మాత్రమే వ్యక్తివాదం అవుతుందని, అంతే తప్ప ఒక వర్గంలో భాగంగా, మానవాళి, జాతిప్రజ, దేవుని బిడ్డలు అనే వాటిలో వ్యక్తికి విలువలేదని చెప్పాను. హేతువాదం, విశ్వజనీన వాదం, వ్యక్తివాదం కలిపితే మానవతా వాదం అవుతాయన్నాను. ఉపన్యాసం అయిన తరువాత నా వెంట ఇరువురు యువకులు వచ్చి, చీకట్లో నన్ను ఆపి, కోపంగా ఇలా అన్నారు. మీరు ప్రజావ్యతిరేక, భారత వ్యతిరేక ధోరణిలో మాట్లాడుతున్నారని, ప్రజల అవసరాలను ప్రక్క దారులు పట్టించి మూఢ నమ్మకాలను అట్టి పెడుతున్నానని, కాషాయ వస్త్రం ముసుగులో మేధస్సును మత్తులో పెడుతున్నానని, రష్యనులు, చైనీయుల పట్ల చిన్న చూపు చూస్తూ ఆ దేశాల ప్రజలు చూపే కాంతి పథాన్ని గ్రహించటం లేదని, బ్రిటీష్ వారిని పొగడుతువన్నావు అని అన్నారు. ఇదంతా పది నిముషాల సేపు సాగించి వారిని చెప్పనిచ్చి, నా స్వంతంగా కలిపించి ఏమి చెప్పనన్నాను. మీరు గొప్ప మేధావులు. ఆ సంగతి అందరికి తెలుసు అన్నారు. అదేమిటో బయటి పెట్టడండి అన్నాను. దాంతో వారిలో అన్నారు. నీవు అమెరికా ఏజంటువు కాషాయ వస్త్రంలో అమెరికా పద్ధతులను వ్యాపింపచేయాలను కుంటున్నావు. మిత్రదేశాలైన రష్యాను, చైనాను అవమానిస్తున్నావు. నీవు స్త్రీలోలుడవు. సామ్రాజ్యవాదివి, పెద్దవాడిగా నటించే పెట్టుబడిదారుడవు, మమ్మల్ని మళ్ళీ బానిసలు చేయాలను కుంటున్నావు. నీవు తాగుతావు, వ్యభిచరిస్తావు, నిన్ను చంపేస్తాము అన్నారు.
నన్ను ఏదో ఒకరోజూ చంపితే చంపండి. ఇప్పుడు మాత్రం యిక్కడి నుండి వెళ్ళకపోతే మీ సంగతి చూస్తాను అన్నాను. వాళ్ళిద్దరూ గుసగుసలాడుకున్నారు. బలమైనవాడు, బాగా తింటాడు, యోగాభ్యాసాలు, పహిల్వాన్ అనే మాటలు వినిపించాయి. ఏదో బూతుమాట అనుకుంటూ వెళ్ళిపోయారు. యూనివర్శిటీలో ఈ సంఘటన చాలా ఉపన్యాసాలలో చెప్పాను. మన యువకులు గుండాలుగా తయారవుతున్నారని వ్యాఖ్యానించాను. అసలు కారణాలు వేరే వున్నవి.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు వివాహితులే ఒకశాతం భార్యా విహీనులుంటారు. హిందూ ప్రమాణ గ్రంథాలలో స్త్రీకి గౌరవం ఉన్నది. వేదాలలో ఆమెను సహధర్మచారిణి అన్నారు. కాలానుగుణంగా ఆమె స్థానం తగ్గిపోయింది. హిందువులు సూత్రప్రాయంగా అర్థాంగిని పొగుడుతారు. కాని ఒక ప్రత్యేక వ్యక్తిగా గురించి కాదు. భార్యకు ప్రేమాదరాలు చూపిన వ్యక్తిని చీదరించుకుంటారు. నేను పాదయాత్ర చేసినప్పుడు ముగ్గురు పిల్లలున్న తల్లిని సైతం ఆమె భర్త ప్రేమించడం చూశాను. ఇరువురూ సమానం అన్నట్లు ప్రవర్తించారు. బీహార్ లోని సంతాలులలో దంపతులు చేతులు కలుపుకుని తిరగటం గమనించాను.
హిందువులు, ముఖ్యంగా భార్యపట్ల గౌరవం చూపినప్పుడు ఏ మాత్రం అలాంటి వ్యక్తిని ఆదరించటం లేదు. కాశీ యూనివర్శిటీ ఆవరణలో భార్య జబ్బుగా ఉంటే పరామర్శించడానికి వెళ్ళిన ఒక దక్షిణాది బ్రాహ్మణ తత్వా చార్యుడిని ఆయన తండ్రి తిట్టేశాడు. ఒక పంజాబి స్ర్తీని పెళ్ళయిన మూడేళ్ళకు కూడా పిల్లలను కననందుకు భర్త పుట్టింటికి పంపేశాడు. బెనారస్ విశ్వవిద్యాలయ ఆవరణలో యువకులు స్వేచ్ఛగా తిరుగుతూ పరస్పరం కౌగిలించుకుంటుంటారు. ఆ పంజాబు స్త్రీ ఒకసారి అలాంటి యువజంటను నాకు చూపి వారలా ఎందుకు చేస్తారో తెలుసా అనడిగింది. చెప్పమన్నాను. నేను చాలా అందమైనదానిని, కాని వారు నా దగ్గరకు వచ్చి నా అందాన్ని గురించి చెప్పలేదు. దీనికి బదులుగా పరపీడనత్వాన్ని చూపే రీతిలో వారు పరస్పరం కౌగిలించుకుంటారు. మీ గురించి నాతో ఏమైన అంటే చెప్పుతీసుకొని కొడతాను అన్నదామె.
ఒకనాడు సంగీత లలిత కళాశాల ప్రిన్సిపాల్ పండిత్ ఓంకార్ నాథ్ వద్దకు వెళ్ళి గానసంగీత తరగతులలో కూర్చోవడానికి అనుమతి ఇవ్వమన్నాను. ఆయన ఒప్పుకోగా మూడేళ్ళు రూయా హాస్టల్ కప్పుపై విద్యార్థుల మధ్య కూర్చున్నాను. అందులో నా విద్యార్థి ఒకరు ఉన్నాడు అతడు కూర్చుని బల్లపై తలబెట్టి గురక పెట్టేవాడు. ఓంకార్ నాథ్ ను అన్ని విధాల అనుకరించే వాడు. నన్ను కూడా అనుకరించేవాడు. భారతీయ సంగీతానికి అలవాటు పడటానికి నాకు చాలా కాలం పట్టింది. మొదటి నాలుగు మాసాలు నేను సంగీతం ప్రారంభించగానే అందరూ నవ్వేవారు. ఆరు మాసాలలోగా సంగీతంలో నిమగ్నుడినయ్యాను. పాశ్చాత్యుల దృష్టిలో భారతీయ సంగీతం సంగీతమే కాదని, అదొక విధమైన శబ్దమనే భావన ఉన్నది. పాశ్చాత్య సంగీతంలో మంచి చెడ్డలున్నట్లే ఇండియాలోనే ఉన్నవి.
నా సనాతన సహచరులు నేను ఈ విధంగా అతిథులకు నగరంలో విశేషాలు చూపెట్టడం ఇష్టం లేక ఆగ్రహించేవారు. నేను విదేశీ వ్యక్తిగా మళ్ళీ వెనక్కు వెళ్ళదల్చుకోలేదు. నేను హిందువును, భారతీయుడిని కాదు, తాత్వికుడను, అయితే ఒక దేశానికి చెందిన తత్వవేత్తను కాదు, మానవతావాదిని పరిమితంగా సుఖాలు కోరేవాడిని, అలాంటప్పుడు నేనేదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలవారిని కలిసినప్పుడు ప్రపంచం ఎలా ఉందో తెలుస్తుంటుంది. పక్కా బనారసీ బయ్యాగా మారటం నాకిష్టం లేదు. నెత్తి మీద జుట్టు లేకుండా కాషాయ వస్త్రంతో నోటిలో పాన్ నములుతూ, బనారసీని అవుతున్నానేమోనని ఆలోచనా నాకు జుగుస్సను కలిగింది.